Previous Page Next Page 
విషవలయం పేజి 10

    కాని ఆయనకో చిత్రమైన గుణం అబ్బింది. పెంపుడు కొడుకు అంటే ఏర్పడిన వల్లమాలిన మమకారంవల్ల అతను ఏమి అడిగినా కాదనలేకపోయేవాడు. అడిగిందల్లా తెచ్చియిచ్చేవాడు మనసులో బాధపడ్తూనే.

    సత్యమూర్తికి డబ్బు విలువ తెలిసేదికాదు. ఆడంబరంగా కాక పోయినా అర్ధవిహీనంగా ఖర్చుపెట్టేవాడు. ఎవరు ఏది అడిగితే అది ఇచ్చెయ్యటం అలవాటయిపోయింది. తండ్రి కోపిష్టి అని అతనికి తెలుసు గాని తన విచ్చలవిడితనాన్ని గురించి ఆయన ఆందోళనపడుతున్నాడని అతనికి తెలియదు.

   
                                   *    *    *

    ఉన్నట్లుండి విజయ యింటిలో పెద్ద దుమారం చెలరేగేటట్లు చేసింది. ఒక్కసారిగా స్థబ్దుగా వుండే వాతావరణమంతా ఎవరో నిర్దయగా కుదిపివేసినట్లయింది.

    తండ్రి ఆమెకో మంచి సంబంధం చూశాడు, పెళ్ళీడు కొచ్చింది కాబట్టి. ఇంచుమిందు ముహూరథం కూడా నిశ్చయించారు. అప్పట్నుంచీ మౌనంగా వూరుకున్నదల్లా-ఒకరోజు అందరూ ఉలికిపడేటట్లు "నేను యీ పెళ్ళి చేసుకోను" అన్నది గట్టిగా.

    "ఏం?" అన్నది తల్లి అదిరిపడి.

    "నాకా అబ్బాయంటే ఇష్టం లేదు"

    "మరి ఆ విషయం ముందే ఎందుకు అఘోరించలేదు? ఇప్పుడు వాళ్ళకి మాట ఇచ్చి అన్ని ప్రయత్నాలూ పూర్తి అవుతూంటే ఏ మొహం పెట్టుకుని చెబుతున్నావు?" అని తండ్రి మండిపడ్డాడు.

    "మొదట్లో నేను నిశ్చయించుకోలేకపోయాను. నా ఆలోచన్లు ఒకదారికి రావటానికి ఇంతకాలం పట్టింది. ఈ సంబంధం నాకు సుతరామూ ఇష్టం లేదు. నేను చేసుకోను" అంది స్పష్టంగా విజయ.

    "అయితే నా పరువూ, ప్రతిష్టా ఏమయిపోయినా నీకు అక్కర్లేదు?" అని తండ్రి కోపంతో అరిచాడు.

    "ఒకరకంగా చూస్తే-అక్కర్లేదు" అంది విజయ మొండిగా.

    రాధమ్మగారు కూతుర్ని బ్రతిమిలాడింది. బుజ్జగించింది, కేకలేసింది. అయినా కూతురు తన పట్టు విడవలేదు.

    చివరికి బలరామయ్యగారు ఆగ్రహాన్ని అణచుకోలేక "మరి అయితే ఎవర్ని చేసుకుంటావు? ఎవడితోనన్నా ప్రేమ అఘోరించావేమిటి?" అన్నాడు రెచ్చిపోయి.

    "ఏం ప్రేమిస్తే తప్పా?" అన్నది విజయ సూటిగా సమాధానం చెప్పకుండా.

    "నే నడిగిందానికి జవాబు చెప్పు. ఎవడైనా వున్నాడా?"

    "సరే ఇంతవరకూ వచ్చింతర్వాత దాపరికం దేనికి? నేను మీటనొక్కితే పనిచేసే యంత్రాన్ని కాను, హృదయం ఉన్న మనిషిని. నాకూ ఒక వ్యక్తిత్వం స్వతంత్రాభిప్రాయాలూ వున్నాయి. నా మనసు ఒకరికి యిచ్చాను" అంది విజయ తొణక్కుండా.

    "ఎవడు వాడు?"

    "వాడు కాదు. వారు కృష్ణమూర్తి."

    సత్యమూర్తి యిందాకటినుంచీ ఆ గదిలోనే నిలబడి సంభాషణ అంతా ఆలకిస్తున్నాడు. అంతవరకూ అతని జోక్యము కలిగించుకోవలసిన అవసరము ఏమీ కనబడలేదు. కాని ఎప్పుడైతే చెల్లెలు కృష్ణమూర్తి పేరు ఉశ్చరించిందో అతను ఉలికిపడి "ఏ కృష్ణమూర్తి? రంగనాథంగారబ్బాయా?" అన్నాడు.

    "అవునతనే" అన్నదామె చలించకుండా.

    "వాడు వొట్టి దుర్మార్గుడు. సమస్త వ్యసనాలూ వున్నాయి వాడికి. పచ్చి మోసగాడు. అలాంటివాడితో నీకు పరిచయం ఎలా ఏర్పడింది విజయ?" అని అడిగాడు బాధపడుతూ.

    ఆమె అతనివంక అసహనంగా, చిరాగ్గా చూసింది. తన వ్యక్తిత్వం దెబ్బతిన్న జుగుప్స కనిపించింది ఆమె నేత్రాలలో. "అతన్ని యిలా నిందించే అధికారము నీకు ఎవరిచ్చారు సత్యమూర్తి?" అన్నది నిర్భయంగా.

    ఈ సంబోధన విని బలరామయ్యగారు నిలువునా వొణికిపొయ్యాడు. "ఎవరిచ్చారా? వాడు నీ అన్నే, అన్న తిట్టటానికె కాదు, నీ తోలు వొలవటానికి కూడా వాడికి అధికారము వుంది" అంటూ మండిపడ్డాడు.

    "ఓ!" అని ఆమె తల ఎగురవేసి "ఎక్కడో పల్లెటూళ్ళో పుట్టి పెరిగినవాడు. అడివి మనిషి నా అన్న, ఆహా" అన్నది ఎగతాళిగా.

    సత్యమూర్తి ముఖమంతా ఎర్రబడిపోయింది అతని మనసు తునా తునకలై పోయినట్లయింది అక్కడ వుండటానికి మనస్కరించక బయటకు వెళ్ళిపోయాడు.

    బలరామయ్యగారు ప్రళయకాల రుద్రుడిలాగా ఎగిరిపోయాడు. "ఇంతకు బారి తెగించిపోయావే దెయ్యమా? ఆ కృష్ణమూర్తి ఎవడో వాడినీ, నిన్నూ కలిపి పాతర వేస్తాను. ఈ సంబంధము ఎలా చేసుకోవో చూస్తాను అంటూ కూతుర్ని బరబర లాక్కువెళ్ళి గదిలో పెట్టి తాళం వేశాడు.
   

 Previous Page Next Page