Previous Page Next Page 
అపరాజిత పేజి 8

                                 


                             అపరాజిత
                                               రెండవభాగం
                                                                                       --తురగాజానకీరాణి    

                                       6

    'శకుంతల ఏడుస్తోంది, పాలుపట్టాలి. కొంచెం అన్నం వార్చేసి వస్తావా?' అన్నది పరమేశ్వరి మాధవితో.
    ఇంకా కరెక్టు చేయవలసిన పేపర్లు న్నాయి. తెల్లవారి యిచ్చేయాలి. బొత్తిగా టైము ఉండటం లేదు. జడవేసుకోడానికి, అన్నం తినడానికికూడా టైము వేస్టవుతుందని భయం వేస్తోంది. పోనీ సెలవు పెడదామన్నా వీలులేదు. శ్యామలకి జబ్బు చేసినప్పుడు, ఆమె పోయినప్పుడు వున్న లీవు అంతా వాడేసుకుంది. మాధవి ప్రక్కకి తిరిగి చూసింది, మంచంమీద కాళ్ళు చాపుకుని కూర్చుని రాధ పత్రిక చదువుకుంటోంది. నెలరోజులే వున్నాయి సెప్టెంబరు పరీక్షలు. పుస్తకాల కోసమని ఫ్రెండు యింటికి వెళ్ళి, వాటితోపాటు పత్రికలూ తెచ్చుకుని చదువుకుంటోంది.
    రిజిష్టరు మూసివేసి లేచింది మాధవి. వెళ్ళి అన్నం వార్చింది, పెద్దనాన్న వుంటే తనీపని చేయడానికి వీలుకాదు. ఆయనకి మడి. రాజరావు వాళ్ళవూరికి వెళ్ళాడాయన. పెద్దమ్మకి రాత్రిపూట అంత పట్టింపులేదు.
    తిరిగివచ్చి కూర్చున్నాక రాధవంక చూసింది. ఇదివరకు దానివైఖరి అంత కష్టంగా అనిపించేది కాదుకానీ ఈమధ్య చాలా కష్టమనిపిస్తోంది మాధవికి. 'రాధా పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. చదువుకోరాదుటే!' అన్నది చివరికి పట్టలేక.
    'ఊ!' అని పలికిందేగానీ ఆమె కదల లేదు. ఆ మంచంమీదే ఒకమూల శకుంతల నోట్లో వ్రేళ్ళు పెట్టుకుని పడుకునుంది. దీపాన్ని చూస్తో కాళ్ళు ఎగరేస్తోంది. నొక్కుల జుట్టు, నల్లని కళ్ళు మాత్రం శ్యామల పోలిక. రంగు, ముక్కు మాత్రం రాజరావుది. అందుకే అంత చక్కదనాలు చిమ్ముతుంది.
    మళ్ళీ రికార్డు తెరిచి కూర్చోకుండా లేచివెళ్ళి, శకుంతల మీదకు వంగి పలుకరిస్తో, కబుర్లు చెప్పడం మొదలెట్టింది మాధవి, ఏమిటో లోతుగా వుంటుంది పాపాయి చూపు అవతలివారి మనస్సులో ఏమి ఆలోచనలు మెదులుతున్నాయోనన్న సంశయాలు, జవాబులు ఏమీ చెప్పాలన్న భయాలు లేక నవ్వేకళ్ళు అవి.
    పెద్దమ్మ పాలుపట్టి, సీసా ప్రక్కనే పడేసింది. 'అన్నీ త్రాగలేదే, ఏమొచ్చిందో! ఒక్క నిముషమాగి పట్టిచూడు.' అన్నది మాధవితో. ఆమె వెళ్ళి వంటింట్లో మజ్జిగ చిలుకుతోంది. పాపాయిని పలుకరిస్తూ కూర్చుంది మాధవి. రాధ ఎప్పటికీ విడిచిపెట్టదు ఆ కధల పత్రికని. క్రిందటి వారం ఒకసారి తను చదువుకోమని హెచ్చరిస్తే 'పరీక్ష ఫీజులన్నీ తనే కడుతున్నా కదా, దండగైపోతాయని సాధిస్తుంది.' అన్నది పెద్దమ్మతో. మాధవికి మనస్సు కలుక్కుమంది. డబ్బిచ్చా కదా అని మాటలు అంటుంది అని గబుక్కున నోరు జారుతుంది రాధ. ఎంత తేలిగ్గా అపార్ధాలు చేసుకుంటారు మనుష్యులు! దానిమంచి దానికే అర్ధం కావడం లేదు.
    ఏ విధంగానూ తనని అపార్ధం చేసికోని వాడు మధు ఒక్కడే కనబడుతున్నాడు. శ్యామల పోవడంతో సంసారమంతా అల్లకల్లోలమైంది. అందరూ కృంగి పోయారు. అతనూ, తనూ ఏమీ మాట్లాడుకొనే లేదు. కథంతా మొదటికి వచ్చినట్లైంది యిద్దరికీ. కళ్ళెత్తి చూసుకోలేదు ఒకరినొకరు ఎన్నాళ్ళో. శ్యామలపోయి రెండునెలలు దాటింది. పాపకి మూడోనెల వచ్చింది. భూమిమీద పడుతూనే తల్లిని పొట్టన బెట్టుకున్న ఆజీవి అందరికీ సమస్య అయింది. చంటి పిల్లలని ఎత్తుకుని ఎన్నేళ్ళయిందో పరమేశ్వరికి. పాలఖర్చుకి కలవరపడుతున్నాడు శివశాస్త్రి - తను భరించేది ఏమంత లేకపోయినా. రాధకి ఒక్కోసారి విసుగు దాని ఏడుపు వింటే. అక్క శ్యామలని, అర్ధాయుషుతో వెళ్ళిపోయిన ఆమె అభాగ్య జీవితాన్ని అనుక్షణం మాధవికి గుర్తు తెస్తుంటుంది శకుంతల.

