Previous Page Next Page 
హృదయాంజలి పేజి 9

    పచ్చని పసినిమ్మపండు ఛాయ ప    గ చూరినట్టుగా అయ్యి, మనిషి ఎముకల గూడుగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. అరుణకూడా మంచం పట్టింది.

    వంట బాధ్యత ఇంటికి పెద్దపిల్ల అయిన అపురూప మీద పడింది. అందరికీ అన్నం తక్కువా, మంచినీళ్ళు ఎక్కువా త్రాగి పడుకోవడం ఆ పిల్లకీ అలవాటైంది.

    ఒకరోజు బాగా ఆయాస పడిపోసాగింది అరుణ.

    పిల్లలు వెళ్ళి డాక్టర్ని తీసుకు వచ్చారు.

    డాక్టరు పరీక్షచేసి, ఆవిడకి మందులేవీ అక్కరలేదనీ, పళ్ళు పాలు మంచి తిండే పెట్టగలిగితే ఆవిడ ఆరోగ్యవంతురాలు కాగలదని చెప్పి వెళ్ళిపోయాడు.

    "బ్రతికుండగా నీకు మంచి తిండి పెట్టలేను. అర్ణా! చచ్చాక అమ్మకి పెట్టినట్టుగా నీకూ పెడతాను పిండం! ఇంకాస్త పొలం మీగిలింది కదా? అది అమ్మేసి పెడతాను! నేను చచ్చాక నాకు అదికూడా వద్దు! ఎందుకంటే మిమ్మల్ని ఇన్ని బాధలకు గురిచేసిన ఈ నీచుడు పరంలోకూడా సుఖపడడానికి అనర్హుడు" భార్య పడుకొన్న మంచం కోడుకు తల బాదుకొని ఏడవసాగాడు ఆచారి.
 
    "మీరు కావాలని చేసింది ఏముంది? రెండు కాళ్ళూ పోగొట్టుకొన్న మీరు ఏం చేయగలరు? ఏం చేయలేదని బాధ పడుతున్నారు? నేను రోజూ అద్దంలో ముఖం చూచుకొన్నప్పుడల్లా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొంటాను. 'ఆయన కాళ్ళే తీసుకొన్నావు! మనిషినే తీసుకొని ఉంటే ఈ బొట్టుపెట్టుకొనే అదృష్టం ఉండేది కాదుక'దాని!" అందామె ఓదార్పుగా.
    అపురూప చెల్లెల్నీ, ఇద్దరు తమ్ముళ్ళనీ కూర్చోబెట్టుకొని చెప్పింది.  "డాక్టరు ఏం చెప్పాడో విన్నారుగా? అమ్మకి మంచి తిండి పళ్ళు పాలు కావాలట! అమ్మ మనకు ఉండాలంటే డాక్టరు చెప్పింది చేయాలి! మనం తినే అన్నం కాస్త కాస్త మిగిల్చి అమ్మకి కడుపునిండా పెట్టి బ్రతికించుకొందాం!"

    "అలాగే!" అంటూ అందరూ ఒప్పుకొన్నారు.

    "నేను పెద్ద రెడ్డిగారింటికెళ్ళి రోజూ ఓ గ్లాసుడు పాలు పోయించుకు వస్తానక్కా." అన్నాడు పెద్ద తమ్ముడు ఉదయభాను.     "నేను దొరగారి తోటకు వెళ్ళి కాపలా ఆయన్ని అడిగి పళ్ళు తెస్తానక్కా!" చిన్న తమ్ముడు చంద్రప్రకాశ్ అన్నాడు.
 
    "మరి నేనేం చేయను?" చెల్లెలు అర్చిత అడిగింది అమాయకంగా ముఖంపెట్టి.
 
    "నువ్వు రోజూ అమ్మకి స్నానం పోసి జడ వెయ్యి!"
 
    "అలాగే, అక్కా! అమ్మకి పేలు పడ్డాయిగా? నేను చక్కగా పేల దువ్వెనతో దువ్వి తీసేస్తాను!"
 
    "మన ఒక్కొక్కరికి అమ్మ ఎంతో చేసిందిగా? మనందరం కలిసి అమ్మకి ఎంత చేసినా తక్కువే!"
 
    ఎవరిపనులు వాళ్ళు కేటాయించుకొన్న పావుగంటలోపే చంద్రప్రకాశ్ పరిగెత్తుకు వెళ్ళి తోటవాడిని అడిగి నాలుగు జామపళ్ళు తీసుకు వచ్చి తల్లికిచ్చాడు.

    "ఎక్కడివిరా ఇవి నీకు?" ఆవిడ అడిగింది.
 
    "దొరగారి తోటవి. నేనేం దొంగిలించలేదు. మా అమ్మకి బాగుండలేదని చెప్పి కాపలా ఆయన్ని అడిగి తెచ్చాను. డాక్టరు నీకు మంచి తిండి, పాలు పళ్ళు పెట్టమన్నాడుగా? నేనేమో పళ్ళు తెస్తాను. అన్నయ్యేమో పెద్ద రెడ్డిగారింటికెళ్ళి రోజూ గ్లాసు పాలు పోయించుకు వస్తానన్నాడు. మరి, పెద్దక్కయ్యేమో...."

    అమాయకంగా తాము ఏమేం అనుకొందీ చెప్పేశాడు. చెబితే అమ్మ సంతోషపడుతుంది కదా అనుకొన్నాడు.
    అరుణకి గుండె గొంతుకలోకి వచ్చినట్టుగా అయింది. ముందు, తన పిల్లలు తన మీద చూపుతున్న ప్రేమకి, తరువాత, ఈ తల్లికోసం వాళ్ళ అభిమానం పోగొట్టుకొంటున్నందుకు.
 
    తిరిపమొత్తడం, అప్పులడగడం ఈ ఇంట ఏనాడూ లేదు.

    అది ఈనాడు జరుగుతూంది! తనమూలంగా!
 
    ఒకసారి జరిగాక అది అలవాటుగా మారుతుంది.

    ఎప్పుడూ అడగనివాళ్ళు అడిగారని ఈరోజు తోటవాడు పళ్ళిచ్చాడు 'పాపం! ఎన్నడూ అడగలేదే' అని రెడ్డిగారు రెండురోజులు పాలుపోస్తాడు. ఇంకెవరైనా మొదటిసారికదా అన్న అభిమానంతో ఏదైనా చేస్తారు! తరువాత విసుక్కుంటారు. విదిలిస్తారు! ఆ అవమానంకూడా వీళ్ళకు అలవాటైపోతుంది. మంచిగా అడిగితే ఇవ్వరుకదా బలవంతంగా పొందుదాం అన్న ధోరణికి దిగుతారు. మనిషి దొంగా, హంతకుడూ అయ్యేది ఇలాగే.

    "చందూ! అక్కయ్యలనీ, అన్నయ్యనీ ఇలా పిలుచుకురా!"

    చందూ అందరినీ పిలుచుకు వచ్చాడు.

    "వీడు ఈ పళ్ళు ఎక్కడ తెచ్చాడో తెలుసా? దొరగారి తోట కావలిగాడినడుక్కుని తెచ్చాడు!"

    "నేనేం అడుక్కుని తేలేదు  అడిగి తెచ్చాను" ఉక్రోషంతో అన్నాడు చందూ.

 Previous Page Next Page