"వెంకట్రావు మాష్టారు యొక్క వినయ విధేయతలు చూసి లోకం అంతా పోరపడింది. నెమ్మదిగాను, వినయ విధేయతలతో వున్నవాళ్ళు అందరి విషయంలోనూ, అన్నిట్లోనూ ఓకేరకంగా వుంటారనుకోటం చాలా పొరపాటని ఓ సంఘటన ద్వారా ఇరుగు పొరుగు గ్రహించారు.
వెంకట్రావు మాష్టారు చేసే ఉద్యోగం కూడా కాలేజీలో లెక్చరర్. ఆయన భార్య పేరు మీనాక్షి. మొదట్లో ఈ మీనాక్షి విషయంలో ఇరుగు పొరుగు చాలా పొరపాటు పడ్డారు. మీనాక్షి ఎత్తుగా, లావుగా వుండేది. పని గట్టుకుని ఎవరితో మాట్లాడేది కాదు. ఎవరితో పరిచయం పెంచుకునేది కాదు. ఎవరయినా ఎదురయితే ముఖం తిప్పుకునేది. లేకపోతే ముఖం దించుకునేది. ఇహ ఆమెతో సంభాషణ ఇలా వుండేది.
"వంటయిందాండీ!"
"ఊ....."
"మాష్టారు ఇంకా ఇంటికి రాలేదా?"
"ఉహూ!"
"పనంతా పూర్తి అయిందా!"
"ఊ......"
"రండి- మా యింట్లో కూర్చుందాము."
"ఉహూ!"
"మాస్టారు వచ్చిం తరువాత వెళుదురు గాని. ఎప్పుడూ మా యింటికి రారు. రండి"
ఉహూ!"
మీనాక్షి తో మాట్లాడాలి అంటే యిలా అన్నమాట. ఊ..... ఆ..... ఉహూ..... లు తప్పించి మరొక్క అక్షరం ఎక్కువ చేర్చి మాట్లాడేది కాదు. దాంతో అందరూ మీనాక్షికి గర్వం అని అపార్ధం చేసుకున్నారు. మీనాక్షి ముందు వెంకట్రావ్ మాస్టారు సన్నగా, పొట్టిగా, బక్క ప్రాణిళా వుండేవాడు.
ఇరుగు పొరుగు పరిచయస్తులు అందరూ మీనాక్షితో పచ్చికొట్టినట్లు మాటలు తగ్గించారు. మీనాక్షి వాళ్ళను చూసి ముఖం తిప్పుకోటం కాదు - వాళ్ళే మీనాక్షిని చూసి ముఖం తిప్పుకుని పోవటం ప్రారంభించారు. ఇలా కొంతకాలం జరిగింతరువాత ఓరోజు అసలు విషయం బయటపడింది అందుకే పెద్దలన్నారు - ఏ విషయమయినా గాని, ఎవరి గురించి అయినా గాని తెలిసీ తెలియకుండా ఓ నిర్ధారణకి రాకూడదు - అపార్ధం చేసుకోకూడదనీను.
ఆ రోజు మీనాక్షిని పేరంటం పిలవటానికి ఒకావిడ వచ్చింది. ఆ సమయంలో తలుపులు వేసి ఉన్నాయి. తలుపు తట్టటానికి తలుపుపై చేయి వేయబోయింది. ఇంతలో లోపల నుంచి భయంకరంగా మూలుగు వినపడింది. పేరంటానికి పిలవటానికి వచ్చిన ఆమె ఏ విషయం అర్ధంగాక అలా నిలబడిపోయింది. అప్పుడు లోపల నుంచి ఇలా మాటలు వినపడ్డాయి.
"ఏం నొప్పిగా వుందా?" ఇది వెంకట్రావ్ మాస్టారి స్వరం.
అమ్మా అన్న ఆక్రందన చిన్నగా వినిపించింది.
అది మీనాక్షి కంటస్వరం. కేక బయటికి రాకుండా బలవంతాన నోరు మూసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
"కూరలవాడిని చూసి నువ్వెందుకు నవ్వావు?"
"నేను నవ్వలేదండీ!"
"బుడి బుడి రాగాలు తీస్తూ ఏడిచావంటే కారం నీ కళ్ళల్లో పోస్తాను జాగ్రత్త. నీ బుద్ధి వక్రం అని తెలిసే ఇన్ని జాగ్రత్తలు వహించాను. వాడుకగా కూరల దానిని పెడితే- దానికి జ్వరం అని దాని భర్త వస్తున్నాడు కదా! అలా అని నాతో చెప్పావా! ఉహూ - వాడి దగ్గరే నాలుగు రోజుల బట్టి కూరలు కొంటుంటివి పైగా వాడు నిమ్మకాయ పచ్చడి అడిగాడని, మహా ఆప్యాయంగా గిన్నెడు పచ్చడి పెడితివి ....."
"వాడికి కాదు - పెళ్ళానికి కావాలంటేను పెట్టాను."
"అలాగా! మరి వాడితో కబుర్లు ఏమిటిట.....?"
"బాగా జ్వరం తగ్గిందా అన్నాను. పాత నిమ్మకాయ లేదు. ఇది కొత్త నిమ్మకాయ. ఎక్కువగా తింటే జలుబు చేస్తుందని చెప్పాను."
"ఇంకా ఏమి చెప్పావు?"
"ఏమి చెప్పలేదు. ఇంతలో మీరు వచ్చారు."
"ఒహో! నేను రాకపోతే యింకా మాట్లాడేదానివన్నమాట......!"
"అదికాదు......"
"నోరుముయ్యి! నీ బులిబుచ్చికం కబుర్లు నమ్ముతాననే అనుకుంటున్నావా! నీ జాతకంలో స్పష్టంగా వుంది - మగవాడిని చూడంగానే నీలో వింత వింత కోరికలు కలిగి, మదపిచ్చితో ప్రవర్తిస్తావని. నీ విషయంలో ఇంత జాగ్రత్త పడ్డా- రాజుగారి పెళ్ళాం అన్నీ వుండి, గుర్రాల శాలని ఊడ్చేవాడి మోజులో పడి చాటుగా వాడిని కలుసుకున్నట్లు - అన్నీ ఉంది నీవు కూరలవాడిని మరిగి, నేను లేని సమయం చూసి వాడితో యికయికలు - పకపకలు. అసలు నీకు....."