Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 9


    "ఇక్కడ రెండు సంబంధాలువచ్చాయి నీకు. అమ్మాయిలిద్దరూ చదువుకున్నవారే! అన్ని విధాలా బాగున్నాయి ఈ సంబంధాలు! నువ్వు చూసి నీకు నచ్చితేవచ్చే నెలలో ముహూర్తాలున్నాయట!...." శ్రీనివాసరావుకి నవ్వొచ్చింది.
    "ఇంక సంబంధాలు చూసేపని లేదమ్మా!" అన్నాడు నవ్వుతూ.
    సీతమ్మతోపాటు శివరామయ్యకూడా అర్ధం కానట్లు కొడుకువేపు చూశాడు.
    'నేనే ఓ సంబంధం చూశాను. మీ ఇద్దరూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడిరావాలి. ఎప్పుడు వెళ్ళాలో నేను ఉత్తరం రాస్తాను మీకు..." అన్నాడతను వివరంగా.
    "ఎవరు వాళ్ళు!" అని అడిగాడు శివరామయ్య.
    "మనకులంకాదు. వాళ్ళ స్వస్థలం గుడివాడ! నాతోపాటు పని చేస్తున్న మా స్నేహితుడికి బంధువులే! అమ్మాయిని హైద్రాబాద్ లో నేను చూశాను. మాట్లాడాను. అన్ని విధాలా నాకు నచ్చింది...." కొద్దిక్షణాలు నిశ్శబ్దం ఆవహించింది గదిలో....
    "నీకు నచ్చితే ఇక మాదేముంది?" నిర్ణయించుకున్నట్లు అన్నాడు శివరామయ్య అక్కడినుంచి బయటికివెళ్ళుతూ.
    శ్రీనివాసరావు ఏమీ మాట్లాడలేదు. అతను తన తల్లినే గమనిస్తున్నాడు. ఆమెలోలోపల కొంచెం బాధపడుతోందని తెలుస్తూనే వుంది. కులంగాని పిల్ల అనేసరికి ఎవరికయినా అది సహజమే తండ్రి తనను కాదనలేక ఆ మాట అని వెళ్ళిపోయాడనికూడా తనకు తెలుసు.
    తను నెమ్మదిగా నచ్చజెప్పాలి వారిద్దరికీ. ఏ విషయంలోనయినా సరే తన అభిప్రాయంప్రకారమే నడుచుకోవడం వాళ్ళకెలాగూ అలవాటయింది. కనుక దీనికి అంగీకరింపజేయడం పెద్ద సమస్యేమీ కాదు. పొద్దు గూకుతోండగా బోసువచ్చాడింటికి. "ఎప్పుడూ వచ్చావన్నయ్యా?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "ఇందాకే వచ్చాను! నువ్వింత ఆలస్యంగా వస్తున్నావేమిటి స్కూలు నుంచి?"
    "ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తున్నామన్నాయ్! వచ్చే నెలలో ఇంటర్ స్కూల్ గేమ్స్ ఉన్నాయి...... మా స్కూలు టీమ్ లో నేనూ ఉన్నాను..."
    "గుడ్! మరి చదువు ఎలా వుంది?" "బాగానే ఉంది కొంచెం మాత్స్ లో వీక్ గా వున్నాను. అందుకని ట్యూషన్ లో చేరాను..."
    "ఎన్ని గంటలకు ట్యూషన్ కెళ్ళాలి?"
    "ఇప్పుడే! భోజనం చేసి వెళ్ళిపోతాను!"
    హడావుడిగా లోపలకు నడుస్తూ అన్నాడతను. మరికాసేపట్లో భోజనం చేసి మళ్ళీ పుస్తకాలు తీసుకుని వచ్చాడు బోను. "నే వెళ్తునన్నాయ్!" అనేసి బయటికి వెళ్ళిపోయాడు.
    శ్రీనివాసరావ్ లేచి డాబా మీదకెక్కాడు. డాబా మీద కూర్చుని ప్రశాంతంగా గడపడం తనకు చాలా ఇష్టం! చదువుకొనే రోజుల్లో స్కూలు నుంచి రాగానే పుస్తకాలు తీసుకొని డాబా ఎక్కి, ప్రొద్దు గూకేవరకూ అక్కడే చదువుకొనేవాడు. డాబా మీద ఓ మూలగా కూర్చుని ఉన్న నాగమణిని చూడగానే గతుక్కుమన్నాడతను. ఆమె ఏవో పుస్తకాలు చదువుతోంది. ఆమె ఎదుటపడాలంటే ఎందుకో గిల్టీగా వుంది.
