అసలే నీ భోజనం అంతంత! ఆ హాస్టల్ భోజనం ఏం తింటున్నావో ఏం లేదో? ఆరోగ్యం జాగ్రత్త! మరీ రాత్రివేళ నిద్ర చెడగొట్టుకొని చదవకు! నువ్వు చిక్కితే అమ్మ నన్ను చీవాట్లు వేస్తుంది! ఇట్లు, మీ అన్నయ్య వామనరావు."
"చి|| గీతకు.
మీ అన్నయ్య వామనరావు ఆశీర్వదించి. మొన్న సెలవుల్లో రాలేదేమిటమ్మా? అమ్మనీకోసం పూటపూటకూ ఎదురుచూసింది. నువ్వు వస్తే ఇవ్వడానికి ఏవేవో చేసి ఉంచింది నువ్వు రాకుండానే సెలవులు అయిపోయాయి. చూసిచూసి విసిగిపోయాక నీ దగ్గరినుండి ఉత్తరం! 'సెలవుల్లో చదువుకొన్నాను రాలేకపోయాను' అని. 'సెలవులకైనా ఓ నాలుగురోజులు వచ్చి నాకళ్ళముందుండకపోతే ఎలా! చదువు మానిపించేసి ఇంటికి తీసుకువచ్చెయ్యి'. అమ్మ గోలపెట్టింది.
ఎందుకిలా చేశావు, గీతా? అమ్మా నాన్నా ప్రాణాలన్నీ మనిద్దరి మీదే కదా? నేను ఉద్యోగరీత్యా దూరమయ్యాను. నువ్వు చదువుకొంటానని పట్టుబట్టి వెళ్ళావు. సెలవుల్లోనైనా రాకపోతే ఎలా? సంగతేమిటో కనుక్కోడానికి నేనే వద్దామనుకొన్నాను. కాని, సెలవు లేకపోవడంవల్ల రాలేకపోయాను. డిసెంబరు సెలవుల్లో రాకపోతే నిజంగానే చదువు కట్టిపెట్టాల్సి వస్తుంది చూడు. ఇహ నేను నిన్ను సపోర్టు చెయ్యలేను. ఇట్లు మీ, అన్నయ్య"
అన్నగారికి గారాలచెల్లి! తల్లిదండ్రులకు అపురూపపు బిడ్డ చదువుకోసమని వచ్చి ఆ పిల్ల ఇక్కడ చేసిన పని ఇది ఈ కాలంలో పిల్లలు ఎందుకిలా చెడిపోతున్నారో అనుకొంది సువర్చల.
మరునాటి సాయంకాలానికి వామనరావు వచ్చాడు. వార్డెన్ వల్ల సంగతి విని అతడు నిశ్చేష్టుడైపోయాడు. చెల్లెలికి సుస్తీ అంటే ఏం సుస్తీ చేసి ఉంటుందా అని గాబరా పడుతూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి తలకొట్టేసినట్టుగా అయింది చెల్లెలు చేసిన ఘనకార్యం వినేసరికి. నిన్ననే నర్సింగ్ హోం లో చేర్చామని, తల్లీ పిల్లా క్షేమమని చెప్పింది వార్డెన్.
"ఇక మా హాస్టల్లో ఆమెకు చోటులేదు. తల్లినీ పిల్లనీ ఏం చేస్తారో మీ ఇష్టం! ఆడపిల్ల కదాని దయతల్చి ఈ విషయం పోలీసులదాకా వెళ్ళనివ్వలేదు. పోలీసుల చేతిలో పడితేనా మీ పరువునూ, డబ్బునూ దూదిని ఏకినట్టుగా ఏకిపారేసేవాళ్ళు!" చూడు! నేనెంత మంచిదాన్నో! మీకెంత ప్రమాదాన్ని తప్పించానో అన్నట్టు చూసింది.
"మీ సహాయానికి చాలా కృతజ్ఞతలు, మేడమ్! ప్రస్తుతానికి ఈ డబ్బు మీ దగ్గరుంచండి! ఇంటికి వెళ్ళాక మరికొంత పంపిస్తాను. ఈ విషయం మరీ ప్రచారం కాకుండా చూడండి!" ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు వామనరావు.
