7
వారంరోజులు గడిచాక ఒకరోజు ఉదయం వున్నట్లుండి రాజారావు దిగాడు. అతని రిక్షా వచ్చి ఆగేసరికి వాకిట్లో కూరలు కొంటున్న మాధవి ప్రక్కకి జరిగి నుంచుంది. ఆమెవంక చూసి, సందేహమైన పలుకరింపుగా చిన్న మందహాసం చేశాడు.
బెడ్డింగు పుచ్చుకుని అతను లోపలికి వెళ్ళేసరికి సావిట్లో ఎవరూ లేరు. శివ శాస్త్రి నూతి దగ్గర స్నానం చేస్తున్నాడు. రాధ యింకా నిద్ర లేవలేదు. పరమేశ్వరి వంటింటి వసారాలో కూర్చుని స్టవ్ లో వత్తులు ఎక్కిస్తోంది. అక్కడే చాపమీద శకుంతల బోర్లపడడానికి సతమతమౌతోంది. చేటలో తోటకూర పెట్టుకుని గబగబ లోపలికి వెళ్ళి మాధవి చెప్పింది ఆమెతో. ఆమె కంగారుపడి ఆ స్టవ్ అల్లా వదిలేసింది. 'ముఖం కడుక్కున్నాడేమో అడుగు, కాఫీ యిద్ధువు గాని.' అన్నది.
మాధవి యిది మొదటిసారి బావకి ఎదురుగా ఒక్కత్తే నిలబడి మాట్లాడ వలసిరావడం. ఇదివరకు పరిస్థితి వేరు? సావిట్లోకి వచ్చి,' 'కూర్చోండి, ముఖం కడుక్కున్నారా? కాఫీ తెస్తాను.' అన్నది.
'అన్నీ అయినాయి స్టేషనులో.' అని అతను కుర్చీలో కూర్చున్నాడు. పాపాయి ఏడిచింది వసారాలో. ఆ మిషగా ఆమె అవతలికి వెళ్ళింది. పాపాయి కాలు చాపకి వున్న పూరి కొసలోకి చిక్కుకుంది. అది తీసి దాన్ని ఎత్తుకుంది. అల్లా ఎత్తుకుని యివతలికి వస్తే-తనూ, పాపా కలిసి వున్న ఆ దృశ్యం అతని కళ్ళకి ఎలా కనబడుతుందోనని ఒక సంకోచంతో వంటింట్లోకి వెళ్ళింది. 'కొంచెం కాఫీ వెచ్చబెట్టు పెద్దమ్మా!' అని చెప్పింది. కాఫీ వేడి అయాక పాపాయిని చాపమీద పడుకోబెట్టీ, కాఫీ తీసుకెళ్ళింది.
అతను అక్కడే నేలమీద బెడ్డింగు పరిచి బట్టలు, షేవింగు సెట్టు బయట పెట్టుకుంటున్నాడు. ఆమె రాధ పడుకున్న గది లోకి వెళ్ళింది.
అప్పటికి శివశాస్త్రి స్నానం చేసి అంగ వస్త్రం కట్టుకుని వచ్చాడు. 'ఇదే నా రావడం? అంతా కులాసాయేనా?' అని నవ్వు ముఖంతో ప్రశ్నలు వేశాడు. 'ఏదీ మాధవీ! పాపాయిని చూపించారా బావకి?' అని కేకేశాడు. అప్పటికే ప్రక్కగదిలో రాధని నిద్ర లేపుతోన్న మాధవి ఏమీ పలుకకుండా ఉండిపోయింది.
కొంచెం ఆగి, 'ఏమే! పాపాయిని తీసుకు రా!' అని వంటింటి వేపు కేక వేశాడు. రాజారావు కాఫీ గ్లాసు క్రింద పెట్టి 'ఏదీ ఇక్కడే ఉందిగా?' అంటూ ఆ వసారాలోకి వెళ్ళి పాపాయిని ఎత్తుకున్నాడు.
మాధవి వంటింట్లోనే ఉండిపోయింది. పెరట్లో పాదుకున్న పది దొండకాయలు తెచ్చి వేయించడం కోసం యిచ్చింది. మజ్జిగ చిలికి, కాఫీ గ్లాసులు కడిగి, వంటిల్లంతా తుడిచి అన్నిపనులు చేస్తూ అక్కడే తచ్చాడింది. రాధ నిద్రలేచి యివతలికి వచ్చాక, ఆ గది కిటికీ తలుపులు తెరిచి, పక్క ఎత్తివేసి శుభ్రం చేసింది. తన బట్టల పెట్టె తెచ్చి సావిట్లో గూట్లో పడేసింది. అతను సామాను అక్కడ పెట్టుకోవడం కోసం ఏర్పాటంతా చేసింది.
