Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 8

    'పాపా! నీ కెవరూ స్వాగతం చెప్పకపోతే నేను చెబుతానమ్మా! రా! మాతోపాటు జీవించు!' ఆ పిల్లను పిల్లల్లేని సుందరయ్య ఆర్తిగా గుండెలకు అదుముకున్నాడు.

    "ఈ పిల్లను ఇంత అందంగా తీర్చిదిద్ది, పుడుతూనే తల్లి చేత ముళ్ళకంపలోకి విసిరివేసే రాత వ్రాసిన ఆ బ్రహ్మదేవుడి లీలను ఏమని వర్ణించాలో తెలియడంలేదు!" గుంపులో ఒకామె అంది.

    "వదినా! నువ్వు ఈ పాపని పెంచుకోడానికి తీసుకోరాదూ? దేవికే మళ్ళీ ఇలా వచ్చిందనుకొని నీ బాధను మరిచిపోవచ్చు" రత్నప్రభ అంది.

    "సంఘసేవ అంటూ తిరిగి దేవికను సరిగా చూడకే చంపాను! మళ్ళీ దాని జతకు ఈ పిల్లెందుకు?" మ్లానంగా అంది సువర్చల.

    "సంఘసేవ కొన్నాళ్ళు ఆపేద్దూ!"

    "తిరగనేర్చిన కాలు ఇంట్లో ఉండదు!"

    సువర్చలకి అజయ్ పుట్టాక పదేళ్ళవరకు మళ్ళీ సంతానం కాలేదు! అజయ్ ని బడికి పంపించాక సువర్చలకి ఇంట్లో ఏం తోచేదికాదు! భర్త ఎప్పుడూ రాజకీయాల్లో, ఊరి ప్రయాణాల్లో మునిగి తేలేవాడు. ఇంటినిండా నౌకర్లూ చాకర్లూ - ఏ పనీలేదు సువర్చలకు. ఇంట్లో ఏం తోచక క్లబ్బులంటూ, సాంఘికసేవ అంటూ ఏదో కాలక్షేపం సృష్టించుకొంది. దేవిక పుట్టేసరికి బయట బాగా తిరిగే అలవాటై దేవికని ఆయాకి అప్పజెప్పింది. పోతపాలతో ఆ పిల్ల ఎప్పుడూ వాంతులతో, విరేచనాలతో బాధపడేది. ఆ పిల్లకి జ్వరం వచ్చినా దగ్గర కూర్చోవడానికి తీరిక ఉండేది కాదు సువర్చలకి. మూడు రోజులు జ్వరం బాగా కాచి పదిహేనురోజుల క్రితం ఆ పిల్ల ఈ లోకానికి టాటా చెప్పిపోయింది. ఆ పిల్ల పోయినప్పుడు కూడా సువర్చల దగ్గర లేదు. విజ్ఞానయాత్రలో ఉంది. వచ్చాక పిల్ల పోయిందని తెలిసి బావురుమంది. తన పిల్లను కనిపెట్టుకు ఉంటే అదిపోయేది కాదనుకొంది!

    'నేనే చంపుకొన్నాను నా బిడ్డను' అని ఏడుస్తుంది! ఇంకా ఆ మనోవ్యధనుండి తేరుకోలేదు సువర్చల.

    "పోలీస్ కి రిపోర్టిచ్చావా?" సువర్చల వార్డెన్ని ప్రశ్నించింది.

    "ఎంత పాపిష్టిదైనా ప్రాణంపోతుంటే చూడలేం కదా? ఆ గొడవలో నాకు పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని ధ్యాసేలేదు. ఇప్పుడిస్తాను."

    "వద్దు!" పరిగెత్తబోయిన వార్డెన్ భుజంమీద చేయివేసి వారించింది సువర్చల."తెలిసి చేసిందో, తెలియక చేసిందో ఇప్పుడు జరిగిన అవమానం చాలు. జీవితంలో ఆ పిల్ల తలెత్తుకోకుండా ఉండడానికి! పోలీసుల చేతిలో పడితేనే ఆ పిల్ల బ్రతుకంతా కెలికి కెలికి బజారున పెడతారు. పత్రికలు బాజా వాయిస్తాయి. చెడిన జీవితం సరిచేయడం మనిషి కనీస ధర్మం. చెడిపోయిన బ్రతుకును ఇంకా చెడగొట్టడం అమానుషం కదూ? పోలీస్ కి రిపోర్ట్ వద్దుగాని వాళ్ళ వాళ్ళెవరినైనా వెంటనే రప్పించే ఏర్పాటు చెయ్యి."

