Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 8

                                 

                          అతి లజ్జాకరంగా వుండవలసిన ఈ కచ్చడాలు
                             ఆఖరుకు అలంకారాలలాగ
                                      పరిణమించాయి


   స్త్రీ మీద పురుషుడికున్న హక్కు చెలాయించడానికి ఈ ఇనపకచ్చడాలు చాలా బాగా పనికివచ్చాయి. చేతిలో కలంవుంది చెరచెర వ్రాశారు సూత్రాల ధర్మపన్నాలూ. స్త్రీ పతివ్రతగా వుండాలన్నారు. పరపురుషుడిని చూడకూడదన్నారు. పాపం అన్నారు. నరకం అన్నారు. నరకం అంటే ఏమిటో బాగా తెలిసేటట్టు నరకబాధలను చిత్రాలుగా చూపించారు. కావ్యాలుగా వ్రాసి వినిపించారు.
    అయినా ఇంకా అనుమానమే. మానవస్వభావం వుంది కదా, ఆహారాది సౌఖ్యాల రుచి ఒకటి వుంది కదా. శాస్త్రాలు అడ్డినా, సూత్రాలు ఆపినా, స్వభావాలు ఆగలేదు. చిల్లర చూపులు మానలేదు. మగవాడికి మహత్తు తగ్గిపోతూ వచ్చింది. మండిపోతుండేవాడు. మాటలతో తీరదురా ఈ మహాచిక్కు అని గ్రహించాడు. నిర్బంధన విధానానికి పూనుకున్నాడు. అంటే డిసిప్లినరీ చర్య ఆరంభించాడు. ఈ ఇనపకచ్చలు బిగించాడు.
    ఆడది ఏదో తప్పు చేసిందన్న ఆగ్రహమే కాని, అందులో తానెంత వరకు కారణం అన్నమాట మన మగవాడికి లేదు. అందులో ఆనాటివాడికి అసలేలేదు. తాను విచ్చలవిడిగా తిరగొచ్చట. అది అంతా శృంగార రసమయ జీవనమట. అలా తిరిగేవాడు కులాసా పురుషుడట. సరసుడట. "వేశ్యాభుజంగా" అనడం ఒక బిరుదు నామం అట. అంటే అర్ధం భోగంవాళ్ళకు విటుడు అని. ఇది ఒక ప్రఖ్యాతి పేరట. నలుగురితోనో పదుగురితోనో వ్యవహరించడం "మగసిరి" అట.
    ఏమయ్యా, ఇలా చేయవచ్చునా అని అడిగితే, నువ్వు! విశ్వామిత్ర పరాశరులంతటివారే, ఆకూ అలమూ తిన్నవారే స్త్రీ ముఖం చూచి మోహపరవశులయ్యారు. మహా తపస్సంతా, మదనతాపం చేసుకొని, పుణ్యం అంతా బుగ్గిలో కలిపి, ఆ స్త్రీలను కూడారు. మనం రాజాన్నాలు తినేవారు. పాలూ పెరుగూ నేయి భుజించేవారం.
    శాల్యన్నం సఘృతం పయోదధియుతం భుంజంతియే మానవాః
    తేషా మింద్రియ నిగ్రహం యదిభవేత్ వింధ్యఃప్లవేత్ సాగరే.
    అటువంటి మనం తట్టుకోగలమా? వింధ్యపర్వతం సముద్రంలో తేలిపోవలసిందే కదా! అని కవిత్వం వెలిగిస్తారు. ఆ శాల్యన్నమే స్త్రీలు గూడా తింటారని తెలియదా! వారు తాగిన పాలకు ఈ గుణం ఉండదా! వారు ఈలాంటి పనే చేస్తే తప్పా? దోషమా? అన్న దృష్టే ఉండదు. స్వార్ధపరత్వం పెరిగిపోతే, సంగతులు సరిగా బోధపడవు.
    దీనికి తోడు మరొకటి కూడా చేశాడు మానవుడు. తన ఇష్టం వచ్చినంతమందిని పెళ్ళి చేసుకోవచ్చునట. సంతానంకోసం అని అంటారేమో, అలాంటివారు చాలా తక్కువ. మొదటి పెళ్ళానికీ అరడజను పిల్లలున్నా రెండో భార్యను చేసుకొన్న వారెందరు? ఇద్దరు భార్యలకు చెరి పదిమంది పిల్లలున్నా మూడోదానికోసం మొగసాల ఎక్కిందెవరు?
