తెల్లవారు ఝాము...
హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళే సెవెన్ జీరో ఎయిట్ ఎక్స్ ప్రెస్ లోని ఫాస్ట్ క్లాస్ ప్రయాణీకులంతా గాఢనిద్రలో వున్నారు.
వెన్నెల కుప్పపోసినట్టు మంచు పేరుకుపోయి వుంది. ఆ మంచుపొరల్ని చీల్చుకుంటూ కాంక్రీట్ స్లీపర్ల మీద వున్న రైల్స్ పై స్మూత్ గా పోతోంది ఎక్స్ ప్రెస్ ట్రెయిన్.
ఉదయానికి చేరువయ్యే కొద్దీ మంచు మరింత ఉధృతరూపందాల్చి వర్షంలా కురవడంతో పట్టాలు కనిపించనట్టు కప్పబడి పోయాయి.
అర్దరాత్రి...
ట్రయిన్ ఆదోని స్టేషన్లో ఆగింది.
ప్రయాణీకులలో చలనం లేకపోయినా,...తనకు చెకింగ్ తప్పదన్నట్టు ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటులో నుంచి దాని ప్రక్కనే వున్న మరొక కంపార్ట్ మెంట్ లోకి మారాడు టి.టి.ఇ.
ఆ సమయంలో నిద్రమేల్కొని పెట్టెల్లోని పాసింజర్స్ ను చెక్ చేయడమంటే చికాకే...కానీ తప్పదు. ఉద్యోగధర్మం.
గార్డు విజిల్ వేయడం....సిగ్నల్ ఇవ్వడంతో ఓ కూతపెట్టి బయలుదేరింది ఎక్స్ ప్రెస్.
ఇంతకుముందు టి.టి.ఇ. దిగిన కంపార్టుమెంటు లోని నాలుగు కూ పేల్లో మాత్రమే ప్రయాణీకులు వున్నారు.
ఒకదాన్లో ఇద్దరు యువకులు,... ఇంకొక కూపేలో మార్వాడీ దంపతులు....వయసులో వున్న ఇద్దరూ ఆడపిల్లలతో. మరొకదాన్లో కలెక్టర్ దంపతులు....ఇంకోదాన్లో రైల్వేకి చెందిన చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్, అతని భార్యా బిడ్డలు. నాలుగు కూపేల్లోని వారూ నిద్రలో జోగుతున్నారు.
ట్రయిన్ నగరూర్ స్టేషన్ దాటుతుండగా వున్నట్టుండి మార్వాడీ నిద్ర మేల్కొన్నాడు. అతను భార్యను తట్టిలేపి పాస్ కు వెళ్ళొస్తానని చెప్పి కదిలాడు.
అతను బాత్ రూం తలుపు తెరుచుకుని డోర్ వేసుకున్న సమయానికే....ప్రక్కనే వున్న కూసే తలుపు మెల్లిగా తెరుచుకుంది.
అందులో నుంచి అధికారి బయటకు వచ్చాడు. చిన్నగా వున్న అతని కళ్ళలో ఎలాంటి భావం ప్రస్పుటం కావడంలేదు. కనులు చిట్లించి అటూ ఇటూ చూశాడు. కారిడార్ లో ఎవరూ లేరు. ఎలాంటి సందడీ లేదు. లో గొంతుకతో కూపేలో వున్న సంజీవిని పిలిచాడు. ఆ సంజ్ఞ కోసమే ఎదురు చూస్తున్న సంజీవి కూడా బయటకొచ్చి తలుపును దగ్గరగా లాగింది.
మార్వాడీ దంపతులున్న కూపే వైపుకు అడుగులువేశారిద్దరూ.
చప్పుడు చేయకుండా ఇద్దరూ కూపెలోనికి అడుగుపెట్టారు.
