Previous Page Next Page 
హృదయాంజలి పేజి 8

    "సిటీకి తీసికెళ్ళి పరీక్షలవీ చేయించాలంటే డబ్బు కావాలికదా? సర్దుబాటు చేసుకొనే సరికి కొంచెం టైం పడుతుంది. తాత్కాలిక ఉపశమనానికి మీ దగ్గరున్న మందులివ్వండి" అన్నాడు సుప్రసన్నాచారి.
 
    "జ్వరాలకీ, పడిశాలకీ ఏవో చిన్న చిన్న మందులు పెట్టెకొంటానే గాని నా దగ్గర గుండెజబ్బులకు సంబంధించిన మందులేవీ లేవండీ!" ఏమో మాత్రలు పొట్లం కట్టించి వెళ్ళిపోయాడు.

    అవే మూడుపూటలా ముసలామె చేత మింగించారు.

    కాని, నొప్పి తగ్గలేదు.

    ఒక అర్ధరాత్రి నొప్పి ఎక్కువై, ఒళ్ళంతా చెమటలుపోసి విలవిల్లాడుతూనే ప్రాణం వదిలేసిందామె
    మరణం ప్రతి జీవికీ సహజమే. చంద్రలోకం మీద అడుగుపెట్టి వచ్చిన మనిషయినా మరణాన్ని జయించలేడు.

    కాని, అది సహజ మరణమైతే అంతగా విచారించే పనిలేదు. కాని, అనంతలక్ష్మిగారిది సహజమరణం అనిపించడంలేదెవరికి. ఆవిడకి మరీ కుదరని జబ్బురాలేదు. మందలు వాడితే మరో పదేళ్ళు నిక్షేపంగా బ్రతికేది.

    మందులు ఇప్పించక మృత్యువుచేతికి అప్పగించినట్లుగా అయింది.

    ఈ నిజం కొడుకూ కోడల్నే కాదు, పిల్లల్ని సైతం క్రుంగదీసింది!

    "పట్నం తీసికెడితే నాన్నమ్మ బ్రతికేది కద, నాన్నగారూ?" అని పిల్లలు పదే పదే అడుగుతున్నారు.
    తల్లి మరణంకంటే, తల్లికి మందులిప్పించలేక చంపుకొన్నానే అన్న బాధ సుప్రసన్నాచారిని ఎక్కువగా క్రుంగదీసింది.

    బ్రతికి ఉన్నప్పుడు కడుపునిండా తిండైనా పెట్టలేని తను, కనీసం ఆమెకు పరలోక ప్రాప్తికోసం చేయాల్సిన ఖర్మ కాండయినా చేయకపోతే మరీ తనకు పుట్టగతులు లేకుండా పోతాయనుకొన్నాడు. ఉన్న పొలం అమ్మేసి తల్లి కర్మకాండ ఘమంగా చేసాడు. అప్పటికిగాని కొంచెం ఆత్మతృప్తి కలుగలేదతనికి. బ్రతికి ఉన్నప్పుడు కడుపునిండా తిండి పెట్టలేకపోయినా చచ్చాక పరలోకంలో సుఖంగా ఉండే ఏర్పాట్లు శాస్త్రానుసారం నిర్వహించి కొడుకై పుట్టినందుకు రుణం తీర్చుకొన్నాడు.

    ఆ ఇంటి పెద్ద దిక్కు అత్తగారు పోయారు.

    కోడలివంతు వచ్చింది.

    ఉన్నదేదో వండి భర్తకూ, పిల్లలకూ పెట్టి మంచి నీళ్ళతో కడుపు నింపుకొన్న రోజులే ఎక్కువైపోయాయి అరుణకు. పస్తు పడుకొన్న రోజే ఆమెకు తృప్తిగా ఉంటుంది. కుండల్లో బియ్యం నిండుకోవడం చూసే అత్తగారు గుండె పగిలి చచ్చారు. ఆమెకులేని అన్నం తనెలా తింటుంది? అన్నం ముద్ద నోట పెట్టుకొంటే చాలు, అత్తగారు పొయ్యి మీదికి ఎక్కించడానికి ఏమీలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ గుండె పట్టుకొని కూలిపోవడం గుర్తు వస్తుందామెకు. ముద్ద లోపలికిపోదు. తిననిరోజే ప్రాయశ్చిత్తం చేసుకొన్నట్టుగా, పాపభారం తగ్గుతున్నట్టుగా. ఉంటుందామెకు. మనసు తేలిక పడుతుంది.

 Previous Page Next Page