Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 9

   

                                        3


    రాధిక తలవంచుకుని కూర్చున్నది. ఆమె చెప్పింది శ్రద్ధగావిన్నాడు సిద్దార్ధ. రాధిక మాత్రం ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాస్ కు తనకు పరిచయం అయిన ఘట్టం గుర్తుకు తెచ్చుకుంది.


                                                                      *    *    *


    రాధిక హడావుడిగా వచ్చి, మలక్ పేటలో కదులుతున్న లోకల్ ట్రైన్ ఎక్కింది.

    బండి కదిలాకగాని ఆమెకు తను చేసిన పొరపాటు తెలిసిరాలేదు. ఖాళీగా ఉన్నది కంపార్ట్మెంటు . ఒక మూల నల్గురు అబ్బాయిలు కూర్చుని ఉన్నారు. వారిగురించి రైలు ప్రయాణం చేసే ప్రతివారికీ తెలుసు వారు గొలుసులు, టిఫిన్ బాక్స్ లు, డబ్బులు కొట్టేస్తారు. అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణం చేయలేరు, సన్నగా కాళ్ళల్లో ఒణుకు ప్రారంభమయింది.

    అది షంషాబాద్ వెళ్ళే లోకల్ కాదు. ఫలక్ నామా వరకే వెళ్తుంది. తను కంగారులో చూచుకోలేదు.

    ఆరోజు బడిలో ఫేర్ వెల్ పార్టీ అని గాజులు వేసుకుంది. మెడలో రెండు పేటల గొలుసు కూడా వేసుకుంది.

    బంగారం తీసుకున్నా ఫరవాలేదు. , తనను ఏం అనకపోతే బావుండును.
 
    "చిలుక మన కొమ్మన వాలిందేంరా!"

    "ఉత్త చిలుకకాదు బ్రదర్. బంగారు చిలుక......."

    "బంగారుదేకాదు పరువాల మొలక!" లేచాడు అతను. ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి అప్పుడే డబిర్ పురా స్టేషన్ వచ్చింది. అమ్మయ్య దిగి, ఉందానగర్ లోకల్ ఎక్కుతుంది.

    బండి ఆగగానే, ఒకతని చేయి ఆమె చేయిని గట్టిగా పట్టుకుంది.
 
    "చిలుకను వెళ్ళనిస్తామా!"

    "నోరు విప్పావా గొంతునొక్కుతాను -"

    యెవరో ఎక్కినా బావుండును.....కాని ఎవరూ ఎక్కలేదు.

    తన పని అయిపోయింది అనుకుంటుండగా ఒగరుస్తూ ఇద్దరు యువకులు ఎక్కేరు.

    వారు తమ ఊరివారేనని తెలుసు కాని యెవరో తెలియదు. అందులో యెప్పుడూ 'టీ' షర్ట్స్ వేసుకునే కుర్రాడంటే ఆమెకు ఒక రకమైన ఆరాధన. కాస్త ధైర్యం వచ్చింది.
 
    "హల్లో రాధిక........"

    అతని మాటలు వింటూనే, రౌడీ చేయి వదిలేసాడు.

    "ఫలక్ నామా ట్రైన్ ఎక్కారేం?"

    "చూచుకోలేదు............" అన్నది ధైర్యంచేసి.
 
    అతను ధైర్యంగావచ్చి, తను కూర్చుని, రాధికను కూర్చోమన్నాడు. అతనితో వచ్చినతను కూడా కూర్చున్నాడు.

    రౌడీలు, దూరంగా నిలబడి ఇద్దరి శక్తిని అంచనా వేయసాగారు.

    అప్పుడే యూకుత్ పురా వచ్చింది. అతను తన స్నేహితుల్ని పిలిచాడు.

    "రండిరా కంపార్టుమెంటు ఖాళీగా ఉంది."
 
    "ఉందానగర్ బండి వెనుకే వస్తుంది"

    "వస్తే వచ్చింది. కబుర్లు చెప్పుకుందాం"

    అంతే బిలబిలమంటూ పదిమంది ఎక్కాక బండి కదిలింది.

    వీళ్ళందరిని చూచి, వాళ్ళు చిన్నకుపేలా ఉన్న డబ్బాలో నక్కారు.
 
    "మీ పేరు!" భయంగా చూచింది రాధిక. నల్గురిని వదిలించుకోబోయి పదిమందిని ఆహ్వానించానా అనుకుంది.

    "శ్రీనివాస్ నండి నన్ను గుర్తు పట్టలేదా! మీ దగ్గర మా నాన్న వ్యవసాయం చేసేవాడు." అన్నాడు.
 
    అప్పుడు గుర్తుకు వచ్చింది. నిక్కర్లు వేసుకొని, మొరటుగా ఉండే అబ్బాయి ఎంత నాజూకు తేలాడు.

    "మీరు నిశ్చింతగా కూర్చోండి. డియర్ ఫ్రెండ్స్ అండ్ ట్రైన్ మేట్స్! మన కంపార్టుమెంటులో దొంగలున్నారు . ఏం చేద్దాం!"

    "సత్కారం చేద్దాం"

 Previous Page Next Page