"నమస్కారమండీ! నా పేరు శ్రీనివాసరావ్. నేను సుధీర్ స్నేహితుడిని. హైదరాబాద్ నుంచి వచ్చాను." పరిచయం చేసుకొంటూ అన్నాడు.
రామరాజు మౌనంగా ప్రతి నమస్కారం చేశాడు. సుధీర్ పేరు వినగానే అతనికి చిరాకు కలిగింది. "ఏమిటి సంగతి?" అనడిగాడు తన చిరాకు కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తూ.
"మీతోకొద్దిసేపు మాట్లాడాలి...." నమ్రతతో అన్నాడు శ్రీనివాసరావ్.
"రండి! అలా కూర్చుందాం" ఖాళీగా ఉన్న ఓ టేబుల్ వేపు నడుస్తూ అన్నాడతను. ఇద్దరూ ఎదురెదురుగ్గా కూర్చున్నారు. "ఇప్పుడు చెప్పండి. ఏమిటి మాట్లాడాలన్నారు?" కుతూహలంగా అడిగాడు రామరాజు.
"ఈమధ్య మీ హేమవచ్చినప్పుడు సుధీర్ ఆమెను నాకు పరిచయంచేశాడు. ఆమెను వివాహం చేసుకోవాలన్నకోరిక కలిగింది నాకు. ఈ విషయంలో మీ అంగీకారం పొందడానికి వచ్చాను...." చిరునవ్వుతో మాట్లాడాడతను.
రామరాజు ఆశ్చర్యపోయాడు. అంతవరకూ ఆవహించిన చిరాకంతా దూరమయిపోయింది. అతనికి కొంత గర్వంగా కూడా వుంది. తన కూతురుని సుధీర్ వివాహంచేసుకోకపోతే అతన్నిమించిన వాళ్ళు బ్రతిమాలి చేసుకొంటారు.
"మీరేం చేస్తూంటారు?" అడిగాడతను శ్రీనివాసరావుని పరీక్షగా చూస్తూ.
"సుధీర్ డిపార్టు మెంటులోనే మరో విభాగంలో సీనియర్ క్లర్క్ గా ఉన్నాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. త్వరలో మరో ప్రయివేట్ కంపెనీలో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరు గా వెళ్ళబోతున్నాను. అఫ్ కోర్స్ ఇంటర్వ్యూలో సెలక్టయ్యాను లెండి కొంచెం టైముపడుతుంది అంతే!" రామరాజు సంతృప్తిపడ్డాడు.
"మీవాళ్ళంతా ఎక్కడున్నారు?" అడిగాడతనిని.
"మా ఊళ్ళోనే! ఉయ్యూరు".
"మీ పెద్దవాళ్ళనోసారి మా ఇంటికి పంపితే అన్ని విషయాలూ మేమూ మాట్లాడుకుంటాము."
"ఓ తప్పకుండా పంపుతాను" సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ అన్నాడతను.
"ఒక్క నిముషం కూర్చోండి! టీ తెస్తాను" అంటూ లేచి కౌంటర్ దగ్గర టోకెన్ తీసుకొని టీ తీసికొని వచ్చాడు రామరాజు.
"హేమ అభిప్రాయం కూడా కనుక్కుని నేను మీకు ఉత్తరం రాస్తాను. అప్పుడు మీ వాళ్ళను పంపితే బావుంటుంది...."
"అలాగేనండీ?" ఇద్దరూ టీ తాగి బయటికొచ్చారు.
"ఇంకనే వెళతానండీ! థాంక్యూ వెరీమచ్!" అనేసి శెలవు తీసుకొని బయటకు నడిచాడు శ్రీనివాసరావ్.
అతనికి మబ్బుల్లో తేలిపోతున్నట్లుంది ఇంత తేలిగ్గా ఈ వ్యవహారం సెటిలయిపోతుందనుకోలేదు తను. ఇంక తమ వివాహానికి ఎదురయే అడ్డంకులేమీ కనిపించడం లేదు తనకి. హేమ ఎలాగూ వప్పుకొంటుంది. ఆ తరువాత అంతా రోజుల్లోనే జరిగిపోతుంది.
