Previous Page Next Page 
విశిష్ట పేజి 9

    నిజంగా ఆమెకు మీకు ఒక స్టూడెంట్ మాత్రమే అయితే మీరంటే నాకు ఎంతో గౌరవముండేది. కాని పవిత్రమైన విద్యాలయాన్ని మన్మధ లీలలకు స్థావరంగా మార్చే మీవంటి మదోన్మత్తులు ఆచార్యపీఠానికే కళంకం! గురుశిష్యుల మధ్య వుండాల్సింది తండ్రీ బడ్డలవంటి సంబంధం. కాని కూతుళ్ళలో ప్రియురాళ్ళను చూసుకొనే మీవంటి కామాంధులు విద్యాలయానికే కళంకాలు.

    మీ తుచ్చవాంఛకు స్టూడెంట్సే కావలసివచ్చారా? ఇహ మీ మన్మధ లీలలు సాగబోవు. మీ నాటకానికి తెరదించుతున్నాను. మీ నిజస్వరూపం బయటపెట్టి నలుగురిచేత ఛీ కొట్టిస్తాను."

    "నీ మొహం! నీవల్లేం అవుతుంది? పిల్లకాకివి."

    "నా ఒక్కదానివల్ల కాకపోవచ్చు. మా స్టూడెంట్స్ నందరినీ సంఘటితపరుస్తాను. ఉద్యమం లేవదీస్తాను. మీకు సాంఘిక బహిష్కరణ విధించి జీవించడమే దుర్భరం చేస్తాను."

    "అబ్బ! గొప్ప విప్లవకారిణివి బయల్దేరావే!" వ్యంగ్యహాసం అతడి పెదవుల మీద పాముపడగలా ఆడింది" నువ్వంటే నాకెప్పటినుండో కోరిక. అణగి వున్నదాన్ని తోకతొక్కి పడగ విప్పుకొనేలా చేశావు. ఈ క్షణం నుండి నిన్ను వెంటాడి వేటాడ్డమే నా లక్ష్యం. నిన్ను పొందేవరకు విశ్రమించను."

    అతడి కళ్ళలో బుసకొట్టిన కసికి నిశ్టేష్టత అయింది విశిష్ట. కరుణ సమస్య తీర్చబోయి కొత్త సమస్య తన మెడకు వేసుకొందా?

    కాస్సేపటికి తెప్పరిల్లి సీరియస్ గా అంది - "విశిష్ట అంటే మామూలు ఆడపిల్ల క్రింద జమకట్టుకు నువ్వు నన్నేమీ చెయ్యలేవు. నా బొందిలో ప్రాణముండగా నన్ను తాకలేవు."

    విశిష్ట కళ్ళలోకి తన పదునైన చూపులు చొప్పిస్తూ అంతే దృఢంగా అన్నాడు - "నిన్ను పొంది తీరుతాను. అదీ నీ అంతట నువ్వే నా కౌగిట్లోకి వచ్చేలా చేస్తాను. ఇదే నా ఛాలెంజ్."

    "నిన్ను నువ్వు అంత గొప్పగా అంచనా వేసుకోకు. తన పదఘట్టనలతో అడవిని అదిరిపోయేలా చేసే ఏనుగును సైతం కుంభస్థలాన్ని కొట్టి నేలకూల్చే సింహాలున్నాయి."

    "అయితే నాకు సమఉజ్జీవన్నమాట. సమవుజ్జీతో ఆట ఇంకా పసందుగా ఉంటుంది." తన అందమైన పలువరస తళుక్కుమనేలా నవ్వాడు పృధ్వీ.

    అప్పుడు చూసింది పరిశీలనగా. ఆరడుగులకి తక్కువగాని పొడవు, పొడవుకి తగిన లావు., చక్కని వర్చస్సు, ఆ ముఖంలో సూదంటురాయిలా ఏదో ఆకర్షణ.

    అతడు నవ్వుతుంటే మనిషి నవ్వినట్లుగా కాక నాగుపాము తన కోరలు విప్పి నవ్వినట్లుగా అనిపించింది విశిష్టకు.  "అసలు నువ్వు మనిషి వనుకోవడం నేను చేసిన పొరపాటు. రాయభారానికి రావడం ఇంకొక పొరపాటు" గిరుక్కున వెనుదిరిగింది.

    దూరంగా నిలబడి ఇటే ఆసక్తిగా చూస్తున్నాడొక లెక్చరర్. అతడి పేరు కృష్ణవంశీ. వాళఅళు గొంతు తగ్గించి చిన్నగా మాట్లాడుకోవడం వల్ల ఆయనలో కుతూహలం చెలరేగిపోయింది. వాళ్ళు దేనికో పోట్లాడుకొన్నారని మాత్రం అర్ధమైపోయింది. "ఏం సార్! దేనికో ఇద్దరూ ఘర్షణపడుతున్నట్టున్నారు?"

