Previous Page Next Page 
మిస్టర్ రాంగో పేజి 8

    వెంటనే పరుగులాంటి నడకతో వాళ్ళవైపే రాసాగారు.
   
    వాళ్ళను గమనించిన ఆ ఇద్దరిలో ఒకడు చిన్నగా విజిల్ వేశాడు.
   
    అతను పాండ్యముత్తు!
   
    పిక్ పాకెటింగ్ లోనూ, చిల్లర దొంగతనాలు చేయడంలోనూ అతను అఖండుడు.
   
    అతనితోపాటు వున్న రెండవ శాల్తీ అతని ప్రియురాలు నల్లపాప!
   
    తెల్లగా పాలిష్ స్టాచ్యూలా వుంటుంది. ఆకర్షనీయమైన కళ్ళు.....ఎత్తుకు తగ్గ లావుండి కసెక్కించే పర్సనాలిటీ ఆమెది. బ్లాక్ జీన్స్ లోకి గ్రీన్ షర్టు టక్ చేసి అందమైన కళ్ళజోడు ధరించి చూసేవాళ్ళకు ప్రత్యేకమైన అమ్మాయిలా కనిపిస్తుంది.
   
    వాళ్ళిద్దరూ మెరుపు మెరసి అదృశ్యమైనంత వేగంగా రైల్వే పోలీసుల కళ్ళల్లో దుమ్ముకొట్టి..... బయటకు వచ్చి పార్కింగ్ ప్లేస్ లో లాక్ చేసి వుంచిన తమ టీవీఎస్ పై దూసుకుపోయారు.
   
    మద్రాసు రోడ్లపైన ఝుమ్మంటూ పోతున్నది వారి వాహనం.
   
    నల్లపాప కురులు గాలికి నిటారుగా లేచి సముద్రంలోని పెద్దకెరటాల్లా వెనక్కు పడుతున్నాయి.
   
    ముఖంపై పడుతున్న జుట్టుని ఒక చేత్తో పక్కకు వెనక్కు నెట్టుకుంటూ.
   
    "రూమ్ కేనా?" రెండవచేయి అతని నడుము చుట్టూ వేస్తూ అడిగింది నల్లపాప.
   
    ఆమె అంత లోన్లీగా అడిగిందంటే మంచి మూడ్ లో వుందన్నమాట....
   
    పది నిమిషాలు ప్రయాణించాక టి నగర లోని ఒక సందులోకి మళ్ళింది వాళ్ళ వాహనం.
   
    ఆ సందు మొదట్లోనే వుందొక వైన్ షాప్.
   
    షాపుముందు బండిని ఆపి దిగివెళ్ళి మెక్ డోసెల్ ప్రీమియం ఫుల్ బాటిల్ కొన్నాడు.
   
    తిరిగి ఇద్దరూ బయలుదేరారు.
   
    మరో పావుగంట గడిచాక ఇద్దరూ వాళ్ళగదిలో వున్నారు.
   
    ఆమ్లెట్స్ తింటూ ఇద్దరూ విస్కీ రుచి చూస్తున్నారు.
   
    "మనం రైలులో కొట్టేసిన ఆ బ్యాగు ఇటు తీసుకురా. ఆ సేఠ్ గాడిని ఆ బ్యాగ్ కోసం చాలాసేపు మాటల్లో పెట్టవలసి వచ్చింది...." అన్నాడు పాండ్యముత్తు గ్లాసులోని మొత్తం విస్కీని గొంతులోకి వంపుకుంటూ.
   
    అతని ఊహ ప్రకారం సేఠ్ దగ్గర కొట్టేసిన ఆ బ్యాగ్ లో చాలా ఎక్కువ మొత్తంలో ఉండాలి!
   
    నల్లపాప లేచి వెళ్ళి, ఆ బ్యాగ్ తెచ్చి ఇస్తూ....
   
    "ఆ సేఠ్ అంతసేపూ నీ మాటలు వింటున్నాడనుకుంటున్నావా? ఎదురుగా కూర్చున్న నా వైపు చొంగ కార్చుకుంటూ కటింగ్స్ ఇవ్వడంతోనే సరిపోయింది. ఛీ....వాడి గార పళ్ళ నవ్వు... పిచ్చి చూపులు భరించాలంటే నాకు ఒళ్ళంతాతేళ్ళూ...జెర్రులూ పాకినట్లనిపించిందనుకో..."
   
