Previous Page Next Page 
నల్లతంబి పేజి 8

        శాంతి నిలయం...

   పర్సనల్ గదిలోకి చేరుకున్న వెంటనే చందనను రమ్మనమని కబురుపెట్టాడు రాజశేఖర్. అది విన్న మురుగన్ కూడా అనుమానంతో చెల్లెలిని అనుసరించాడు.
అడుగులో అడుగువేసుకుంటూ భయంతో బిక్కు బిక్కుమంటూ లోనికి వచ్చింది చందన.
జరిగిన హత్యాప్రయత్నాన్ని తలచుకుంటున్న మురుగన్ కు తల కొట్టేసినట్టుగా వుంది. తన చెల్లెలు ఆ పని చేసినందుకు రాజశేఖర్ ఎలా ముఖం చూపించాలో, అతనితో ఎలా మాట్టాడాలో అర్ధంగాక బయటే నిలిచిపోయాడు.
చందన వైపు పరిశీలనగా చూశాడు రాజశేఖర్.
అంతవరకూ ఏడ్చినట్టుంది....బుగ్గలపై కన్నీటి చారికలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుగుడ్లు ఎర్రగా మారి కొద్దిగా వుబ్బివున్నాయి కూడా..
"నేను....నేను....మిమ్మల్ని చంపాలని ప్రయత్నించలేదు."
"అలానే అనుకుందాం....మరి నీ దగ్గర రివాల్వర్ ఎందుకుంది నా రివాల్వర్ నీ దగ్గరికెలా వచ్చింది?"
మౌనంగా వుండిపోయింది చందన.
"నా ప్రశ్నకి జవాబు చెప్పడం ఇష్టంలేదా? లేక నీ దగ్గర జవాబు లేదా?"
బొటబొటా కన్నీరు కారుస్తున్నదామె.
"నువ్వు ఎందుకు రివాల్వర్ ప్రేల్చావో నాకు తెలుసు. ఆ నిజం నీ నోటి వెంట వినాలని అడుగుతున్నానే తప్ప నాకు తెలియదనుకోకు....ఈ వీడియో క్యాసెట్ చూడు...."
వి.సి.ఆర్. లో వీడియో క్యాసెట్ పెట్టి రిమోట్ కంట్రోల్ తో టి.వి., వి.సి.ఆర్.లను ఆన్ చేశాడు.
మరుక్షణం అనాథ శరణాలయంలో జరిగిన ఫంక్షన్ దృశ్యాలన్నీ ఒకటొకటిగా కనిపించసాగాయి. ఊపిరి బిగపట్టి చూడసాగింది చందన.
అనాధ శరణాలయం లోపల జరిగిన ప్రతి కదలికా ఆ క్యాసెట్ లో వుంది.
కారు దిగిన చందన తనను ఎవరూ గమనించడంలేదనుకుని నక్కి నక్కి లోనకి వచ్చింది. ఒక గుబురు పొదచాటున నిలిచి చుట్టూ పరిశీలనగా చూసింది. తనను ఎవరూ చూడలేదని గ్రహించాక ఫంక్షన్  జరిగే స్థలానికి దగ్గరలోవున్న వత్తుగా పెరిగిన పూలమొక్కల మధ్యకు చేరుకుంది.
మధ్యలో ఒకసారి చేతిలోని వ్యానిటీ బ్యాగ్ ను తెరచి....అందులో వున్న రివాల్వర్ ను తడిమి చూసుకుంది.
అప్పుడు తనను ఎవరూ గమనించలేదనుకుంది.
కానీ....తన ప్రతి కదలికా వీడియో ఫిల్మ్ లో పడింది.
దృశ్యాలు కన్నుల ముందు కదలిపోతున్నాయి.
అటూ ఇటూ తిరిగే సెక్యూరిటీ గార్డుల కంటపడకుండా ఒదిగి కూర్చుంది చందన.
వ్యానిటీ బ్యాగ్ లోని రివాల్వర్ ని బయటకు తీసింది.
మరు సెకనులోనే ధన్ మంటూ ప్రేలిన రివాల్వర్ చప్పుడు...
మెరుపు వేగంలో దూసుకుపోయిన బుల్లెట్ బారినుంచి రాజశేఖర్ తృటిలో తప్పించుకోడం క్షణాలమీద జరిగిపోయాయి.
వెంటనే మరోసారి ప్రేలింది రివాల్వర్.
చందన చేతిలోని రివాల్వర్ నుంచి దూసుకెళ్ళిన బుల్లెట్ వెళ్ళింది రాజశేఖర్ వున్న డయాస్ వైపుకు కాదు....ఒక పొదచాటునుంచి రాజశేఖర్ ని రివాల్వర్ తో షూట్ చేయబోతున్న ఆగంతకుని వైపు...! వెంట వెంటనే రెండు షాట్లు వినిపించడానికి కారణం ఇదే...
