జరిగిన దోపిడీ తెలుసుకుని వచ్చినంత వేగంగా బయటకు పరుగెత్తి రైల్వే పోలీసులకు వెంటనే ఆ విషయాన్ని తెలియపరచాడు టి.టి.ఇ.
హడావుడిగా కంపార్టుమెంటు లోకి జొరబడిన పోలీసుల కంటికి 'కమెండో' అని సంతకం చేసివున్న తెల్లకాగితపు ముక్క కనిపించింది.
అయితే, పోలీసులు ఈ హడావిడిలో వుండగానే మరో సంఘటన జరిగింది.
బెంగుళూరు నుంచి బొంబాయి వెళ్ళే ఉద్వాన్ ఎక్స్ ప్రెస్ గుంతకల్ స్టేషన్ లో ఆగింది. స్వచ్చమయిన గాలికోసం ప్లాట్ ఫారం మీదకు వచ్చారు ప్రయాణీకులు.
ఆ జనసముద్రంలో పోలీసుల వెతుకులాట మందగించింది.
ఎక్స్ ప్రెస్ ట్రయిన్ వెంటనే బయలుదేరింది.
ఉద్వాన్ ఎక్స్ ప్రెస్ గుంతకల్ స్టేషన్ దాటగానే అవుటర్ లో వాక్యూమ్ బ్రేక్ అప్లయ్ చేసి ట్రయిన్ స్లోమోషన్ లో వుండగానే సంజీవి, అధికారి ఇద్దరూ ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటు నుంచి దిగిపోయారు.
సుమారు పదిలక్షల విలువచేసే బంగారం, వజ్రాలుగల రెండు సూట్ కేసులు మాయమయ్యాయన్నది రైల్వే పోలీసులకు మరొక షాకింగ్ న్యూస్!
రెండు రైళ్ళలో దోపిడీ ఓకే విధంగా జరిగింది.
అంతేకాదు. దోపిడీ స్థలంలో 'కమెండో' అని సంతకం చేసిన తెల్లకాగితం దొరకడం విశేషం.
బెంగుళూరు ఎక్స్ ప్రెస్ లో కలెక్టరుగారి ఫ్యామిలీతో పాటు, రైల్వే ఆఫీసర్ గారి ఫ్యామిలీకూడా ప్రయాణిస్తోంది.
వాళ్ళు ఎవరో తెలిసినందువల్ల వారి జోలికి వెళ్ళలేదో....లేక కాకతాళీయంగానే వారిని వదిలివేశాడో.....పోలీసులకు అర్ధంకాని ప్రశ్నలు!
అప్పటికప్పుడే రైల్వేపోలీస్ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
కొన్ని వారాల క్రితం నెల్లూరువద్ద కోటిరూపాయల వెండి దోపిడీ చేసిన విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. తమ పరిధిలోనే కాక, వివిధచోట్ల నేరాలు జరిగాయి గనుక అన్ని నేరాలు చేసింది 'కమెండో' అనే చిరునామా తెలియని దొంగ కావడంవల్ల, ఆ కేసులన్నింటినీ దర్యాప్తుచేసే అధికారాన్ని ఇన్ స్పెక్టర్ ధీరజ్ కు అప్పగించి నేరస్థుడిని పట్టుకునే బాధ్యతను అతని భుజస్కందాలపై వుంచారు సీనియర్ పోలీసు అధికారులు.
వాళ్ళ నమ్మకం అటువంటిది! అతను డేరింగ్ అండ్ డాషింగ్ మోస్ట్ సీనియర్ అండ్ సిన్సియర్ పోలీసు ఆఫీసరు అని వాళ్ళ అభిప్రాయం.
ఉద్యోగ బాధ్యతలను స్వీకరించిన కొద్దికాలంలోనే క్రిమినల్స్ ను హాండిల్ చేయడంలో అతని వైపున్యం, ఉద్యోగ ధర్మం నిర్వహించడంలో అతని నిజాయితీ, చేపట్టిన కేసును పరిష్కరించడంలో చూపించే కార్యదక్షత, అంతుచిక్కని నిగూఢమయిన కేసులను సయితం అవలీలగా పరిష్కరించగలిగిన గుండె నిబ్బరం, అమోఘమయిన మేధస్సు, అన్నిటినీ మించి తన డ్యూటీపట్ల వుండే అంకితభావం.....అధికారులందరినీ ఆకట్టుకున్నాయి.
అందుకే అతనికొక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఒక ఇమేజ్ ఏర్పడింది.
అతను తన దర్యాప్తును ప్రారంభించాడు.
* * *
పట్టుపాన్పు మీద గులాబీరేకులు దొంతర్లుగా పేర్చివున్నాయి. ఆ పందిరి మంచం చుట్టూ మల్లెచెండుల గుబాళింపు....
అది తమ కోసమే దేవతలు ఏర్పాటు చేసిన శోభనపు రాత్రిలా అనిపిస్తున్నది. ప్రియునికోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నది సంజీవి.
