Previous Page Next Page 
వెలుగుబాట పేజి 10


    
    ఆ హాస్టలు సదుపాయమూ, చదువుకొనే అవకాశమూ, మా జాతివాళ్ళందరికీ దక్కుతాయని అనుకున్నాను. మొన్న మొన్నటివరకు అది కేవలం కొందరికే ఒక ఆఫీసర్ లాంటి వాళ్ళు ప్రయత్నించి సాధించగలిగినవి మాత్రమేనని నాకు తెలీలేదు.
    బీదరికం నేను బాగా అనుభవించాను. కానీ జిక్  కుటుంబం సంవత్సరంన్నర కాలంలో నామీద వేసిన సంస్కారం ముద్ర మాత్రం నన్ను వదిలిపోలేదు సిటీ దూరం కావటంవల్ల మా ఊరికి తరచుగా వెళ్ళలేకపోయేవాడిని. కాలేజీలో చేరిన కొత్తలో ఆవార్తా చెబుదామని స్టూడెంట్ కన్షెషన్ రేట్ లో అతికష్టపడి మా ఊరు వెళ్ళాను- మా వాళ్ళు నన్నుచూసి చాలా సంతోషించారు. వాళ్ళు అనుభవించే బీదరికం చూసి నేను చలించిపోయాను. మా తమ్ముడు అప్పటికే పాలేరుగా పనిచేస్తూ కుటుంబానికి అండగా  ఉన్నాడు. నేను ఎక్కువ రోజులు ఉండేవాడినికాను. నా  చదువు ఆపటానికి వీల్లేదు ఉండమని వాళ్ళు అడిగేవారు కాదు. నేను చదువు పూర్తి చేసుకుని వాళ్ళను ఉద్ధరిస్తానని గంపెడాశలు పెట్టుకున్నారు-కాని ఇప్పుడు.....?"
    వాక్యం పూర్తి చెయ్యలేకపోయాడు కుమార్- నవ్వేశాడు. బొమ్మలా నిలబడిపోయింది ఝాన్సీ.

 

