"అతడి గుట్టురట్టు చేయడం ఏమోగానీ ముందు నా బతుకు బజారున పడుతుంది కదా?ఇంత చేస్తే అతడు తన తప్పును ఒప్పుకుంటాడని గ్యారంటీ లేదుకదా?"
"నువ్వు యదార్ధం నలుగురి ఎదుటా చెప్పగలిగితే అతడి చేత తప్పు ఒప్పించి నిన్ను పెళ్ళి చేసుకొనేటట్టు చేసే బాధ్యత నాది"
"సిగ్గు లేకుండా పదిమంది ఎదుటా పెళ్ళి కాకుండానే తల్లినౌతున్నానని ఎలా చెప్పుకోగలనే? సిగ్గు విడిచి చెప్పినా అతడు నాతోవున్న సంబంధం అంగీకరిస్తాడని గ్యారంటీ ఏమిటి? అంగీకరించే మనిషి అయితే అతడు నాతో అలా మాట్లాడి వుండేవాడు కదా?"
"పెళ్ళి కాకుండా తల్లివి కావడానికి సిగ్గేయలేదు కాని, జరిగింది చెప్పడానికి సిగ్గెందుకు? చెప్పకపోతే నీకు న్యాయమెలా జరుగుతుంది?" అంది విశిష్ట.
"న్యాయం జరుగుతుందంటే చెప్పొచ్చు. నేను చెప్పగలిగితే నువ్వేం చేస్తావో ముందు అది చెప్పు."
"మన స్టూడెంట్స నంతా కూడగడతాను. మనని సమర్ధించడానికి సుభాషిణి మేడమ్ వుండనే వుంది. అతడి మీద ఒత్తిడి తెచ్చి నిన్ను పెళ్ళి చేసుకొనేటట్టు చేస్తాను."
"అంతా గొడవ గొడవ అయిపోతుంది కదూ? అంతా ఒక సైక్ఞోన్ లా తయారవుతుంది. అంత జరిగినా అతడు అంగీకరించకపోతే నేనా అవమానంతో బ్రతకటం అసాధ్యం. ఈ వ్యవహారం ఇంతటితో. తెగిపోతేనే బాగుంటుంది. విశిష్టా! నీకు మా అందరికంటే దైర్యం ఎక్కువ. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసినదానివి. ఒకసారి పృధ్వీ సార్ ని ఒంటరిగా కలుసుకొని ఇది మీకు న్యాయమా అని అడుగు! ఏం చెబుతాడో చూద్దాం."
"అడగటానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాని మనం చిన్నప్పుడు బ్రాహ్మడు -బంగారు కంకణం కథ చదువుకున్నాం గుర్తుందా? ఒక బ్రాహ్మణుడు అడవిగుండా ప్రయాణిస్తుంటాడు. అడవి మధ్యన బోనులో పడిన ఒక పులి తటస్థపడుతుంది. అలా వెడుతున్న బ్రాహ్మణ్ణి పిలిచి తన దగ్గరున్న స్వర్ణకంకణం చూపిస్తూ 'అయ్యగారూ! ఈ బోను తలుపు తీశారంటే ఈ స్వర్ణకంకణం మీకు బహుమానంగా ఇచ్చేస్తాను' అని చెబుతుంది. బ్రాహ్మడు స్వర్ణకంకణం మీద ఆశతో బోను తలుపు తెరుస్తాడు. పులి ఒక్కసారిగా బయటికి ఉరికివచ్చి "నాకు చాలా ఆకలిగా వుంది. నిన్ను తినేస్తాను" అని చెబుతుంది.
"నిన్ను రక్షించిన వాడినే భక్షిస్తావా? నీకిది న్యాయమా?" అని అడుగుతాడు బ్రాహ్మడు లబలబలాడుతూ.
"మాది జంతున్యాయం బాబూ! ఆకలి వేసినప్పుడు ఏది చిక్కితే అది చంపి తినొచ్చునని మా జంతున్యాయం చెబుతోంది అని చెప్పి బ్రాహ్మడి మీద పడి తినేసిందా పులి. బంగారు కంకణం మీద ఆశ బ్రాహ్మడి మెడకు మృత్యుపాశం బిగించినట్టే, నువ్వు పృధ్వీమీద వ్యామోహంతో కట్టుబాటు అనే బోను తెరిచి స్వేచ్ఛగా నీ కౌగిట్లోకి ఆహ్వానించావు. అతడొక జంతువు.
అతడికున్నది జంతున్యాయం. ఒక ఆడపిల్లను నమ్మించి. మోసం చేయవచ్చునా అంటే అతడి జంతున్యాయం న్యాయమనే చెబుతుంది. మార్గదర్శకాలైన ఎంన్నో నీతికథలను మనం పాఠాలుగా చదువుకొని కూడా అవసరమైనప్పుడు మరిచిపోతుంటాం" అంది బిందు.
