"ఇంతకూ పెళ్ళికొడుకు ఎవరు?" అడిగింది వసుంధర. "పేరు శ్రీనివాసరావు! మా బావ సుధీర్వాళ్ళ ఆఫీసే అతనిదీ!"
"ఏం చదువుకొన్నాడు?"
"పోస్ట్ గ్రాడ్యుయేట్!"
"అతనిని చూశావా?"
"చూడటమేమిటి? నేను హైద్రాబాద్ వెళ్ళినప్పుడు మాతోపాటు అతనూ షాపింగ్ కొచ్చాడు!".
"ఓహో! అలాగయితే అంతా అర్దమయిందిలే!" ఉడికిస్తూ అంది వసుంధర.
"ఇదేం లవ్ మారేజ్ కాదులే! ఏదో కనుక్కొన్నట్లు ఫోజివ్వనవసరంలేదు".
చంద్రకాంత్ వారి సంభాషణ భరించలేకపోతున్నాడు. హేమ ఆమె వివాహం విషయం అంత ఈజీగా తీసుకోవడం అతనికి నచ్చలేదు. ఆమెని అంతగా అభిమానించే తన గురించి అసలు పట్టించుకోనేలేదన్న మాట! ఆమెను రహస్యంగా ఆరాధిస్తున్న తన మనసుని ఆమె అర్ధం చేసుకోలేదన్న మాట! అవును! మానెఉ తను రాత్రింబగళ్ళు లోపలే స్మరిస్తున్న విషయం ఆమెకు తెలీదు. రోజూ తనకలల్లో ఆమె విహరిస్తోందన్న నిజం ఆమెకు తెలీదు. ఆమె తన ప్రణయ సామ్రాజ్యానికి ఏనాడో అధిపతిగా చేసిన సంగతి ఆమెకు తెలీదు. ఆమె లేనిదే తన జీవితమే లేదన్న విషయం ఆమెకు తెలీదు. ఇప్పుడేమిటి చేయడం?
తన ప్రేమను ఆమెకు తెలియజేయాలా? ఆమెను అతనితో వివాహానికి అంగీకరించవద్దని ప్రాధేయపడాలా? ఆమె ఆ వివాహం చేసుకుంటే తను తన జీవితం ముగిస్తానని బెదిరించాలా? ఏమీ అర్ధం కావడంలేదతనికి. అయినా తన మాటలు ఆమె లెక్క చేస్తుందా? చిన్నపిల్లాడి మాటలని కొట్టిపారేస్తుంది. ఆమెకంటే చిన్నవాడయిన తనకు అలాంటికోరికలు తగవని మందలిస్తుంది. చంద్రకాంత్ వుక్రోషం ముంచుకొచ్చింది కోపంగా ఆమెవేపు చూశాడతను.
నేనింక వెళతాను వసుంధరా!" లేచి నిలబడుతూ అన్నదామె.
"అదేం? రైలు వచ్చేవరకూ ఉండవా!" "ఊహూ! నువ్వు వెళ్ళిపోతూంటే చూస్తూ వుండడంనాకు బావుండదు! అందుకని ముందే వెళ్ళిపోతాను!"
"సరే!"
"హైద్రాబాద్ వెళ్ళగానే ఉత్తరం రాస్తావు కదూ?"
"ఓ నువ్వెంత ప్రాంప్టుగా జవాబిస్తావో చూస్తాను"
"ఓకే చంద్రకాంత్! నువ్వేమీ మాట్లాడనేలేదు. అప్పుడే మర్చిపోయావా ఏమిటి నన్ను?" అతనిని నవ్వుతూ పలకరించిందామె.
"అవునవును! ఎవరు మర్చిపోయిందీ మీకే తెలుసు....." నిష్టూరంగా అన్నాడతను.
"ఓహో! ముందే నేరం నామీదకు నెట్టేస్తే సరిపోతుందనుకుంటున్నావా! సరే! నేను వెళుతున్నానిక!" అందామె.