"అప్పటికప్పుడు నగరమంతా అగ్నిలా వ్యాపించిపోయిందయ్యా ఈ వింత! పిల్లల్ని కని కాలవ ప్రక్కనా, చెత్తకుండీల్లో, దేవాలయాల్లో వదిలేయడం అప్పుడప్పుడూ వింటుంటాం! మీ చెల్లెలు చేసిన కిరాతకం వాళ్ళందరినీ మించిపోయింది. బాత్ రూంలో కని బిడ్డని కిటికీలోంచి విసిరి వేసింది! గట్టి నేలమీద పడితే తల రెండు వక్కలయ్యేది! ముళ్ళ చెట్లలో పడితే ఒళ్ళంతా ముళ్ళు దిగబడి ఘోరంగా చనిపోయేది! ఆ పిల్ల ఏదో వరప్రభావంలా బ్రతికింది. ఈరోజు వైద్య పరీక్షకూడా చేశారు ఆ పిల్లను! ఎడమ భుజం కొద్దిగా దెబ్బతిన్నదని, పెరుగుతూంటే అదీ పోతుందని, పిల్ల చాలా ఆరోగ్యంగా ఉందని చెప్పారు డాక్టర్లు! ఆ పిల్ల చిన్నదెబ్బ కూడా తగలకుండా బ్రతకడమే విడ్డూరంగా, అద్భుతంగా చెప్పుకొంటున్నారందరూ."
నర్సింగ్ హోంలో ఉన్న గీతాభవానిని కలుసుకొన్నాడు వామనరావు. అన్నగారిని చూసి తలదించుకొంది గీతాభవాని. మతివచ్చినప్పటి నుండి ఎవరెవరో వస్తున్నారు. ఏవో ప్రశ్నలు వేస్తున్నారు. ఏదో సలహాలు ఇస్తున్నారు.
"అతడు పెళ్ళి చేసుకొంటానని మోసగించాడా? మోసగించాడని చెప్పడానికి ఏవైనా ఆధారాలున్నాయా? ఉంటే చెప్పండి! కేసు పెట్టి అతడిచేతే మీ మెళ్ళో తాళికట్టిస్తాం!" పత్రికా విలేఖరిగా పరిచయం చేసుకొన్న అతడు ఆవేశంగా అన్నాడు.
"నవ్వులపాలు ఎలానూ అయ్యావు! ఇహ ఆ పిల్లను వదుల్చుకోవాలని చూడకు! ఉద్యోగం చేసి ఆ పిల్లని పెంచుతూ ఆ పిల్ల జన్మకారకుడు లాంటి మగవాళ్ళకి చెప్పు దెబ్బలా ఉండేలా ఆదర్శంగా జీవించు." క్లాస్ మేట్ యశోద బోధించింది.
ఎవరు ఏం చెప్పినా, ఏం అడిగినా పెదవి విప్పడం లేదు గీతా భవాని. దించుకొన్న తల ఎత్తడం లేదు! మూగ బొమ్మలా అయింది.
"హైదరాబాద్ లో చదువుకోడానికి సీటు వచ్చిందంటే అంతదూరం వద్దని అమ్మా నాన్న అన్నారు! నీ పట్టుదల చూసి అమ్మా నాన్నకి నచ్చజెప్పి నిన్నిక్కడ కాలేజీలో చేర్చి, హాస్టల్లో ఉంచిపోయాను! నువ్వు అంత ముంకుపట్టు పట్టడానికి కారణం ఇప్పుడు తెలిసింది! చేసినా తప్పును దాచుకోడానికి ఇంత దూరం పారిపోయి వచ్చావు! అది దాగాకుండా నలుగురిలో ఇలా భళ్ళుమని బ్రద్దలైపోయింది! గీతా, ఇలా ఎవరివల్ల జరిగింది? చెప్పు! వాడిపేరు చెప్పు."
ఎప్పుడూ సాత్వికంగా, లాలింపుగా మాట్లాడే అన్నయ్య ఇంత కరుగ్గా, హృదయశల్యంగా మాట్లాడుతూంటే కూడా తలెత్తలేదు గీతాభవాని!