Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 10

    దూరంగా  గుట్టపై నుంచి  కణుసు  చేసిన  ఆర్తనాదం  వినిపించింది. ఏ క్రూరమృగాన్నయినా  ముఖ్యంగా  పులిలాంటి  జంతువును  చూసినప్పుడు తప్ప రాబోయే  ఉపద్రవాన్ని  సూచిస్తూ కణుసులుగాని, లంగూర్ లు గాని  నిశిరాత్రివేళ  సంచలనాన్ని  సృష్టించవు. చిరుతలు ఎక్కువగా  వేటాడేది  రాత్రివేళల్లోనే. బహుశా ఏ ప్రాణినో  వేటాడే ప్రయత్నంతో  చిరుత  నిర్భయంగా  అడవిలో  తిరుగాడుతూ  ఉండొచ్చు.

    బయట హటాత్తుగా  వంద గజాల  దూరంలో  వున్న  పశువుల కొట్టాంలో ఏదో  అలజడి మొదలయింది.

    చప్పుడు  చేయకుండా  తలుపు  తెరిచాడు ,వెన్నెల  రాత్రివేళ పశువులు  హడావుడిగా  అటూ ఇటూ  కర్రల  ఫెన్సింగ్ మధ్య  కట్లు తెంచుకుని పరుగులు  తీస్తున్నాయి. ఎవర్నీ  డిస్టర్బ్ చేయడం  అతనికి ఇష్టంలేదు .రైఫిల్ అందుకుని  చాలా వేగంగా  పశువుల  కొట్టాం  చేరుకున్నాడు.

    విచిత్రం....అప్పటికే  చుట్టూ  సరిహద్దులా  ఏర్పాటు  చేయబడిన కర్రలు  నేల కొరిగున్నాయి. టార్చిలైటు తీసుకుని  అందులోకి  ప్రవేశించాడు. లైటు వెలుగులో  నేలపడి  ఉన్న కర్రల మధ్య  చిక్కని రక్తం.

    అక్కడ నుంచి  అడవివేపు  కొంత  దూరం  నడిచాడు.

    పగ్ మార్క్స్ బట్టి  అవి చిరుతకి సంబంధించినవిగా  గుర్తించి, తను ఉండగానే  మరో దారుణం  జరిగినట్టు  గ్రహించాడు. ఇంచుమించు ఫర్లాంగు దూరంలో  వున్న  అడవిని  చేరుకున్నాడు గాని ,లోపలికి అడుగుపెట్టే సాహసం  చేయలేకపోయాడు.

    ఈలోగా  గుడిసెల్లోని  జనం  కొందరు  బయటికి  వచ్చారు. లోపాలిచ్చే  ఆవును పొట్టనెట్టుకొని  నా నోటికాడ  కూడు  పడగొట్టేసినాది బాబూ!" అంటూ కాళ్ళపై  పడ్డాడో  వృద్ధుడు.

    భారీగా  వున్న  పశువులు  మీదికి  లంఘించిన  పులినయినా ఎదుర్కోగలవు. కొమ్ములతో  పొడుస్తూ  గట్టిగా  ప్రతిఘటించి  ఒక్కోమారు శత్రువుని  మట్టు పెట్టగల   సమర్ధత గలవవి. కానీ అన్నీ తాళ్ళతో  నిట్రాటలకు  కట్టివేసి  ఉండడంతో చిరుతపై  బలంగా  తిరుగుబాటు చేసి  ఉండకపోవచ్చు  అనుకున్నాడు.

    సాయంకాలం  సమ్మయ్య  భార్యను  చంపిన  చిరుత  అడుగుజాడలు ,ఇప్పుడు ఇసుకలో కనిపించిన  అడుగుజాడలు  ఒకేలా  ఉండడంతో  రెండు  సంఘటనలకి  ఒకే చిరుత  కారణమని నిర్ధారించుకున్నాడు.

    తెల్లవారింది. చిరుత  ఆ ప్రాంతాన్ని   వదలక  ముందే  తను రంగంలోకి  దిగాలనుకున్నాడు  చైతన్య.