ఇప్పుడామె బాగా అలసిపోయి వుంది. ఆ పాన్పుమీద పడుకుని ఎదురుచూడడం వల్లకాదు ఆమెలో ఆలోచనలు రేపిన అలజడివలన....
లిల్లీ పువ్వువంటి ఆమె ముఖంమ్మీద చెమట బిందువులు తళతళా జారిపోతున్నాయి. ఆమెమాత్రం తన ప్రియునికోసం....అతని రాకకోసం తపించిపోతున్నది.
అతను అప్పుడే దేవలోకం నుంచి దిగివచ్చిన గంధర్వునిలా వున్నాడు. ఆమెను సమీపించి రెండు బాహువులనూ చాపాడు.
సన్నని వెలుగురేఖ ఆమె మోముపై క్షణం లాస్యమాడి మాయమై పోయింది.
తెల్లని పలుచని చీరలోనుంచి మెరుస్తున్న శరీరచ్చాయ...మెత్తగా పడుతున్న లేత అడుగులు. రెప్పపాటులో సంజీవి అతనిని సమీపించి వాలిపోయింది.
అతని చేతులు ఆత్మీయంగా ఆమెని చుట్టివేశాయి.
ఎక్కడో ఉవ్వెత్తున కెరటం ఒకటి ఎగసిపడింది.
హఠాత్తుగా ఎవరో తట్టినట్టు సంజీవి ఉలిక్కిపడింది. గది తలుపులను బయట ఎవరో కొడుతున్నారు.
పక్కకు చూస్తే....అతను లేడు! అంటే, తానింతవరకూ కల కంటుందన్నమాట! వాస్తవంలోకి సిగ్గుల మొగ్గ అయిపోయింది సంజీవి.
మళ్ళీ తలుపు కొట్టడంతో విసుగ్గా లేచి వెళ్ళి తలుపు తీసింది.
ఎదురుగా అధికారి. తన కలల రాకుమారుడు..తన ప్రియుడు!
"హాయ్" అంటూ అమాంతం కౌగిలించుకోబోయింది సంజీవి.
"ఏంటా దూకుడు? ఈ కౌగిలింతలేంటి? ఆడపిల్లవు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది."
"అంతేనంటావా" ఉక్రోషం ధ్వనించింది కంఠంలో.
"అవును. నువ్వు ఆడదానివి. నేను మగాడిని. అది గమనించి దూరంగా వుంటేనే బావుంటుంది" తెగేసి మరీ చెప్పాడతను.
"నా ఇష్టం. నా కిష్టమైన వ్యక్తిని కౌగిలించుకుంటాను. ముద్దు పెట్టుకుంటాను" రోషంగా అంది సంజీవి.
"నీతో వాదించే ఓపిక నాకు లేదు మహాతల్లీ. నన్ను లోపలకు రానిస్తావా లేదా? లేదంటే ఇక్కడే నిలబెట్టేస్తావా? ఇప్పుడుద్ నా మీద చూపించే నీ కోపతాపాలన్నింటినీ రేపు పెళ్ళి అయ్యాక నీ మొగుడి మీద చూపించావనుకో, ఆ గురుడు శోభనం కాకుండా సరాసరి వారణాసి ఎక్స్ ప్రెస్ ఎక్కుతాడు.
ఆమె అడ్డు తప్పుకోవడంతో లోపలికి వస్తూ అన్నాడు అధికారి.
"అంటే కట్టుకున్న పెళ్ళాన్ని వదిలి కాశీ వెళ్లాలని నీ కోరికన్నా మాట?"
"అదేమిటి....నేను వెళ్ళడమేమిటి?"
"మరి? నన్ను చేసుకునేది నువ్వె అయినప్పుడుద్ ఎవరో ఎందుకు వెళతారు?" చిలిపిగా బుగ్గ గిల్లుతూ రెచ్చగొట్టిందతన్ని.
"ఓరి నాయనోయ్. నీతో వాదించి నెగ్గలేను కానీ....నన్ను కట్టుకునీ ఉద్దేశాన్ని అర్జంటుగా విరమించేసుకుని చక్కటి మొగుణ్ణి వెదుక్కో. తాడూ బొంగరం లేని వాడిని నన్ను పెళ్ళి చేసుకుని నువ్వు సుఖపడలేవు. నాతో వుంటే ఎప్పటికయినా నీకూ జైలు ఫుడ్డే గతి అవుతుంది."
"అబ్బో....చెప్పావు లేవయ్యా. నిజమైన భార్యాభర్తల బంధం అంటే అదే. భర్త ఎక్కడా వుంటే భార్య కూడా అక్కడే వుండాలి. అది హైందవ ధర్మం. నీతో పాటే నేనూ జైలుకు వస్తాను. అక్కడే పిల్లల్ని కంటాను. అంతే తప్ప ఈ జన్మలో ఇంకొకరిని నా భర్తగా అంగీకరించను" మొండిగా అంది సంజీవి. ఆమె స్వరం బరువెక్కుతున్నది.