రెండు నిమిషాలవరకూ రూమ్ నిశ్శబ్దంగా వుండిపోయింది. అప్పటికి గాని విశ్వనాథం షాక్ నుంచి తేరుకోలేదు. తేరుకుంటూనే అంతా గుర్తుకొచ్చి తన కాలివంక చూసుకుని కెవ్వుమని అరచాడు.
"అబ్బా.... అబ్బా! కరచింది! వెధవ కుక్క! దొంగ రాస్కెల్స్.. వెధవల్లారా! అందుకే కుక్కల్ని పెంచొద్దురా అంటే వినరు"
"అబ్బే- అది మా కుక్క కాదు మావయ్యా! ఇంకా పెంచుకోవటం లేదు దాన్ని" ప్రొటెస్ట్ చేయబోయాడు సింహాద్రి.
"నోర్మూసుకోరా పక్షీ! అది మీదే మీదే మీదే! మీదవబట్టే నన్ను కరిచింది! లేకపోతే నన్నే ఎందుక్కరుస్తుందీ అంట? మీ ఇద్దరినీ ఎందుక్కరవలేదూ అంట! అమ్మో అమ్మో! నేనిప్పుడు బొడ్డుచుట్టూ పధ్నాలుగు ఇంజక్షన్లు చేయించుకోవాలి"
చిరంజీవికి అతనిని చూస్తే జాలివేసింది.
"పధ్నాలుగు అక్కర్లేదండీ! ఎనిమిది చాలు!"
"ఎనిమిదేమిట్రా నీ బొంద! పధ్నాలుగూ చేయించుకోవలసిందే!"
"అక్కరలేదండీ! ఎనిమిది సరిపోతాయ్"
"నువ్వు నన్ను చంపాలనే ఎనిమిదంటున్నావ్. ఛస్తే నీ మాట వినను"
"మీరు చెప్పేది పిచ్చికుక్క సంగతి! మంచి కుక్కకి ఎనిమిది చాలండీ!"
విశ్వనాథం అనుమానంగా అతనివేపు చూశాడు.
"అసలేమీ అక్కర్లేదుగానీ ఎందుకయినా మంచిదని ఎనిమిది తీసుకుంటారు"
"ఎవరు?"
"అందరూ!"
"ఇంతకూ అసలది మంచిదో కాదో నీకెలా తెలుసు?"
"తెలుసండీ! అది మంచిదే"
"అదే నీకెలా తెలుసూ అనడుతున్నాను"
"దాని వాలకం చూస్తే తెలీటంలేదూ! అది మనవంక చూసేప్పుడు సూటిగా మన కళ్ళల్లోకి చూస్తే మంచికుక్క అన్నమాటండీ! అలా కాకుండా విలన్ లాగా సైడ్ కి గానీ, వంకరగానీ చూస్తే పిచ్చి కుక్కన్న మాటండీ"
"ఇప్పుడది ఎలా చూసిందో గమనించలేదుగా మరి?"
"నేను చూశాను గదండీ! సూటిగా మీ కళ్ళల్లోకే చూసింది కరిచేముందు"
"ఇంతకూ అలా చూపులను బట్టి కుక్కను జడ్జ్ చేసే టెక్నిక్ నీకెవరు నేర్పారు?"
"చదివి తెలుసుకున్నానండీ"
"ఏం చదివావ్?"
"కుక్కలూ వాటి చూపులూ అన్న పుస్తకం"
"ఎందుకు చదవాల్సి వచ్చింది ఆ పుస్తకం?"
"కాలేజ్ హాస్టల్లో ఉండేప్పుడు ఇలాగే చాలామంది మా జాకీ కరచిందని పధ్నాలుగు ఇంజక్షన్లు తీసుకోవటం మొదలు పెట్టారండీ! పధ్నాలుగు అవసరం లేదురా- ఎనిమిది చాలని ఎంత చెప్పినా వినిపించుకో పోయేసరికి, చివరకు ఆ పుస్తకంకొని తీసుకొచ్చి స్పెషల్ క్లాస్ పెట్టి చదివి వినిపించామండీ"
"ఇప్పుడుందా ఆ పుస్తకం?"
"లేదండీ"
"ఏమయింది?"