    చిరుత ఆవుని  ఎత్తుకు  పోయిన  తర్వాత  మళ్ళీ  కొద్దిగా చినుకులు పడటంతో  ఉదయ సూర్యుని వెలుగులో చెట్ల  ఆకులపైన, గడ్డిదుబ్బలమీద  పేరుకున్న  నీటి బిందువులు  ఆరని  గిరిజనుల కన్నీళ్ళలా చైతన్యను  రెచ్చగొడుతున్నాయి.

    మరో రోజుకి  స్వాగతం  పలుకుతున్నట్టు  దూరాన  కోకిల భూపాలరాగం వినిపిస్తోంది.

    ఒంటరిగా  పల్లె నుంచి  బయలుదేరిన  చైతన్య  ఆవుని ఈడ్చుకు వెళ్ళిన  జాడల్ని  వెదుక్కుంటూ  అడవిని  చేరుకున్నాడు .కుడిపక్క పదిహేను గజాల దూరంలోవున్న  లోయమాత్రం  నిశ్శబ్దంగా వుంది. రాత్రి పడిన వర్షం  చిరుత  అడుగు జాడల్ని  చెరిపేయడంతో  ఆ తర్వాత  యెటు  వెళ్ళాలన్నదీ  నిర్ధారించుకోలేకపోయాడు.

    అనుమానంగా  చుట్టూ  కలియ చూసిన  చైతన్య సరయిన ఆధారం  లభించక  పోవడంతో  ముందురోజు  సమ్మయ్య భార్యను చిరుత లాక్కు వెళ్ళిన  ప్రాంతానికి  బయలుదేరాడు.

    పులినిగాని, చిరుతనిగాని  మాటువేసి  వాటిని  దెబ్బతీయడం చైతన్యకు  ఇబ్బంది కరమయిన  విషయం కాదు. కాకపోతే  పరిస్థితులు  అనుకూలించాలి. అంటే  చిరుత  అడుగు జాడలు  గుర్తించలేకపోయినా, అది చంపిన కళేబరమయినా  ఏ ప్రాంతంలో ఉన్నదీ  తెలుసుకోవాలి.

    ముందురోజు  సమ్మయ్య   చూపించిన  ప్రదేశాన్ని  చేరిన  చైతన్య కుడిపక్క  దట్టంగా  సేరుకున్న  వెదురు పొదల్లోంచి  ఓ వంద  గజాల దూరం  నడిచాడు.

    అతని నమ్మకం  తప్పు కాలేదు. కాని అప్పటికే  ఆనవాళ్ళు  సైతం  మిగల్చకుండా  శవాన్ని  పీక్కుతినేసింది  చిరుత.

    ఒక్క రోజులో  చిరుత  మొత్తం  కళేబరాన్ని  తినలేదు. అది రుచి చూసి  వదిలేశాక  నక్కలు, దుమ్మలగొండి  లాంటి  జంతువులు  మిగతా  భాగాన్ని  స్వాహాచేసి  ఉంటాయి .కాబట్టి  చిరుత  అదే రాత్రి పల్లెకు  చెందిన పశువుల కొట్టాంలో  మళ్ళీ  అడుగు పెట్టింది.

    కేవలం  ఇదే ఆలోచనతో  వెదురు పొదల్ని  దాటి  దుర్గమారణ్యంలోకి  అడుగు పెట్టాడు.

    అతడి నమ్మకం తప్పు కాలేదు.

    ఓ జింక  చెట్టు సమీపంలో  పడి వుంది  ఆవు కళేబరం .దాన్ని  మరుగుపరచే  ప్రయత్నం  చేయకుండా  కడుపులో  కొంత భాగాన్ని  తిని వెళ్ళింది. పరిశీలనగా  చూశాడు. అది మూతి  వాపు వ్యాధితో జబ్బుపడిన  ఆవులా  కనిపించింది. అంటే చిరుత  అదే కారణంగా  విడిచి  వెళ్ళిందా?

    ఏ వేటగాడయినా  ఇదమిత్థంగా  తేల్చుకోలేని  సమస్య అది.

    అసలు చిరుత  అదే  అడవిలో  ఉందా_లేక  మరోచోటుకు  వేట నిమిత్తం  వెళ్ళిపోయిందా? ఇంకో  అనుమానం తలెత్తింది.

