Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 8

            డబ్బు, అధికారం లాంటి ఆయుధాలు ఏమాత్రం కూడా అతణ్ని సాధించలేవని  తోటి వ్యాపారస్థులు  అన్న మాటల్ని  మననం చేసుకుంటూ  "ఈ కలపంతా  తమ డిపార్టుమెంటు  నుంచి  కొన్నదే....ఇవిగో పర్మిట్లు" అన్నాడు కాగితాలను అందిస్తూ.

    కేవలం  నామమాత్రంగా  వుండే "పర్మిట్" చూసి  చైతన్య లాంటి  చండశాసనుడైన  ఆఫీసరు  విడిచి  పెడతాడని  ఆ కలప  యజమాని  పొరపాటు  పడలేదు గాని, జరుగుతున్న  అక్రమ  వ్యవహారంలో అంత లోతుగా  తల దూర్చతాడని   ఆ క్షణంలో ఊహించలేకపోయాడు.

    అటవీశాఖలోని  మొదటిది  టెరిటోరియల్  విభాగం. ఈ విభాగపు ముఖ్య బాధ్యత  అటవీ సంపదను  రక్షించడం.

    రెండవది  ఎక్స్ ప్లాయిటేషన్   విభాగం. దీని   బాధ్యత  అడవిలోని  కలపను  ఓ క్రమపద్ధతిలో  నరికించి వ్యాపార నిమిత్తమయి  డిపోలకు  చేరవేయడం.

    మూడోది  కార్పొరేషన్  విభాగం .వినియోగం కోసం  చెట్లను నరికిన స్థానంలో  తిరిగి  మొక్కల్ని  నాటి పోషించడం  ఈ విభాగపు ముఖ్య కర్తవ్యం.

    అక్రమంగా  రవాణా  చేయాలని  ప్రయత్నించే  కలపను స్వాధీనపరుచుకోవడం, దానితోపాటు  వంటచెరుకు కోసం గాని, మరే ఇతర అవసరాలకైనా  కలపను  వేలం  వేసి అమ్మేది  ఎక్స్ ప్లాయిటేషన్ విభాగం విధి అయినా, అందులోని  కొందరు  అధికారులు కలప వ్యాపారస్థులతో  చేతులు  కలపడంతో  ప్రభుత్వం  ఎంతో  రాబడిని  కోల్పోతుంది.

    ఒక "కూప్" లో  ఒక కంట్రాక్టరు  అయిదు వందల క్యూబిక్ మీటర్ల చొప్పున  వంటచెరుకు  వేలం  పాడితే  దానికి ఎక్స్ ప్లాయిటేషన్ విభాగపు  అధికారులు  ఒక లారీకి  ఇరవయి  అయిదు  క్యూబిక్ మీటర్ల చొప్పున  ఇరవై పర్మిట్లు  ఇస్తారు. అయితే  కంట్రాక్టర్లు  ఈ విభాగపు అధికారులకి  లంచం  ముట్టచెప్పి  లారీకి నలభై నుంచి  ఏభై  క్యూబిక్ మీటర్ల కలప  లోడ్  చేసి, దాన్ని  ఇరవయి  అయిదు  క్యూబిక్  మీటర్ల  వంటచెరుకుగానే  చలామణీ  అయ్యేట్టు  చేస్తారు.

    ఒక్కోమారు  వంటచెరుకు  క్రింద టేకు, బండారు, నల్లమద్ది లాంటి  విలువైన కలపను  కూడా కంట్రాక్టర్లు  తరలించుకుపోతుంటారు.

    ఈ అవినీతిని  క్షుణ్నంగా  తెలుసుకున్న  చైతన్య  చాలా రోజులుగా  ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూశాడు.

    పర్మిట్ లోని  మొత్తానికి, లారీ  లోడ్ లోని, వ్యత్యాసాన్ని  సునాయాసంగా  గ్రహించిన చైతన్య ఊరుకోలేదు.

    లారీని సీజ్ చేసి అటవీశాఖ డిపోకి  తరలించి ,కాంట్రాక్టరును  అరెస్టు చేయించడంతో పాటు  అతనితో  చేతులు  కలిపిన  రేంజర్ ను సస్పెండ్ చేశాడు.

