Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 9

       
                                                  ఆ ఆచార శేషమే మన "మరుగుబిళ్లలు"
                          ఈ కచ్చడాల నిర్మాణ విధానం


        ఈ కచ్చడాలు ఆడవారికి ఒక విధంగా నగలయినాయి. అందులోనూ ముఖ్యంగా ఉండవలసిన నగలు. అదిలేకపోతే సిగ్గు. ఆ కచ్చడంలో ఒక ముక్కే ఇప్పటి మరుగుబిళ్ళ. ఆ పటానికీ, ఇప్పుడు వాడుకలో సర్వత్రా ఉన్న మరుగుబిళ్ళలకూ, ఎంత పోలిక ఉందో చూచినంత మాత్రాన తెలుస్తుంది. అదే ఆకారం; అదే చిత్ర రచన. ఆ ఆచారం పోయింది. దాని లాంఛనంగా ఇది మిగిలిపోయింది.
    మరుగుబిళ్ళ లేకపోతే తప్పు. ఒక స్త్రీకి పుట్టిన ఆడుబిడ్డకు మరుగుబిళ్ల పుట్టింటివారు చేయించాలి. లేకపోతే అమ్మలక్కలు ఆడిపోస్తారు. "ఆపాటి మరుగుబిళ్ళ చేయించడానికి కూడా గతిలేకపోయిందా?" అని అంటారు. ఇది పెద్ద తిట్టు.
    కొందరు ఈ వాదనను అంగీకరించరు. గోప్యాంగం కనబడకుండా ఈ ఉపాయం చేశారంటారు. దీన్ని సిగ్గుబిళ్ళన్నారు. కాని, ఈ వాదనను అంగీకరించరు తెలిసిన వారు. ఎవరికి సిగ్గు? ఆ చిన్నపిల్లకా? పయివారికా? చిన్నపిల్లకు సిగ్గు ఏమిటి?
    ఇంక గోప్యాంగం కనబడకూడదన్న సంగతికి. ఆ పాటి గోప్యాంగం మగబిడ్డకు మాత్రం లేదూ? మగవాడికి ఒక బిళ్ళలాంటిది కట్టరేమి? చూచేవారికి సిగ్గువేస్తుందని అంటారేమిటో. అలా అయితే పిల్లవాడి గోప్యాంగం చూచిన స్త్రీలకు సిగ్గులేదని, ఆడపిల్లది చూస్తే పురుషులకు మాత్రం సిగ్గు కలుగుతుందని అనవలసి వస్తుంది. ఆ వాదని ఏమీ బాగుండదు.
    దీనికన్నా మంచి సమాధానం ఒకటి ఉంది. అది గూడా పూర్వకాలపు (అంటే అనాది కాలపు) నమ్మకాలను అనుసరించి ఉన్న సమాధానమే. అదేమంటే-దిష్టిదోషం అన్నది ఒకటి ఉందనీ, ఆ చెడ్డ దిష్టి ఎవరికీ తగలకూడదనీ, అందులోనూ ముఖ్యంగా గోప్యాంగాలకు తగలకూడదని ఒక గట్టి నమ్మకం ఉండేది. అందుచేత ఇతరుల దిష్టి సరాసరి శరీరాల మీద పడకుండా ఉండేటట్టు చూచేవారు. దిష్టిదోషాన్ని మరోదయినా వస్తువుమీదకు తిప్పేవారు.
    ఈ పద్ధతి ననుసరించే, ముఖాలమీద కాటుక చుక్కలు పెట్టడం, ధగధగ మెరిసే గాజుపూసలో, గవ్వలో లేక ఆభరణాలలో ఉపయోగించడం వచ్చింది. ఇది ప్రపంచం అంతటా జరిగిన విషయం. అన్ని జాతులు పూర్వకాలం ఈ దిష్టి దోషాన్ని అంత జాగ్రత్తగా పాటించేవారు. ఇప్పటికీ ఈ నమ్మకం లేకపోలేదు.