"పదండి! బయటవరకూ వస్తాను" ఆమెతోపాటు స్టేషన్ బయటకు నడుస్తూ అన్నాడతను. ఇద్దరూ వెయిటింగ్ రూమ్ లో నిండిపోయిన జనంమధ్య నుంచీ తప్పించుకుని రిక్షా స్టాండ్ దగ్గరకు చేరుకున్నారు.
"మీది చాలా కఠినమయిన మనసు!" అన్నాడు చంద్రకాంత్ హఠాత్తుగా.
ఆమె ఆశ్చర్యపడింది. "నాదా?"
"అవును!"
"ఎందుకని?"
"నేను చెప్పను!"
"అదేమిటి? కారణం చెప్పకుండా స్టేట్ మెంటిస్తే ఎలా సరిపోతుంది?" నవ్వుతూ అడిగింది.
"కారణం ఏమిటో మీ మనసుకి తెలుసు!" తిరిగి అన్నాడతను.
"బావుంది! తెలిస్తే అడగడం దేనికి?"
అతనికేం చెప్పాలో తెలీటంలేదు. "సరే పోనీండి!" అన్నాడు నిదానంగా.
అతనేదో బాధపడుతున్నాడని గ్రహించిందామె.
"రిక్షా కావాలామ్మా?" రిక్షా వాడు వచ్చి నిలబడ్డాడు.
"అవును!" రిక్షా ఎక్కి కూర్చుందామె. "ఇంక వెళతాను చంద్రకాంత్!" అంది ఆప్యాయంగా.
"వెళ్ళండి! మీరు నన్ను అర్ధం చేసుకోలేరు!" అనేసి గిరుక్కున వెనక్కు తిరిగి స్టేషన్ లోకి నడిచాడతను.
ఆమె చకితురాలయింది చంద్రకాంత్ ప్రవర్తనకూ అతని గురించే ఆలోచిస్తూండిపోయింది. అతనెందుకలా అన్నాడు? అతనిని తను అర్ధం చేసుకోకపోవడమేమిటి? తనది కఠినమయిన మనసని ఎందుకన్నాడు? అసలతని ఆంతర్యం ఏమిటి? తనకు తెలిసి తను అతనితో ఎప్పుడూ దురుసుగా వ్యవహరింపలేదే! అతని మనసు కష్టపెట్టుకొనేలా ఎప్పుడూ ప్రవర్తించలేదే! మరెందుకతనలా మాట్లాడాడు? అతనిని తను అర్ధం చేసుకోవడమేమిటి? ఏమీ పాలుపోలేదామెకి.
* * * * * *
శ్రీనివాసరావ్ హైద్రాబాద్ చేరుకునేసరికి అప్పటికే రామరాజు రాసిన ఉత్తరం ఆఫీసులో తన టేబుల్ మీదుంది. అతనికీ, హేమకూ వివాహం చేయడానికి తాము అంగీకరిస్తున్నామనీ, అతని తరపు పెద్దవాళ్ళు ఏ రోజయినా సరే వస్తే మిగతా విషయాలన్నీ మాట్లాడి ముహూర్తాలు నిశ్చయించగలరనీ తెలియజేశాడతను.
శ్రీనివాసరావ్ ఆ ఉత్తరం తీసుకుని వెంటనే సుధీర్ ఆఫీస్ కి చేరుకున్నాడు.
"ఏమయింది?" అడిగాడు సుధీర్ ఆత్రుతగా.
"వెళ్ళి రామరాజుగారితో అన్నీ మాట్లాడాను! అన్నీ ఆలోచించుకుని ఏ సంగతీ నాకు తెలియజేస్తామన్నారు. నేను అట్నుంచి అటు మా ఊరెళ్ళి ఇవాళే ఆఫీసు చేరుకొనేసరికి-ఇదిగో-ఈఉత్తరం ఉంది!" అంటూ తన చేతిలోని ఉత్తరం అతని కందించాడు శ్రీనివాసరావ్.
ఉత్తరం చదివి "వెరీగుడ్! కంగ్రాచ్యులేషన్స్!" అన్నాడు సుధీర్ నవ్వుతూ.
"థాంక్యూ! నీ సహకారం లేకపోతే ఇది ఇంత త్వరగా సక్సెస్ అయేది కాదు!".