    ఒకవేళ  సుమారు పది చదరపుమైళ్ళ  విస్తీర్ణం  వరకు  వ్యాపించిన ఆ దుర్గమారణ్యంలో చిరుత  ఉన్నా దాని  ఉనికిని  వెంటనే  కనిపెట్టడం సాధ్యం కాని పని. ఆ ప్రాంతానికి  ఆనుకుని  కుడిపక్కగా  విశాలంగా  పరుచుకొని  ఉన్నసాగు భూమి కనిపించింది.

    గిరిజనుల అండతో  ఆ ప్రాంతాన్ని  బీటింగ్  (పరిమిత ప్రాంతం  చుట్టూ  పెద్దగా డప్పులాంటివి  కొడుతూ  సద్దుచేయడం)ద్వారా చుట్టుముట్టి  చిరుతని సాగుభూమి  వేపు  రప్పించే  ప్రయత్నం చేయాలనుకున్నాడు.

    కాని తెలివి  గల చిరుత గుబురుగా  పెరిగిన  ఏ చెట్టు  పైనుంచో దుమికి,తన సమీపంలో  నడుస్తున్న  మనిషిని  వధించే  ప్రయత్నం చేస్తుంది.

    బాగా  ఆలోచించాడు. సాయంకాలం  వరకు  ఓ పొదమాటున నక్కి  కూచున్నాడు. చిరుత ఆగమనాన్ని  కోరుకుంటూ_కాని ఎలాంటి ఆచూకీ దొరకలేదు.

    ఉన్నట్టుండి  చెట్లపై నుంచి  పికిలిపిట్ట, కంజుకోళ్ళ  కూతలతో అడవిలో సంచలనం బయలుదేరింది.

    అంటే చిరుత ఆ ప్రాంతంలోనే  ఉంది. మరో  అరగంట గడిచింది. చిరుత అలికిడి లేదు.

    బహుశా ఆవు  కళేబరాన్ని  చేరే  ప్రయత్నం  చేయదనిపించింది. మరికొన్ని  గంటల్లో  చీకటి దట్టంగా  ఆవరించేక  చిరుత తన ఉనికిని  మారుస్తూ  విశాలమయిన  సాగుభూమిని  దాటి మరో ప్రాంతానికి వెళ్ళి పోవచ్చు.

    ఏదో నిర్ణయానికి  వచ్చిన  వాడిలా  వెంటనే  పల్లెని  చేరుకున్నాడు.

    జబ్బుపడిన ఆవును  వదిలిపెట్టి  వెళ్ళిన  చిరుతను మరో'ఎర'తో ఆకట్టుకోవాలి. 
    
    రంపంగిలో  ఓ మేకను  కొన్నాడు.

    మరో అరగంటకల్లా  ఉత్సాహవంతులైన  కొందరు  యువకులతో  అడవిని చేరుకున్నాడు.

    ఆవు కళేబరానికి  ఓ పది  అడుగుల  దూరంలో  మేకను ఓ చెట్టుకు కట్టేసి మిగతా  కార్యక్రమం పూర్తికాకుండా  మేక అరిచే అవకాశమివ్వ  కూడదని  దాని మూతి చుట్టూ  ఓ తాడు  బిగించాడు.

    అడ్డదిడ్డంగా  పెరిగిన  కొమ్మలతో  చిరుత  గమనాన్ని  గుర్తించే అవకాశమివ్వని  చెట్లు  చుట్టూ....కొమ్మల్ని  నరికి 'ఫైర్ లైన్' కు అడ్డంకి తొలగించాలన్నా  వ్యవధిలేదు. అసలు  ఆ గుబురు చెట్లపై కూచుని మాటేసే ప్రయత్నమే  చాలా ప్రమాదకరమయినది. చీకటి  పడ్డాక  సమీపంలోని  ఏ చెట్టుమీదకయినా  చప్పుడు  లయకుండా  ఎక్కి చైతన్య మాటేసిన చెట్టు కొమ్మల్లోకి  లంఘించగల  లాఘనం  గలది  చిరుత.

 Previous Page Next Page