Previous Page Next Page 
రెండోమనసు పేజి 9

 

    సావిత్రి లేచి హడావుడిగా పనిలో మునిగిపోయింది. నూతి దగ్గర అంట్లు శుభ్రం చేస్తుండగా వచ్చాడు ఆమె తండ్రి.
    "సావిత్రీ! మీ పిన్నితో మాట్లాడాను. ఆమె సంగతి నీకు తెలీందేముందీ?"
    సావిత్రికి దుఃఖం వస్తుంది. తండ్రి మీద కోపం కూడా వస్తుంది. పిన్ని సంగతి తనకు తెలుసు. నిజమే! కాని ఇలాంటి ముఖ్యమయిన సమయంలో కూడా తండ్రి ఆమెకు భయపడటం ఆమెకు బాధ కలిగిస్తుంది.
    ఆమె ఏమీ మాట్లాడక పోవటం గమనించి అతనే మాట్లాడాడు మళ్ళీ.
    సావిత్రీ! చలపతి నిన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడా"
    సావిత్రికి అతనా ప్రశ్న ఎందుకడుగుతున్నాడో అర్ధం కాలేదు.
    "ఊ!" అంది తలవంచుకునే.
    "అయితే......మీ పిన్నికి తెలీకుండా ........చలపతితో వెళ్ళిపో........."
    ఉలిక్కిపడింది సావిత్రి ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయ్.
    "నన్నా........" అంది ఆశ్చర్యం, సిగ్గూ, అనందం అణచుకోడానికి ప్రయత్నిస్తూ.
    "అవునమ్మా! ఇంతకాలం మీ పిన్ని ఏం చేసినా ఊరుకున్నాను. కానీ ఇప్పుడు ఇది నీ జీవితం సమస్య. నువ్వు మిగతా జీవితమంతా ఆనందంగా గడపాలంటే నేను చేయగలిగింది ఇదే! నువ్వు చలపతితో వెళ్ళిపో ----తరువాత ఏమయినా సహాయం కావాలంటే నేను చేస్తాను."
    ఈలోగా పిన్ని నూతి దగ్గరికి రావటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడతను. సావిత్రి కొద్దిసేపటికి వరకు తడబాటు నుంచి బయటకు రాలేకపోయింది. ఆ తరువాత మధ్యాహ్నం వరకూ ఆమె ఆలోచనలతో సతమతమావుతూనే ఉంది.
    తండ్రి చెప్పేవరకూ తనలా ఆలోచించనే లేదు. అలాంటివి సినిమాల్లో చూడటం, నవలల్లో చదవడమే కానీ నిజంగా అలా చేస్తారనీ గానీ, చేయవచ్చని గానీ అనిపించటం లేదు.
    అసలు నిజంగా అది సాధ్యమేనా? తనలా చేయగలదా? చలపతి ఇందుకు సిద్దపడతాడా? ఏమో ఈ విషయం తను ఆలోచించుకొదానికే సిగ్గుగా ఉంది! ఇంక చలపతితో ఏం మాట్లాడగలదు?
    సమయం గడుస్తున్న కొద్దీ ఆమెలో ఆందోళన పెరిగిపోతోంది. చీకటి పడిపోతోంది. చలపతి గడ్డివాము వేపు వెళ్ళటం కనబడుతూనే ఉందామె. పిన్ని తలాకిట్లో కెళ్ళటం గమనించి తనూ వడివడిగా అతని దగ్గిరకు నడిచింది.
    "సావిత్రీ! ఇవాళ మా ఇంటిలో పెద్ద గొడవయిపోయింది తెలుసా?" అన్నాడు చలపతి నెమ్మదిగా.
    "ఏమయింది?" భయంగా అడిగిందామె.
    "అత్తయ్య ఎవరో పిల్లను చూడ్డానికి వెళదామని అంటే నేను వప్పుకోలేదు. దాంతో ఆమె క్కోపం వచ్చింది. నేనూ కోపం వచ్చి మన విషయం చెప్పాను దాంతో అత్తయ్య రెచ్చిపోయి నన్ను నానా మాటలు అంది. మీ పిన్నికి, మా అత్తకీ దేవుడి దయవల్ల మాటల్లేవు గానీ లేకపోతె ఈ పాటికి మీ పిన్నికీ కూడా న్యూస్ వెళ్ళిపోయేది."
    సావిత్రి ముఖం వివర్ణమయింది. ఇంక ఈ పరిస్థితిలో చలపతి మాత్రమేం చేస్తాడు!
    "అది సరే మీ వాళ్ళేమన్నారు?" ఆత్రంగా అడిగాడతను.
    "మా నాన్నతో చెప్పాను. నాన్న పిన్నితో చెప్పారు. పిన్ని నాన్నను నాలుగు దులిపింది. మనం పెళ్ళి చేసుకుంటేనూ చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు కావట."
    "సావిత్రీ! ఇంక మనం వీళ్ళ పర్మిషన్ కోసం ఎదురు చూడటం అనవసరమనుకుంటాను. ఎవ్వరికీ చెప్పకుండా నాతొ వచ్చేస్తావా?"
    "మా నాన్న కూడా వెళ్ళిపోమ్మన్నారు . కానీ నాకు భయంగా వుంది."
    చలపతి ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు.
