Previous Page Next Page 
హిమసుందరి పేజి 8

                                  4


    "సీతా!"

    "ఊ....."

    "సీతూ!"

    "ఊ...."

    "హౌ సీతే!"

    రామకృష్ణ వడిలో తల పెట్టుకుని పడుకున్న సీతా మనోహరి కోపంతో చర్రున లేచింది. లేస్తూనే దండకం చదివింది.

    "స్త్రీ జాతికి అసలు బుద్ధిలేదు. మగవాడి నరనరాన తరతరాలుగా నమ్మించి మాయమాటలు చెప్పి మోసగించి తన పబ్బం గడుపుకుని ఇంతగా ద్రోహం చేస్తున్నా స్త్రీ మోసపోతూనే వుంది. ఎంత చదువులు చదివి ఏం లాభం? ఎన్ని విద్యలు నేర్చి ఏమి లాభం? ఎంత పెద్ద పదవిలో ఉండి ఏం లాభం? అక్కడికి స్త్రీ జాతి కళ్ళు తెరిచేలా ఓ పాట ఉండనే ఉంది రాదేనమ్మ చెలీ రాదేనమ్మా ఈ మగవాడి మాటలు నమ్మ రాదేనమ్మా అని........

    "అవును గాని సీతా! ఇప్పుడు ఇక్కడ ఏమన్నా జరిగిందా?" చాలా అమాయకంగా అడిగాడు రామకృష్ణ.

    "వేషాలు వేయకండి" చిర చిర లాడుతూ అంది సీత.

    "నేను కూర్చున్న వాడిని కూర్చున్నట్లే వున్నాను. నావి వేషాలా?"

    "మరి నాదా?"

    "దండకం లాంటిది చదివావు కదా! ఇంతకీ నేను వాళ్ళ సంగతి చెప్పనేలేదు మగవాళ్ళ మోసాలు ఎలా చెప్పగలిగావు?"

    "ఏమి తెలియనట్లు వేషాలు వేయకండి."

    "అబ్బబ్బ, నాకేమీ తెలియంది వేషాలు వేషాలు అంటే ఎలా సీతా!"

    "మీరు వెంకట్రావ్ మాష్టారి విషయం చెపుతానన్నారు."

    "అవును అన్నాను."

    "వడిలో పడుకుంటే చెపుతానన్నారు. పిచ్చి చేష్టలు చేయనని మాట ఇచ్చారు. అవునా?"

    "అవును."

    "మరి సీతా సీతూ సీతే అంటూ ఆ గోల ఏమిటి? ఆ వేషాలు ఏమిటి?" సీత సీరియస్ గా అడిగింది.

    రామకృష్ణ ఫక్కున నవ్వాడు.

    "సీతా! నీకు మాట యిచ్చాను. మాట తప్పుతూ చేతులకి పని కల్పించానా? లేదు కదా! నీ అందమైన మోముని చూస్తూ హౌ సీతే అని ఒకటికి రెండుసార్లు అన్నానే అనుకో అది మాట తప్పటమా? అసలు నేను అలా ఒకటికి రెండుసార్లు సీతా! అని నీ నామస్మరణ చేశానో అనుకో అది ప్రేమ కాని వేషం మోసం ఎలా అవుతుంది.

    నేనేమన్నా వెంకట్రావ్ మేష్టారు లాంటి వాడినా! బయటికెల్లినప్పుడల్లా పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి బయట తలుపు తాళం వేసి.....

    "ఏమిటి మీరనేది?" సీత నిర్ఘాంతపోతూ అడిగింది.

    "నువ్వుత్త పిచ్చిపిల్లవు సీతా! ఓ విధంగా నీవు లోకం తెలియని అమాయకురాలివి" అనుకున్న రామకృష్ణ మృదువుగా అన్నాడు. "నీకు తెలియని విషయాలు చాలా వున్నాయి సీతా! అవన్నీ చెప్పి అనవసరంగా ఈ రాత్రికి నీ మనసు పాడు చేసిన వాణ్ణి అవుతానేమో?"

    "అదేం లేదు చెప్పండి" అంది సీత ఆతృత పడిపోతూ.

    "అయితే నీవు నా వడిలో తల పెట్టుకుని పడుకుంటేనే....."

    "మీరు పిచ్చివేషాలు వేయనంటేనే......"

    "సరే" రామకృష్ణ బుద్ధిగా తల తిప్పుతూ అన్నాడు.

    సీతా మనోహరి బెడ్ ఎక్కి రామకృష్ణ వడిలో తల పెట్టుకుని పడుకుని "ఊ..... కానీండి" అంది.

    "వెంకట్రావ్ మాష్టారు తల వంచుకుని నడుస్తూ నెమ్మదిగా మాట్లాడుతూ ఏ భీషజాలు లేని మనిషిలా ఉంటాడు. దురలవాట్లు కూడా లేవు. పరుల విషయాలలో అనవసరంగా తల దూర్చడు. కాని భార్య విషయంలోనే!"

    "ఏమిటి భార్య విషయంలో మరీ మెతకా?" సీత మహా ఆతృతతో అడిగింది.

    "అలా అడ్డు తగలకు చెపుతున్నా కదా?" అని మృదువుగా కోప్పడి మళ్ళి చెప్పటం మొదలుపెట్టాడు రామకృష్ణ.

 Previous Page Next Page