"వెళ్ళిరా............"
రెండు అడుగులు వేశాడో లేదో మళ్ళీ పిలిచింది సావిత్రీ.
"ఏమిటి?" తిరిగి ఆమె దగ్గర కోస్తూ అడిగాడతను.
"నిన్ను నమ్ముకొని వస్తున్నాను? నాకెలాంటి అన్యాయము చేయవూ కదూ?"
"అంటే, నువ్వు నన్ను అర్ధం చేసుకొంది ఇంతేనన్నమాట!" నిష్టూరంగా అన్నాడు చలపతి.
సావిత్రి కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయ్.
"సారీ చలపతి, అర్ధం చేసుకోక కాదు ఈ మాటంది! నేను చేస్తున్న పని సరైనది కాదేమో అన్న భయం అడిగిస్తోంది మాట! ఏమీ అనుకోకేం?"
ఆమె చేతి నందుకొని పెదాలతో స్పృశించాడు చలపతి.
"ఒకే ఒక్కమాట సావిత్రీ! నీకెలాంటి కష్టమయినావస్తే! అది నేను ఈ లోకంలో లోంచి పోయిన తర్వాతే. ఇంతే నేను చెప్పగలను!"
"నువ్వు మరీ సీరియస్ గా తీసుకొంటావ్ ప్రతి విషయమునూ! అయినా అలాంటి ప్రశ్న వేయడం నాదే బుద్ది తక్కువలే......."
"మరి నే వెళుతున్నాను! గుర్తుంది కదూ! వచ్చేనెల ఇదే రోజు......."
చలపతి వెళ్ళిపోయాడు. సావిత్రి మరికొద్ది సేపు అక్కడే నిలబడిపోయింది ప్రతిమలా!
జరిగిపోయింది, అది సరయినదో, కాదో తనకు తెలీదు. తప్పో ఒప్పో అంతకన్నా తెలీదు! కానీ తన తండ్రి, పిన్ని నిర్ణయించే భవిష్యత్తు కన్నా తను నిర్ణయించుకున్న భవిష్యత్తే నిస్సందేహంగా మంచిది. తరువాత తనను తాను నిందించుకునే అవకాశం రాదు.
నెమ్మదిగా ఇంట్లోకి నడిచింది . పిన్ని తన తండ్రితో చెబుతోంది. "పిల్లాడు కొంచెం ముడురయినా చాలా ఆస్థి వుంది! అమ్మాయి సుఖపడుతుంది. మనమీద వుంచుకున్న కొద్దీ రామరామ మనకే బరువెక్కువ! ఏమంటారు?"
"అవును!" అన్నాడు తండ్రి.
* * *
"నీ కెందుగ్గురూ! మీ ప్రేమ వ్యవహారమంతా నా కోడిలేయ్! నువ్వు నిశ్చింతగా వుండు! నీతో పాటు నేను వుంటాను! ఆ మాట కొస్తే యస్సల్సీ చదివే రోజుల్లో ఓ మైనారీటీ తీరనీ పిల్లకి కూడా మారేజ్ చేయించేశాను ఇంట్లో వాళ్ళకు తెలీకుండా, తరువాత పెద్ద గొడవయిందనుకో? అయినా మళ్ళీ సర్దుకున్నరందరూ! నన్నో రోజు లాకప్ లోకి తోశారా విషయంలో! నేనది ఇన్సల్ట్ గా ఫీలవలేదు. చాలా గర్వంగా ఫీలయ్యాను.
నాదొకటే పాయింట్ గురూ! ప్రేమ వివాహాలు విరివిగా జరగాలి! వీటికి పెద్దలోప్పుకోరు! నన్నడిగితే ఒప్పుకోకూడదు కూడానూ! అప్పుడే ఆ కుర్రదానికీ, కుర్రడికీ మరింత పట్టుదల వస్తుంది. ఆ పట్టుదలే ఆ వివాహాన్ని చెదిరిపోకుండా చివరివరకూ కాపాడుతుంది. తామిద్దరూ ఒకటి, మిగతా ప్రపంచమంతా ఒకటి అన్న భావన కలుగజేస్తుంది. వివాహం విజయవంతం కావాలంటే ఆ భావం చాలా ముఖ్యం. మాములు ఎరేంజ్ డ్ పెళ్ళిళ్ళలో అలాంటి భావన రాదు! వచ్చే అవకాశాలు చాలా తక్కువ........"
ఆ నెల రోజులూ ఎలా గడిపాడో చలపతికే తెలీదు. రాన్రాను ఓ విధమయిన భయం ఆదుర్దా అతని కేక్కువయిపోయినాయ్! అంతకు ముందున్న పట్టుదల, ధైర్యం దిగజారి పోతున్నట్లు అనిపించసాగింది.
ఈలోగా అతనికి అత్తయ్య దగ్గర నుండి రెండు మూడు ఉత్తరాలు వచ్చినాయ్! తను ఏవో రెండు సంబంధాలు చుసిందనీ, ఓసారి ఇంటికొస్తే ఏదోకటి నిర్ణయించుకోవచ్చనీ!
"నాకిప్పుడే పెళ్ళి వద్దు" అని జవాబు రాసి పడేశాడు చలపతి.
ఆరోజు రానే వచ్చింది. తనూ రెండ్రోజులూ శెలవు పెట్టేశాడు నర్సరాజు. మధ్యాహ్నం భోజనాలయినాక నర్సరాజు టాక్సీ తీసుకొచ్చి చలపతి ఇంటిముందాపేడు.
"టాక్సీ ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగాడు చలపతి.