మెత్తగా వున్న బెర్త్ లమీద హాయిగా పడుకుని వున్న ముగ్గురు ఆడవారిలో మధ్య వయస్సు వున్న ఆమెవారి తల్లి అనీ, మిగిలిన ఇద్దరూ ఆమె కూతుళ్ళనీ చూడగానే అర్ధమవుతోంది.
ఇద్దరూ కళ్ళతోనే సైగ చేసుకుని తల్లిని తట్టి లేపారు. ఆమె ఉలిక్కిపడి కన్నులు తెరచింది.
ఎదురుగా కనిపించిన ఆ ఇద్దరినీ చూడగానే పిచ్చి భయంతో కేకపేట్టింది... కాదు ... కాదు... కేకపెట్టాలనే ప్రయత్నం చేసింది.
పలుచగా పరచుకుని వున్న డిమ్ లైట్ కాంతి పడి తళుక్కుమని మెరిసింది అధికారి చేతిలోని కత్తి. ఆ మారణాయుధాన్ని చూడగానే బయటకు రావలసిన అరుపు ఆమె గొంతులోనే ఆగిపోయింది.
తన చేతిలోని బటన్ నైఫ్ ను సంజీవికి ఇచ్చి, మెరుపులా ముందుకు కదిలాదతను.
జేబులో నుంచి నైలాన్ తాడు తీసి ఆమె రెండు చేతులను కలిపి మేలికవేసి కూపేకి వున్న కిటికీ చువ్వలకు కట్టివేశాడు. బెర్తుమీద కనిపిస్తున్న తువాలును ఆమె నోటినిండా కుక్కి మిగిలిన ఇద్దరివైపుకు కదిలాడు.
చిదిమితే పాలుగారిపోయేటంత సుకుమారంగా వున్నారు ఆ ఇద్దరూ అమ్మాయిలు.
ఒక్కొక్కరి నోటిని మూసి బలంగా గుంజడంతో జర్రున జారారు. అదిరిపాటుతో కళ్ళు తెరచి చూసిన మరుక్షణం బెంబేలెత్తిపోయారు ఆ ముద్దు గుమ్మాలు. ఎంతగా గింజుకున్నా వారి పట్టునుంచి తప్పించుకోవడం సాధ్యపడలేదు. క్షణాలమీద వారిని కూడా కట్టివేసి చేతులు దులుపుకున్నాడు ఆగంతకుడు.
ఇక మిగిలింది ఒకే ఒక్కడు....
అతని కోసమే క్షణాలను లెక్కపెడుతూ ఎదురు చూడసాగాడు.
అతను చూస్తుండగానే...
కూపే తలుపు తెరుచుకుని లోనికి అడుగుపెట్టాడు మార్వాడీ.
వస్తూనే తన వాళ్ళందరూ బందితులై వుండటం గమనించాడు. అతని కనుపాపలు పెద్దవైనాయి. ఏం జరిగిందో అడగబోఏంతలోగా తలుపు పక్కన వున్న ఆగంతకుడు అతని కంటపడ్డాడు.
"పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్దిగా కూర్చో..." అధికారి హెచ్చరించాడు.
అతని చేతిలోని కత్తి చూశాక, అతను చెప్పినట్లే చేయడం మంచిదనుకుని, అదురుతున్న గుండెను అదుపులో వుంచుకునే ప్రయత్నం చేస్తూ...బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాడు మార్వాడీ.
"దట్స్ గుడ్...అదీ బుద్దిమంతుది లక్షణం! మీ దగ్గరున్న నగలన్నీ చకచకా తీసి ఇచ్చెయ్యండి."
అతను కదలలేదు.
"ఏమిటాలోచిస్తున్నావ్....మర్యాదగా విన్నావంటే నగలతో సారి పెట్టుకుంటాం. లేదంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సి వుంటుంది!"
అతని మాటలకు అర్ధం ఊహించడంతో చిగురుటాకులా వణికి పోయాదతను.
