"ఇక్కడే ఏదైనా అనాధశరణాలయంలో వదిలేసి వెడదామని అనుకొంటున్నాను! అక్కడికి వెడుతూనే గీతకి వెంటనే దొరికిన సంబంధం చేసేస్తాను!" అన్నాడు అప్పుడే ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా.
"మోసగించడం కాదా! ఆ మోసం బయట పడ్డరోజు మీ చెల్లెలి బ్రతుకు ఏమౌతుంది?" సువర్చల అంది.
నిస్సహాయంగా చూశాడు వామనరావు. "నన్నేం చేయమంటారు చెప్పండి? మాది మధ్య తరగతికి చెందిన కుటుంబమైనా సదాచారానికి నిలయం మా ఇల్లు! పరువు మర్యాదలకి ప్రాణం పెడతాడు మా నాన్న. ఈ సంగతి ఆయన చెవిని పడితే ఈ మధ్యే పక్షవాతంతో ఆరోగ్యం దెబ్బతిన్న ఆయన నిలువునా ప్రాణం వదిలేస్తాడు!"
"మీ చెల్లెల్ని అడిగి అతడెవరో తెలుసుకోండి! సాధ్యమైనంత వరకు అతడికే ఇచ్చి పెళ్ళి చేయండి! అలా చేయగలిగితే ఉన్న సమస్య పరిష్కారమై క్రొత్త సమస్య తలెత్తనీయదు!"
"గీతను ఇంత అవమానానికి గురిచేసినవాడు ఆమెను పెళ్ళాడతాడంటే నాకు నమ్మకం లేదు."
"ప్రయత్నమైతే చేసి చూడండి."
"అసలు, మా గీత ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నానండీ. అది చాలా అమాయకురాలు. మొదటినుండి దానిది అదొకరకం మనస్తత్వం. ఎవరినీ నొప్పించి ఎరుగదు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. ఎవరూ స్నేహితులు లేరు తనపని తను మౌనంగా చేసుకుపోతుంది. అలాన్త్య్పిల్ల ఇంత కథానాయకి ఎలా అయిందాని ఆశ్చర్యంగా ఉంది. మాగీతను గురించి ఎన్నెన్ని అనుకొన్నాను. నాకున్నది ఒక్కతే చెల్లెలు దాన్ని గ్రాడ్యుయేట్ ని చేయాలనుకొన్నాను. ఇంతదూరం పంపటమేమిటని అమ్మా నాన్న అంటే వాళ్ళతో పోట్లాడి ఇక్కడ కాలేజీలో చేర్పించి వెళ్ళాను. చదువు అయిపోతూనే ఏ డాక్టరుకో, ఇంజనీరుకో చక్కని ఈడూజోడూ చూసి ఇవ్వాలనుకొన్నాను. ఆజంటని చూస్తే ప్రపంచమంతా ఈర్ష్యపడేట్టుండాలని ...ఎన్నెన్నికలలు? నాకలలన్నిటిమీద గొడ్డలి పెట్టు పెట్టిందండీ మాగీత..." అతడు ముఖం చేతుల్లో కప్పుకొని ఏడవసాగాడు.
అక్కడున్న అందరి హృదయాలు జాలితో నిండిపోయాయి. హాస్టల్లో గీతాభవాని ఎరిగిన వాళ్ళుకూడా అలాగే చెప్పారు. గీత చాలా మెత్తని మనసు కలదని, చిన్నమాటకే నొచ్చుకొంటుందని, చిన్నమాటతో కూడా ఎవరికీ నొప్పించి ఎరుగదని. అంత హాస్టల్లోగాని, కాలేజీలోగాని ఎవరూ స్నేహితులు లేరు. ఎప్పుడూ సినిమాకి గాని, షికారుకిగాని వెళ్ళిఎరుగదు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకొంటుంటే తను మాత్రం బుద్దిగా పుస్తకం పుచ్చుకు కూర్చొనేది!
అలాంటి మనిషి కడుపులో ఉండి, తనకి కడుపులో గడ్డ అయిందని బొంకడం, బిడ్డనుకని కిటికీలోంచి విసిరివేసే కిరాతకానికి పాలుపడడం-అందరికీ ఆశ్చర్యంగా ఉంది.
కొందరి స్వభావాలకీ, వాళ్ళ జీవితాలలో జరిగే సంఘటనలకీ సంబంధముండదా?
"బాధ పడకండి, వామనరావుగారూ! మీ చెల్లెలికి మీ అనురాగంతో స్వర్ణసౌధం నిర్మించి ఇద్దామనుకొన్నారు! ఆమె తన దురదృష్టం కొద్దీ కూలద్రోసుకొంది. ఏమో! ఎవరు చెప్పగలరు? ఇప్పుడు కూడా మీ ఆశలకనుగుణమైన సంబంధమే రావచ్చు! గతం సమాధి అయి ఆమె జీవితం క్రొత్త మలుపులు తిరగవచ్చు!" ధైర్యం చెప్పింది సువర్చల. "పిల్ల విషయమే నాకు విచారంగా ఉంది! కావలసిన వాళ్ళంతా ఉండి ఆ పిల్లను అనాథ శరణాలయం పాలవుతుందంటే..."
అక్కడే వుండి, అన్ని సంగతులూ వింటున్న సుందరయ్య "అమ్మగారూ!" అని పిలిచాడు. "పిల్లని అనాధ శరణాలయం వదిలేసేట్టు అవుతే నేను పెంచుకొంటాను! ఆ పిల్లని నా కిప్పించండి!"
"నువ్వు పెంచుకొంటావా? పెంచుకొంటే మంచిదేగాని."
"చెప్పండమ్మా."
"ఆడపిల్లలంటేనే సమస్యలమయం. పైగా ఆపిల్ల ఇంతటి కథతో పెరుగుతుంది. తల్లి చేసిన తప్పు ఆ పిల్ల జీవితం పొడువునా నీడలా వెన్నాడుతూనే ఉంటుంది. ఆ పిల్లను పెంచడం నీకు సమస్య కాకపోవచ్చు గాని, పెళ్ళిమాత్రం సమస్యే కావచ్చు."
"మీరు తరుచు అంటూంటారుగా, అమ్మా? ఆడపిల్లకు పెళ్ళే ముఖ్యమనుకోవడంవల్లే తల్లిదండ్రులు ఇన్ని బాధలకు గురి అవుతున్నారని ఆడపిల్లను ఆడపిల్లగా కాక మనిషిగా తయారుచేస్తే తల్లిదండ్రులకి ఇంత బరువుకాదని, తనకాళ్ళమీద నిలబడి తన జీవితానికి కావలసింది తనే సమ కూర్చుకోగలదని!"
సంఘసేవిక నోటినుండి తరుచూ ఇలాంటి విషయాలమీదే మాటలు దొర్లుతుంటాయి! పనిపాటల వాళ్ళకి కూడా సువర్చల ఏం మాట్లాడుతుందో బాగా తెలుసు!
తన భావాలు, ఆలోచనలు కనీసం ఒక మనిషినైనా ప్రభావితం చేశాయనుకొంటే సువర్చలకి ప్రయాస పడి కొండనెక్కుతూ ఒక మజిలీ చేరుకొన్నట్టుగా సంతోషం, గర్వం కలిగాయి!