పూర్తిగా ఒక ఏడాది జీవితంలో ఎన్నడూ లేనంత యిబ్బంది పడ్డాడు డబ్బుకోసం. అప్పుడు ఆ యిబ్బందులేమీ లెక్కపెట్టే పరిస్థితిలో లేడు; కానీ యిప్పుడు తలచుకుంటే తల గిర్రున తిరుగుతోంది.
తనింకా ఎందుకున్నాడు ఈ యింట్లో? ఏ సౌకర్యమూ సుఖమూ లేని ఈ గదిలో ఎందుకున్నాడు నిజంగా? నెల నెలా శివశాస్త్రి అద్దెకోసం ఎదురుచూస్తోన్నప్పుడు తను వెళ్ళి, నేను మీ కేమీ యివ్వనక్కర్లేదు, మీరే నాకు నాలుగువేలు బాకీ అని ఎందుకు చెప్పేయ లేదూ? ఆయనతో తనకేమీ సంబంధం లేదు కనుక చెప్పలేదు. అసలు సంబంధం వున్న మనిషే ముఖం తప్పించి తిరుగుతోంది.
మాధవి తనతో వచ్చేస్తే ఏ చిక్కూ వుండదు...
మధు లేచి కూర్చున్నాడు. తలుపు చిన్న చప్పుడైంది.
'ఎవరు?' అంటూ వెళ్ళి తెరిచాడు.
మాధవి లోపలికి వచ్చింది.
'ఏమిటి మాధవీ అర్ధరాత్రి వేళ? ఏమైంది?' అన్నాడతను.
ఎన్నోచెప్పి, ఏదో సలహా అడగాలని వచ్చింది మాధవి. ఎప్పటికీ నిద్రపట్టక, దారితోచక చివరికి తెగించి లేచివచ్చి తలుపు తట్టింది. కానీ అతను ఏమైందని అడగగానే చటుక్కున చెప్పలేక పోయింది. కొంచెం ఆగి, 'మీ గదిలో లైటు వెలుగుతోందని చూసి వచ్చాను. ఏం చేస్తున్నారు?' అన్నది.
'చదువుకుంటున్నాను. రా కూర్చో' అని కుర్చీలోని బట్టలు తీసి అవతల పడేశాడు. ఆమె కూర్చున్న కాస్సేపటికి 'ఏమైంది? తేలిందా - మనసంగతి- మన పెళ్ళి సంగతి?' అన్నాడు. అన్నిటి కంటే పైగా వున్న ప్రశ్న, ఆశ, జీవితం లోని ఏకైన కోరిక బయటి కొచ్చింది మధుకి.
మాధవి తలవంచుకుంది. 'అది మాట్లాడాలనే వచ్చాను.' అన్నది ఏవిటి చెప్పాలతనికి, ఎల్లా చెప్పాలి? కోపగించుకుంటాడేమో, బాధపడతాడేమో, ఆవేశంతో ఏమైపోతాడు-కానీ తప్పదు.
'మా శ్యామలక్కయ్యే చచ్చిపోయినప్పుడు పిల్లని నాకు వప్పగించింది.'
'ఔను, చెప్పావు, రాజారావు యిప్పుడు తీసుకెళ్ల నంటున్నాడా? నిన్నే చూడమంటున్నాడా?' ఇతను ఎప్పుడూ యింతే, బావ పేరువస్తే మాటలు అనేస్తాడు.
'అనలేదు. కానీ, నాకు దిక్కు మీ రొక్కరేనని సలహా అడుగుతున్నాను, చెప్పండి ఏం చేయమంటారో!'
'ఏ విషయం మాధవీ! పిల్లని చూడటం విషయమా? ఎల్లా చూస్తావు నువ్వు! ఐనా నీకు ఏమిటి సంబంధం?'
'ప్రాణం పోయేముందు నాతోనే చెప్పింది కదండీ?'
'అదేమిటి -ఆవేశంలో వున్న మనిషి ఏదో ఒకటి అంటుంది.' అన్నాడతను.
ఇల్లా అంటోంటే అతని భావం అర్ధంకాలేదు మాధవికి.
తను చేసిన వాగ్ధానానికి ఏమీ విలువ లేదని అంటారేమిటి? అల్లాగైతే దేనికీ అర్ధంలేదు. కానీ - ఏవో ప్రశ్నలతో, అడ్డు మాటలతో మధునే దూరం చేసుకోరాదు తను.