అయితే, చందన ప్రొఫెషనల్ కాకపోవడంవల్ల బుల్లెట్ సూటిగా వెళ్ళక అతని భుజాన్ని మాత్రం గాయపరచగలిగింది. చివ్వున చిమ్మిన రక్తం ఆ పొదపై చిందింది. తన ఉనికి ఎవరికో తెలిసిపోయిందని అర్ధమైన ఆ వ్యక్తి కంగారుగా లేచి ప్రహరీ గోడను సమీపించి బయటకు దూకి మాయమైపోయాడు!
ఆ వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకుని వున్నందువల్ల అతనెవరో తెలియడం లేదు.
రివాల్వర్ చప్పుళ్ళకు ఎలర్టయిన సెక్యూరిటీ సిబ్బంది రివాల్వర్ తో వున్న చందనను క్షణాలలో పట్టుకోగలిగారు.
వాళ్ళు ఆమెను పట్టుకునే హడావుడిలో వున్నప్పుడే, ఆకాస్త అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హత్యాప్రయత్నం చేసిన వ్యక్తి తేలిగ్గా పారిపోయాడు.
వి.సి.ఆర్ ని ఆఫ్ చేశాడు రాజశేఖర్.
జరిగిందేమిటో కళ్ళకు కట్టినట్టుగా కనిపించేసరికి ఏమీ చెప్పకుండా మౌనం దాల్చింది చందన.
"నన్ను ఇంకెవరో షూట్ చేయబోగా అతన్ని కాల్చావు నువ్వు. కానీ, నాకు తెలీని విషయం అదే...! రహస్యంగా నా వెనుక రావాల్సిన అవసరం నీకెందుకు కలిగింది? అలా పిల్లిలా నక్కినక్కి ఎందుకు వచ్చావు అక్కడికి?....అదీ రివాల్వర్ తో సిద్దంగా వున్నావు నువ్వు. అతడెవరో హత్యాప్రయత్నం చేయబట్టే అతన్ని షూట్ చేశావు. ఒకవేళ అతను చేయకపోతే నువ్వె చేసి వుండేదానివా ఆ పని...?"
"లేదు...లేదు....మిమల్ని నేనెందుకు చంపుతాను! కట్టుకున్న భర్తను చంపే కసాయిదానిలా కనిపిస్తున్నానా మీ కంటికి?....
"ఫర్వాలేదే.....ఇప్పటికైనా నేను నీ భర్తనని గుర్తించావు....అదే నిజమైతే నీకు రివాల్వర్ తో ఏం పని?"
మరల మౌనం వహించింది చందన.
"ఆల్ రైట్!....కనీసం ఈ ప్రశ్నకయినా జవాబు చెప్పు...అతన్ని నువ్వు ఎప్పుడయినా చూశావా?"
ఆ ప్రశ్నకు మరోసారి తడబడిపోయిందామె.
"అబ్బే.....లేదు" ఆమె కంఠంలో వణుకు స్పష్టంగా కనిపిస్తోంది.
రాజశేఖర్ భ్రుకుటి వింతగా ముడిపడింది.
"నువ్వే అతన్ని దగ్గరగా చూశావుకదా....కనీసం అతని పోలిక లైనా చెప్పగలవా...?"
తెలియదన్నట్టు అడ్డంగా తలూపింది చందన.
జరిగిన షాక్ నుంచి ఇంకా ఆమె తెరుకోలేదని ఆమె ముఖ కవళికలే చేపుతున్నాయనీ, తరువాత నిదానంగా అడిగి చూద్దామని ఆమెను పంపించేశాడు రాజశేఖర్.
గది బయట నుంచి అప్పటి వరకూ వాళ్ళ సంభాషణ అంతా విన్న మురుగన్ 'హమ్మయ్య' అనుకుంటూ నిట్టూర్చాడు. తన చెల్లెలు అతనిపై హత్యాప్రయత్నం చేయలేదు. పైపెచ్చు అతన్ని కాపాడింది!
కానీ, రాజశేఖర్ పర్సనల్ రివాల్వరు చందన ఎందుకు తీసుకొచ్చినట్టు? అంత అట్టహాసంగా జరుగుతున్న పార్టీకి దొంగచాటుగా ఎందుకు వచ్చినట్టు? మురుగన్ ఎంత ఆలోచించినా ఆ ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు.
ఈ పరిస్థితులలో తను రాజశేఖర్ ను కలవడం మంచిదో కాదో ఎటూ నిర్ణయించుకోలేక పోయాడు. కాలమే అన్నిటికీ జవాబు చెపుతుందన్న ఆశతో మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు మురుగన్.
కిటికీలోనుంచి మురుగన్ రావడం,....లోపలకు రాకుండానే వెళ్లిపోవడం గమనించాడు రాజశేఖర్. అనుమానంగా అతను భ్రుకుటి ముడిపడింది. ఇప్పుడు అతని ఆలోచనలు చందనవేపునుంచి మురుగన్ వేపుకు మరలాయి.....

 Previous Page Next Page