    "భయమా? ఎందుకు? వాళ్ళు పోలీస్ రిపోర్టు ఇస్తారేమోననా?"
    "ఏమో? ఫలానా అందుకు అని కాదు."
    "ఏం ఫర్లేదు సావిత్రీ! మా ఫ్రెండ్ నర్సరాజని హైదరాబాద్ లో వున్నాడు. మా ఆఫీసే! అతనిలాంటి మారేజేస్ చాలా చేయించాడట! అన్నీ తనే పకడ్భందీగా చేస్తాననీ చెప్పాడు. అతని సహాయం తీసుకుంటే ఏమీ సమస్య ఉండదనుకుంటాను."
    సావిత్రీ ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో ఇంకా సంశయం కదలాడుతూనే వుంది.
    "సావిత్రీ ఎమిటింకా ఆలోచిస్తున్నావ్?" ఆమెను దగ్గరకు తీసుకుంటూ అడిగాడతను.
    "ఏమీ లేదు! మనం చిక్కుల్లో ఇరుక్కుపోం కదూ?"
    "ఎందుకలా ఆలోచిస్తావ్? మనిద్దరం మైనారిటీ తీరినవాళ్ళమే! లీగల్ గాకూడా అండదండలుంటాయ్. అదీ గాక బోలెడు మంది ఫ్రెండ్స్ మనకి సహాయం చేస్తారు! ఇంకేం కావాలి?"
    సావిత్రీ ఏమీ మాట్లాడలేదు. అతని కౌగాలిలోంఛి విడివడి దూరంగా జరిగింది. కాలి బొటనవేలితో నేలమీద రాస్తూ ఆలోచిస్తోంది.
    ఇది తన భవిష్యత్తు నిర్ణయించుకోవలసిన ఘడియ! ఈ క్షణంలో తన భయపడినా, పిరికిదానిలా ప్రవర్తించినా  జీవితమంతా పశ్చాత్తాపపడుతూ గడపాలి!
    ఊహు! తనకు చలపతి కావాలి! మనసులో ఏనాడో అతని పటం చిత్రించుకుపోయింది. అది శాశ్వతం చేసుకునే అవకాశం ఇప్పుడు లభించింది.
    ఇప్పుడు ఈ అవకాశం వదులుకుంటే తన చేతులారా తనే జీవితాన్ని నాశనం చేసుకున్నట్లవుతుంది.
    "అవును సావిత్రీ! ఇంతకన్నా మంచి మార్గం లేదు. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ మన వివాహానికి కావలసిన ఏర్పాట్లనీ చేసేస్తాను! సరిగ్గా వచ్చే నెల ఇదే తారీఖున ఈ ఊరు వచ్చి రాత్రి పదిన్నరకి వెనక రోడ్డు మీద ఎదురు చూస్తుంటాను! రైలెక్కామంటే ఉదయానికల్లా హైదరాబాద్ లో ఉంటాం! వెంటనే పెళ్లి జరిగిపోతుంది, ముందు గుళ్ళో చేసుకుందాం! తర్వాత రిజిస్టారాఫీసులో! ఏంటావ్?"
    "మా పిన్ని వాళ్ళు గొడవ చేస్తే?"
    "ఏం చేసినా ప్రయోజనం వుండదు! అప్పటికే మనం భార్యాభర్తలమయి ఉంటాం కదా!"
    సావిత్రి కి సిగ్గు ముంచుకొచ్చింది.
    "ఏమంటావ్?" రెట్టిస్తూ అడిగాడు చలపతి.
    "ఏమో! నాకేం చెప్పటానికీ తోచడం లేదు!"
    "అసలు ఈ సంగతి చెప్పు! నీకు మనిద్దరం ఒకటవాలని ఉందా లేదా?" కోపంగా అడిగాడు చలపతి.
    సావిత్రి నవ్వేసింది. "అదిగో! మళ్ళీ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నావ్!"
    "లేకపోతే ఏమిటి? నేను మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంటే నువ్వేమో నాకు సహకరించడం పోయి అలా సందిగ్ధంగా మాట్లాడితేఎలా?"
    మరికొద్ది క్షణాలు ఆలోచనలో పడిపోయింది సావిత్రి.
    "సరే!" అంది సావిత్రి తలెత్తి అతని వంక చూస్తూ.
    చలపతి ఆనందానికి అవధులు లేకపోయినాయ్! చటుక్కున సావిత్రిని దగ్గరకు లాక్కుని ఆమె చెక్కిళ్ళ మీద ముద్దు పెట్టుకొన్నాడు. మృదువుగా అతన్ని దూరంగా తోసివేసింది సావిత్రి.
    "ఇంక వెళ్ళిపో! కానీ ఓ విషయం గుర్తుంచుకో ఇక ఇందులో ఎలాంటి మార్పులూ చేయకు, నేను అన్నిటికి సిద్దపడే నీతో వస్తున్నాను......."
    "ఎలాంటి మార్పు వుండదు ! సరిగ్గా ఆ రోజు రాత్రికి మనూరు చేరుకొని , ఎవ్వరకూ కనబడకుండా వెనుక రోడ్డు మీదకి పదింటికల్లా చేరుకుంటాను. నువ్వు పదిన్నరకల్లా వచ్చేశావంటే అంతా అనుకొన్నట్టే జరిగిపోతుంది.సరేనా?"
    తలూపిందామె.
    "మరి నే వెళ్ళనా?" అడిగాడు చలపతి.

 Previous Page Next Page