Previous Page Next Page 
మిస్టర్ రాంగో పేజి 10

    అతను చెప్పిన పని.... చెప్పిన సమయంలోపు చేయాలి... లేదా చేయించాలి.
   
    చెయ్యడం చాలా రిస్క్...
   
    చేయించడం బాగానే వుంటుంది... కాకపోతే అందుకు సరిపోయే మనుషులు దొరకాలి.
   
    కాదు... కాదు... వెదకాలి!
   
    అంతే...
   
    ఇక ఎక్కువ ఆలోచింపలేదు కిట్టు.
   
    టి. నగర్ వైపు వెళ్ళే సిటీబస్ ఎక్కి... పాండీ బజారులో దిగాడు.
   
    మెయిన్ రోడ్డుకు ఎడమగా చీలే చిన్న సందు వెంట ఐదు నిమిషాలపాటు నడక సాగించి ఒక చిన్న మేడమీద గదికి చేరుకున్నాడు.
   
    తలుపునాకు తాళం కప్ప కనిపించేసరికి కిట్టూకు నిరుత్సాహం కలిగింది.
   
    విసుక్కుంటూ మెట్లు దిగి క్రిందకు వచ్చి పాండీ బజారుకు నడిచి వెళ్ళి సెంటర్ లో ఐదు నిమిషాలపాటు వెయిట్ చేశాడు.
   
    ఎండ చిటపటలాడుతున్నది.
   
    పాండీబాజార్ సెంటర్ లో వున్న కృష్ణాకేఫ్ లోకి నడిచి ఒక మూలనున్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సర్వర్ ను పిలిచి టిఫిన్ ఆర్డర్ చేసి ఆలోచనలో పడ్డాడు.
   
    సరిగ్గా అదే సమయంలో వెదకబోయిన తీగె కాలికి తగిలినట్టు...అదే హోటల్లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులను చూసిన కిట్టూ కళ్ళు ఆనందంతో మెరిశాయి.
   
    "వాళ్ళు అతను కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చారు.
   
    "హల్లో ముత్తూ..."
   
    చిరునవ్వుతో పలకరించాడతను.
   
    "నువ్వు....సారీ....మీరు"
   
    "కి....ట్టూ"
   
    "ఓ...నువ్వా....ఏమిటీ వేషం బాగా మారిపోయినట్టున్నావు..."
   
    "దానికొక కారణం వుంది కానీ... మీ ఇద్దరితో పనిబడింది"
   
    "ఏం పని?" కుతూహలంగా ప్రశ్నించింది నల్లపాప.
   
    "ఇక్కడ కాదు...ముందు బయటకు పదండి" చెప్పి పైకి లేచాడు కిట్టూ.
   
    ఇద్దరూ అతన్ని అనుసరించారు.
   
    టిఫిన్ తెచ్చిన సర్వర్ నోరు తెరచి చూస్తుండగానే వాళ్ళు ముగ్గురూ బయటకు వెళ్ళి ఆటో ఎక్కి వేగంగా వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది.
   
    ఇరవై నిమిషాల తరువాత...
   
    మద్రాసు మెరీనా బీచ్ లో వున్నారు ముగ్గురూ...
   
    సముద్రపు ఘోష తప్ప ఎక్కువ జనంలేని చోట ఇసుకలో కూర్చున్నారు.
   
    ఎండ మాడ్చివేస్తున్నా అక్కడ ఎండవున్నట్టు లేదు.
   
    "చెప్పు కిట్టూ...ఏమిటా పని?"
   
    "హైదరాబాద్ ఎప్పుడయినా వెళ్ళారా?"
   
    ఈసారి పాండ్యముత్తు, నల్లపాప ఒకరి ముఖాలొకరు చూస్తున్నారు.
   
    వారి ఫీలింగ్స్ గ్రహించిన కిట్టూ చిన్నగా నవ్వుకున్నాడు.
   
    నల్లపాప ఘొల్లున నవ్వింది.
   
    కిట్టూ చికాకు పడ్డాడు.
   
    "చూడు కిట్టూ....హైదరాబాద్ పోలీసులకు చిన్న పిక్ పాకెట్ కేసులో చిక్కి వారం రోజుల జైలులో వున్నాను. మూడు రోజులపాటు తిండి లేకుండా హైదరాబాద్ వీధుల్లో తిరిగాను ప్రతి గొందూ సందూ తెలుసు"
   
    పాండ్య ముత్తు వివరించి చెబుతుంటే ఆశ్చర్యంతో నోరు తెరవడం కిట్టూ వంతయింది.
   
    "వెరీ గుడ్... నేను చెప్పినా పని చేసుకువస్తే మీకు చెరో పది లక్షలు ఇస్తాను"
   
    నల్లపాపకు కళ్ళు గిర్రున తిరిగాయి.
   
    తూలి పాండ్య ముత్తు మీద పడినంత పనిచేసింది.
   
    "ఏమిటి కిట్టూ....నువ్వు చెప్పేది నిజమేనా? ఇరవై లక్షలు ఇస్తావా అసలు విషయం ఏమిటి?" పెద్దగా అన్నాడు పాండ్యముత్తు.
   
    "ఇష్....ష్" అరవొద్దన్నట్టు సైగచేసి చెప్పడం మొదలు పెట్టాడతను.
   
    కిట్టూ చెప్పింది పూర్తిగా విన్నాక నల్లపాప, పాండ్యముత్తు అతను చెప్పినట్టు చేయడానికి సిద్దపడ్డారు.
   
    అడ్వాన్స్ గా యాభై వేలు ఇచ్చాడు వాళ్ళకు.
   
    "మిమ్మల్ని ఎప్పటికప్పుడు నేను నీడలా గమనిస్తూనే వుంటాను. జాగ్రత్త" చెప్పి వెళ్ళిపోయాడు కిట్టూ.
   
    నల్లపాప....పాండ్యముత్తు వెర్రిగా కేకపెట్టి ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని బీచ్ ఇసుకలో కేరింతలు కొడుతూ పొర్లిగింతలు పెట్టారు.
   
                                                   *    *    *
   
    రాత్రి తొమ్మిది గంటలు.
   
    రాంగో మాటి మాటికీ వాచీ చూసుకుంటున్నాడు.
   
    హైదరాబాద్ బస్ బయలు దేరడానికి ఇంకా అరగంట టైమ్ వుంది.
   
    అతని కళ్ళు జాజిబాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి.
   
    క్రితం రోజు జరిగిన సంభాషణను గుర్తుకు తెచ్చుకుంటూ తన ఆలోచన సరి అయినదో కాదో మరోసారి తనను తానే ప్రశ్నించుకుంటున్నాడతను.
   
    సరిగ్గా ఇరవై గంటలకు ముందు...
   
    ఇదే సమయంలో....
   
    "మన పెళ్ళి సంగతి ఏం చేశావ్?" జాజిబాల సీరియస్ గా ప్రశ్నించిందతడ్ని.

 Previous Page Next Page