హోటల్ చేరుకొని గది ఖాళీచేసి బస్ స్టాండ్ చేరుకొన్నాడతను ఉయ్యూరు వెళ్ళే బస్ సిద్దంగా ఉందక్కడ. బస్ లో ఎక్కి కూర్చున్నాడు శ్రీనివాసరావ్. తన తల్లిదండ్రులతో తనకే ఇబ్బందీలేదు తనెలా చెపితే అలా వింటారు తమ వంశంలో తనలా చదువుకొన్న వారెవ్వరూ లేరు.
అసలు పట్నం జీవితమే తెలీదు వారికి. అంచేత తను ఏం చేసినా మంచికోసమే చేస్తాడన్న అవగాహన ఉంది. ఆ కారణం చేతే తమ బంధువులమ్మాయ్ నాగమణిని తనకిచ్చి వివాహం చేయాలనివారు అనుకొన్నప్పుడు తను నిరాకరిస్తే ఎలాంటి కోపతాపాలూ లేకుండా ఊరుకొన్నారందరూ. నాగమణి గుర్తురాగానే నవ్వు వచ్చింది శ్రీనివాసరావుకి. ఆ అమ్మాయిని తను వాళ్ళ అక్కయ్యపెళ్ళిలో చూశాడు. అప్పుడే ఆమెను తనకిస్తే బావుంటుందన్న ఆలోచన కలిగింది ఆమె తల్లిదండ్రులకు. నాగమణి అందంగానే వుంటుంది. కానీ చదువుబొత్తిగాలేదు. అదీగాక ఆమె పల్లెటూరివాతావరణంలో పుట్టి పెరిగింది.
ఇంకా ఆనాటి అలంకరణలు ఆమెని వదల్లేదు. కట్టూబొట్టూ అంతా పల్లెటూరి తరహాయే! అలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే జీవితమంతా ఆమెను ఆధునికంగా మార్చడానికే సరిపోతుంది తను ఉద్యోగ రీత్యా ఎప్పుడూ పట్నాల్లోనే ఉండక తప్పదు. మరి పట్నం వాతావరణంలో ఇమడడం ఆమెకూ కష్టంగానే ఉంటుంది. అసలు తనక్కాబోయే భార్యా అలంకరణల్లో ఆధునికంగా ఉండాలని తనకోరిక. అంటే కొంతయినా చదువుండాలి మరి! తను ఆఫీసులోనే కొంతమంది అమ్మాయిలున్నారు. వారిని చూస్తుంటే తనకెంతో ముచ్చటగా ఉంటుంది. మగాళ్ళలాగానే పాంటూ, షర్టూ వేస్తారు. వాళ్ళు మాటలూ, చేష్టలూ అన్నీ వింతగా ఆకర్షణీయంగా కనబడతాయి తనకి. తన భార్య కూడా మరీ అలా కాకపోయినా కనీసం కొంత వరకయినా ఆధునికంగా వుంటే బావుండునన్నకోరిక కలిగింది. తనుకోరుకున్న వన్నీ హేమలో కనిపించాయ్ తనకి. అన్నిటినీ మించిన అందం ఆమెకుంది.
కండక్టర్ గంట కొట్టాడు. బస్ బయల్దేరింది శ్రీనివాసరావ్ ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. బస్ వేగంగా పోతుంటే చల్లనిగాలి ఆహ్లాదంగా వీస్తోంది. అటూ ఇటూ పచ్చని పొలాలు సుందరంగా కనబడుతున్నాయ్. బస్ ఉయ్యూరు చేరుకొనేసరికి సాయంత్రమైపోయింది. బస్ దిగి రోడ్డు వెంబడే నడవసాగాడతను. చాలా రద్దీగా ఉందా రోడ్డు. క్రిక్కిరిసిపోయిన జనం, బస్సులు, రిక్షాలు అన్నీ అక్కడే జామ్ అయిపోయినట్లున్నాయి. హోటళ్ళల్లోనుంచి బిగ్గరగా సినిమాపాటలు వినబడుతున్నాయి. ఓ రిక్షా జనం మధ్య నెమ్మదిగా కదులుతూంది. ఓ రాజకీయ మహాసభ కు రమ్మని మైకులో ప్రాధేయపడుతున్నాడు. శ్రీనివాసరావ్ కి నవ్వొచ్చింది. తన చిన్నప్పటినుంచీ ఈ ఊళ్ళోనే ఉన్నాడు తను. రాజకీయ పార్టీలు, సభలు ఎక్కువవుతున్నాయి గానీ ఊరుమాత్రం అలాగే ఉంది. ఏమాత్రం సౌకర్యాలు మెరుగుపడలేదు. మురికిగుంటలు మాత్రం ఎక్కువయ్యాయి. ఇంట్లో అడుగుపెడుతున్న అతనిని చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.
