Previous Page Next Page 
విశిష్ట పేజి 10

     "జరిగిందంతా గుట్టుగా పూడ్చిపెట్టి కన్నె వధువుగా కొత్త అవతారం ఎత్తి ఇంకెవరిచేతో తాళి కట్టించుకుంటావా? ఆ మొగుణ్ని మోసగిస్తూ జీవితమంతా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ వుంటావా?" కోపంగా అడిగింది విశిష్ట.

    "నన్ను మరీ అంత నీచురాలిగా జమకట్టకు విశిష్టా! నేను మోసపోయింది కాక నావల్ల మరో అమాయకుడు ఎందుకు మోసగింపబడాలి? ఏనాటికీ నేనంత నీచానికి పాల్పడను. నేను చేసిన తప్పుకు నన్ను నేను బలి చేసుకుంటానుగాని ఇంకెవరినీ బలిచేయను."

    "అంటే అర్ధం? చేసిన తప్పుకు నీలో నువ్వు క్రుంగి క్రుశించి ఛస్తావా? నిన్నీ స్థితికి గురిచేసినవాడు దొరబాబులా తిరగాలా? ఒక దుర్మార్గుడిని అలా వదిలేయడం కూడా నేరమే. వాడు ఇంకా ఇంకా ఆడపిల్లల షికారు సాగించడానికి నువ్వు దోహదం చేసినదానివి అవుతావు తెలుసా?"

    "వాడు మళ్ళీ ఇంకెవరినీ మోసగించకుండానే బుద్ది చెబుతాను"
 
    "ఎలా?" విశిష్టలో కుతూహలం పెరిగిపోయింది.

    "రేపు కాలేజీకి వచ్చిచూడు!"

    ఏం చేస్తుంది కరుణ? పదిమందిలో పృధ్వీ కాలర్ పట్టుకొని చెంపలు వాయగొడుతుందా.......? పెళ్ళి చేసుకుంటావా లేదా అని అడుగుతుందా?

                                                             *    *    *

    సాయంత్రం కాలేజీ ఆడిటోరియంలో 'స్త్రీ అత్యాచారాలు' అన్న అంశం మీద డిబేటింగ్ నడుస్తోంది.

    స్త్రీల మీద జరిగే అత్యాచారాలకు స్త్రీలే కారణమంటున్నాడు ఒక యువకుడు. రెచ్చగొట్టినట్టుగా వుండే వాళ్ళ దుస్తులూ, కవ్వించే చూపులూ, మగవాళ్ళను అదుపు తప్పిపోయేలా చేస్తాయట. మగవాడు బలహీనతకు లోనైన క్షణంలో ఏ అనర్ధమైనా జరగడానికి ఆస్కారముంది అంటున్నాడు. నిరాడంబరంగా, నిర్మలంగా, కనిపించే అమ్మాయిలవైపు ఏ మగాడూ కన్నెత్తి చూసే సాహసం చేయలేడట.

    విశిష్ట చివ్వున లేచి వేదిక మీదికి వెళ్ళి మైకు అందుకుంది. ఆ యువకుడి మాటలు ఆమెను ఎంత ఆవేశానికి లోనుచేశాయంటే ముఖమంతా ఎర్రగా కందిపోయింది.

    "కొన్ని ఆంబోతులు ఎవరి మీదైనా ఎర్రబట్ట కనిపిస్తే చాలు రెచ్చిపోయి వెంటబడి కుమ్మేస్తాయట. కాని మనిషి రూపంలో వుండే కొన్ని ఆంబోతులు కోక కనిపిస్తే చాలు రెచ్చిపోయి మీదపడటానికి వెంటపడతాయి. వాటికి రంగుతో పనిలేదు. ఆడది అయితే చాలు. ఆఫీసుల్లో, కంపెనీల్లో , పొలాల్లో, కాలేజీల్లో ఆడది పనిచెయ్యడానికి వెళ్ళి ప్రతిచోటా ఈ ఆంబోతులు రెచ్చిపోయి మీదపడుతుంటాయి.

    వాళ్ళ నుండి తప్పించుకోవడం ఒక సమస్యగా మారి ఎందరు ఆడపిల్లలు, ఎందరు ఆడవాళ్ళు ఎవరికీ చెప్పుకోలేక నలిగిపోతున్నారో మీకేం తెలుసు? ప్రతీచోట, ప్రతీరంగంలో పురుషుడి సెక్సువల్ హెరాస్ మెంట్ కి గురవుతోంది స్త్రీ. దానికి ఆమె వేషభాషలు ఎంతమాత్రం కారణం కాదు. మగవాళ్ళలో దాగివున్న మృగప్రవృత్తే కారణం.