                                  


    రాజారావు పిల్లని తీసుకు వెడతానని అనలేదు, 'మీరు చూస్తోండండి'అనలేదు. ఏదో వస్తువుని మర్చిపోయి వదిలినట్లు విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళాక కూడా ఏమీ కబురులేదు, జాబులేదు.
    ఆ రోజు తనుకాలేజీ నుంచి వచ్చే సరికి అతను సామాను రిక్షాలో పెట్టుకుంటున్నాడు. గుండెలో వున్న బరువు ముఖంలో, కళ్ళల్లో స్పష్టంగా కనబడుతోంది. మాధవి లోపలికి వచ్చి సామానుకేసి చూస్తూ నిలబడిందే కానీ ఏమీ అనలేదు. అతను అరుగు మీద కూర్చున్న మామగారితో మాత్రం చెప్పి వెళ్ళిపోయాడు.
    బాగా చీకటి పడ్డాక వీధిలోకి చూస్తూ మాధవి నిలబడి వున్నప్పుడు, మధు వచ్చి తన గది తాళం తీసుకున్నాడు.    
    'నిలబడ్డావేం మాధవీ!' అన్నాడు.    
    'ఏమీలేదు, వూరికేనే. మీకింత ఆలస్యం అయిందేం?'
    'ఆలస్యం అయింది'. అన్నాడతను జవాబుగా.
    తనకి తెలుసు అతను ఓవర్ టైము చేస్తున్నాడు డబ్బుకోసమని. ఆ చీకట్లో పచ్చి దుమ్ముకొట్టుకు పోయిన గదిలో ఏం చేస్తాడతను? తను కూడా లోపలికి వెళ్ళి దీపం వేసి అవీ ఇవీ సర్దుదామని మనస్సులో వచ్చిన కోరికని అణిచేసుకుని వెనక్కి తిరిగి లోపలికి వచ్చేసింది మాధవి. 'మీ బావగారు వెళ్ళారా? పిల్లని తీసుకెళ్లలేదేం?' అని ఆనాడు అడగలేదు. గ్రహించుకున్నాడేమో మరి! మాధవి మీద పడిన భారం ఎంతదో అర్ధం చేసికున్నాడేమోమారి ఊరుకున్నాడు.

