శిశిర్ నిశ్శబ్దంగా తలూగిస్తే, "వస్తాడులే, అపురూపా!" అని నవ్వుతూ చప్పింది మాణిక్యమ్మ. సాగిపోయింది కారు. అపురూప కళ్ళలో పలుచని నీటి తెరమధ్యన కనిపించిన ఆ ఆర్తిని చాలా రోజుల వరకు మరిచిపోలేకపోయాడు శిశిర్.
దసరా సెలవుల వరకూ మాణిక్యమ్మే ఈ భూమ్మీద లేకుండా పోయింది. హార్ట్ ఎటాక్ తో పోయింది.
రవి భార్య ఆమె తలిదండ్రులకి ఒక్కతే సంతానం. ముందు ఇల్లరికం అని అనుకోకపోయినా తల్లి పోయాక రవి అత్తారింట్లో ఉండడం మొదలు పెట్టాడు.
కొడుకు పెళ్ళయితే ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడుతుందని మురిసేది మాణిక్యమ్మ. ఆమె ఊహలకి భిన్నంగా ఏనాడూ మూతపడని ఆ ఇల్లు ఈనాటికి మూతపడింది. ఇంట్లో దీపం పెట్టే దిక్కులేకుండా పోయింది.
ఇల్లు మూతపెట్టి తమ్ముడు అత్తారింటికి చేరుకోవడం నచ్చలేదు సుధకు. రవిని నిష్టూరమాడింది. "ఏ ఘడియలో ఇంట్లో అడుగుపెట్టావో మాకు అమ్మలేకుండా పోయింది" అని మరదలిని తిట్టింది. దానితో తమ్ముడికి అక్కకీ మాటలు లేకుండా పోయాయి. రాక పోకలు బంద్ అయ్యాయి.
మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళే అవకాశమే రాలేదు శిశిర్ కు.
కాని, శిశిర్ మనసుతో అపురూప ఒక అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.
* * *
ప్రశాంతంగా సాగిపోతున్న పడవమీద హఠాత్తుగా ఒక ప్రళయ కెరటం విరుచుకుపడి నావను పల్టీ కొట్టించినట్టుగా, సుప్రసన్నాచారి జీవితం తలక్రిందులైపోయింది.
ఒకరోజు ఆయన ప్రక్క ఊళ్ళో బడి ముగించుకొని సైకిల్ మీద వస్తున్నాడు.
కల్లు లారీ ఒకటి ఆ రూట్ లో తిరుగుతూ ఉంటుంది. అది ఆరోజు అదుపు తప్పినట్టుగా ప్రక్కన వస్తున్న ఒక ఎడ్లబండిని నుగ్గు నుగ్గుచేసి బండికి కట్టిన ఎద్దుల్ని చంపి వీళ్ళకి కొంచెం దూరంలో సైకిల్ మీద వస్తున్న ఆచారిని ఢీకొట్టింది. ఆ ఢీకొట్టడంలో సైకిల్ ఓ ప్రక్కకి, ఆయన లారీ చక్రం క్రిందకి పడ్డారు. చక్రం ఆయన కాళ్ళ మీదినుండి పోయింది కాళ్ళు పటపట విరిగిపోవడంతోనే ఆయనకు స్పృహ తప్పింది.
రెండు రోజుల తరువాత హాస్పిటల్లో కళ్ళు తెరిచిన ఆయనకి కనిపించిన మొండికాళ్లు ఆయన గుండెలో మర ఫిరంగుల్ని ప్రేల్చాయి. ఆ క్షణాన్నే ఆయనలోని కళాహృదయం మూగబోయింది జీవన విపంచి తీగలు త్రెగిపోయినట్టుగా అయింది.
ఏమిటో అసహనం! అశాంతి, కోపం! సుప్రసన్నాచారి అప్రసన్నాచారి అయిపోయాడు. ఇంట్లోను బయటా చిర్రుబుర్రు. బళ్ళో ఒక పిల్లాడిని ఏదో అడిగితే జవాబుచెప్పలేదని చావ చితక కొట్టాడు వాడికి వచ్చేప్రాణం పోయేప్రాణం అన్నట్టుగా అయింది.
పై అదికారులకి ఫిర్యాదు అందడంతో బదిలీ ఆర్డర్స్ వచ్చాయి.
అసలే కర్ర కాళ్ళతో ప్రక్క ఊరికి వెళ్ళి చదువు చెప్పడం యాతనగా ఉంది. పైగా ఎక్కడికో దూరంగా ఈ బదిలీ ఉన్న ఊరు వదిలిపోవాలంటే మనసొప్పలేదు. ఉక్రోషంతో ఉద్యోగమే అక్కరలేదు పొమ్మన్నాడు. వాలంటరీ రిటైర్మెంటు తీసుకొన్న రోజు భవిష్యత్తు అంత భయానకంగా ఉంటుందని ఎంత మాత్రం ఊహించలేదతడు.
కరువు కాటకాల మూలంగా వచ్చే తిండిగింజలు రాకుండా పోయాయి. ఊళ్ళో కరువు మూలంగా ఉదారంగా పెట్టే చేతులు కూడా పెట్టకుండా పోయాయి.
* * *
ఆ రోజు వేళ ప్రకారం స్నానం చేసి మడికట్టుకొన్న అనంత లక్ష్మమ్మగారికి పొయ్యిమీదికి ఎక్కిద్దామంటే పట్టెడుబియ్యం ఏ కుండలో వెదికినా దొరకలేదు.
"నాన్నమ్మా! ఆకలేస్తూందే" అని వచ్చే పిల్లలకి ఏం పెట్టాలి? ఏకాదశి అని, శనివారం అని ఉపవాసాలు తనకి అలవాటే. కాని, పిల్లలు? ఓ గంట ఆలస్యమైతే అల్లాడిపోతారు. ఆవిడ కళ్ళలో తిరిగిన నీళ్ళతో పాటే గుండె కూడా పట్టుకొన్నట్టుగా అయింది.
ఎలాగో దేవతార్చన చేసి, తులసి తీర్ధం గొంతులో పోసుకుని, "ఏమిటో గుండెలో నొప్పిగా ఉందేమ్మా!" అని కోడలితో చెప్ప ిమంచమెక్కిన ఆమె మరి దిగలేదు.
నొప్పి నొప్పి అని ఆవిడ గిలగిల్లాడిపోతుంటే, అపురూప పరిగెత్తుకు వెళ్ళి డాక్టర్ని తీసుకు వచ్చింది. ఆర్.ఎం.పి. డాక్టరతడు.
ఆయన ముసలామెను పరీక్ష చేసి, అది గుండెజబ్బనీ, ఖరీదైన మందులు వాడాల్సి వుంటుందనీ, ఒకసారి సిటీకి తీసికెళ్ళి మెడికల్ చెకప్ చేయించి రిపోర్ట్ తీసుకువస్తే, తను దాని ప్రకారం ట్రీట్ మెంట్ ఇవ్వగలననీ, తనకి ఫీజేమీ అక్కరలేదనీ, మందులు మాత్రం తెచ్చుకొంటే చాలునని చెప్పాడు.