    కారణాలున్నాయిలెండి. లేనికార్యం అంటూ ఏదయినా ప్రపంచంలో వుంది గనకనా! కాని, ఆ కాంతల గతేమిటి? ఈ మగరాజు రోజుకొక అంతఃపురంలో ఉంటాడు. తన కామానికి దారి చూచుకుంటాడు. తాను తిన్న పాలూ, పెరుగూ వినియోగంలో పెడతాడు. మరి ఆ రెండో భార్య? ఏమి చెయ్యాలి? ఇతడు తృష్ణ ఎలాగో ఒకలాగ తీర్చుకుంటే మరి దాని తృష్ణో? ఆ తృష్ణ తీర్చే ఉపాయం ఏదయినా చేయగలిగాడా? ఆమెకు సంతృప్తి కలిగించి తరువాత తన సంతృప్తి కోసం చూచాడా?
    లేదు; ఆ స్త్రీ పాపం పై చూపు చూస్తుంది. దానికి మంట. అది వ్యభిచారం అట. (తాను చేసిందంతా సరసం, మగసిరి సుమండీ) పాపం అట. ఇక దానిని తిట్టిన తిట్లు యిన్నీ అన్నా? స్త్రీ బుద్ధిః ప్రళయాంతకా అన్నారు. పడతి అంటే పాము అన్నారు; దూరంగా పారిపో అన్నారు; అగ్నికీల అన్నారు. అందరినీ మింగేస్తుందన్నారు. తిట్టారు; శపించారు. ఇనపకచ్చలు వేసి బీగాలు బిగించారు. దోషంచేసింది మగవాడు; దూషణ పొందినది ఆడది. అది మనవారి న్యాయం!
    అనేకమంది స్త్రీలను ఉంచుకొనే ఆచారం ఉన్న దేశాలలోనే ఈ ఇనపకచ్చడాల ఉపయోగం ఎక్కువగా ఉండేది. ఈ ఇనపకచ్చడాల ఆచారం ఎక్కువగా ఉన్నప్పుడు అది లేకపోవడం ఒకలోపం అవుతుంది. దానికి ఒక ఆధిక్యం వస్తుంది. ఈ ఇనుపకచ్చలు చేయడంలో నిర్మాణ చాకచక్యం చూపించడం, కొత్త కొత్త రకాలు తయారుచేయడం, బుద్ధి కుశలత కనబరచడం అన్నీ వస్తాయి. ఇనపకచ్చలు అన్న విషయం ఒక కళ అవుతుంది.
    ప్రక్కచూపిన కచ్చడం మీద చూడండి ఎంత నగిషీని చూపించాడో! మలద్వారమూ మూత్రద్వారమూ ఎంత అందంగా ఉంచడానికి ప్రయత్నం చేశాడో! దీనిని బట్టి చూస్తే, పాపం! ఆ స్త్రీలు వీటిని నిరోధక యంత్రాలుగానూ, శత్రుమారణసాధనం గానూ భావించారంటారా? అలా అనగలమా?
    లేదు, వీటిని గూడా అలంకారాలుగానే భావించారనడం మంచిది. భావ్యం. మజూరీ -- చేసేందుకు కూలి-ఎంత ఇచ్చారో. ఎంత సంతోషంతో ఈ ఇనపకచ్చడాలు ధరించేవారో! "చూచావా, మా ఆయన నాకు ఎంత చక్కని కచ్చడం చేయించాడో" అని ఎందరు అమ్మలు తమ స్నేహితులకు వీటిని చూపించేవారో.
    ఈ కచ్చలు - మంచివి - లేనివారు "ఏమండీ, నాకు కచ్చడం చెయ్యించి పెట్టారు కారు. యింకెన్నాళ్ళు ఈ దరిద్రపు బతుకు బతకటం చూడండి. సుబ్బమ్మ పది వరహాలిచ్చి కచ్చడం చెయ్యించుకుంది; రామక్క పన్నెండు వరహాలిచ్చి చెయ్యించుకుంది. నా గతే ఇలా అఘోరిస్తూవుంది. అని ఎంత వేధించేవారో భర్తలను! వారెన్ని పాట్లుపడి డబ్బు సంగ్రహించి ఈ కచ్చడాలు చేయించేవారో.
    ఇదంతా హాస్యానికి చెప్పిన మాటలు కావు, నిజాలు. ఇప్పుడు చెయిన్, గొలుసులు, తళుకుల గాజులు చెయ్యించమని భార్యలు భర్తల ప్రాణాలు తీస్తున్నట్టే అప్పుడు ఈ కచ్చడాల కోసం ఆందోళన చేసేవారు. లుంగీ పాటర్ను పట్టుచీర కొనకుండా ఇప్పుడు మగవాడు పెళ్ళాం పోరు ఎలాగా మాన్పలేడో, అలాగే ఆ రోజులలో సరి క్రొత్తరకం కచ్చడం ఇచ్చినదాకా, మగని మర్యాద దక్కేది కాదు. అది లేకేపోతే అవమానం. అమర్యాద, సిగ్గు, లజ్జ, అది అంత అవసరం.
    ఈ పైని చూపించిన కచ్చడంలో మీదిభాగం (అనగా కటిముందు వుండవలసిన భాగం) ఇప్పటి మరుగుబిళ్ళలకు (సిగ్గుబిళ్ళలంటారు) పోలికగా వుంటుందో లేదో కొంచెం పరిశీలించి వుండండి.

 Previous Page Next Page