Previous Page Next Page 
రెండోమనసు పేజి 8


    "సావిత్రీ! మన విషయం మా వాళ్లతో గానీ, మీ వాళ్ళతో గానీ ఎలా చెప్పటం? అసలు వాళ్ళు వప్పుకుంటారంటావా?"
    "ఏమో! నాకెలా తెలుస్తుంది?"
    "ఒకవేళ వాళ్ళు వప్పుకోకపోతే?"
    "బాగుంది! నన్నడగుతావెం" నవ్వుతూ అందామె.
    "పోనీ మీ వాళ్ళను నువ్వు అడగగలవా? మా వాళ్ళను నేను అడుగుతాను."
    "అమ్మో ! నాకు భయం బాబూ! మా పిన్ని విరుచుకు పడుతుందేమో."
    "పోనీ మీ నాన్నతో చెపితే?"
    ఆమె ఓ క్షణం ఆలోచించింది.
    "సరే! నాన్న నడుగుతాను.
    "నేనూ మా మావయ్యనదుగుతాను. మా అత్తయ్య మహా డేంజరస్ మనిషి....."
    "ఇంకనే వెళ్ళనా మరి?" అడిగిందామె.
    "మనం మళ్ళీ కలుసుకునేదెప్పుడు?"
    "నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళిపోతున్నావ్?"
    "రేపు రాత్రికి!"
    "అయితే రేపు సాయంత్రం చీకటి పడ్డాక ఇక్కడే కలుసుకుందాం!"
    "నువ్వు తప్పకుండా రావాలి. లేకపోతే నేను హైదరాబాద్ వెళ్ళలేను - గుర్తుంచుకో!"
    "సరే"
    ఇద్దరూ వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ఇళ్ళకు చేరుకున్నారు.
    సావిత్రి తండ్రితో మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూడసాగింది, సాయంత్ర మాయేసరికి తండ్రి ఇంటికి వచ్చాడు. పిన్ని తండ్రి పక్కనే మసలుతుండటం చేత రాత్రి వరకూ మాట్లాడటం కుదరనేలేదామెకి.
    చివరకు రాత్రి భోజనాలయాక అవకాశం దొరికింది తండ్రి ఆరుబయట పచార్లు చేస్తోంటే అతని దగ్గరికి నడిచింది సావిత్రి.
    "ఎమ్మా సావిత్రి! భోజనం చేశావా?" ఆప్యాయంగా పలుకరించాడు తండ్రి.
    చేశాను నాన్నా!
    "మరిక పడుకోపోయావా?"
    "నాన్నా......" నెమ్మదిగా పిలిచిందామే.
    "ఏంటమ్మా?"
    "నాన్నా........మరి" తటపటాయించిందామే.
    అతను పచార్లు చేయటం ఆపాడు.
    "చెప్పమ్మా! ఏమిటి సంగతి?"
    "నాన్నా........నేను .......నాకు పెళ్లి చేసేయాలని సంబంధాలు చూస్తున్నారు గదా! నేను .....నేను......"
    "రెండో పెళ్ళి సంబందాల నీకిష్టం లేదూ కదూ అలా జరక్కుండా ఉండటానికి నేనూ విశ్వప్రయత్నం చేస్తున్నానమ్మా!"
    "అది కాదు నాన్నా - మీరు వప్పుకునేట్లయితే నన్ను చలపతి చేసుకుంటానంటున్నాడు నాన్నా" ధైర్యం తెచ్చుకుని చెప్పేసిందామే.
    "ఏమిటీ! చలపతి నిన్ను చేసుకుంటానంటున్నాడా?"
    "అవున్నాన్నా! మీరు వప్పుకునేట్లయితే మీతో వచ్చి మాట్లాడతాడు......"
    అతనికి నమ్మకం కలగటం లేదు. సావిత్రేనా ఇంత ధైర్యంగా మాట్లాడుతోంది?