'నిన్న మా పెద్ధనాన్న బావ దగ్గరికి వెళ్ళి వచ్చారు. అతను ఒకమాట అడిగాడుట. పిల్లని తీసుకు వెళ్ళాలంటే పెళ్ళి చేసుకోవాలన్నాడుట.' అన్నది తలవంచుకుని.
'లక్షణంగా తనెవరి నెత్తినో చేయి పెట్టి' మరో నాలుగువేలు గుంజి పెళ్ళి చేసుకుని, పిల్లని తీసుకు వెళ్ళమని చెప్పలేదా శివశాస్త్రిగారు? అల్లాంటి మాటలు ఆయన బాగానే చెబుతాడే?'
ఆమె తల యెత్తింది. 'ఎందుకండీ అంత కటువుగా మాట్లాడుతారు? అసలు అవన్నీ కాదు నాకు వచ్చిన పెద్ద సమస్య-బావకి మనస్సులో వేరే ఉదేశ్యం వుంది -నన్ను గురించి.' అని మళ్ళీ తల వంచేసింది ఆమె.
మధు కొంతసేపు నిశ్చలంగా చూశాడు. 'అంటే అతన్ని పెళ్ళిచేసుకోమని బలవంతపెట్టడం సంగతే!" అన్నాడు తీవ్రంగా.
'లేదు బలవంత పెట్టడం కాదు. మీరు కూడా నాతో యిలా మాట్లాడితే నేను ఏమైపోవాలి?' అని వచ్చే ఏడుపుని ఆపుకుంది మాధవి.
'ఇంకెల్లా మాట్లాడను మాధవీ? నా పరిస్థితి నీకు కొంచెమైనా అర్ధమౌతోందా? నువ్వు ముఖం తప్పించి తిరుగుతున్నావు. నీతో వంటరిగా మాట్లాడాలంటే అవకాశం దొరకదు. పిలిచినా నువ్వు రావేమోనని ఒక అర్ధం లేని భయం నాకు. మా నాన్న చూడు ఎల్లా వ్రాశారో!' బల్ల మీదున్న వుత్తరం పట్టుకొచ్చి పడేశాడు మాధవి ముందు. ఆమెవ్రేళ్ళతో దాన్ని పట్టుకొని చూడసాగింది.
'ఇంత సంపాదించుకుంటూ యింకా ఆ గతేమిటి నీకు, ఏమిటంత ప్రత్యేకత' అని స్నేహితులు ప్రశ్నలు.' అన్నాడు అదే వూపులో ఏం, ఈ గదికి ఏమి వచ్చింది? వాళ్ళు అంటే మాత్రం మీరు జవాబు చెప్పలేరా, అని అడిగాలని ఆమెకి కానీ వేరొక దారిన మళ్ళింది అతని ధోరణి.
'రాజారావు నిన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడని నాకు తెలిసింది గదా! ఇప్పుడు భార్యపోయాక, ఆమె చెల్లెలిని పెళ్ళాడ్డం శాస్త్రీయం కనక అల్లా అనడం చాలా సబబుగా వుంది. అందులోనూ బ్రహ్మమూర్తులైన శ్రీ శివ శాస్తుర్లవారికి యిల్లాంటి ఆలోచనలు తక్షణం నచ్చుతాయి కనుక మరీ భాగుంది. ఇంక నా సలహా నీకు ఏ విషయంలో కావాలి మాధవీ?' పట్టలేకుండా అనేస్తున్నాడు అతను మాటలు. ఒకసారి దొరికింది కదా అవకాశం అన్నట్లు అనేస్తున్నాడు.
'నన్ను ఏమని సలహా యిమ్మంటావు? రాజారావు నాకంటే డబ్బున్న వాడు, నాకంటే అందమైన వాడు. చచ్చిపోయిన మీ అక్క కూతురికి తండ్రి. నువ్వు పెళ్ళి చేసుకో అని చెబితే నీకు నచ్చుతుందా? అదేనా నీకు కావలసిన సలహా?'
మాధవికి ఏడుపు వచ్చేసింది. 'అది కాదు అది కాదు' అని అడ్డు పెట్టబోతూ ఏడుస్తోంది.
కొంచెం సేపయాక అతను, 'వెళ్ళు మాధవీ! అర్ధరాత్రయింది. నువ్విట్లా వుండగా మీ వాళ్ళు వచ్చి చూస్తే పెద్ద గొడవ ఔతుంది. వెళ్ళి పడుకో' అని అతను ఆమె చేతిలోంచి ఉత్తరం లాక్కుని బల్లమీద పడేశాడు.