                               *    *    *

    శివశాస్త్రి తిరిగి వచ్చాడు. అక్కడ ఏమి జరిగిందో, రాజారావు ఏమన్నాడో గబగబా చెప్పే స్వభావం కాదాయనది. కోపమొస్తే మాట మిగులుతాడు కానీ మిగతా సమయాల్లో ముభావమే. ఆయన వచ్చిన రోజు రాత్రి పెద్దమ్మ వంటింట్లోకి పిలిచింది మాధవిని పనుంది రమ్మని. కుంపటి మీద పాప పాల కోసం నీళ్ళు పెట్టి విసురుతో ఆమె కూర్చున్న తీరు చూడగానే మాధవికి తట్టింది ఆమె తనతో ఏదో సీరియస్ గా చెబుతుందని. పెద్ధనాన్న యింట్లో లేడు.
    'మాధవీ, మీ బావ ఏమన్నాడో విన్నావా? పిల్లని తను తీసుకెళ్ళడుట- అల్లా కూర్చో పీట లాక్కుని. చాలా వున్నాయి చెప్పాల్సినవి.' అన్నది పరమేశ్వరి.
    'ఈ పసిగుడ్డు ఎప్పటికీ పెరిగి పెద్ద దవుతుంది, దీని ఖర్చంతా ఎవరు భరించనని మీ పెద్దనాన్న బెంగ. తల్లిలేని పిల్ల అదొక్కత్తీ బరువాండీ అంటే ఆయన వినిపించుకోక, అల్లున్ని అడగటానికి వెళ్ళారు ఏం చేయమంటావు పిల్లనని.'
    'ఏమన్నాడుట?' మాధవి తలవంచుకుని అడిగింది.
    'పిల్లని ఎవరు చూస్తారిక్కడ, ఎవరూ ఆడదిక్కు లేదు అన్నాడుట.'
    'నిజమే.' అన్నది మాధవి. పరమేశ్వరి ఆమె వంక ఒక్కక్షణం చూసి, 'ఏమిటి నిజం? మతివుందా నీకు?' అన్నది.
    'ఏం?' అని తెల్లబోయి తలెత్తి చూసింది మాధవి.
    'పిల్లని చూడ్డానికి నిన్ను పెళ్ళి చేసుకుంటాడుట.'
    ఎత్తిన తలని అల్లాగే వుంచింది మాధవి. ఒక్క క్షణం మనస్సులోని సుడులనన్నిటినీ ఏకం చేసి పెద్దమ్మని చూసింది. మరుక్షణం తలదించుకుంది.
    పరమేశ్వరి యింక ఏమీ అనక కుంపటి విసురుతూ కూర్చుంది. ఆమె చెప్పిన విషయం ముందు మాధవికి క్రొత్తగా వినబడినా ఎప్పుడో ఆమె మనస్సులో అనుమానంగా, భయంగా మెదిలినదే. కానీ యిప్పుడు బావ యిల్లా అడగడంతో సమస్యగా నెత్తిమీద పడింది. తను ఊరుకుని లాభం లేదు.
    'శ్యామల పెళ్ళికి దబ్బు ఎవరిచ్చారని అడగలేదా బావ?' అన్నది మాధవి.
    'అడగడం దేనికి? అతనికి తెలుసు. అసలు యిక్కన్నుంచి వెళ్ళేటప్పుడే మీ పెద్ధనాన్న ఈ మాట అనుకుని వెళ్ళారు. తల్లి, తండ్రిలేని పిల్ల మాధవి, దానిని అన్యాయం చేయడానికి తలపెట్టొద్దని నేను మొత్తుకున్నాను. వెళ్ళి అడిగినట్లున్నారు మాధవిని చేసుకుంటావా అని. సరే నన్నాడు అతను. అల్లా చెప్పక, అతనే అడిగాడని నా దగ్గర అబద్దాలాడుతున్నారు.' అక్కసుగా అన్నది పరమేశ్వరి ఈ మాటలు.