    నందికొట్కూరులో  పోలీసు  తతంగమంతా  ముగించుకొని ఫారెస్టు రెస్టు హౌస్ కి వచ్చేసరికి  మధ్యాహ్నం  మూడు గంటలయింది.

    బడలికగా  కూర్చొని  గార్డు  అందించిన  కాఫీని  సిప్ చేస్తూ హెడ్ క్వార్టర్స్ కి పంపాల్సిన  రిపోర్టు  తయారు చేస్తుండగా, గదిలోకి  దూసుకువచ్చాడో  ఆగంతకుడు.

    సుమారు ఇరవయి  రెండేళ్ళున్న  గ్రామీణ  యువకుడతడు.

    కళ్ళనుంచి  ధారాపాతంగా  నీళ్ళు  ఉబికి  వస్తున్నాయి.

    ఆయాసంతో  రొప్పుతూ  కొన్ని  క్షణాలవరకూ  మాటాడలేకపోయాడు.

    అక్కడికి  పదిమైళ్ళ  దూరంలోని  రంపంగి  గ్రామానికి  చెందిన ఆ యువకుడు అడవిని  ఆనుకుని వున్న ఓ క్వారీలో పని చేస్తుంటాడు  అపరాహ్ణవేళకి  పని ముగించి, అతడితోపాటు  కూలికి  వచ్చే భార్యతో సహా గూడెంకి  బయలుదేరాడు. మార్గమధ్యంలోని  అడవిని  దాటి పల్లెని  చేరుకోవాలంటే  అయిదు  మైళ్ళదూరం  నడవాలి.

    ఓ వాగు  అంచున  వెదురు  పొదల్ని  ఆనుకుని  ఇరుకుగా  వున్న కాలిబాటపై  ఒకరి వెనుక  మరొకరు  ముచ్చటలాడుకుంటూ  నడుస్తున్న వేళ  హఠాత్తుగా  ఓ చిరుతపులి  గాండ్రింపుతోపాటు  వెనువెంటనే  భార్య  ఆర్తనాదం వినిపించింది. 

    అదురుపాటుతో  వెనక్కి  తిరిగిన  సమ్మయ్య  నేలపై  వెల్లకిలా  పడిన  భార్యను, ఆమెపై రాక్షసంగా  నిలబడిన  చిరుతని  చూసి  నిశ్చేష్టుడయ్యాడు.

    అదీ కొన్ని సెకండ్లపాటే....

    అంతే....దైన్యంగా  తనవేపే  చూస్తున్న  భార్యను ఎలా రక్షించుకోవాలో  తెలీని స్థితిలో  అతడు  అచేతనుడయి  ఉండగానే, ఆమె మెడ నందుకున్న  చిరుత  రెప్పపాటులో  పొదల్లోకి  ఈడ్చుకుపోయింది.

    చాలా హృదయ విదారకంగా  చెబుతూ  రొప్పుతున్నాడు సమ్మయ్య.

    నిజమే....చిరుత  పంజాదెబ్బకి  నేలకొరిగిన  అతడి  భార్య నిస్సహాయంగా  అతడికేసి  చూసిన  చూపు గురించి  అతడు  చెప్పిన  తీరు  చైతన్య ను  సైతం  కదిలించింది.

    సాంత్విన వచనాలతో  ఓదార్చుతూ  కూచునే  వ్యవధిలేదు. సమ్మయ్య దుఃఖం ఉపశమించేవరకు  మౌనంగా  ఉండిపోయిన  చైతన్య అనునయంగా  చిరుతకు సంబంధించిన  వివరాల్ని  తెలుసుకునే  ప్రయత్నం చేశాడు.

    ఎడమ కన్నులేని  చిరుత  గురించి, మెడతోపాటు  మొహమంతా  నిండిన గాయాల గురించి  సమ్మయ్య  వివరిస్తుంటే  మౌనంగా  విన్నాడు. చిరుత ఎందుకలా  గాయపడిందీ  చైతన్యకు  సైతం  తెలీని విషయం.

    శ్రీశైలం డామ్ కు పదిహేను  మైళ్ళ  దూరంలో  రిజర్వు ఫారెస్టును  ఆనుకుని  వున్న  గ్రామం  రంపంగి.