"ఆ పుస్తకాన్ని నమ్మి ఎనిమిదే ఇంజక్షన్లు చేయించుకున్నడొకడికి హఠాత్తుగా పిచ్చెక్కి ఆ పుస్తకం నమిలి తినేశాడండీ! అయితే వాడికి పిచ్చెక్కడానికి వేరే కారణం ఉందిలెండి! మా కుక్క కరిచాక వాడిని మళ్ళీ ఓ గుర్రంకరిచిందట"
విశ్వనాధానికి వణుకు పుట్టుకొచ్చింది.
"గు... గు.... గుర్రమా?" అన్నాడు భయంతో ఆ తరువాత కొద్దిక్షణాల వరకూ మాట పెగల్లేదు. అసలు తనాగదికి ఎందుకొచ్చాడా అన్న విషయం కూడా మర్చిపోయాడు. ఎంత ఆలోచించినా లాభం లేకపోతోంది. ముందా విషయం చెప్పి పధ్నాలుగు ఇంజెక్షన్లలో మొదటిది తీసుకోడానికి డాక్టర్ దగ్గర కెళ్ళాలనుంది.
"అసలు నేను నీ గదికెందుకొచ్చానంటే....." అని రెండుసార్లని మళ్ళా ఆలోచనలో పడ్డాడు.
"ఒకవేళ నాకు పాతికేళ్ళునిండాయనీ, ఆస్తి నాచేతి కిచ్చేస్తున్నానీ చెప్పడానికొచ్చావేమో మావయ్యా" గుర్తు చేస్తూ అన్నాడు సింహాద్రి.
"పిచ్చివాగుడు వాగకు! ఆ విషయం నేను చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటాను. ఇంకా సంవత్సరం టైముంది! దానికి అసలు నేనొచ్చిన కారణం ఏమిటంటే ఆ..గుర్తుకొచ్చింది" అంటూ లేచి నిలబడి జేబులోనుంచి ఓ కవరు తీసి కవర్లోంచి ఓ ఫోటో బయటకు లాగి - వెంటనే దానిని సింహాద్రి మీదకు విసిరేశాడు.
"అందులో పిల్లన్జూడు! ఆ పిల్లతో నీ పెళ్ళి ఫిక్సయింది. ఆగస్ట్ ఇరవై ఆరున పెళ్ళి! తెల్సిందా!"
సింహాద్రి ఫోటో కేసి చూశాడు. చూసి కెవ్వున కేకవేశాడు.
"అదేమిటి మావయ్యా! ఇది మగపిల్లాడి ఫోటో"
"నోర్మూసుకో- మగపిల్లడేమిటి? అది ఆడపిల్లే!"
"కాదు మావయయా! ఫోటో తప్పుగా ఇచ్చినట్లున్నారు. ఇది మగాడే! స్పష్టంగా కనిపించటం లేదూ?"
"పిచ్చివాగుడు వాగద్దన్నానా? నేను చెప్తున్నాను. అది ఆడపిల్లే! తెల్సిందా?"
"కాదు మావయ్యా! ఇదిగో - నువ్వే చూడు"
విశ్వనాథం ఫోటో అందుకుని మళ్ళీ చూశాడు. అతని కోపం ఇంకా ఎక్కువయిపోయింది.
"నీకేం బుద్ధుందా లేదా? అమ్మాయి బొమ్మ లక్షణంగా కనబడుతోంటే - కాదు మగాడి ఫోటో అంటావా? ఏమోయ్ చిరంజీవి!"
"ఏమిటండీ?"
"నువ్వు చూడీ ఫోటో! ఇది ఆడపిల్లే కదూ!"
చిరంజీవి ఆ ఫోటో అందుకుని అయిదు నిమిషాలు పరీక్షగా చూశాడు. ఆ తరువాత అల్మారాలోనుంచి తన కళ్ళజోడు తెచ్చుకుని మరో రెండునిమిషాలు చూశాడు.
"ఆడపిల్లే అయుంటాండు!" అన్నాడు బెరుగ్గా.
సింహాద్రి ఆశ్చర్యపోయాడు.
"ఆడపిల్ల ఎలా అవుతాడ్రా"
"ఒరే సింహాద్రీ! వెధవ్వాగుడు వాగకు.ఈ పిల్లతో ఆగస్ట్ ఇరవై ఆరున నీ పెళ్ళి ఎరేంజ్ చేశాను తెల్సిందా!" అన్నాడు విశ్వనాథం కోపంగా.
"కాని ఇది మగ పిల్లాడు కదు మావయ్యా ?"