ఆమె తమాయించుకుని కళ్ళు తుడుచుకుంది.
'ఎందుకంత అన్యాయంగా మాట్లాడుతారు? నాకు ప్రపంచమంతటిలోకి మీరు కావలసిన వారు అనుకోబట్టి వచ్చాను మీ దగ్గరికి నన్ను ఎందుకిట్లా దూరం చేస్తారు? మాటలతో పొడిచి చంపుతారెందుకు? బావ అందమైనవాడు, డబ్బున్న వాడని నేను అన్నానా?' అన్నది.
'నువ్వు అనక్కర్లేదు - అది నిజం. నాతో నీకున్నది అతి స్వల్ప పరిచయం. అక్షరాలా అది ఋణానుబంధం. అది తీరింది ఇంకేమిటి నాతో పని? నేనూ పొరబడ్డాను. మునిగిపోయిందే ముంది? నాకు యివ్వాల్సిన మరో రెండువేల చిల్లర - అదీ తీర్చేస్తావు వడ్డీతో, సంపాయించుకుంటున్న దానివి' అన్నాడతను.
'అదే అనవద్దన్నాను. డబ్బు ప్రసక్తి తీసుకురాకండి మన విషయంలో.'
'సరే ఆ రెండువేల సంగతి కూడా మర్చిపొమ్మంటావా? అల్లాగే, మా నాన్న ఆడిన నిష్టూరం ఎల్లాగూ ఆడారు. యింక రెండువేలే కదా? నాలుగు నెలల జీతం నాది కాదనుకుంటే అదీ పూడుతుంది' అన్నాడు.
మాధవి అల్లాగే తలవంచుకుని కూర్చుంది. అతనూ అల్లాగే కూర్చున్నాడు దీపం వంక చూస్తూ. ఇంత అర్ధరాత్రి నిశ్శబ్దంలొ, ప్రేమాను బంధితులైన వారి మనస్సుల్లో రాగం ఉదయించడం లేదు. కళ్ళలోతు ల్లోకి చూస్తే ఎదలో కోరికలు మొగ్గ దొడగడం లేదు. జరిగినదంతా నిజమా అన్న ఆశ్చర్యం, నిజమే కదా అన్న నిరాశ, దీపాల దారులు నడిచి వచ్చేశామన్న వెలితీ వున్నాయి అతని చూపులో ఎందుకిలా మాట్లాడుతాడు, పార్కులో తన చేయి పట్టుకుని పాణి గ్రహణం చేసిన యితను ఎందుకిల్లా మాట్లాడుతాడు అన్నబాద ఆమె మనస్సులో మండుతోంది.
'వెళ్ళు మాధవీ!' అన్నాడతను.
'వెళ్ళిపోనా? ఇంకేమీ లేదా?' అన్నదామె ఎంతో మెల్లిగా.
'ఇంకేముంది? ఆ పిల్లని చూడాలన్నావు, ఎల్లా చూస్తావు వంటరి దానివి? రాజారావుగారింట్లో వుండి చూడటం మంచిది. అల్లాగే చూడు.' అన్నాడతను. లేచి నిలబడ్డాడు. కదల కుండా కూర్చున్న ఆమెవంక చూశాడు. దీపం వెలుగు తలమీద పడి రేగిన ముంగురులు.....మెరుస్తున్నాయి. దీనంగా వాలిన ఆమె కనురెప్పలు తేనెరంగుగా కనిపిస్తున్నాయి. ముడుచుకొని వున్న ఆమె చేతులు అనిశ్చయంగా కదులుతున్నాయి. నా కింత దగ్గరై పోయిన మాధవిని అంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావు అని బుజాలు పట్టి కుదిపి అడగాలనిపిస్తుంది.
అతను వెనక్కి తిరిగి మంచం మీదున్న కాగితాలూ, బట్టలూ అన్నీతీసి క్రింద పడేశాడు. దుప్పటి దులిపి వేసుకున్నాడు. మాధవి లేచినిలబడి తలుపు వరకు వెళ్ళింది. వెనక్కి తిరిగి చూసింది. అతను యింకా ఏవో సర్దుతున్నాడు. బయటికి వెళ్ళి పోయి తలుపు దగ్గరగా లాగింది.
రెండు నిముషాలాగి అతను వచ్చి తలుపు తీసి బయటికి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. గడియ పెట్టి వచ్చి పడుకున్నాడు. దీపంవంకే చూస్తున్న అతని కళ్ళల్లో విపరీతమైన అలసట గూడుకట్టుకొంది.