    "ఈ ఆడపిల్లలకి ఏం పనిలేదండీ! కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నారో స్వయంవరానికి వస్తున్నారో, అర్ధంకావడంలేదు. ఆ పిల్లకి నేనంటే వల్లమాలిన ప్రేమట. నన్ను పెళ్ళిచేసుకోండి! లేకపోతే చచ్చిపోతాను అంటోంది." 

    "వారేవా! మీరేమన్నారు?"

    "ఇలా బెదిరించిన వాళ్ళను చాలామందినే చూశాను. నేను కాలేజీలో చదువుతున్నప్పుడూ ఇదే గొడవ ఈ ఆడపిల్లలతో, 'ప్రేమించాను పెళ్లి చేసుకోండి' అని. ఏ ఆడపిల్లకి చూసినా నేనంటే క్రేజీ. 'పృధ్వీ నన్నే పెళ్ళాడతాడు అంటూ వాళ్ళలో వాళ్ళు పందాలు వేసుకొనేవాళ్ళు. లెక్చరర్ గా కాలేజీలో చేరాక ఇప్పుడూ అదే గొడవ. దేవుడు నన్ను అందంగా పుట్టించి ఇదొక సమస్య తెచ్చిపెట్టాడు." ఏదో పెద్ద కష్టం వచ్చిపడ్డట్టుగా ముఖం పెట్టాడు పృధ్వీ.

    వెళ్ళబోతున్న విశిష్ట ఆగి అతడి మాటలు వింది. పళ్ళు పటపట కొరికింది. అతడి మాటల్లో కొంత నిజం లేకపోలేదు. అతడు అందగాడు. ఆ మాట ఎవరూ కాదనలేదు. ఆ అందంపట్ల ఆడపిల్లలు ఇట్టే ఆకర్షితులౌతుంటారు. వాళ్ళ బలహీనత ఆధారం చేసుకొని వాళ్ళని తన చుట్టూ తిప్పుకొని అనుభవించి గాలికి వదిలెయ్యడం పృధ్వీ అలవాటు.

    అందులో చాలామంది విరక్తితో చదువులు మానేశారు. కొందరు జీవచ్చవాలుగా మారారు. కొందరు గుట్టుగా పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఇంతవరకు అతడి బండారం బయట పెట్టిన వాళ్ళెవరూ లేరు. అతడి నిజస్వరూపం బయటపెట్టాలంటే తాము చెడిపోయిన సంగతి బయటపడిపోతుంది కనుక అందరూ గమ్మునుండిపోయారు. ఈసారి మాత్రం అలా జరుగనివ్వకూడదు. అతడి గుట్టు రట్టు చేయాలి. ఇంకే ఆడపిల్ల అతడి వల్ల మోసపోకుండా చూడాలి.

    కరుణ దగ్గరికి వచ్చి చెప్పింది.  "అతడొక మానవ మృగం. ఎలా ప్రేమించావే? మనిషి అందంగా కనిపిస్తే చాలా? మనసు ఎలాంటిదో తెలుసుకోనక్కరలేదా?" తన రాయబారం ఎలా విఫలమైందీ చెప్పి చివాట్లు పెట్టింది విశిష్ట. 

    "తొలి వయసు గారడీ అది, పైమెరుగులకే మోసపోయేలా చేస్తుంది. అందుకే ఇన్ని విఫల ప్రేమలు. ఇన్ని భగ్నగాధలు. మోసపోయామని తెలుసుకొనేసరికి జరిగిపోయి వుంటుంది సర్వనాశనం" కరుణ ఒక నిట్టూర్పు విడిచింది. పగిలిన గుండెలోంచి వచ్చిన నిట్టూర్పు అది.

    "నీ జీవితం నాశనం కానివ్వను. అతడిచేత నీ మెడలో తాళి కట్టించి తీరుతాను చూడు. రేపే కాలేజీ ఆవరణలో టెంట్ వేస్తాను. ఉపన్యాసాలతో, ఉపవాసాలతో అదరగొట్టేస్తాను. ఆడపిల్లలను ఆటబొమ్మలు గానే చూసిన పృధ్వీ వాళ్ళ ఆత్మశక్తి ఏమిటో తలుసుకొనేలా చేస్తాను!"   

    "ఇంత జరిగాక అతడిచేత నా మెడలో తాళి కట్టించినా ఒకటే! ఉరితాడు కట్టించినా ఒకటే! బలవంతంగా అతడిచేత కట్టించుకునే తాళి ఉరితాడు కాక ఏమౌతుంది? వద్దు నాకా తాళి! అలాంటి మనిషితో కాపురం చెయ్యడానికి ఆత్మగౌరవం వున్నఏ  ఆడపిల్లా అంగీకరించదు తెలుసా? అందుకని నువ్వు నాకోసం ఎవరి నుండీ సానుభూతి సంపాదించనక్కరలేదు. ఎవరెవరినో సంఘటితం చేసి ఉద్యమం లేవదీయ్యనక్కరలేదు."

    "మరి నీ సమస్యకి పరిష్కారం?"

    "నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను"

 Previous Page Next Page