    ప్లాట్ ఫారమ్ మీద ఖరీదైన వ్యక్తిని ఎన్నుకుని, అతనితోపాటు తోటి ప్రయాణికుల్లా రైలు బయలుదేరేవరకు మంచి డ్రామా ప్లే చేసి...రైలు వేగాన్ని పుంజుకునే సమయంలో ఆ వ్యక్తి వస్తువు ఏదో ఒకటి లాగేసుకుని దూకేయడం వాళ్ళిద్దరికీ ఐస్ క్రీమ్ తిన్నంత ఈజీ!
   
    పాండ్యముత్తు బ్యాగ్ ఓపెన్ చేసి దాన్ని బోర్లించాడు.
   
    ఆ బ్యాగ్ లో నాలుగైదు జతల బట్టలు....సిగరెట్ పెట్టెలు....అగ్గిపెట్టె ... గుట్కా పాకెట్లు తప్ప చిల్లర డబ్బులుకూడా లేవు.
   
    కోపం పట్టలేక ఆ బ్యాగ్ ని విసిరి కొట్టాడతను.
   
    నల్లపాప అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది.
   
    రెండు క్షణాలపాటు అతను మాట్లాడలేదు.
   
    "ఈ చిల్లర దొంగతనాలతో మన జీవితాలు ఫ్రీగా వెళ్ళిపోతాయనుకుంటున్నావా?" రెట్టించి అడిగిందామె.
   
    ఈసారి నల్లపాప కంఠంలో కొద్దిపాటి నిరాశ.
   
    "నేనూ అదే ఆలోచిస్తున్నాను పాపా"
   
    "ఆలోచిస్తున్నానంటే సరిపోదు.... ఏం చేస్తావో ఏమో... నాకు అనవసరం. మనం అర్జెంటుగా లక్షాధికారులమైపోవాలి. అలాంటి మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించు..." అంటూ తన పెదవులతో అతని పెదవులను జతచేసింది నల్లపాప.
   
    అంతే -
   
    ఆ గది వెచ్చటి నిట్టూర్పులతో వేడెక్కిపోవడం మొదలైంది....
   
                                                    *    *    *
   
    విజయవాడ__
   
    బందరు రోడ్డులో వున్న నాలుగంతస్థుల భవంతి ముందు లెక్కలేనన్ని కార్లు ఆగివున్నాయి.
   
    గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక లేడీస్ బ్యూటీ పార్లర్....మొదటి అంతస్థులో ఒక ఫర్నిచర్ షాపు....రెండవ అంతస్థులో ఇన్సూరెన్స్ బ్రాంచి ఆఫీసు...మూడవ అంతస్థులో ఆడియో కాసెట్లు అమ్మే షాపు...చివరి అంతస్థులో "వెన్నెలా ఫైనాన్స్ కంపెనీ"...
   
    దాని ప్రొప్రయిటర్ రాజేంద్రప్రసాద్!
   
    ఐదడుగుల ఎత్తు...వంద కిలోల బరువు.... నెత్తిమీద ఖచ్చితంగా పిడికెడు వెంట్రుకలు, మాటిమాటికీ కళ్ళు ఆర్పడం అతని ప్రత్యేకతలు.
   
    ప్రపంచంలో డబ్బుని ఎన్ని రకాలుగా ప్రోగుచేయాలో అన్ని రకాలుగా అన్వేషించి, ఆ మార్గంద్వారా డబ్బు సంపాదించడానికి ఏమాత్రం వెనుదీయని అల్పబుద్ది రాజేంద్రప్రసాద్ రక్తంలో వున్న అన్ని రక్తకణాలలోనూ కలిసిపోయింది.
   
    అప్పుడు ఉదయం తొమ్మిది గంటలు దాటి నలభై నిమిషాలు అవుతున్నది.
   
    అప్పటికి ఆ కంపెనీలో పని చేస్తున్న ఏడుమందిలో ఆరుగురు మాత్రమే వచ్చారు.

 Previous Page Next Page