ఆ అర్దరాత్రి పల్లెలోని ప్రజలకు చిరుత మూలుగుతూ చేసిన ఆర్తనాదం లాంటి గాండ్రింపు చాలా స్పష్టంగా వినిపించింది. ఒకటి కాదు, రెండు కాదు....అడవిలో దూరంగా ఓ వారం రోజులపాటు ఆ చిరుత మూలుగు ప్రజలందర్నీ భయంతో నింపింది. ఆ తర్వాత హఠాత్తుగా మూలుగు ఆగిపోయి నిశ్శబ్దం పేరుకుపోవడంతో చిరుత చనిపోయిందను కున్నారు కాని, ఆ చిరుతే అంగవైకల్యంతో మేనీటర్ గా మారటానికి ఆనాటి సంఘటనే కారణమవుతుందని ఊహించలేకపోయాను.
చైతన్య మరికొన్ని నిముషాలలో అతని వెంట బయలుదేరాడు. జీపు ప్రయాణానికి అనువైన ప్రాంతం కాకపోవడంతో నడక తప్పని సరయింది.
సాయంకాలం నాలుగు గంటలయింది.
అడవిలా దట్టంగా ఆకాశంలో పేరుకున్న మేఘాలు సూర్యుడి వెలుగుకు వారధి వేస్తున్నాయి. ఏటవాలుగా వున్న గుట్టలపై నుంచి లోయలోకి దిగి ఆగ్నేయ దశలో నిస్సారంగా పడి వున్న బీడుభూముల్లో నుంచి నడుస్తున్నారు.
తోవ పొడవునా సమ్మయ్య మౌనంగా నడుస్తున్నాడు తప్ప పెదవి విప్పలేదు.
చైతన్య సైతం మాటాడించే ప్రయత్నం చేయలేదు.
నడుస్తున్న సమ్మయ్య ఆగిపోయాడొకచోట. అతడు చెప్పలేదు. దారుణం జరిగిన ప్రాంతాన్ని చూపెడుతూ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. బహుశా భార్య మరణానికి ముందు నిస్సహాయంగా చూసిన చూపులు గుర్తు కొచ్చాయేమో!
వెదురు పొదలను ఆనుకొని వున్న సన్నని కాలిబాటను చేరిన చైతన్య పరిశీలనగా చుట్టూ చూశాడు. అప్పటికే ఆవరిస్తున్న చీకటి దట్టమయిన అడవిని మరింత అంధకారంలోకి నెడుతోంది.
సమీపంలో ఒకచోట చెల్లాచెదురైన పొదలు చిరుత కళేబరాన్ని ఏ పక్క ఈడ్చుకు వెళ్ళిందో తెలిసినా శవాన్ని ట్రాక్ చేయడం ఆ సమయంలో ప్రమాదంతో కూడిన పనిగా భావించాడు చైతన్య.
పైగా అతడెదుర్కోబోతున్నది చిరుతపులిని.
పిల్లి తెగకి చెందినదైనా, చిరుతపులి పులికంటే తెలివయినది. సింహం కంటే క్రూరమయినది. పులి తలదాచుకునేటంత స్థలంలో అది తన మొత్తం శరీరాన్ని ఇముడ్చుకుని కూర్చోగలదు.
వేటాడ్డంలో ఎంతటి జిత్తులమారిగా వ్యవహరిస్తుందంటే అడవిలో మేస్తున్న ఓ గేదెను సమీపించాలనుకున్నప్పుడు, ముందు బురదలో పొర్లి తన సహజ వాసన్ని కప్పి పుచ్చుకుంటుంది.
చిరుత అడుగు జాడల్నిబట్టి దాన్ని వేటాడాలనుకుని బయలుదేరితే నలభయి అడుగుల ఎత్తు వున్న గోడను సైతం దూకగల చిరుత ఏ చెట్టు పై నుంచో మనపైకి ఉరికే ప్రమాదమందంటాడు, సింహాలను, ఖడ్గమృగాలను వేటాడ్డంలో ప్రపంచ రికార్డు సృష్టించిన జాన్ హంటర్. అడవిలో సంచరించే రేచుకుక్కలకు తప్పదేనికీ భయపడని జంతువు చిరుతపులి, అమెరికా ఖండానికి చెందిన జాగ్వర్, వ్యూమా లాంటి చిరుతపులుల్ని మించిన ధైర్యం ,సాహసం కలది. ఆఫ్రికా ఖండంలోని మచ్చలున్న లెపర్డ్ ను మించిన వేగం గలది. ఇండియా అడవుల్లో సంచరించే 'చీటా'.
చీకటిలో_అందునా పిల్లిలా ఏ కొద్దిగానూ చప్పుడు చేయకుండా నడిచే చిరుత పరిసరాలకు అనువైన రంగుతో ఇమిడిపోయి ప్రత్యర్ధుల్ని సునాయాసంగా దెబ్బతీస్తుంది. ఆవేశం, గుండె నిబ్బరం మాత్రమే కాదు ఆలోచనతో ప్రతి క్షణాన్నీ ఆయుధంగా వాడితే తప్ప చిరుతను ఎదుర్కోవడం కష్టమనిపించిన చైతన్య అప్పటికే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
ఆ రాత్రికి చైతన్య రంపంగి గ్రామంలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. సమ్మయ్య ఓ పట్టాన తిరిగి రావడానికి అంగీకరించలేదు.
