Previous Page Next Page 
వెలుగుబాట పేజి 9


    ఈ గందరగోళం మధ్య సుందరమ్మ దైన్యాన్ని పట్టించుకున్నవాడు కుమార్ ఒక్కడే సుందరమ్మద్వారా తల్లిదండ్రులకు రామయ్యే ఆధారమనీ- వాళ్ళది అతి బీదకుటుంబమనీ- బోసుబాబు ఉద్యోగం ఇప్పిస్తాననటంవల్లేనే బోసుబాబు ఇంటికి రాకపోకలు ప్రారంభించాడనీ, అది ఇలా విషమించిందనీ చెప్పుకొంది.
    కుమార్ స్వయంగా ప్రతిపక్ష నాయకుడిని కలుసుకున్నాడు.
    "జరిగినది ఏదయినా ఒక అన్యాయాన్ని ఎదుర్కోవటానికి ఇలా ముందుకొస్తున్నారు. మీకు నిజంగా మరణించిన వ్యక్తిమీద సానుభూతిఉంటే అతడి కుటుంబానికి ఏదైనా ఆర్ధిక సహాయం చేయండి" అని అడిగాడు. వాళ్ళు కుమార్ మాటలు లక్ష్యపెట్టకుండా కుమార్ నే హేళనచేసారు.
    ఒకడు "నువ్వు మందులమ్మి కూడబెట్టుకున్న డబ్బుతో సాయంచెయ్యి" అన్నాడు.
    కుమార్ కోపంతో "మీరంతా అంటున్నట్లు నేను మందులమ్మి డబ్బులు కూడబెట్టుకుఉంటే, ఈనాటి ఈ న్యాయస్థానంలో దోషిగా నిలవవలసివచ్చేది కాదు. న్యాయం కొనుక్కునేవాడిని" అన్నాడు.
    మరొకడు "ఒకరిద్దరికి సాయంచేసినంతమాత్రాన సమస్యలు తీరిపోతాయా? అధికారంలో ఉన్నవాళ్ళను గద్దెదింపండి, మాకు అధికారం ఇవ్వండి, ఇలాంటి అవకతవకలు రాకుండా మేం పాలిస్తాం." అన్నాడు- ఈ సమాధానం విన్న కుమార్ మనసు రగిలిపోయింది.
    "అంతే! అధికారంలో ఉన్నవాళ్ళని గద్దె దింపడం అధికారం చేజిక్కించు కోవటం- అదే మీకు కావలసింది- ఒక నిరుపేద కుటుంబాన్ని ఆపదలో ఆదుకోవటం కాదు."
    కుమార్ కోపం అతడి పెదవికి మాత్రమే చేదుతెచ్చింది. దోషిగా భావించి అతనిని  సస్పెండ్ చేసారు.
    కుమార్ నవ్వుతున్నాడు ఝాన్సీ కళ్ళు తుడుచుకుంది.
    "ఒక విషయం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది" అంది.
    "ఏమిటది?"
    "అడిగితే మీరేమీ అనుకోకూడదు."
    "మీరేం అడిగినా నేనేమీ అనుకోను."
    "మీరూ.....మీరు- ఇక్కడే- అంటే, మా మధ్యనే పుట్టి పెరిగారుకదా? మా ఆచారాలను చూసీ సంకుచితతత్వాలను చూసీ,
 ఎందుకంత దిగ్భ్రాంతి చెందుతారు? అమాయకంగా కొత్తలోకాన్ని చూస్తున్నట్లు చూస్తారెందుకు?"
    కుమార్ అల్లరిగా నవ్వాడు.