                                                           * * *

    అప్పుడే ప్రేమించటం - పెళ్ళాడటం వరకూ ఎదిగిపోయిందా తన కూతురు? అతను ఆలోచనలో పడ్డాడు. వాళ్ళ కులం వేరు. తమ కులం వేరు! తనలాంటి బీదవాడికి కులాల పట్టింపులు లేవు. కానీ ......తన భార్య వప్పుకుంటుందా? అసలే ఆమెకి మూర్ఖత్వం. చాదస్తం ఎక్కువ.
    "సరేనమ్మా! మీ పిన్నితో మాట్లాడతాను......."
    ఆనందంతో పొంగిపోయింది. లోపలికి తడబడుతున్న అడుగులతో వెళ్ళిపోయింది.
    ఆమె తండ్రి చాలా సేపు సావిత్రి చెప్పిన విషయం గురించే ఆలోచిస్తుండిపోయాడు. తల్లి పోయిన దగ్గర్నుంచి సావిత్రి ఎన్నో బాధలు పడుతూనే ఉంది. తన రెండో భార్య సావిత్రిని అసహ్యించుకాకపోయినా .....ప్రేమగా మాత్రం చూడదు.
    నిజానికి తాము తంటాలు పడితే సావిత్రికి ఈడూ, జోడూ సరిపోయే కుర్రాడికిచ్చి పెళ్ళి చేయగల స్తోమత ఉంది.
    కాని అది తన భార్య కిష్టం లేదు. ఇప్పుడే అప్పులు చేస్తే తరువాత తన పిల్లలు అన్యాయమయిపోతారని ఆమె భయం. అందుకే ఎదురు కట్నం వచ్చేట్లు చూసి ఏదయినా రెండో సంబంధం వరడుకివ్వాలని ఆమె ఆలోచన.
    "సక్కూ....."భార్యా దగ్గర కెళ్ళి మంచం మీద కూర్చుంటూ పిలిచాడతను.
    "ఊ ఏమిటి?"
    "వాళ్ళ చలపతి హైదరాబాద్ నుంచి వచ్చాడు చూశావా?"
    "అవును పొద్దున్న వచ్చాడుగా మనింటికి?"
    "వాడి బ్రతుకు తెరువు వాడు చూసుకున్నాడు. లేకపోతే చాలా తిప్పలు పడాల్సి వచ్చేది."
    "అవునవును"
    "వాడికి సంబంధాలు చూస్తున్నరటగా!"
    "అవును! ఇవ్వాళ సాయంత్రం వెళ్ళి ఓ పిల్లను చూసి వచ్చారు. పిల్లేమో వాడికి నచ్చలేదుట. వాళ్ళత్తయ్యకి చలపతికి చాలా పెద్ద పోట్లాట జరుగుతోంది దాన్ని గురించే"
    "వాడికి మన సావిత్రి నిచ్చి చేస్తే బాగుంటుంది కదూ" అడిగాడతను.
    ఆమె చటుక్కున లేచి కూర్చుంది. మంచం మీద" ఏమిటి? సావిత్రిని వాడికిస్తారా> మీకేం మతిపోలేదు కదా! వాళ్ళ కులమేమిటీ? మన కులమేమిటీ?"
    "అది కాదే.....ఈడూ జోడూ బాగుంటుంది కదా పాపం రెండో పెళ్లి వాడికిస్తే."
    "చస్! ఊరుకోండి! ఇవాళ ఆ కులం లేనివాడికిచ్చి పెళ్ళి చేసేస్తే అయిపోతుందనుకుంటున్నారా? రేపు మన పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? పిచ్చి ఆలోచనలు చేయకుండా నిద్రపొండిక."
    అతను ఇంకా మాట్లాడలేకపోయాడు. అట్టే మాట్లాడితే ఆమె రెచ్చిపోతుంది. ఇప్పుడు లేనిపోనీ గొడవ పెట్టుకోవటం తప్పితే ఆమె మనసు మార్చటం కల్ల.
    మాట్లాడకుండా తన పక్కమీద పడుకున్నాడతను. వాళ్ళ మాటలన్నీ లోపల్నుంఛీ వింటోన్న సావిత్రికి గుండెలు పగిలిపోయాయి. ఇంక తను చలపతిని చేసుకోవడం కల్ల!
    ఆ రాత్రికి ఆమెకు నిద్ర పట్టలేదు. కళ్ళ వెంబడి నీళ్ళు కారుతూనే ఉంది. తెల్లారుజామునేప్పుడో నిద్ర పట్టింది.
    తండ్రి తనను నిద్రలేపుతుంటే తిరిగి మెలుకువ వచ్చింది సావిత్రికి. లోపల్నుంచి పిన్ని అరవటం వినబడుతూనే ఉంది. "బారెడు తెల్లారినా ఇంకా నిద్రలేవలేదేం? ఎవరు చేస్తారు ఇంటిపనులన్నీ? నీ తాత చేస్తాడా?"

 Previous Page Next Page