    ఈ దిష్టిదోష పరిహారంకోసం ఇలాంటి బిళ్ళలు ఉపయోగించేవారు అని చెప్పుతారు. దీనికి దృష్టాంతంగా, మగపిల్లల మొలత్రాళ్ల చిన్నపాలకాయలవంటి వస్తువులు, లేక పొడుగాటి గజ్జెలు కడతారు- బంగారాన్నో, వెండినో చేయించి. అంతకూ చాలనివారు కానుగకాయనో, నల్ల జీడిగింజనో, ఏదీ చిక్కకపోతే నల్లని పెద్దపూసనో మొలతాడుకి కడతారు అని చూపిస్తారు.
    ఈ వాదన అంత సులభంగా కాదనలేము; కాని, ఇనుప కచ్చడాల ఇమిటేషన్ అన్న వాదనకు మాత్రం బలం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఆకారాన్ని బట్టిచూస్తే, ఇదే నిజమయిన కారణంగా కనబడకమానదు. అంతేకాకుండా ఈ మరుగుబిళ్లను రావిఆకులాగా చేస్తారు. అంతేకాదు, ఆ ఆకుమధ్యకు రెండుమూడు గీతలు నిడుపుగా ఉంచుతారు. అంతా పట్టిచూస్తే ఈ బిళ్ళల నిర్మాణమూ, ఆ కచ్చడాల నిర్మాణమూ ఒక్కచేతి మీదనే తయారయినట్టు కనపడతాయి.
    అంతెందుకు? ఇలాంటి బిళ్ళనే మరొకదానిని వెనుక ప్రక్కకు కట్టి, ఈ రెండు బిళ్ళల కొనలనూ కొంచెంవంచి కలిపినట్టయితే, ఇప్పుడు పటంలో కచ్చడం అవుతుంది. అలా ఉండడానికే ఈ బిళ్ళల చివరలు సన్నంగా చేశారు. ముందునుంచి వెనుకకు పోయినప్పుడు తొడలకు బాధ కలగకుండా ఈ భాగం సన్నంచేశారు.
    తీసినప్పుడు, కట్టినప్పుడు సదుపాయంగా ఉండటానికి ఈ రెండు చివరలని ఒక కీలుతో "జాయింటు" చేసేవారు. "జాయింటు" పద్ధతి ఇష్టం లేదన్నవారు ఒక్కరేకులోనే ముందుబిళ్ళా వెనుకబిళ్లా కొంచెం విశాలంగా చేసి మధ్యభాగాన్ని సన్నంగా చేసేవారు. ఇది ఒక్కముక్క "కచ్చడం", అతుకు ఉండదు. రేకు పల్చగా వుండడంచేత వంగుతుంది. మధ్యను సన్నంగా వుండడంచేత తొడలను ఒరుసుకొని బాధపెట్టదు.
    ముందుబిళ్ళకు, వెనుకబిళ్ళకు ఉచితస్థలాలలో మూత్రవిసర్జనకు, మల విసర్జనకు రంధ్రాలు ఉంచేవారు. ఈ బిళ్ళను బంధించడానికి, మొలతాడువలె సన్నని ఇనుప పట్కా ఒకటి చేసేవారు. ఈ పట్కా ఒక ముక్కగా ఉంటే, నడుముకు గుచ్చుకుంటుందని మూడు, నాలుగు ముక్కలను కీళ్ళతో సంధించి చేసేవారు. ఈ పట్కాను ముందు వెనుక బిళ్ళల తలలోనుంచి ఈడ్చి నడుముచుట్టూ తిప్పి, ఈ పట్కా రెండుకొనలనూ కలుపుతూ చిన్న బీగం వేసేవారు. అదీ ఇనుపకచ్చడం నిర్మాణ విధానం!
    ఇంత సన్నాహం చేస్తేగాని ఇనపకచ్చడం తయారయేది కాదు. ఇంత పాతివ్రత్య సంరక్షక మహాసాధనం కనిపెట్టిన మహా మేధావి ఎవడో: ఏ దేశం వాడో: ఏ కాలంవాడో కదా.

 Previous Page Next Page