తలుపులు మూసుక్కూచున్న పల్లె ప్రజలంతా చైతన్య వచ్చినట్టు తెలియగానే ధైర్యంగా బయటికి వచ్చారు. వర్షం తగ్గడంతో ఆరు బయట ఓ రాతి చప్టాపై కూచున్నాడు చైతన్య. చిన్నా పెద్దా అంతా చుట్టూ గుమిగూడగానే చిరుతకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం చేశాడు.
స్పుర ద్రూపంతో ,చెరగని చిరునవ్వుతో మృదు మధురంగా మాటాడే చైతన్య చాలా స్వల్పకాలంలో వారిని ఆకట్టుకున్నాడు.
రెండు నెలల క్రిందట కండిగుట్టకు దక్షిత భాగంలో ఓ ఎద్దును చంపిన చిరుత, మరో వారానికల్లా పల్లెకు చెందిన గోర్జిలో మేస్తున్న రెండు ఆవుల్ని చంపిందని , ఆ తర్వాత కొట్టాంలోనికి ప్రవేశించి అర్ధరాత్రివేళ మరో ఆవును చంపి పొదల్లోకి ఈడ్చుకుపోయిందని, అటు తర్వాతనే ఇనుప ట్రాప్ తో చిరుతను మట్టుపెట్టే ప్రయత్నం జరిగిందని పల్లె పెద్ద చెబుతుంటే ఆశ్చర్యంగా విన్నాడు.
మూర్ఖత్వమో, లేక అమాయకత్వమోగాని అతడు విన్న పశువుల్ని వధించిన చిరుత గురించి అంతవరకూ ఏ ఒక్కరూ అతనికి తెలియపర్చలేదు. అంతకు పూర్వమే ఆ సంఘటనల గురించి అతనికి తెల్సిఉంటే ఇంతవరకూ రానిచ్చేవాడు కాదు. ఫలితం మాటెలాఉన్నా చిరుతని ఎదుర్కొనే ప్రయత్నం చేసేవాడు.
మూఢ విశ్వాసాలకు ఆలవాలమైన గిరిజన ప్రాంతాలవి. నాగరికతకు దూరంగా క్రూరమృగాలకు నిలయమై అరణ్యాలను ఆనుకుని వున్న కొన్ని గిరిజన వాడల్లో ఏ హాని జరిగినా, అది ఓ జంతువు వలన వచ్చిన ముప్పుగా భావించరు ముందుగా.
ఎవరి కంటా పడకుండా ఏ క్రూరమృగమైనా ఓ మనిషిని చంపితే_అది ఏ అదృశ్య శక్తి కోపానికో కారణమని తలపోసి కర్మ సిద్ధాంతాన్ని కళ్ళకు చుట్టుకుంటారు.
మరోసారి హాని జరిగితే ఆ శక్తికి మరింత గొప్పతనాన్ని అంటగట్టి భయంతో వారు నమ్మే గిరిజన దేవతలకి మొక్కుకుంటారు. ఒకవేళ ప్రాణహాని కలిగిస్తున్నది జంతువే అని కళ్ళారా చూసి తెలుసుకున్నా స్వతహాగా తమకు హానిచేయని జంతువులు అలా ప్రవర్తించడానికి ఏ శక్తో దాన్ని ఆవహించి అలా చేస్తోందని కొన్నాళ్ళు భీతితో బిక్కచచ్చిపోతారు.
మరణాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఏం చేయాలో పాలుపోని స్థితిలో క్రమంగా వాస్తవాన్ని గుర్తించి ,అప్పుడు తీరుబాటుగా అటవీశాఖ అధికారులకి పెద్ద తలనొప్పిగా మారుతుంది.
ఆ రాత్రి గిరిజనులు తనకు అందించిన కొర్రలతో చేసిన జావను తీసుకొని ఆకలిని ఉపశమింప చేసుకున్నాడు. వారి ఆహారపు అలవాట్లను బాగా ఆకళింపు చేసుకున్న వ్యక్తి అతడు.
కేవలం ప్రకృతి సిద్ధమైన రాగులు, కొర్రలు, సజ్జలతో వారెంత ఆరోగ్యంగా వుండేదీ చూసి ఆశ్చర్యపోతుంటాడు అతను. ఎన్నోసార్లు వారి ఆతిధ్యాన్ని స్వీకరించాడు, అమాయకమైన ఆత్మీయతకు స్పందించాడు.
ఆ రాత్రి చొప్పతో వేసిన గుడిసెలో పడుకున్న చైతన్యకు నిద్రపట్టలేదు. తుంగ చాపపై విశ్రమించిన చైతన్యకు నిద్రపట్టక పోవడానికి కారణం అతనికి అలవాటైన ఫోమ్ బెడ్ లేక కాదు. గుడిసెలో దండేనికి వేలాడుతున్న నేత చీరను చూస్తుంటే చనిపోయిన సమ్మయ్య భార్య గుర్తుకొచ్చింది. బహుశా ఏ జక్కమ్మ పండక్కో ప్రేమగా భార్యకు కొని ఉంటాడు సమ్మయ్య.
అపరాత్రివరకూ అడవి పక్షులు వినిపించే సంగీతాన్ని వింటూ ఆ పొదరింటిలో ఒకరి నొకరు పెనవేసుకుని ఎన్నో రాత్రులు నిశ్చింతగా నిద్రపోయి ఉంటారు. ఒంటరితనం ఎంత క్రుంగదీస్తుందో మరి. సమ్మయ్య నిద్రలోనో నిద్రరాకనో వెక్కి వెక్కి పడుతున్నాడు.