"సరిగ్గా చెప్పావు బిందూ! చిన్నప్పుడు చదువుకొన్న బ్రాహ్మడు. బంగారు కంకణంలాగే అయింది నా బ్రతుకు." కరుణ కళ్ళు కన్నీళ్ళతో జలజలలాడాయి. "స్నేహితురాళ్ళుగా నా కోసం ఏమైనా చెయ్యండి! నన్నెలాగైనా ఒడ్డున పడెయ్యండి. నాకు నెలతప్పిందని ఇంట్లో తెలిస్తే, సామూహిక మరణాలు సంభవిస్తాయి మా ఇంట్లో"
ఎవరికైనా అన్యాయం జరిగితే ఎదిరించి మాట్లాడే ధైర్యం బాగానే వుంది విశిష్టకు. అనవసరమైన గొడవల్లో తలదూరిస్తే ఇంట్లో తిడతారన్న భయం సింధుది, బిందుది,
ఎంత ధైర్యం వున్నా కొంచెం బెరుగ్గానే వుంది విశిష్టకు , ఎందుకంటే ఈ కాలేజీలో చేరినప్పటినుండి అతడి డేగ చూపులు ఆమెను వెంటాడుతున్నాయి అతడి కళ్ళు మౌన సంకేతాలు వెలువరిస్తున్నాయి. ఇప్పుడు ఆ వేటగాడి ముందుకే తను రాయబారిగా వెళ్ళాలి. అదీ......... ఒంటరిగా ....ఇంట్లో వాళ్ళు తిడతారన్న భయంతో సింధు, బిందు తప్పుకోవడం వల్ల.
పృధ్వీని ఒంటరిగా కలువడానికి రెండు రోజుల వరకు వీలుపడలేదు విశిష్టకు. చివరికి లైబ్రరీలో ఒంటరిగా కనిపించాడు ఏదో పుస్తకం కోసం వెదుకుతూ.
విశిష్ట గబగబా దగ్గరికి వెళ్ళి "నమస్కారం సార్!" అంది.
నమస్కారం అందుకున్నట్లుగా తల మాత్రం ఊగించి "ఏమిటి?" అన్నాడు. ఆమె ఒంటరిగా కనిపించిందన్న ఆనందం కళ్ళలో మెరుపులుగా మారుతుంటే. ఆమెను ఒంటరిగా చిక్కించుకోవాలని ఒకటి రెండుసార్లు ట్రై చేసి విఫలమయ్యాడిదివరలో.
"మీతో కరుణ విషయం మాట్లాడాలనుకొంటున్నానండీ!"
"ఏ కరుణ?"
"ఎం,ఎ ఫస్టియర్ స్టూడెంట్."
"ఏమిటి సంగతి?" కనుబొమ్మలు వెటకారంగా కదిలాయి పైకి క్రిందికీ.
"కరుణ పరిస్థితి చాలా దయనీయంగా వుంది. మీతో వున్న సంబంధం ఇంట్లో తెలిసిపోయింది. రేపోమాపో అందరికీ తెలిసిపోతుంది దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల. మన సమాజంలో పెళ్ళి కాకుండా కడుపొచ్చిన స్త్రీ ఎంత హీనంగా చూడబడుతుందో మీకు తెలీంది కాదు. ఆమె జీవితం ముందు ముందు ఎంత నరకంగా మారుతుందో ఎవరైనా ఊహించగలరు. ఆమె ఏం తప్పు చేసిందని ఆమెకీ శిక్ష? ఆమె అమాయకంగా మిమ్మల్ని ప్రేమించడమే నేరమా?" అడిగింది ఆవేశంగా.
"ఇదెక్కడి తద్దినంరా బాబూ! మొన్న ఆమె తండ్రి కూడా వచ్చి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకొందామని అడిగాడు. ఏమిటీ తమాషా? ఆమెతో నాకు మీరనుకొనే సంబంధమేమీ లేదు. ఆమె నేను పనిచేస్తున్న కాలేజీలో ఒక స్టూడెంట్ అంతే. ఎవరి పాపమో మోస్తూ అది నాకు ఎందుకు అంటగడుతుందో, ఆమెకు నాతో సంబంధమున్నట్లు ఎందుకు చెబుతుందో అర్ధంకావడంలేదు" అన్నాడు ఎంతో అమాయకంగా ముఖం పెట్టి.
చప్పట్లు చరిచింది విశిష్ట. "మీ నటన చాలా సూపర్బ్! నాటకాల్లోనో, సినిమాల్లోనో అయితే ఉత్తమ నటన అవార్డు ఇచ్చేవాళ్ళు. కాని నిజ జీవితంలో మీ నటనకి చెప్పు తీసుకుకొట్టాలనిపిస్తోంది. ఒక ఆడపిల్ల జీవస్మరణ సమస్యలో చిక్కుకొని అవతల రోదిస్తుంటే నాటకాలాడతారా నాటకాలు?