చిరంజీవి కొంచెం కంగారుపడ్డాడు.
"నేనా? నేనూ... నేను.... మామూలుగానే ఉన్నానండీ"
"నేనడిగేది అసలీ రూమ్ కెలా వచ్చావని!"
"అదా? అది భలే అనెక్స్ పెక్టెడ్ గా జరిగిపోయిందిలెండి"
సింహాద్రి ఠక్కున అందుకున్నాడు.
"అవును మావయ్యా! చాలా తమాషాగా జరిగింది"
"ఏమిటా తమాషా"
"నాకు సడెన్ గా అబిడ్స్ రోడ్ మీద కనిపించాడు. అదీ సర్దార్జీ గాలిలోకి లేపబట్టి క్లియర్ గా కనిపించాడు గానీ లేకపోతే కలుసుకునేవాళ్ళం కాదు.'
"అవునవును! సర్దార్జీ తన కాలేజ్ డేస్ లో మాంచి స్పోర్ట్స్ మెన్ అయివుండాలి" ఒప్పుకున్నాడు చిరంజీవి.
"లేదా వెయిట్ లిఫ్టింగయినా ప్రాక్టిస్ చేసివుండాలి. సో- తనూ ఇక్కడే వర్క్ చేస్తున్నానని చెప్పాడు మావయ్యా! పాపం రైల్వేవాళ్ళు క్వార్టర్సు ఇవ్వలేదట! అందుకని ఫ్లాట్ ఫారం మీదే ఉంటున్నాడట. అలా ఎప్పుడూ ఫ్లాట్ ఫారం మీద ఉంటే పాపం పాసింజెర్స్ కి కష్టం కదా! అందుకని నా రూంకి వచ్చేయమన్నాను"
విశ్వనాథానికి మళ్ళీ కోపం ముంచుకొచ్చింది.
వాళ్ళిద్దరూ కాలేజీలో చదివే రోజుల్లోనే ఇద్దరినీ ఒకే రూమ్ లో ఉండకుండా వేరువేరుగా ఉంచేలా ఎన్నో ప్రయత్నాలు చేశాడు తను. కానీ కుదరలేదు. ఓకే క్లాసులో ఉండకుండా చేయమని ప్రిన్సిపాల్ కి కూడా ఉత్తరాలు రాశాడు. అయినా ఫలించలేదు. చివరకు ఈ ఉద్యోగం పుణ్యమా అని సింహాద్రి హైదరాబాద్ లో చిరంజీవికి దూరంగా ఉంటాడని ఆశపడ్డాడు. కానీ ఏమయింది? ఆ చిరంజీవి వెధవ కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తూ తయారు.
"అయితే నీకు పాపం క్వార్టర్స్ ఇవ్వలేదన్నమాట." అడిగాడు విశ్వనాథం ఆలోచిస్తూ. ఎలాగోలా వాళ్ళిద్దరినీ వేరు చేయకపోతే మళ్ళీ ఇద్దరూ కలసి నానా రభసా చేస్తారు. అంతేకాదు. వాడి మాటలు వింటే సింహాద్రిగాడు వట్టి జులాయి వెధవ అవాల్సిందే.
"ఇవ్వలేదండీ!" చెప్పాడు చిరంజీవి.
"ఎందుకని?"
"దానికి చాలా పెద్ద రికమండేషన్ కావాలండీ! రైల్వే మినిష్టరుదో లేక మా జనరల్ మేనేజర్ గారి ఫ్యూన్ దో రికమండేషనుంటే గానీ ఇవ్వరు."
"అయితే ఓ పని చేద్దాం! నేనే నీకు వేరే ఇంకో మాంచి రూమ్ వెతికి పెడతాను"
చిరంజీవికి పరిస్థితి అర్ధమయిపోయింది. కానీ అర్ధం కానట్లు మొఖం పెట్టాడు.
"అబ్బే! ఎందుకండీ మీకాశ్రమ! ఎలాగోలా ఈ రూమ్ లోనే ఎడ్జస్టయి పోతాం! కదురా?" సింహాద్రి నడిగాడతను.