"నోనో! నేను నీకేం సహాయం చేశానని? వాళ్ళ అడ్రస్ ఇచ్చాను అంతేగా!"
"అఫ్ కోర్స్! కానీ నేను నీ స్నేహితుడినన్న విషయం కొంత వరకూ నామీద సదభిప్రాయం కలుగజేసిందాయనకు! నా గురించి మళ్ళీ ఆరాలు, విచారణలు చేసే అవసరం తప్పిపోయింది".
"సరే! అంతగా నా సహకారం ఉందనుకొంటే ఓ పార్టీ ఇద్దూగానిలే! బాకీతీరిపోతుంది!" నవ్వుతూ అన్నాడు సుధీర్.
"ష్యూర్!"
ఇద్దరూ మరికాసేపు మాట్లాడుకొన్నాక అక్కడి నుంచి వచ్చేశాడు శ్రీనివాసరావ్.
ఆ రోజునుంచే అతను హేమ తనింటికి వచ్చేసరికి ఇల్లు ఎలా ఉండాలో, ఇంట్లో ఏమేం వస్తువులుండాలో ఆలోచించడం మొదలుపెట్టాడు. హేమలాంటి అందాల భరిణనుయెంత సుకుమారంగా చూసుకోవాలో తనకు తెలుసు. ఆమెకు తనింట్లో ఏ విధమయిన ఇబ్బందీ కలుగకూడదు. ఆ రోజే తన తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడతను ఆ తరువాత సంఘటనలన్నీ అతివేగంగా జరిగాయ్. అతని తల్లిదండ్రులు రామరాజు దగ్గరకెళ్ళడం- ఆ తరువాత లగ్నాలు లేకపోవడంవల్ల వెంటనే ముహూర్తాలు నిశ్చయించుకోవడం జరిగిపోయింది. ఇరవై రోజుల్లోనే పెళ్ళి ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకోవాల్సి వచ్చింది.
శ్రీనివాసరావు నెలరోజులు శెలవు తీసుకున్నాడు. బయల్దేరే రోజునే అతనికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ వచ్చాయ్ శెలవు పూర్తవగానే విజయవాడలో జాయినవాలి. తన ఊరికి దగ్గరలో ఉండవచ్చని ఆ ట్రాన్స్ ఫర్ కోసం తనేకొద్ది రోజుల క్రితం ప్రయత్నించాడు.
వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. పెళ్ళిళ్ళల్లో సాధారణంగా కనిపించే ఆచారాలెన్నో పక్కకి నెట్టివేయబడ్డాయ్. అలా జరిగినందుకు శివరామయ్యా, సీతమ్మా నొచ్చుకున్నా, హేమపట్టుబట్టటంవలన చేసేది లేక ఊరుకున్నారు. పీటల మీద తలవంచుకోకుండా కూర్చుని నవ్వుతూ, తుళ్ళుతూ స్నేహితురాండ్రతోనూ, బంధువులతోనూ మాట్లాడే హేమను చూస్తూంటే వారికి అయిష్టం ప్రారంభమయింది. మొదటిరాత్రికోసం సన్నాహాలు ప్రారంభిస్తుంటే హేమ సరాసరి శ్రీనివాసరావ్ దగ్గరకు నడిచి అతనితోనే మాట్లాడుతూ కూర్చుంది చాలా సేపటివరకూ! ఇది సీతమ్మకు మరింత విడ్డూరమనిపించింది. ఏమీ అలంకరణలు లేకుండానే శోభనం గదిలో అడుగు పెట్టిన ఆమెను చూసి నవ్వుకొన్నాడు శ్రీనివాసరావ్.
నిజమే! ఇంత అందమయిన అమ్మాయికింకా అలంకరణలెందుకు?
"ఏమిటి అలా చూస్తున్నారు! గంగిరెద్దువేషం వేయలేదనా?" నవ్వుతూ అడిగిందామె అతనికి సమీపంగా వచ్చి.
"ఊహు! అది కాదు! అందమయిన అమ్మాయికి అలంకరణలు అనవసరం అని నాకిప్పుడు తెలిసింది!" నవ్వుతూ అన్నాడతను.