                                            *    *    *


    కుమార్ ఇంటికి వచ్చేసరికి చెల్లెలు అస్థిపంజరంలా మంచాన్ని అతుక్కుపోయింది. అన్నను చూడగానే పరమానందతో "అన్నా" అని చీపురుపుల్లల్లా ఉన్న చేతులు జాపింది- ఆ చేతులు రెండూ పట్టుకొని, ఆ మంచంలోనే కూచుని చెల్లెలి చెక్కిళ్ళు నిమిరాడు. అతడి కళ్ళు చెమ్మగిల్లుతున్నా, చిరునవ్వుతో "చూడు ఇంకెన్నాళ్లో ఇలా మంచంలో పడుకోవు- ఈసారి నేను వచ్చేసరికి లేచి పరుగెత్తుతావు! అన్నాడు.
    "నాకు మందులూ టానిక్కులూ తెచ్చావా?"
    "ఓ" అని తను తెచ్చినవన్నీ బల్లమీద పెట్టాడు. అతని మనసులో లోపల బాధతో మూలిగింది. తన చెల్లెలికి కావలసింది మందులూ, టానిక్కులూ కాదు- పళ్ళూ పాలు కావాలి. పూర్వం మనుషులు పళ్ళుతిని పాలు త్రాగి ఉండేవారట! ఈ మునివృత్తి చాలా ఆరోగ్యకరమైనది- కానీ, చాలా ఖరీదైనది.
    కుమార్ ని చూసి అతడి తల్లి శాంతమ్మ ముఖం వికసించింది. కుమార్ ప్రయత్నంవల్లా-సిటిలో ఉండటం వల్లా- శాంతమ్మ కట్టూ బొట్టులో మాట తీరులో చాలా మార్పు వచ్చింది. చాలా వరకు పెద్దింటి ఇల్లాలు లాగానే ఉంటుంది. అయినా ఆమె మాటల్లో అప్పడప్పుడు యాసదొర్లుతూనే ఉంటుంది.
    "ఏం బాబూ? సెప్పకుండానే వచ్చావు? బాగున్నావా? ఉండు కాఫీ పెడతాను" సంభ్రమంతో కిరోసిన్  స్టౌ వెలిగించింది-తనకు ఊహ తెలిసినప్పటినుంచీ కష్టాల్లోనే మగ్గుతున్న ఈ సంసారాన్ని పైకి తేవాలని ఎంతగానో కలలు కన్నాడు- తిమ్మణ్ని వాలేరు పని నుంచి  తప్పించి మెట్రిక్  పాస్ చేయించి కనీసం కంపౌండర్ ట్రైనింగ్ ఇప్పించాలనుకున్నాడు- తండ్రిని మెంటల్ హాస్పిటల్ లో చేర్పించి వైద్యం చేయి చాలనుకున్నాడు- తాను నమ్మకున్న  ఆ నేలనువదిలి రాలేకపోతున్నాడు తండ్రి. ఒకప్పుడు తమదయిన పొలంలోనే పాలేరుగా ఉన్నాడు తమ్ముడు- చెల్లెలిని వైద్యంకోసం సిటీకి తీసుకొచ్చాడు. చెల్లెలితోపాటు తల్లీ వచ్చింది-తాను డాక్టరయినా తన కుటుంబానికి ఏమీ చెయ్యలేకపోతున్నాడు. తన జాతివారికి ఏమీ చెయ్యలేక పోతున్నాడు- రెండు మూడు నెలలయినా జీతం సంపాదించ కుండానే ఈ సస్పెన్షన్ వచ్చింది. సస్పెన్షన్ లో పూర్తి జీతం రాదు. ధరలన్నీ చుక్కలంటుతున్న ఈ రోజుల్లో ఈ సమస్యలన్నీ ఎలా పరిష్కరించుకోవాలి? పాపం, తన తల్లి మొన్నటి వరకు కష్టపడి కూలిపనిచేసేది. తనే మానిపించాడు. తన కష్టాలన్నీ గట్టెక్కాయని మురిసిపోతోందా వెర్రితల్లి. ఇప్పుడు మళ్ళీ తల్లిని కూలికి పంపి తమ్ముడితో పాలేరుపని చేయించి, వాళ్ళ సంపాదన మీద తను బ్రతకాలా?
    కొడుకుకి కాఫీ ఇచ్చి "బాబూ నువ్వక్కడ. మేమిక్కడ ఎందుకు మేమూ నీ దగ్గరకి వచ్చేస్తాం చెల్లికి నువ్వు వైద్యం చెయ్యలేవా" అంది.
    కుమార్ గుటక మింగి "అలాగేనమ్మ" అన్నాడు అతడు తల్లి చెల్లెలినీ తన దగ్గరకు తీసుకురావాలనే  ఆలోచనలోనే ఉన్నాడు. ఉద్యోగంలో చేరిన వెంటనే మొదట తండ్రి దగ్గరకు వెళ్ళాడు తమ్ముడికి నచ్చజెప్పి రాత్రి పాఠశాలలో చేర్పించాడు ఇంతలోనే అనుకోకుండా ఈ గొడవలు వచ్చిపడ్డాయి కోర్టులంటే మాటలుకాదు- తరువాత న్యాయం జరిగినా మానినా, ముందు లాయర్లకు గుమ్మరించుకోవాలి.
    ఈ గొడవల మధ్య తన పెళ్ళి ఒకటి. సంసారమంతా ఇలావుండగా తను ముందు పెళ్ళి చేసుకున్నాడంటే, అందరూ ఏమనుకుంటారు? అసలు అది నిజంగా పెళ్ళేనా! ఝాన్సీ ఆలోచనలు ఎలా వున్నాయో ! తన ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా చూసిందీ? ఏదో అత్యంత ప్రియమయినది పోగొట్టుకున్నట్లు....."
    "కాఫీ త్రాగరా! చల్లారిపోతోంది" అంది తల్లి కొడుకుని చనువుగా మందలిస్తూ.
    కాఫీ త్రాగేసి ఉద్యోగ ప్రయత్నంమీద బయలు దేరాడు. ఎక్కడయినా ప్రైవేటు నర్సింగ్ హొమ్ లో అసిస్టెంటులా తీసుకోవటానికి ఎవరూ ఒప్పుకోలేదు. ప్రయివేయు నర్సింగ్ హొమ్ లకు ఒక్కసారి ఏ విధంగానయినా, చెడ్డపేరు వచ్చిందంటే, పేషంట్స్ మళ్ళీ నర్సింగ్ హొమ్ వంక చూడరు- ఎందుకంటే, సాధారణంగా బాగా డబ్బున్న వాళ్ళే అలాంటి నర్సింగ్ హొమ్స్ కి రాగలరు.

 Previous Page Next Page