కరీమ్ చాచాది పళ్ళబేరం. ఆ చుట్టు ప్రక్కలున్న నిమ్మతోటలు, నారింజ, సపోట, జామ, మామిడి, అన్ని పళ్ళతోటలు గుత్తుకు తీసుకొని, తెంపించి బళ్ళకు అమ్ముతాడు.
చిన్నప్పటినుండి ఓ జామకాయ కొనటం సిద్దార్ధకు అలవాటు కరీమ్ ఇంకా మరిచిపోలేదు.
"మాసుమా, మునీర్ బావున్నారా!"
"మునీర్ అలగ్ హై బేటా......వాడి సంపాదన వాడిది, మానుమా అత్తగారింట్ల ఉన్నది .దాందీ పెనిమిటి, మోతేమీన్....."
"ఏ డిపార్ట్ మెంటు........"
"అదే కట్ మల్ డిపార్ట్ మెంటు పోలీసు" అన్నాడు.
సిద్దార్ధ నవ్వేశాడు.
"జర చాయ్ తాగిపో సిద్దూ బేటా" అన్నాడు.
"పదండి....." అతని వెనుక నడిచాడు.
వాళ్ళిద్దరి మధ్య జామకాయ సంబంధమేకాదు. అంతకంటే పటిష్టమైన అనుబంధం వుంది. సిద్దార్ధ చాలా చిన్నగా వున్నాడు. మత కలహాలు జరిగాయి. వాటి పేరున పగ వున్న వారిని, ప్రక్కవారు దెబ్బలు కొట్టేవారు. అప్పుడు కరీమ్ పై నేరం మోపారు.
అక్కడే ఆడుతున్న సిద్దార్ధ ఏడుస్తూ "కరీమ్ చాచా" కొట్టలేదని సాటి పిల్లలతో గొడవ చేశాడు.
అప్పటినుండి ఆ కుర్రవాడంటే కరీమ్ కు అమితమైన ఆపేక్ష. వారిద్దరి అనుబంధం, మతానికీ, కులానికీ అతీతమైనది. మానవత్వం ప్రాతిపదికపై పెనవేసుకుంది.
కరీమ్ ఇంట్లో చాపపైన పరుపు దానిపై దిండ్లు ఉంటాయి. వెళ్ళి కూర్చున్నాడు.
"అబ్బే! ఓ బేగమ్ యెవరొచ్చారో చూడు." అన్నాడు
తళ తళలాడే జరీ చీర మెరిసి, మరుక్షణమే ఓ అందమైనా స్త్రీ బయటికి వచ్చింది.
"సలామ్....... " అన్నాడు.
"సలామ్ బేటా! జీతెరహో......" అన్నది తాంబూలం సేవించిన పళ్ళు బయటపడేలా నవ్వుతూ.
ఆమె వెళ్ళి చాయ్ తీసుకు వచ్చింది. యాలకులు, దాల్చిన వేసిన టీ గమ్మత్తయిన వాసనలు వెదజల్లుతూ వుంది.
సిద్దార్ధ టీ త్రాగాడు.
"మా?.........అబ్బా మీ వూరుకాదు కాని నా ప్రాణం పోతోంది." అంటున్న మృదువయిన కంఠంతోపాటు. మెరుపు తీగ వచ్చింది.
ఇందాకా తను బయట చూచిన అమ్మాయి.
"రా సేతా బెటీ.......సిద్దూ.......సేత అని మనది వూర్లో పెద్దలకు చద్వు చెప్పుతుంది." అన్నాడు కరీమ్.
"నమస్తే......."
"నమస్తే......చాచా! వారెవరో చెప్పలేదు" నవ్వుతూ అడిగింది. ఆమె ముఖాన దరహాస చంద్రికలుదయించాయి. ఆ సంధ్యా సమయం మసక వెలుతురులో ఆమె ముఖం అందంగా కనిపించింది.
"ఆఁ.....బేటీ! ఈ ఊర్లో పెద్ద.......బిజినెస్సు మ్యాన్ ......పోయినసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినారే పురుషోత్తమరావు. వారి.....కొడుకు......." అకస్మాత్తుగా ఆ అమ్మాయి ముఖాన రంగులు మారిపోయాయి.
"నేను వస్తాను చాచా.!......" వెనుతిరిగింది.
సిద్దార్ధకు తల తీసినట్టు అయింది.
"ఇంకా కులం, మతం అంట లో్ర్లు బేటా! అఫ్ సోస్........" అన్నాడు.
ఆ అమ్మాయి క్రింది జాతి అమ్మాయి కాబోలు....
"ఆ బిడ్డ ఏదో చదువు చెప్తనని వస్తే అద్దెకు ఇల్లు ఇయ్యరు బేటా. మన బయటగది ఇచ్చిన" అన్నాడు.
"వస్తాను చాచా......." లేచాడు. సేత.........సేత ఏం పేరు! అతను కరీమ్ ఇల్లు దాటుతుండగా - బయట గదిలో దీపం వెలిగిస్తూ, సేత కనిపించింది. ఆమె తన తండ్రిపేరు చెప్పగానే ఎందుకలా అయింది. అతను ఆమెను అడగాలనుకున్నాడు. అపరిచితురాలిని అడిగినా నిజం చెబుతారా! వడిగా ఇంటిదారి పట్టాడు.