    ఆడది కనిపిస్తే సెక్స్ తప్ప ఇంకేమీ గుర్తురాదు వాళ్ళకు. ఉన్నత స్థానాల్లో వున్నవాళ్ళు, ఉన్నతోద్యోగులు సైతం ఈ మృగవాంఛకు అతీతులుకాదు. నిన్న మొన్న పత్రికల్లో సంచలన వార్తగా వస్తున్న రూపన్ డియోల్ బజాజ్ కేసు విషయం చర్చిస్తే ఈ విషయమే తేలుతుంది. ఆమె ఒక ఐ.ఎ.ఎస్ ఆఫీసర్.

    సమాజంలో ఒక ఉన్నతోద్యోగిని ఒక ఐ.ఎ.ఎస్ అధికారికి భార్య .అప్పటి పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గా వున్న కె.పి.ఎస్. గిల్........ టెర్రరిస్టుల పాలిట సింహ స్వప్నంగా పేరు తెచ్చుకొన్న ఆయన ఒక విందులో ఆమెతో అసభ్యంగా లాక్కొని, అంతటితో ఆగక ఆమె పిరుదుల మీద చరిచాడట.

    రూపన్ అది సామాన్య విషయంగా తీసుకోలేదు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచిన అతడి పురుష దురహంకారం మీద ధ్వజమెత్తింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎనిమిదేళ్ళు సుదీర్ఘపోరాటం సాగించి గిల్ మహాశయుడికి అయిదునెలల జైలుశిక్ష, ఏడువందలరూపాయల జరిమానా వేయించింది.

    ఇది ఒక మహిళ సాధించిన విజయం. ఈ మాత్రానికే అంత రగడ చేయాలా అని విమర్శించిన వాళ్ళంతా ఇప్పుడామె సాధించిన విజయాన్ని పొగుడుతున్నారు. ఆమె తీసుకున్న చర్యను అభినందిస్తున్నారు. మగవాడు లైంగిక వేధింపులకు గురి అయ్యే స్త్రీలలో ఎందరు రూపన్ లా చర్య తీసుకోగలుగుతున్నారు?

    బస్సుల్లో, సినిమాహాళ్ళలో, ఆడా మగా కలిసి తిరిగే ప్రతిచోటా ఎందరో గిల్లులు మనకు తారసపడతారు. కాలుతొక్కినా, ఒళ్ళు గిల్లినా గమనించనట్టుగా ముఖం పెట్టేస్తాం. రూపన్ లా రచ్చకెక్కడానికి సిగ్గు! మగవాళ్ళ సెక్సువల్ హెరాస్ మెంట్ ఆడది కిక్కురుమనకుండా భరిస్తున్నంత సేపు వాళ్ళింకా రెచ్చిపోతూనే వుంటారు..........!"

    విశిష్ట వాగ్దాటికి అడ్డుపడ్డాడు మరొక స్టూడెంట్.

    "మధువనిలో ఒక అందమైన పువ్వు కనిపించగానే ఎటు నుండో వచ్చిన తుమ్మెద వాలడం సహజం. ప్రకృతి సహజమైన విషయాలకు కూడా మీ ఆడవాళ్ళు విపరీతార్ధాలు తీసి రగడ చేస్తారెందుకని? ఒక అందమైన స్త్రీ వెడుతుంటే మగవాళ్ళ కళ్ళేకాదు. ఆడవాళ్ళ కళ్ళు కూడా ఆటోమాటిగ్గా అటు తిరుగుతుంటాయి. సౌందర్యం ఎక్కడ కనిపించినా ఆరాధించడం మనిషి సహజ గుణం. దాన్ని కూడా మీరు లైంగిక వేధింపు అంటారా?"

    "అందం! ఆరాధన! మగవాడిలో బుసలుకొట్టే కాముకతను అందమైన పరదాలు అని. మీరు నిస్వార్ధంగా ఏ ఆడదాన్నైనా ఆరాధించగలరా? పవిత్రంగా ప్రేమించగలరా?"

    "ఎందుకు లేమూ?"
   
    "మీలో ఎంతమంది పెళ్ళి చేసుకొని కూడా రామకృష్ణ పరమహంసలా తన భార్యను దేవీమాతగా భావించి ఆరాధించగలరు నాయనా?"

    "ఆయన దైవాంశసంభూతుడు! జ్ఞాని! పెళ్ళి చేసుకొని మేం అలా చేస్తే మాకు మగతనం లేదని మరునాడే మా ముఖం మీద విడాకులు పారేసి పోతుంది ఆ పెళ్ళాం!"

    నవ్వులతో ఆడిటోరియం మార్మోగిపోయింది.

    ఆడపిల్లలు సైతం తలలు వంచుకొని సిగ్గుపడుతూనే నవ్వుకున్నారు.

 Previous Page Next Page