Previous Page Next Page 

    ఆయన యింట్లో తిష్టవేయతము, ఆయన ఏమయినా మాట జారినా దులిపేసుకుని తిరగడము అలవాటు చేసుకుని చివరకు చిరపరిచితుడి క్రింద మిగిలిపోయాడు. బలరామయ్యగారి పొలాలు కొన్ని ఎల్లమిల్లిలో వుండటంవల్ల- ఆయన అప్పుడప్పుడూ అక్కడికి పోయినప్పుడు రామకృష్ణయ్య గారింట్లో సత్యమూర్తిని చూసి ముచ్చటపడ్డాడు. అప్పటికతను ఏడెనిమిదేళ్ళ కుర్రవాడు. రామకృష్ణయ్యగారి కింకా యిద్దరు కొడుకులూ, యిద్దరు కూతుళ్ళూ ఉన్నారు సత్యమూర్తి అందరికన్న చిన్నవాడు. ఆయన భార్య అతన్నికన్నాక రెండు సంవత్సరాలకు స్వర్గస్తురాలయింది. రామకృష్ణయ్యగారు వున్న కాస్త పొలం స్వయంగా చూసుకుంటూ ఏదో బండీ యీడ్చుకొస్తున్నాడేగాని వున్నావాడేమీకాదు. అందుకని ఓరోజు బలరామయ్యగారు నోరువిడిచి దత్తత ప్రశక్తి తీసుకురాగానే భుజాలెగురేసి, స్వలాభం అన్నీ చూసుకుని మెల్లిగా అంగీకారం తేల్పాడు.

    సత్యమూర్తి చిన్నప్పటినుంచీ అమాయకుడు. పెద్దల యెడల వినయ విధేయతలూ, భయభక్తులూ గలవాడు. తన జీవితంలో హఠాత్తుగా వచ్చిన మార్పు అతడ్ని భయపెట్టింది. గందరగోళ పరిచింది. తల్లిప్రేమ చిన్నతనం నుంచీ ఎరుగడు. ఆ పల్లెటూళ్ళో, అల్లరిపిల్లలకి దూరంగా ఎప్పుడూ వొంటరిగా తిరుగాడుతూ వుండే అతను ఓ మాదిరి పట్నానికి వచ్చి పడ్డాడు. ఇక్కడ అంతా కొత్త మనుషులు, కొత్త యిల్లు, కొత్త పద్దతులు. తన చుట్టూ ఓ బందిఖానా లాంటిది ఏర్పడిందని గ్రహించాడు. ఇంచుమించు తన తండ్రి యీడే వున్న ఓ వ్యక్తి తనంటే పితృవాత్సల్యం ప్రదర్శిస్తున్నాడు చీటికిమాటికి దగ్గరికి పిలుస్తున్నాడు. లాలిస్తున్నాడు, తను ఆయన్ని "నాన్నగారూ" అని పిలవాలని బోధించబడింది. అట్లాగే పిలుస్తున్నాడు. ఆ పెద్ద యింట్లో బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నాడు. పేరుకు తల్లి అంటూ ఒకామె వుంది. ఆమె ఎప్పుడూ అతన్ని చేరదియ్యలేదు, బుజ్జగించదు. పైగా ఆమె కొరకొరలాడే చూపులు అతనికి భయాన్ని కలుగజేసేవి. ఆమెకు సాధ్యమైనంత దూరంగా తప్పించుకు తిరగసాగాడు.

    తన గురించి ఆ దంపతులిద్దరికీ వాగ్వివాదాలు జరగటం అనేకసార్లు విన్నాడు. తనే యిహ వారి పుత్రుడనీ, అతన్ని ప్రేమగా చూసుకోవాలనీ, పరాయివాడిని చూసినట్లు అలా చూడటం తగదనీ ఆయన హెచ్చరిస్తూ వుండేవాడు. ఆవిడ లెక్కచేసేదికాదు. ఎందువల్లనో ఏ మమకారపు కిరణాలూ ఆమె హృదయంలో వుదయించలేదు. కాని క్రమంగా అతనిపట్ల కొంత దయగా వుండటం అలవర్చుకుంది. వేళకి బడికి పంపటం, కొద్దిగా మాట్లాడుతూ వుండటం, భోజనాదిక వ్యవహారాలూ అన్ని యాంత్రికంగా చూసేది. రాధమ్మగారు తన మనస్సులో ఏమున్నదో బయటికి తెలియనిచ్చేది కాదు.

