2
అలిసిపోయినట్లుగా ఒక్కసారి ఘార్ణిల్లిరైలు సామర్లకోట స్టేషన్ కి వచ్చింది. రాత్రి పదకొండు గంటలు దాటిపోయింది. ఎప్పుడు చేరవలసిన బండో అసలు! సత్యమూర్తి తన పెట్టె, బెడ్డింగ్ తో ఫ్లాట్ ఫారం మీదకి దిగాడు.
అతని ప్రక్కనుంచి ఎవరో టి.సి. పోతున్నాడు. అతన్ని ఆపి "కాకినాడ కనెక్షన్ ట్రెయిన్..."
"అది ఏనాడో వెళ్ళిపోయింది మిస్టర్. మళ్ళీ తెల్లవారుఝాముదాకా ట్రెయిన్ లేదు."
హతోస్మి సత్యమూర్తికి ఉసూరు మనిపించింది. అప్పటిదాకా ఇక్కడ వెయిటింగ్ రూమ్ లో జపం చెయ్యాల్సిందే! అతనికేమీ చేయటానికి పాలుపోలేదు. ఒకటి రెండు నిమిశాలు అలాగే సందిగ్ధంగా ఆలోచిస్తూనిలబడ్డాడు.
ఇంతలో అతనికి స్టేషన్బయట టాక్సీలుంటాయని గుర్తుకువచ్చింది. "హమ్మయ్య" అని కుదుటబడి సామానువాడి నెత్తినపెట్టి బయల్దేరాడు.
సామాను టాక్సీలో పెట్టించి, వెనకసీట్లో ఆనుకుని కూర్చున్నాడు - ఆలోచిస్తూ.
టాక్సీ కాకినాడ చేరుకునేందుకు అరగంట పట్టింది. రామారావు పేటలోవున్న ఓ పెద్ద మేడ ముందుకువచ్చి ఆగింది.
గేటు తెరచుకుని లోపలకు వెడుతున్నాడు సత్యమోర్తి. అంతా నిశ్శబ్దంగా వుంది. ఎక్కడా మనుషుల అలికిడిలేదు. పైన ఎక్కడో రెండు మూడు గదుల్లోంచి కనిపించే కాస్త వెలుతురూ తప్ప సర్వత్రా చీకటి.
టాక్సీవాడ్ని పంపించేసి, సామాను క్రింద హాల్లో వుంచేసి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు.
పైన వసారా అంతా చడీచప్పుడు లేకుండా వుంది. అతను చిన్నగా అడుగులు వేసుకొంటూ వెళ్ళి తండ్రి గదిముందు నిలిచాడు.
గదికి ద్వారానికి తెరకట్టేసి ఉంది. లోపల సన్నని వెలుగు ప్రసరిస్తోంది.
"అమ్మా!" అని పిలిచాడు చిన్నగా.
గదిలో అలికిడి అయింది. రెండు మూడు క్షణాలు గడిచాక తెర తొలగించుకుని ఓ నడివయసు దాటిన స్త్రీ యువతలకు వచ్చింది. ఆమె ముఖమంతా దుర్భరవేదనతో శుష్కించిపోయినట్లు కళావిహీనమైపోయింది.
"వొచ్చావా?" అన్నదామె ఉదాసీనంగా.
"నాన్నగారి కెలావుంది?"
"ఎక్కువగానే వుంది. నిన్నటినుంచి మరీ విషమించింది పరిస్థితి. అందుకని నీకు వైర్ యిప్పించాను."
సత్యమూర్తి చప్పుడు చేయకుండా లోపలకు అడుగుపెట్టి మంచంవైపు చూశాడు. బలరామయ్యగారు కళ్ళు మూసుకుని పడుకుని వున్నారు.
"ఇప్పుడే నిద్రపట్టింది. రేప్రొద్దున్న మాట్లాడుదువుగాని, ప్రయాణ బడలికలో ఉన్నట్లున్నావు. బట్టలు మార్చుకొని పడుకో" అన్నది ఆమె.
అతను బయటికి వచ్చి "ఏమిటి జబ్బు?" అని అడిగాడు ఆత్రంగా.
"పక్షవాతం. ఉన్నట్లుంది ఓ కాలూ చెయ్యీ పడిపోయింది. అప్పట్నుంచీ ప్రళయంగానే వుంది."
"ఇంట్లో ఎవరేవరున్నారు?" అని అడిగాడు సత్యమూర్తి కొంచెం ఆగి.
"తమ్ముడు వీరభద్రానికి కబురుచేశాను. అతను మొన్ననే వచ్చాడు" క్రిందగదిలో పడుకొన్నాడు. నౌకరు చంద్రయ్య కూడా యింటిలోనే పడుకున్నాడు. వాడూ హాల్లో ఎక్కడో వుండాలి."
"సరే అని సత్యమూర్తి యింకేమీ మాట్లాడకుండా తన గదివేపు వెళ్ళిపోయాడు.
3
కాకినాడలో బలరామయ్యగారి పేరు ఒకరకంగా ప్రసిద్దికెక్కింది. ఆయన పరమ లోభి అని, ఆయన లుబ్ధత్వానికి ఉదాహరణలుగా తెలిసినవారు చిత్రమయిన కథలు చెప్పుకుంటారు.
బలరామయ్యగారు సత్యమూర్తికి సొంత తండ్రికాదు. ఆయనకు ఎన్నాళ్ళకి సంతానప్రాప్తి కలగలేదు. ఏళ్లు పైపడుతున్న కొద్దీ ఆయన పిల్లలకోసం కలవరించి పొయ్యాడు. వ్రతాలు చేశాడు. వైద్య చికిత్స పొందాడు. తీర్ధయాత్రలు దర్శించాడు. చివరకు ఆయన అదృష్టం పండి ఆయన భార్య రాధమ్మగారి గర్భం ఫలించి ఓ ముహూర్తాన ఆడపిల్లను కని వూరుకున్నది. అంతే. మరి కాన్పులేదు. నాలుగయిదు సంవత్సరాలు ఓపిగ్గా వేచివుండి చివరకు సత్యమూర్తిని తెచ్చి దత్తత చేసుకున్నాడు. సత్యమూర్తి అసలు తండ్రి రామకృష్ణయ్యగారు బలరామయ్యగారికి ఎక్కడో దూరపు బంధు అవుతాడు. స్వగ్రామమైన ఎల్లమిల్లినుండి సొంత పనులమీద కాకినాడ వచ్చినప్పుడు బలరామయ్యగారికి యిష్టం వున్నా లేకపోయినా