"అవును మావయ్యా ఏం ఫరవాలేదు వుయ్ కెన్ మానేజ్"
"అదీగాక నాకెప్పుడూ నైట్ డ్యూటీలు గనుక రాత్రుళ్ళు నేనింట్లో వుండను. సింహాద్రికి పగలు ఆఫీస్ గనుక వాడు పగలు ఇంట్లో వుండడు."
విశ్వనాథం ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. కానీ లోపల మాత్రం అశాంతి పేరుకు పోతోంది.
"ఇద్దరికీ ఇప్పుడే వార్నింగిస్తున్నాను గుర్తుంచుకోండి! మళ్ళీ అడ్డమయిన కుక్కల్నీ తెచ్చి రూమ్ లో పెట్టి పెంచారంటే మాత్రం మర్యాదగా వుండదు" అన్నాడు కోపం అణచుకుంటూ.
"కుక్కల్నా? ఎందుకు వాటిని పెంచడం? నోనోనో.... అలాంటి హాబీలన్నీ ఎప్పుడో మానేశాం మావయ్యా!"
"అవునండీ! కాలేజ్ డేస్ లోనే మానేశాం! అదంతా పిచ్చిపని"
"అలా అని నన్ను నమ్మమంటారు?" అడిగాడు విశ్వనాథం.
"సెంట్ పర్సెంట్ నమ్మాలండీ! మేము ఒకటి రెండు వెధవపనులు చేస్తే చేసి వుండవచ్చు. కానీ అబద్దాలు మాత్రం ఎప్పుడూ చెప్పలేదు"
"నెవర్ నెవర్....." అన్నాడు సింహాద్రి.
"ఒకవేళ ఎప్పుడయినా ఏదయినా అబద్దం చెప్పినా అదంతా కేవలం అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన పనేగాని ఇన్ టెన్షనల్ కాదు"
"సెంట్ పర్సెంట్ కరెక్ట్!"
"అసలు ఇద్దరం అబద్దాలంటే ఎంతో అసహ్యించుకుంటామండీ! మొన్నోరోజు మా ఫ్రెండొకడు ఇలాగే అబద్దం చెప్తే వాడిని ఇంకోసారి మా కంటికి కనబడవద్దని వార్నింగిచ్చాం! అసలు మీతో మాత్రం ఒక్కసారయినా అబద్దం చెప్పామా?"
విశ్వనాథానికి వళ్ళు మండిపోతోంది.
"లక్షసార్లు చెప్పారు" అన్నాడు కసిగా.
"ఎప్పుడు?"
"ఎప్పుడూ చెప్పేది అబద్దాలే అయితే ఇంక గుర్తెలా వుంటుంది?"
"నోనో! యూ ఆర్ మిస్టేకెన్ సర్! అబద్దాలు చెప్పడం ఎప్పుడూ జరగలేదు. కేవలం మీరు మమ్మల్ని అపార్ధం చేసుకుంటున్నారు. అంతే" సింహాద్రిని బ్రహ్మాండంగా సపోర్ట్ చేయాలని నిశ్చయించుకుని అన్నాడు చిరంజీవి.
సరిగ్గా అప్పుడే అంతకుముందు రోజు సింహాద్రి ఆరు బిస్కెట్లు పెట్టిన కుక్క మళ్ళీ ఆ రోజు కోటా కోసం గదిలో కొచ్చేసింది వేగంగా. వచ్చి అక్కడున్న ముగ్గురినీ చూసి, ఎందుకయినా మంచిదని పలుకరింపుగా నవ్వి అప్పుడు సింహాద్రి భుజాల మీద రెండు కాళ్ళూ వేసి ఆప్యాయంగా మొఖమంతా నాకబోయింది.
సింహాద్రి మొఖం పాలిపోయింది.
"ఛీ ఫో" అన్నాడు కంగారుగా.
ఆ కుక్క అతని మాటలు పట్టించుకోలేదు. ఎందుకంటే కొంతకాలం అది ఓ మంత్రిగారింట్లో వుంది. అంచేత సిగ్గూ, శరం అంటే ఏమిటో బొత్తిగా మర్చిపోయింది.