    లక్షాధికారి, రాజకీయ ప్రముఖుడు అయినా రఘురామయ్యగారి భార్య అనే గౌరవమేగాక, సంఘసేవికగా మంచిపేరు తెచ్చుకొందప్పటికే సువర్చల. తమ హాస్టల్ కే చెడ్డపేరు తెచ్చిన గీతాభవాని అంతు చూడాలని ఎంత ఉబలాటంగా ఉన్నా సువర్చల మాటను తీసివేయలేకపోయింది వార్డెన్.

    అడ్రస్ కోసం వార్డెన్ ఆఫీసు రిజిష్టరు చూడబోతుంటే, "ఇదిగో, ఈ ఉత్తరాల్లో ఉంది వాళ్ళన్నయ్య అడ్రస్" అంటూ రెండుత్తరాలు తెచ్చిచ్చింది ఒక పిల్ల.

    ఆ ఉత్తరాన్ని సువర్చల చదివింది.

    "చి|| గీతకు,

    మీ అన్నయ్య ఆశీర్వదించి. నీ దగ్గరినుండి అసలు జాబులు రావడం లేదు. మరీ అంత తీరిక లేకుండా చదువుతున్నావా? కొంచెం తీరిక చేసుకో, తల్లీ! ప్రతిక్షణం నీ క్షేమం గురించి ఆతృత పడుతుంటానని తెలియదూ? గీత ఈ సమయంలో కాలేజీకి వెళ్ళి ఉంటుంది. గీత ఈ సమయంలో భోజనం చేస్తూంటుంది! గీత ఈ సమయంలో క్లాసు పుస్తకాలు ముందేసుకొని ఏకాగ్రంగా చదువుతూ ఉంటుంది. అని ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తుంటావో ఊహించుకొంటూంటాను. రాత్రి పదిగంట లవుతుంది. నీ కళ్ళ మీదికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అయినా బలవంతాన కళ్ళు తెరుచుకొని చదువుతూనే ఉంటావు. 'ఇక పడుకో, గీతా!' అన్నానో రోజు. నా రూమ్ మేట్ తెల్లబోయినట్టుగా, 'ఏమిటిరా? ఎవరితో మాట్లాడుతున్నావు?' అనడిగాడు.

    "మా గీత నిద్రకళ్ళతో చదువుతున్నట్టుగా అనిపించింది" అన్నాను సిగ్గుపడి.

    'చెల్లెలంటే నీకెంత పిచ్చిప్రేమరా?' అన్నాడతను.

    నా ఉద్యోగం బాగానే ఉంది. ఈ ఊరు, భోజనం కూడా ఫర్వాలేదు. కాని, ఇంటి దగ్గర అమ్మా నాన్నతో, చెల్లెలితో కలసి ఉన్నట్టు ఉండదు కదా? వారంరోజుల క్రితం మన ఊరు వెళ్ళాను. అమ్మా నాన్నా నీ గురించి చాలా బెంగపెట్టుకొన్నారు. ఉన్న ఒక్క ఆడపిల్లనూ చదువుఅంటూ తమకి దూరం చేశానని తిట్టారు నన్ను. తిట్టనీ. నా చెల్లెలి ముద్దు చెల్లించానని తృప్తిగా ఉంది. చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకొని నా పేరు నిలబెట్టాలి సుమా!

    ఇంకొక విశేషం ఏమిటంటే,

    నాకు పిల్లనిస్తామని మన పిన్ని తరపు బంధువులెవరో వచ్చారట. కట్నం ఏభైవేలయినా ఇస్తామన్నారట. ఈ సంబంధం చేసుకొంటే గీతకి ఆ డబ్బుతో మంచి సంబంధం చూడొచ్చుకదాని అమ్మ ఒకటే బలవంతపెడుతూంది. నా ఆదర్శాలు నీకు తెలుసు కదూ, గీతా? వరకట్నమంటే నాకు చెప్పలేని అసహ్యం. నా చెల్లెలికి మంచి మగన్నే చూస్తాను. డాక్టరు కైనా, నాలాగా ఇంజనీరుకైనా ఇచ్చి చేస్తాను. కాని, ఇలా నేను ఒకరికి అమ్ముడుపోయి మాత్రం కాదు. నా జీతంనుండి పైసా పైసా కూడబెట్టి చేస్తాను నా చెల్లెలి పెళ్ళి అని చెప్పను. నువ్వు పైసా పైసా కూడబెట్టి పెళ్ళి చేసేసరికి అది ముసలిదై పోతుంది అని వెక్కిరించారు, విన్నవాళ్ళు. నిజమే! కాని, ఏం చేయను? నా ఆశయాన్ని మార్చుకోలేను. కట్నం తీసుకోకుండా పిల్ల అందం, గుణగణాలు చూసి పెళ్ళాడే సహృదయుడు దొరికితే ఎంత బాగుండును? నాది ఉట్టి ఆశంటావా, గీతా? నువ్వే ధైర్యం చెప్పాలి నాకు!

 Previous Page Next Page