    ఏ శుభముహూర్తాన అతను దత్తుకు వచ్చాడోగాని బలరామయ్యగారికి మాత్రం కుమారునిపట్ల అవాజ్యమైన అనురాగం కుదిరింది. తనకి తోచినంతలో మంచి మంచి బట్టల్ని కుట్టించాడు. ఎక్కడకు పోయినా తనవెంట తీసుకుపోతూండేవాడు. దగ్గర కూర్చోపెట్టుకుని మంచి మంచి కబుర్లు చెప్పి అతని కొత్తదనం పోగొట్టి, తనవైపు త్రిప్పుకోవటానికి ప్రయత్నం చేస్తూండేవాడు.

    విజయ అతనికన్న రెండుమూడేళ్ళు చిన్న. రాధమ్మగారు చేసిన అతి గారాబంవల్ల ఆమె వొట్టి రణపెంకిగా తయారై వూరుకుంది. ఎవరిమాటా లెక్కచెయ్యదు. ఎవరికీ భయపడదు.

    సత్యమూర్తిని ఆమె వచ్చినప్పటినుంచీ ఓ శత్రువుగా పరిగణించింది.

    "మీ అన్నయ్యే" అన్నారు బలరామయ్యగారు.

కాని హఠాత్తుగా వచ్చి  తమ యింట్లో వున్నత పీఠం అధిష్టించి కూర్చున్న యీ కొత్త కుర్రాడ్ని "అన్నా" అని పిలవటానికి ఆ పిల్లకు ఏనాడూ మనస్కరించలేదు. ఎప్పుడూ దూరంగానే వుంటూవచ్చేది. కొన్ని సందర్భాలలో యీసడించుకునేది కూడా. ఎందుకో సత్యమూర్తికి ఆ పిల్ల అంటే మొదట్నుంచీ భయం ఏర్పడింది. ఎవరితోనూ తనంతట తాను మాట్లాడనీవాడు మంచిచేసుకుందామని ఎంతో కొంత ప్రయత్నం చేశాడు, కాని విఫలుడయ్యాడు.

   
                                  *    *    *

    బలరామయ్యగారు పరమ లోభి. బోలెడు ఎకరాల బంగారంవంటి భూమేగాకుండా ఆ ఊళ్లోనే మరో రెండు పెద్దపెద్ద యిళ్ళున్నాయి. అవి భాగాలుచేసి అద్దెలు కిచ్చాడు. వడ్డీవ్యాపారమంటూ భారీఎత్తున సాగించక పోయినా యిరవైముప్పయివేలదాకా ఎప్పుడూ వడ్డీకి తిరుగుతూనే ఉంటుంది. వాటి తాలూకు పత్రాలు, లిటికేషన్లు యీ గొడవలతో ఆయన తల మునిగే ఆలోచనలతో వుండేవాడు.

    ఆయన ఖరీదైన బట్టలు వేసుకోగా ఎవరూ చూడలేదు. కాళ్ళకు చెప్పులు కూడా వుండేవికావు. ఎంతదూరమైనా సాధారణంగా నడిచే పోతూండేవాడు. ఎప్పుడోగాని రిక్షా ఎక్కేవాడు కాదు. ఎక్కితే వాడితో డబ్బుల దగ్గర హోరాహోరీ యుద్ధం చేసేవాడు.

    ఆయన ఎప్పుడూ వ్యాపారాల జోలికి పోలేదు. వాటి మనుగడపై ఆయన కంతగా నమ్మకంలేదు.

    సత్యమూర్తి వాలకం చూసి అతను ప్రయోజకుడు కాడేమోనని దిగులు పడుతూండేవాడు.
   

 Previous Page Next Page