    కానీ ఆమె తనను గమనించనే గమనించింది. ఇప్పుడు డాబా దిగి పోవడం కూడా అంత సమంజసంగా ఉండదు. తనసలు ఆమెతో మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదని నాగమణి అనుకొనే ప్రమాదం ఉంది.
    "ఇక్కడున్నావా నాగమణి?" చిరునవ్వుతో ఆమె దగ్గరకు నడిచి అడిగాడతను ఆమె చటుక్కున లేచి నిలబడింది.
    "మీ అమ్మా, నాన్నా అంతా బావున్నారా?"
    "ఆ! బాగానే ఉన్నారండీ!".
    "మీ పరీక్ష లెప్పుడు?"
    "ఇంకా మూడు నెలలున్నాయి".
    "ట్యుటోరియల్ కాలేజీలో బాగా చెపుతున్నారా?".
    "ఆ! ఫరవాలేదు! అయినా నేను ఇంటి దగ్గర అన్నీ చదివేశానెప్పుడో, పరీక్షల్లో జవాబులు రాసే విధం తెలీక ఇక్కడ చేరాను...." తల వంచుకొని అందామె.
    "ఓహో..." కొద్దిక్షణాలు నిశ్శబ్దంగా గడచినయ్. "నేను కింది కెళ్తాను..." అంటూ అక్కడనుంచి నడవబోయిందామె.
    "ఆగునాగమణీ! నువ్వు చదువుకో! నేనువెళ్ళిపోతాను" అన్నాడు శ్రీనివాసరావ్.
    నాగమణి నిలబడిపోయింది. "ఎలాగూ చీకటి పడుతోంది లెండి. కిందే చదువుకుంటాను..." అంది.
    "మెట్రిక్ పాసయాక ఏం చేద్దామని? ఇంకా చదువుతావా?" అడిగాడతను.
    "చదవాలనే అనుకుంటున్నాను. కానీ మరి అమ్మా, నాన్నా ఏమంటారో తెలీదు!" చిన్నగా నవ్వుతూ అందామె.
    "నీకు ఇప్పుడు చదువు మీద శ్రద్ద కలిగిందేమిటి?" నవ్వుతూ అడిగాడతను.
    నాగమణి సిగ్గుపడింది. "ఏమో! ఇంతకాలం నేనూ అడగలేదు, మావాళ్ళూ పట్టించుకోలేదు. ఇప్పుడు కదా నాకు చదువు ఉపయోగం తెలిసింది" ఆ మాట తననుచిన్న బుచ్చడానికే అన్నట్టు అనిపించింది తనకి.
    కొద్ది క్షణాలు నిశ్శబ్దంగానే నిలబడ్డారిద్దరూ. అతనే మీ మాట్లాడకపోవడం గమనించి నెమ్మదిగా మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయిందామె. చాలా సేపు ఆ చీకట్లోనే నాగమణి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు శ్రీనివాసరావ్. ఆమె మీద ఎందుకో సానుభూతి కలిగిందతనికి.
    
                                                                 * * * * *


    శ్రీనివాసరావ్ వెళ్ళిపోయాక హేమ చాలాసేపు అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. హైద్రాబాద్ లో కలసి వున్న ఆ కొద్దిసేపట్లోనే అతనిని తను అంతగా ఆకర్షించిందంటే ఆశ్చర్యంగా వుంది. బహుశా అతని కోరికకు తండ్రి అంగీకరించవచ్చు. మరి తన సంగతేమిటి? అతని మీద తనెలాంటి అభిప్రాయమూ ఏర్పరచుకోలేదు. కానీ అతనితో మాట్లాడిన కాసేపట్లో ఓ విషయం గ్రహించింది తను. అతనికి "స్త్రీ" మీద సానుభూతి ఉంది. సంఘంలో ఆమెకు అన్యాయం జరుగుతోందని అతనూవప్పుకొన్నాడు. తన ఆలోచనా ధోరణికి, అతని ఆలోచనలకూ పొంతన ఉంది. కనుక అతనిని తను చేసుకొంటే మరింత దీక్షతో తనునారి సమితి కార్యక్రమాలు నిర్వహించగలదు. అతని సహకారం కూడా తనకు లభిస్తుంది. సాయంత్రం తండ్రి ఇంటి కొచ్చే లోగానే అతనిని అంగీకరించాలనే నిర్ణయానికొచ్చిందామె. రామరాజు ఇంటికొస్తూనే సౌభాగ్యమ్మను పిలిచాడు. ఇద్దరూ చాలాసేపు శ్రీనివాసరావు గురించి మాట్లాడుకుని తరువాత హేమను పిలిచారు.
    "ఏమిటి డాడీ?" అక్కడి కొచ్చి కూర్చుంటూ అంది హేమ. తల్లిదండ్రుల దగ్గర ఆ విషయం మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందామెకి.