"వద్దొద్దు....మీరు చెప్పినట్టే చేస్తాను"
తుపాను గాలికి రెపరెపలాడుతున్న గడ్డిపరకలా అల్లాడిపోతూ, భార్య, కూతుళ్ళ వంటిమీద ఉన్న నగలన్నీ ఒలిచి బెర్త్ మీద కుప్పలా పోశాడు. తన మెడలో వున్న గోల్డు చెయిన్, వ్రేళ్ళకు వున్న ఉంగరాలను కూడా తీసి వారికందిస్తూ తమ దగ్గర ఇంకేమీ లేవన్నట్టు తల అడ్డంగా వూపాడు మార్వాడీ!
దానికి సమాధానంగా ఒక చిరునవ్వు నవ్వి పై బెర్త్ మీదవున్న సూట్ కేసులను తెరచి, అందులో ఒకదానిలో భద్రంగా దాచివుంచిన రవ్వల నెక్లెస్.....దుద్దులు.....గాజులు....ఇతర బంగారు వస్తువులు, పట్టు చీరలు, వాటి క్రింద దాచివుంచిన లక్షరూపాయల నోట్లకట్టలనుసొంతం చేసుకున్నాడు అధికారి.
"ఓరి ముసలాడా! మాదగ్గరే తెలివితేటలు చూపబోయావంటరా! మంచిగా చెబితే మమ్మల్నే బోల్తా కొట్టించాలని చూసినందుకు శిక్షగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్ని ఒ పట్టు పట్టమంటావా?" విలాసంగా ఒ అమ్మాయి బుగ్గను చిదుముతూ అన్నాడతను.
"అంతపని చేయకండి....మీకు కావలసినవన్నీ తీసుకున్నారుకదా. చచ్చి మీ కడుపునా పుడతాం. మమ్మల్ని ప్రాణాలతో వదిలేయండి చాలు"
ఈలోపు బెర్తుపై కుప్పగా పోసిన నగలనుకూడా బాగ్ లోకి సర్దేసింది సంజీవి.
మార్వాడీని కూడా కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి, కూపే తలుపులు దగ్గరకు లాగాడు అధికారి.
ఆ కార్యక్రమం అంతా ముగిసేసరికి సమయం మూడు గంటలు కావస్తోంది. అప్పుడు పంచెర్ల స్టేషన్ దాటింది ఎక్స్ ప్రెస్ ట్రెయిన్.
"ఇంక పదినిమిషాలలో గుంతకల్ స్టేషన్ వస్తుంది. నా అనుమానం నిజమైతే టి.టి.ఇ. ఈ కంపార్టుమెంటులోకి రావచ్చు. అతను వచ్చేలోపే మనం కామ్ గా దిగిపోవాలి" అంటూ జేబులో నుంచి కమెండో అని బోల్డ్ లెటర్స్ వున్న స్టిక్కర్ ను తీశాడు అధికారి.
"నో_ఆ స్టిక్కర్ వదలకు. మొన్న జరిగిన డబుల్ మర్డర్ కేసులో ఎవరో ఆ నేరాన్ని మనమీద తోయడానికి ఇవే స్టిక్కర్స్ ను బాత్ రూమ్ అద్దాలకు అంటించారు."
అతని భ్రుకుటి ముడిపడింది. స్టిక్కర్ ను తిరిగి జేబులో వేసుకుని చిన్న కాగితం మీద కమెండో అని సంతకం చేసి కూపే తలుపు కొద్దిగా తెరచి లోపల పడేశాడు.
అనుకున్న ప్రకారం గుంతకల్ రైలుస్టేషనులో ట్రెయిన్ ఆగింది.
కూపేలను గమనిస్తూ వెళుతున్న టి.టి.ఇ. కంటికి కొద్దిగా తెరచివున్న కూపే కనిపించింది.తలుపు లాక్ చేసుకోమని చెప్పడానికి గాను ఆ కూపే తలుపు తెరిచాడు. లోపల కనిపిస్తున్న దృశ్యం చూసి అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని వాళ్ళ చేతులకు కట్టిన కట్లు వూడదీశాడు.