మొఖం నాకే కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా వేసి బిస్కెట్ల కోసం అతనిచుట్టూ తిరిగి వెతకసాగిందది.
విశ్వనాథం మళ్ళీ అగ్గి అయిపోయాడు.
"ఏమిటిది?" అన్నాడు ఛాన్స్ దొరికింది గదాని.
"కుక్క" అన్నాడు చిరంజీవి.
"వీధి కుక్క" అన్నాడు సింహాద్రి. ఎలాంటి అనుమానాలకూ తావు లేకుండా!
"వీధి కుక్కని తెలుసులేవోయ్. ఆ విషయం దాని మొఖం చూస్తేనే తెలుస్తోంది. అదిప్పుడు ఈ గదిలోకెందుకొచ్చిందని అడుగుతున్నాను"
సింహాద్రికేం చెప్పాలో తెలీలేదు. సహాయంకోసం చిరంజీవివేపు చూశాడు. చిరంజీవి గొంతు సవరించుకున్నాడు.
"అదే మేమూ చూస్తున్నాం. ఇంత ధైర్యంగా లోపలికెలా వచ్చిందా అని. ఛీ ఫో" అంటూ దానిని బయటికి తరమబోయాడు.
అది పరిస్థితి గ్రహించి సింహాద్రిని వదిలి చిరంజీవి దగ్గరకొచ్చి అతని మొఖం నాకడానికి ప్రయత్నం చేయసాగింది. అతనిని కూడా మంచి చేసుకుంటేగాని తనకు రిలీజ్ చేయాల్సిన బిస్కెట్ల కోట తనకు గిట్టదని అనుమానం కలిగింది దానికి.
"ఇలాంటి దగుల్భాజీ అబద్దాలు చెప్పడానికి సిగ్గుండాలి" అన్నాడు విశ్వనాథం.
"నిజంగా మావయ్యా! ఇది మాది కాదు" అన్నాడు సింహాద్రి.
"మీద కాకపోతే పొమ్మన్నగానే బయటకు పోదేం?"
"అదే మాకూ అర్ధం కావటం లేదు" అంటూ చిరంజీవి లేచి దానిని కాలితో తన్నబోయాడు. ఆ కుక్కదగ్గర ఓ గుణం వుంది. అదేమిటంటే తననెన్ని తిట్టినా సహిస్తుంది. ఎంత అవమానాల పాల్జేసినా ఒప్పుకుంటుంది. తిండి పెట్టకపోయినా కాళ్ళదగ్గరే పడివుంటుంది. కాని తిండి పెట్టకపోగా, తన్నబోతే మాత్రం ఎక్కడలేని తిక్క పుట్టుకొస్తుంది. తిక్క పుట్టుకొచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తుందో దానికే తెలీదు. ఎలక్షన్ లో ఓడిపోయిన మినిష్టరుగారు ఆ కోపంలో దానిని తన్నబోయినప్పుడు ఇలాగే తిక్కరేగి అందినచోటల్లా కరచి ఆ ఇల్లు వదిలి రోడ్డునపడింది. మళ్ళీ ఆ ఇంటి మొఖం చూడలేదు. ఇప్పుడు చిరంజీవి చేయబోయిన విన్యాసం కూడా దానికి నచ్చలేదు. అంచేత పళ్ళు బయటపెట్టి గుర్రుమంది. దాంతో ఆటోమేటిగ్గా చిరంజీవి ఎగిరి సింహాద్రి మంచంమీద నిలబడ్డాడు. అతను ఎగరడం వల్ల అల్మారా మీదున్న పుస్తకం చేతికి తగిలి శరవేగంతో ఎగిరి విశ్వనాథం భుజం మీద తాకటం, విశ్వనాథం ఉలిక్కిపడి ఎగిరి గెంతడం, అతనలా ఎగరడం కేవలం తనమీద దండయాత్రకే అని ఆ కుక్క మనస్ఫూర్తిగా నమ్మి అతని కాలిని కసిగా కొరికి పారిపోవడం అంతా చాలా త్వరగా సిస్టమేటిక్ గా జరిగిపోయింది.