"అదేమిటి! ఉత్తరం ముక్కయినా లేకుండా వచ్చేశావ్?" అన్నాడు తండ్రి శివరామయ్య.
"అనుకోకుండా వచ్చేశాను నాన్న!" అన్నాడు బూట్లు విప్పుతూ అన్నాడు శ్రీనివాసరావు.
"నాలుగురోజులు శెలవు పెట్టావా మరి?" అడిగింది సీతమ్మ.
"రెండురోజులుంటా మళ్ళీ ఎలాగూ వచ్చే నెలలో పండక్కి రావాలి కదా!"
"కాఫీ తెస్తానుండు....." హడావుడిగా వంటింటివేపు నడిచిందామె. బట్టలు మార్చుకొని పడక్కుర్చీలో కూలబడ్డాడు శ్రీనివాసరావ్. సరిగ్గా అప్పుడే లోపలికి అడుగుపెడుతున్న నాగమణిని చూసి ఆశ్చర్యపోయాడతను. నాగమణి చేతిలో పుస్తకాలున్నాయి. అతనిని చూసి సిగ్గుపడి పైట సర్దుకుని లోపలకు వడివడిగా నడిచిందామె.
శ్రీనివాసరావ్ ఇంకా ఆశ్చర్యంనుంచి తేరుకోలేదు అతని ఆశ్చర్యం గమనించి శివరామయ్య నాగమణి గురించి చెప్పేడు." మరేం లేదు నాగమణి మెట్రిక్ పరీక్షకు కడుతోందిట. త్వరలో పరీక్షలున్నాయి. ఈలోగా ట్యుటోరియల్ కాలేజీలో కొద్దిరోజులు చదువుకొందామని ఇక్కడికొచ్చింది. ఈ రెండు మూడు నెలలు మనింట్లోనే ఉంటుంది."
"అదా!" ఇంకా ఆశ్చర్యంతోనే అన్నాడు శ్రీనివాసరావ్. అతనికి నవ్వొచ్చింది. ఇప్పుడు చదువు మొదలెడుతోందా? ఎందుకు? ఈ వయసులో చదువుకొని ఏం చేయడానికి!'
'కానీ ఇప్పుడు చదువు మీద శ్రద్ద పుట్టుకొచ్చిందేమిటి వాళ్ళకి!" నవ్వుతూ అడిగాడతను. శివరామయ్య కూడా నవ్వాడు.
"ఏదోలే ఆ పిల్లకి చదువుకోవాలని ఉందట!" ఈ లోగా సీతమ్మ కాఫీ తీసుకొచ్చి అందించిందతనికి.
"నాగమణిని చూశావా?" అడిగిందామె నవ్వుతూ.
"ఆ! అదే అడుగుతున్నానునాన్నని! మెట్రిక్ కి వెడుతోందట కదా!"
"అవును!" అని కొద్ది క్షణాలాగి అతని దగ్గరగా జరిగి రహస్యంగా చెప్పిందామె.
"అసలు మెట్రిక్ ఎందుకు చదువుతోందో తెలుసా? చదువులేని అమ్మాయిని చేసుకోనని నువ్వు అన్నావు కదా! అందుకని కోపం వచ్చి పట్టుదలతో చదువుతానని పేచీ పెట్టిందట! పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేస్తుందట! అసలు పెళ్ళే చేసుకోదట...." శ్రీనివాసరావ్ నిర్ఘాంతపోయాడు.
తను నిరాకరించడం వల్ల ఆమెలో పట్టుదల కలిగిందన్నమాట! చాలా మొండి మనిషిలానే ఉంది చూస్తుంటే. అంతలోనే ఆమె మీద జాలి కూడా కలిగిందతనికి. తను నిరాకరించడంవల్ల ఆమె బాగా 'హర్ట్' అయినట్లుంది. కానీ అందులో తన తప్పు మాత్రం ఏముంది?" ఆమె నొచ్చుకుంటుందని తను తనకిష్టంలేని వివాహం ఎలా చేసుకోగలడు?
"మేమే నీకు ఉత్తరం రాద్దామనుకుంటున్నాము రమ్మని ఈలోగా నువ్వేవచ్చావు" అన్నది సీతమ్మ.
"ఎందుకు?".