    "శ్రీనివాసరావ్ విషయం మాట్లాడదామనిపిలిచానమ్మా! అతనిని చేసుకోవడానికి నీకేమయినా అభ్యంతరం ఉందా?"
    ఆమె నవ్వింది. "నాకేమీ లేదు డాడీ!" నవ్వుతూ అంది.
    "అలాగయితే మరి అతనికి ఉత్తరం రాసేస్తాను రేపే!" అన్నాడు అతను తేలిక పడ్డ మనసుతో. సౌభాగ్యమ్మ మాత్రం ఎటూ చెప్పకుండా ఊరుకుండిపోయింది. సుధీర్ చేసుకోనన్న తరువాత ఇంకెవరయినా ఒకటేనని ఆమె ఉద్దేశ్యం. సాయంత్రం ఆరు దాటాక రిక్షాలో వసుంధర వాళ్ళింటికి చేరుకుంది హేమ. అప్పటికే బయలుదేరడానికి సిద్దంగా ఉన్నారు వాళ్ళు మరి కాసేపటి తర్వాత అందరూ కలిసి రైలు స్టేషన్ కి చేరుకున్నారు.
    అక్కడ సామానుతో వేచివున్న చంద్రకాంత్ వసుంధరతో పాటు వస్తూన్న హేమనుచూసి సంబరపడిపోయాడు. "మీరు రారేమో అనుకున్నాను" అన్నాడు ఆనందంగా.
    'రాకపోతే వసుంధర ఊరుకుంటుందా?" నవ్వుతూ అన్నదామె. ముగ్గురూ సిమెంట్ బెంచీమీద కూర్చున్నారు.
    "మళ్ళీ ఎప్పటికో నిన్ను చూడడం!" బాధగా అంది వసుంధర.
    "ఎప్పటికోనా?" మూడు నెలల్లో హైద్రాబాద్ రానూ?" వసుంధరా, చంద్రకాంత్ ఆశ్చర్యంగా ఆమెవేపు చూశారు. "హైద్రాబాద్ వస్తున్నారా!" నమ్మలేనట్లు అడిగాడు చంద్రకాంత్.
    "అవును! రావడమే కాదు. నేనూ అక్కడే ఉంటానప్పటినుంచీ!"
    "అబద్దాలన్నీ" అన్నది వసుంధరకొట్టి పారేస్తూ? "నీ ఇష్టం! నువ్వెలా అనుకున్నాసరే!" "పోనీ! అక్కడకు ఎందుకు వస్తున్నారో చెప్పకూడదూ? ఉద్యోగం దొరుకుతోందా?" అడిగాడు చంద్రకాంత్.
    "ఊహు! కాదు!"
    "మరి?"
    "మీ ఇద్దరూ చెప్పగలరేమో ప్రయత్నించండీ" నవ్వు బిగబట్టుకుంటూ అందామె.
    కొద్దిసేపు ఆలోచనలో పడ్డారిద్దరూ.
    "మీకు బదిలీ అవుతోందా?"
    "ఊహు! మా డాడీ ఇక్కడే రిటయిరవుతారు! కనుక బదిలీ ప్రసక్తేలేదు!"
    "ఇంకేమిటి మరి?" అడిగాడతను. "ఆ! తెలిసింది" తలూపుతూ అన్నది వసుంధర.
    "ఏమిటది?" అడిగింది హేమ."అర్ధమయిందిలే! నీ వివాహం జరుగుతుంది! నీకు కాబోయే శ్రీవారు హైద్రాబాద్ లోనే పనిచేస్తారు కరెక్టేనా? ఆమె నవ్వేసింది.
    "అవును!" "చూశావా! నేను చెప్పలే...." ఇద్దరూ గట్టిగా నవ్వేశారు. కాని చంద్రకాంత్ మొఖం వాడిపోయింది. అకస్మాత్తుగా హేమచెప్పిన వార్తను తట్టుకోలేకపోతున్నాడు అతను. ఆమెకు ఏదో ఒక రోజు వివాహమవుతుందన్న ఆలోచనే ఇంతవరకూ రాలేదు తనకు. అకస్మాత్తుగా ఆమెకూ తనకూ మధ్య పెద్ద అగాధం ఏర్పడిపోయినట్లు అనిపించసాగింది. గుండెలు పిండేస్తున్నట్లుబాధ! హేమనుబలవంతంగా ఎవరోతనకు దూరం చేస్తున్నట్లనిపించసాగింది.మనసు విలవిలలాడిపోతోంది. కళ్ళ వెంబడినీళ్ళు తిరిగినాయి అతనికి. అతికష్టంమీద దుఃఖం ఆపుకోడానికి ప్రయత్నించసాగాడు.

 Previous Page Next Page