    'నీ కిష్టం లేదా పెద్దమ్మా?' అన్నది మాధవి తలయెత్తి.
    పరమేశ్వరి విసనకర్ర క్రిందపడేసి మాధవిమీద చేయి వేసింది. ఆమెకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. 'నాకు తెలియదా మాధవీ అన్ని సంగతులూ? నీకు నాలుగువేల రూపాయిలు ఎల్లా వచ్చాయో అందరికీ తెలుసు. అది అంత భారం ఎందుకు మీద వేసుకోవాలండీ అని దెబ్బ లాడితే, చదువుకుని సంపాయిస్తోందిగా, అన్నారు పెద్దనాన్న. కష్టమో, సుఖమో అప్పు తీరుస్తున్నాకూడా ఆయనకేమైనా పట్టిందనుకున్నావా?' అని కొంచెం ఆగి- 'తీరిపోయిందా అంతా?' అన్నది చివరి ప్రశ్నగా.
    'ఆ, పూర్తయింది. ఇంక నాకు ఏ బాధ్యతలూ లేవూ-' అని వెంటనే 'ఉన్నాయి, యింకా తీర్చాలి' అని తల దించుకుని గుండె బరువైపోగా, గొంతు పూడుకుపోయి, ఉక్కిరి బిక్కిరైంది.
    'ఎంత కష్టపడుతున్నావు తల్లీ? నేనుండీ ఏమీ చేయలేను' అని పరమేశ్వరి వాపోయింది.
    వంటింట్లో మాటలు వినబడి లోపలికి వచ్చింది రాధ. దిగాలుపడి కూర్చున్న యిద్ధరినీ చూసి, వెనక్కి తిరిగి వెళ్ళిముందు గదిలో కూర్చుంది. ఉయ్యాల్లో పాపాయి కదిలి క్యారుమనేసరికి పైతల్లి, కూతురు యిద్దరు కదిలారు.
    'మాధవిని ఆలోచించుకోనివ్వండి అని చెప్పాను మీ పెద్ధనాన్నతో' అన్నది పరమేశ్వరి. ఇంకా నేను ఆలోచించి వప్పు కుంటాననే వీళ్ళ ఉద్దేశ్యమా అని మాధవి మనస్సులోనే బాధ పడింది.
    
                                    *    *    *

    రాత్రి పన్నెండు బావయింది. చదివిన పుస్తకం మడిచి ప్రక్కకి తిరిగి పడుకున్నాడు మధు. వెలుగుతున్న దీపం వంక చూశాడు. చదువుతున్నంత సేపూ ఆ పుస్తకంలోని కధలో లీనమై పోయిన మనస్సుకి సమస్యలు లేవు. అది మూసేయ గానే తనని కలవరపెట్టే ఆలోచనలు ఝామ్మని ముసురుకొంటాయి.
    నాన్నగారికి ఎల్లా తెలిసింది నాలుగు వేలు తను ఆఫీసులో అప్పు తీసుకున్నట్లు? ఎంత నిష్టూరంగా, కోపంగా వ్రాశారో వుత్తరం? అసలు వద్దామనుకున్నారుట గానీ, వీల్లేక రాలేదని వ్రాశారు. వస్తే? తనున్నయీ గదీ, వాలకం చూసి అంతా గ్రహించేవారు.

 Previous Page Next Page