    ఎడ్లబళ్ళ  సైతం  వెళ్ళడానికి  వీలుపడనంత  దట్టంగా  పెరిగిన అడవి ప్రాంతమది.

    వ్యవసాయం  అక్కడి ప్రజల జీవనాధారం.

    చాలా తరుచుగా  ఆ గ్రామంతో  ప్రవేశించే  ఓ చిరుతపులి  గిరిజనుల  పశువుల  కొట్టాల్లోని పశువుల్ని  అపహరించుకుపోయేది__

    ఆ విధంగానే  పాలిచ్చే ఆవు  నొకదాన్ని  ఈ మధ్య చిరుత  ఈడ్చుకు వెళ్ళి  పొదలమాటున  పడేసింది .కనీసం అప్పటికయినా  ఫారెస్టు డిపార్టుమెంటుకి  తెలియపరచలేదెవరూ.  

    కాని_ఆవును  పోగొట్టుకున్న  యజమాని  మాత్రం  చిరుత నుంచి ఎలాగయినా  అంతం చేయాలని  అప్పటికే  అతడు కోయంబత్తూరు నుంచి తెప్పించిన  హేయిర్ ట్రాప్ ను  ఆయుధంగా  వాడేడు.

    సుమారు రెండున్నర  అడుగుల  నిడివి గల  ఆ ఇనుప సంకెల అర్ధ చంద్రాకారంలో  రెండు భాగాలుగా   విభజింపబడి  ఉంటుంది. సూదిగా మొనదేలిన  మేకుల్లాంటి  పళ్ళతో  విడిగా  అమర్చబడిన  అర్ధ చంద్రాకారాలు  జంతువుతాకగానే  "హెయిర్ ట్రిగ్గర్" కదలడంతో  బలమైన  వేగంతో  కూరుకుపోతాయి. మెడలో  గుచ్చుకున్న  ఆ పళ్ళు జంతువు విదిలించుకున్నకొద్దీ  మరింత  లోతుగా దిగబడతాయి.

    ఆవు కళేబరాన్ని  సామాన్యంగా  చిరుతపులి  వెనుకనుంచే తినడం  ప్రారంభిస్తుంది. ఈ చిన్న సూత్రాన్ని  ఆధారం చేసుకుని తెలివిగల  ఆవు  యజమాని  ఆవు  వృష్ఠభాగంలో  ఈ ట్రాప్ ను ఏర్పాటుచేసి, అది కనబడకుండా  కొన్ని  ఆకుల్ని, కొమ్మల్ని  ఉంచాడు_ట్రాప్ చిరుత గుర్తించకుండా.

    చిరుత అతని  అంచనా  ప్రకారం  వెనుకనుంచే  వచ్చి  ఆవు నడుముభాగాన్ని  తినాలని  ప్రయత్నించి, దురదృష్టవశాత్తూ  ఆ ట్రాప్ లో ఇరుక్కు పోయింది. మెడను  బలంగా  గుచ్చుకున్న  వృత్తాకారపు  ట్రాప్ లోని  ఇనుపమేకుల  బాధకు  తాళలేక  గాండ్రిస్తూ  తప్పించుకోవాలనుకుంది. మేకులు మరింత  లోతుగా  దిగాయి. మూలుగుతూ ,పెనుగులాడుతూ  చాలా సేపటివరకూ  ప్రయత్నించింది....

    దాని  బలానికి రెండు  పక్కలా  చెట్లకు కట్టిన  వైర్లు  ఊడి  ట్రాప్ తో సహా  చిరుత  ఆ ప్రదేశం  నుంచి  అడవిలోకి పరుగెత్తింది.   

    అడవిలోని జంతువు  లన్నింట్లోనూ  అతివేగంగా  పరుగెత్త గల చిరుత  గుట్టలపైన, రాళ్ళపైన  లంఘిస్తూ  నరకయాతనపడింది. విన్యాసంలో  వైర్లు  గుండ్రాళ్ళ  మధ్య  ఇరుక్కుని  బలంగా  చిక్కుకుపోవడంతో  ట్రాప్ వూడింది. మామూలుగా కాదు_పులి కుడి కన్నును ఊడబెరుకుతూ ,మెడ నిండా  లోతయిన  గాట్లను  నింపుతూ.

 Previous Page Next Page