రాధ ముఖం కడుక్కుని వచ్చి రాజారావుతో కబుర్లు చెబుతూ కూర్చున్నది. ఆమె పరీక్షలింకా పదిహేను రోజులే వున్నాయి. అందువల్ల యిద్దరూ పరీక్ష లని గురించే మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
మాధవి తొమ్మిదింటికి వెళ్ళి 'మీరు భోజనానికి వస్తారా?' అనడిగింది అతన్ని. అతను గడియారం చూసుకుని 'అప్పుడే భోజనం ఏమిటి?' అన్నాడు. కొంచెం ఆగి చిన్న నవ్వుతో 'నీకు టైమైతే నువ్వు తినేయి' అన్నాడు.
కాలేజీ పుణ్యమా అని ఆమె త్వరగా అన్ని పనులూ పూర్తి చేసుకుని తొమ్మిదిన్నర కాకుండా బయటికి వచ్చేసింది. గుమ్మం యివతల కాలు పెడుతూనే, గదికి తాళం వేసి బయలుదేరుతున్న మధుని చూసింది. అతన్ని చూడగానే బుగ్గలు ఎర్రబారినాయి-కానీ మందహాసం బదులు చెదరే చూపులు ముఖాన్ని ఆవరించాయి.
'ఆఫీసుకేనా!' అన్నది. ఔను ఇటు వస్తారా, వెడదాం?' అన్నాడు తను.
ఇద్దరూ కలిసి నడిచి వెళ్ళబోతూ ఒకసారి వెనక్కి తిరిగి యింటి తలుపు వేపు చూసింది, ఎవరేనా నిలబడి చూస్తున్నారేమోనని.
'రాజారావు వచ్చాడు కాదూ?' అన్నాడు మధు పదిగజాలు వెళ్ళగానే.
'ఊ!' అన్నదామె.
'ఎందుకని వచ్చాడో, చెప్పాడా?' అన్నాడు.
'లేదు పొద్దున్నేగా వచ్చారు?' అన్నదామె. కొంచెంసేపు మౌనంగా నడిచాక 'నీకు దూరమౌతుంది, బస్సు ఎక్కుతావా యిక్కడ?' అన్నాడు. సరేనని తలూపింది.
ఇద్దరూ నిలబడి వచ్చేపోయే వాళ్ళని చూశారు. 'సాయంత్రం ఆరింటికి పార్కు దగ్గరికి వస్తావా?' అన్నాడు.
ఆమె తలూపింది. బస్సు వచ్చింది ఆమె ఎక్కబోతుండగా, 'రావడానికి వీలవుతుందా?' అన్నాడు. 'వస్తా' అని ఎక్కింది ఆమె.
-మధ్యాహ్నం రెండుగంటల నుంచి మాధవికి బాగా తలనొప్పి వచ్చింది. మాత్ర వేసుకుని కాఫీ త్రాగిన తర్వాత కొంచెం తగ్గినట్లని పించింది కానీ యింకా తల దిమ్ముగా వుంది. ఇంటికి వెడితే నయమనుకుంది-కానీ వెడితే రాజారావు యింట్లో వుంటాడు. ఏమి సమస్యలు సిద్ధం చేసి వుంచారో అంతా చేరి తనకోసం వాటిల్లోంచి బయటపడి పార్కుకి చేరాయి. పోనీ యింటికి వెళ్ళకుండా సరాసరి పార్కుకి వెళ్ళటం నయమా అనుకుంది. కానీ మరీ చీకటి పడితే యింట్లో ఏమైనా అనుకోవచ్చు.
నాలుగువరకు లేబొరేటరీలో అటూ యిటూ తిరిగింది. ఇంకా రెండుగంటలు గడవడ మెల్లాగు? ఐదుకి మరో పది నిలుషాలుందనగా బయటకి వచ్చి చూసింది. బాగా మబ్బుపట్టి వుంది ఆకాశమంతా. వాన వచ్చేట్లుంది. లేబొరేటరీ తాళాలు వేస్తున్నారని ఫ్యూను వచ్చి చెప్పాడు. ఆమె పుస్తకాలు, టిఫిన్ డబ్బా తీసుకుని బయటికి వచ్చి వరండాలో నిలబడింది.
ఇప్పుడే బయలుదేరి నడిచి వెళ్ళినా పావుగంటమించి పట్టదు పార్కు చేరడానికి. ఐదు కాగానే చేరి ఏంచేయాలి అక్కడ? మెల్లిగా బయటికి వచ్చి బస్సు స్టాండు దగ్గర నిలబడింది. ఇంటికి వెళ్ళే బస్సు వచ్చి ఆగింది. పోనీ యింటికి వెళ్ళి ఏదో ఒకటి రెండు పనులు చేసి, ఏదో పనుందని చెప్పి బయలుదేరి వెడితే నయం అనుకుంది. చటుక్కున బస్సు ఎక్కింది. ఇంటికి చేరేసరికి సన్నచినుకులు ప్రారంభమైనాయి.