    "సూటిగా అడగండి- " హరిజనుల కులంలో పుట్టావు కదా? మీ వాళ్ళ అలవాట్లు, ఇతరులు మీపై చేసే అత్యాచారాలు ఇవి నీకు  కొత్తగా- వింతగా- ఎందుకున్నాయీ? అని అడగండి. అవును- ఈ సమాజమంతా నాకు  వింతగా ఉంది. దీనితో పరిచయమవుతున్నకొద్దీ నాకు మతి పోతుంది ఎందుకంటే, నేను ఈ సమాజంలో పెరగలేదు ఒక కుటుంబంలో పెరిగాను. ఒక ఫ్యాక్టరీ నిర్మాణంలో సహాయపడటానికి జెకోస్ల వేకియా నుంచి కొందరు సాంకేతిక ప్రవీణులూ, వారి కుటుంబాలూ ఇండియాకు వచ్చాయి. జీతగాళ్ళు పసివాళ్ళకి చాలా ఎక్కువ జీతాలిస్తారు, పని తక్కువగా ఉంటుంది. అంచేత అందరూ ఆ కుటుంబాలలో పనిచేయటానికి ఎగబడేవారు- ఆ అదృష్టం నాకు దక్కింది. పన్నెండేళ్ళ వయసులో ఒక జెకా కుటుంబంలోకి తోటమాలిగా ప్రవేశించాను- ఆ కుటుంబంలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకు జెకోస్లోవేకియన్ భాష తప్ప మరొకటి రాదు- ట్యూషను మాస్టర్లనుపెట్టి ఇంగ్లీషు తెలుగు నేర్పించేవారు వాళ్ళతోపాటు నేనూ నేర్చుకొనే వాడిని- యజమాని కాని యజమానురాలు కానీ, నన్ను మందలించకపోగా,ప్రోత్సహించేవారు.  ఒక్కొక్క  సాయంత్రం వాళ్ళ పిల్లలతోకలిసి నేను చదువుకొంటూంటే, ట్యూబ్ తో నీళ్ళు మొక్కలకు వాళ్ళే పట్టేవారు  ఆ రకంగా పరీక్షకు వెళ్ళకపోయినా, నాకు చదువులో ఆసక్తీ, ప్రవేశమూ కలిగాయి. ఆసందర్భంలో ఆ కుటుంబానికి మరో యూనిట్ కు వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. వాళ్ళు నన్నూ తమతో రమ్మన్నారు. నెలకు  రెండువందలు పంపుతామన్నారు నా తల్లిదండ్రులకి-అప్పుడు నేను అమ్మకోసం ఏడ్చాను అమ్మ కూడా ఏడ్చింది. అయితే నెలకో రెండు వందలముందు ఈ కన్నీళ్ళకు విలువలేకపోయింది. ఆ కుటుంబంలో చచ్చుప్రేమలుకోసం ఇంత అదృష్టం వదులుకోలేరు నాకు నచ్చజెప్పి బుద్ధులుచెప్పి ఆ కుటుంబంతో పంపింది. నాకు ఆ కుటుంబాన్ని వదలాలన్నా కష్టంగానేఉంది. అంచేత అమ్మకోసం మనసులో బెంగగా ఉన్నా ఉత్సాహంగానే వాళ్ళతో వెళ్లాను నేను రానంటే, వాళ్ళు నన్ను ఏమాత్రం బలవంతం చేసేవారుకాదు. అలా వాళ్ళతో మరో సిటీ చేరుకున్నాను. జెకా కుటుంబం కొద్దిరోజుల్లోనే స్వదేశం వెళ్ళిపోయింది పిల్లల చదువులు పాడవుతాయని వాళ్ళు  ఇండియాలో ఎక్కువ రోజులుండేవారుకాదు. కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత యజమానికీ నాకూ సన్నిహిత్యం మరింత పెరిగింది. ఆయన నన్ను కొడుకులాగే- అలా  అనకూడదేమో, మా నాన్న నన్నెప్పుడూ- అంత అభిమానంగా చూసినట్లు గుర్తులేదు. ఎంతో అభిమానంతో చూసేవారు. పనిచేసే కుర్రాడిననే భావం నాకెప్పుడూ వచ్చేదికాదు. ఒక్క సంవత్సరంలో ఆయన వెళ్ళిపోవలసి వచ్చింది. అప్పుడే ఆయన నన్ను దగ్గర కూచోబెట్టుకుని వచ్చీ రాణి తెలుగులో చదువు విలువ బోధించి "ఇకనుండి చదువుకుంటావా? మీ వాళ్ళ దగ్గరికి వెళ్తావా? అన్నారు. అమ్మను చూడాలని ఉంది, కానీ అప్పటికే చదువులో ఆసక్తికలిగి చదువుకోవాలనే ఆశ ప్రబలిపోయింది నాకు. ఆ జిక్ పిల్లలు నాకు ఆదర్శమయ్యారు. ఎక్కువ ఆలోచించకుండానే "చదువుకుంటాను" అన్నాను. ఆయన ఏ ప్రయత్నాలు చేసారో, ఎలా సాధించారో నాకు తెలియదు కాని నన్ను హాస్టల్ లో చేర్పించారు. మా జాతి వాళ్ళకి ప్రభుత్వం కలిగించే సదుపాయాలన్నీ  కలిగేలాగ చేసారు. స్కూల్ ఫీజ్ లేకుండా స్కాలర్ షిప్ లతో ఎంతవరకు చదువుకోవాలనుకున్నా చదువుకొనే ఏర్పాటు చేశారు. హాస్టల్ లో చేరడానికి ముందుగానే ఆయన సహకారంతోనే ఏడో క్లాసు పబ్లిక్ పరీక్ష పాసయి ఎనిమిదో క్లాసుకి  మొదటిసరిగా స్కూల్లో జాయినయ్యాను.

 Previous Page Next Page