"ఇలాంటి విషయాల్లో రైళ్ళూ, బస్సులూ నమ్ముకోకూడదోయ్ పిచ్చి నాయనా! అలా నమ్మే మా ప్రసాద్ గాడు ఓసారి దెబ్బ తిన్నాడు. ఆ కధ తర్వాత చెప్తాలే! ముందు బయటికి నడు. మనకాట్టే టైం లేదు" అన్నాడుతను.
అతనితో పాటు బయటకు నడిచి టాక్సీలో కూర్చున్నాడు చలపతి. టాక్సీ వేగంగా పోసాగింది. సాయంత్రమయేసరికల్లా విజయవాడ చేరుకొంది టాక్సీ. అక్కడ నుంచి తన ఊరికి మరో మూడుగంటల ప్రయాణం.
హోటల్లో భోజనాలు అవీ ముగించి ఏడు గంటలకల్లా మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. సరిగ్గా పదింటికల్లా ఊరు చేరుకుంది టాక్సీ. నెమ్మదిగా లైట్లు లేని ఆ మట్టి రోడ్డు మీద సావిత్రి ఇంటివెనుక ఆపారు టాక్సీని.
ఈ రోడ్డు మీద రాకపోకలేక్కువఉండవు కదా?" అడిగాడు నర్సరాజు.
"ఊహు! కాలువ గట్టు కేళుతుంది రోడ్డు! ఉదయం వరకూ ఎవ్వరూ రారు......." చెప్పాడు చలపతి.
"నువ్వులా ముందు కెళ్ళి ఆ అమ్మాయి వచ్చే దారిలో నుంచో."
చలపతి టాక్సీ దిగి సావిత్రి ఇంటివెనుక గేటు దగ్గరకు చేరుకున్నాడు. అంతా నిశ్శబ్దంగా వుంది. ఉండుండి కొట్టాంలో పశువులు గడ్డి లాగటం, నమలడం లాంటి శబ్దాలు వినబడుతున్నాయ్.
మరి కొద్ది సేపట్లో పెరటి తలుపు తెరచుకొని బయటి కోస్తున్న సావిత్రి కనిపించింది. ఇంట్లోంచి లాంతరు వెలుగు బయటకు చిమ్ముతోంది. తలుపులు దగ్గరగా మూసి గేటు దగ్గరకు వచ్చిందామె.
"సావిత్రీ!" ఆనందంగా పిలిచాడు చలపతి. గేటు తెరచుకొని అతని దగ్గరగా వచ్చిందామె.
"పద! అక్కడ టాక్సీ వుంది" ఆమె చేయి పట్టుకొని టాక్సీ దగ్గరకు నడిపించాడు చలపతి.
నర్సరాజు వారిద్దరినీ వెనుక కూర్చో పెట్టి డోర్ శబ్దం కాకుండా వేసేశాడు. తను ముందు కూర్చోగానే టాక్సీ బయల్దేరింది. మెయిన్ రోడ్ చేరుకోగానే మంచి వేగంతో నడపసాగాడు డ్రయివర్.
విజయవాడ చేరుకునే వరకూ ఎవ్వరూ మాట్లాడలేదు. చలపతికి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయ్. విపరీతంగా భయపదిపోతున్నాడు. సావిత్రి చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిమురుతూ కూర్చున్నాడు.
టాక్సీ హైదరాబాద్ రోడ్డ్ ఎక్కాక అతనికి కొంచెం కొంచెంగా ధైర్యంగానే ఉంది" ఇప్పుడు ఫరవాలేదు లెండి" నవ్వుతూ అన్నాడు చలపతి.
"ఇంక ఫర్వాలేదోయ్! అంతా సవ్యంగానే జరిగిపోతుంది!"
"మీరు లేకపోతె ఇంత తేలిగ్గా అయేది కాదేమో అనిపిస్తోంది."
"ఇలాంటివి ఎవరున్నా లేకపోయినా జరిగిపోతాయాయో! ఎటొచ్చి మీ ఇద్దరికీ పట్టుదల, ధైర్యం వుండాలి అంతే!"
తెల్లార్లూ ఏవేవో మాట్లాడుతూనే ఉన్నాడు నర్సరాజు. తెల్ల వారుజమున అయిదింటికల్లా నర్సరాజు ఇంటికి చేరుకుంది టాక్సీ.
"రామ్మా!" అంటూ సావిత్రిని లోపలకు ఆహ్వానించింది నర్సరాజు భార్య.
టాక్సీకి తనే డబ్బులిచ్చేశాడు నర్సరాజు.
"లెక్కలు తరువాత చూసుకుందాంలే! నువ్వుప్పుడిలాంటివేమీ పట్టించుకోకు" అని చెప్పేశాడు.
సావిత్రి కట్టుబట్టలతో వచ్చేసింది. ఆమెకి కింకా బెడురుగానే ఉంది. ఏ క్షణాన్న ఏం జరుగుతుందో అని అనుమానంగా వుంది.
"ఇంకేం భయం లేదు సావిత్రీ! మరి కాస్సేపట్లో నర్సరాజు స్నేహితుల సమక్షంలో మన పెళ్ళి జరిగిపోతుంది" అన్నాడు చలపతి.
"మరి......మనిల్లు ఎక్కడ?" అడిగిందామె.
"ఇక్కడికి దగ్గరే! కాకపోతే కొంచెం మార్కెట్ కి దూరం. ఇలాగె వుంటుందనుకో. ఇంకొంచెం పెద్ద గది. అంతే తేడా!"
"పెళ్ళిలో ఏమి గొడవ జరగదు కదా?" పాలిపోయిన ముఖంతో అడిగిందామె.