పుస్తకాలు పడేసి, పరమేశ్వరి కోసం యిల్లంతా తిరిగింది. పెరట్లో నూతి దగ్గర చీరె పిండుకుంటోంది ఆమె.
'కూర ఏమీ లేదేమో? ఏం చేద్దాం రాత్రికి?' అన్నది మాధవి.
'తెస్తారేమో మీ పెదనాన్న. మధ్యాహ్నమనగా వెళ్ళారు ఎక్కడికో మామా, అల్లుడూ.' అన్నదామె. పెద్ధనాన్నకి బావతో స్నేహం శ్యామల పోయాక గానీ ప్రారంభం కాలేదు.
బావ ఎందుకు వచ్చాడని అడుగుదామని నాలిక చివరివరకు వచ్చింది. అంత చెప్పే విషయం వుంటే పెద్దమ్మ తనకి కాక మరెవరికి చెబుతుంది? కాస్సేపు అక్కడే నిలబడి 'రాధ ఎక్కడికి వెళ్ళింది?' అన్నది.
'పుస్తకాలకోసం వెళ్ళింది ఎక్కడికో- బియ్యం గాలిస్తావా, వస్తున్నాను.' అన్నది పరమేశ్వరి. ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని వంటింట్లోకి వెళ్ళింది మాధవి!
ఆపని పూర్తయేటప్పటికి సావిట్లో గడియారం అరగంట కొట్టింది. చారు కోసం అన్నీ ఒక గిన్నెలో వేసి, సిద్ధంచేసి గాలించిన బియ్యం అక్కడ పెట్టి, గబ గబా కుంపటి అంటించిందామె.
'నువ్వు వస్తున్నావా పెద్దమ్మా? నేను ఒక ఫ్రెండు యింటికి వెళ్ళాలి' అని కేకేసింది.
పరమేశ్వరి లోపలికి వస్తూ 'ఎవరింటికి?' అనడిగింది. మాధవి అది విననట్లుగా గది లోపలికి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళాక తన పెట్టి అక్కడ లేదని గుర్తు వచ్చింది చీరె తీసుకోవడానికి. కానీ అద్దంలో ముఖం చూసుకుని చెంపల మీద తడి, కనురెప్పల క్రింది కాటుక కొంగుతో తుడుచుకుంది. పౌడరు అద్దుకుని బొట్టు పెట్టుకుంటుంటే సావిట్లో అలికిడైంది. రాజారావు సన్నగా దగ్గిన చప్పుడు వినబడింది. విప్పిన జడ గబ గబ అల్లేసుకుంది. దువ్వెన కిటికీలో పడేసి యిటు తిరగగానే అతను గదిలోకి వచ్చాడు. మళ్ళీ మొహమాటంగా, పలుకరింపుగా నవ్వాడు.
'ఎంత సేపైంది నువ్వొచ్చి? అన్నాడు.
'ఒక అరగంట దాటుతోంది.' అన్నది. అతను తన పనేదో చూసుకుంటే బాగుండును. కానీ తనతో మాట్లాడటానికే నిలబడ్డాడు. 'పెద్ధనాన్న మీతో రాలేదా?' అన్నది మాధవి. అని అవతలికి వెళ్ళడానికి ముందుకు రెండడుగులు వేసింది.
'రాలేదు, వేరే పనిమీద వెళ్ళారు - మరి - మాధవీ-' అని అతను మాట ఆపాడు.
దడ దడమని వెనకాల చప్పుడైతే తిరిగి చూసింది ఆమె. పెద్ద పెద్ద చినుకుల ప్రక్కింటి రేకు వసారా మీద పడుతున్నాయి. ఆమె మనస్సు నీళ్ళు కారిపోయింది. వెల వెలా బోయే ముఖాన్ని అతనికి చూపించలేక అటే తిరిగి చూడసాగింది.
'అరే, వాన వస్తోందే!' అని అతను కిటికీవేపుకి వచ్చాడు. అదే అదనుగా ఆమె గది తలుపు దగ్గరికి వచ్చింది. తనకి ఎందుకు భయం, అతనేం చేస్తాడని? ఇంత ఆలోచనలేదామెకి. ఎల్లాగో బయటికి చేరాలి. ఆరుకాకుండా పార్కుదగ్గర ఉండాలి. పెద్ద వానపడుతోంది. కొంచెం తగ్గితే బాగుండును. ఆరాటంతో ఆమె కిటికీవేపు చూస్తోంది.
రాజారావు వానని చూడక తనూ తలుపు వేపు వచ్చాడు. 'మాధవీ! నీతో ఒకమాట చెప్పాలి-చెప్పమంటావా?' అన్నాడు.
'సరే అన్నదామె అప్పుడే కూర్చోమంటాడు. మాట్లాడమంటాడు. ఎల్లాగ? 'నేను ఒక ఫ్రెండుతో ఆరింటికి వస్తానని చెప్పాను. వెళ్ళాల అన్నదామె.