Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 8


    "ఎందుకేమిట్రా.... అలా చేయమన్జెప్పి మావయ్యే ఆ పోలీసులకు బోలెడు డబ్బిచ్చాడట"
    "కర్కోటకుడు"
    "మహా కర్కోటకుడు"
    "గుడ్ నైట్. నిద్రొచ్చేసింది" అనేసి గురక మొదలుపెట్టి నిద్రలోకి జారిపోయాడు చిరంజీవి.
    
                      * * * * *
    హఠాత్తుగా తమ పక్కనే ఏదో పెద్ద ప్రేలుడు సంభవించిన శబ్దమయేసరికి ఇద్దరకూ ఛటుక్కున మెలుకువ వచ్చింది.
    "ఏదో పెద్ద శబ్దం అయినట్లుంది కదూ?" కళ్ళు నులుముకుంటూ అన్నాడు సింహాద్రి.
    చిరంజీవి ఒప్పుకున్నాడు.
    "రెండు రైళ్ళు హెడాన్ కొలీజన్ అయినట్లు నాకు కలవచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఆ శబ్దం వినిపించే సరికి నిజంగా యాక్సిడెంట్ అయిందేమో అని భయం వేసింది"
    "ఇంతకూ ఆ శబ్దం ఏమిటంటావ్?"
    "ఏమో అదే అర్ధం కావటం లేదు"
    ఇద్దరూ మళ్ళా పడుకోబోతుండగా మరోసారి తలుపు మీద పేలుడు పదార్ధం విసిరినట్లు తలుపుకొట్టారెవరో!
    "అది మన తలుపుకొడుతున్న శబ్దం లాగుంది" అన్నాడు సింహాద్రి లేవకుండానే.
    "అవును ఏం చేద్దామంటావ్?"
    "తలుపు తీసి చూడు"
    "ఇంత అర్ధ రాత్రివేళ ఎవరయి ఉంటారంటావ్?"
    "ఏమో! ఇంటి ఓనరుకి మొన్నే అద్దె కట్టేశాను కదా- ఇకెవరబ్బా..."
    ఇద్దరూ ఆలోచనలో వుండగానే తలుపులు ఊడిపడేట్లు బాదారెవరో. ఆసారి ఆ శబ్దంతోపాటు ఒరే సింహాద్రి అన్న బండగొంతుకొకటి కూడా కలిసి వినిపించింది.
    చిరంజీవి లేచి వెళ్ళి తలుపు కొద్దిగా తెరచి చూశాడు.
    మరుక్షణం ఆ సందులోనుంచి లోపలకు దూసుకొచ్చాడు విశ్వనాథం.
    అతన్ని చూడగానే సింహాద్రి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.
    "నువ్వా మావయ్యా!" అన్నాడు గాబరాగా.
    "నీకేమైనా బుద్ధుందా?" అన్నాడు విశ్వనాథం ఉగ్రరూపం దాల్చి.
    సింహాద్రి కేమీ అర్ధం కాలేదు. అసలు ఇంత రాత్రివేళ మావయ్య తన రూమ్ కి రావడమే అయోమయంగా వుంటే, రాగానే "నీకు బుద్ధుందా" అని అడగడం ఇంకా అయోమయంగా ఉంది.
    "బుద్దా?" అడిగాడతను ఆశ్చర్యంగా.
    "అవును"
    "ఏం బుద్ధి?"
    "ఇంకేం బుద్ధి - అదే- బుద్ధంటే కూడా తెలీని చవటా!"
    సింహాద్రి పరిస్థితి ఇట్టే గ్రహించాడు. తాను అలా బుద్ది గురించి అడిగిన కొద్దీ ఆయన రెచ్చిపోతాడు. అదివరకూ ఓసారి ఇలాగే తను అడిగిన ప్రతి విషయానికీ రెచ్చిపోయి నూట పధ్నాలుగు తిట్లు తిట్టాడు తనను. అంచేత ఇప్పుడు వెంటనే ట్రాఫిక్ మార్చేయాలని నిర్ణయించుకుని "ఇంత అర్దరాత్రి వచ్చావేమిటి మావయ్యా" అన్నాడు అమాయకంగా.
    విశ్వనాథం కోపంతో ఎగిరి దూకినంత పన్జేశాడు.
    "ఏమిట్రా కూశావ్? ఇంత అర్దరాత్రి ఎందుకొచ్చాననా? ఇంత అర్ధరాత్రి ఎందుకొచ్చాననా?"
    సింహాద్రికి చిరాకేసుకొచ్చింది.
    ఏమిటలా తనడిగే ప్రతిదీ పదిసార్లు రెట్టిస్తాడు? చిరంజీవి వేపు చూశాడతను.
    చిరంజీవి తనకూ ఆ పెద్దమనిషి ధోరణి ఆశ్చర్యంగానే ఉందన్నట్లు భుజాలెగరవేశాడు.
    "అవును మా మయ్యా! అర్ధరాత్రి వచ్చేవేమిటి  మావయ్యా అనడిగేను. ఏమిటి తప్పందులో?" అడిగాడు సింహాద్రి కూడదీసుకుని.
    "ఒరేయ్ ఉష్ట్రపక్షీ! ఇది అర్దరాత్రి కాదురా... పగలు పట్టపగలు! తెల్సిందా? మండ్రగబ్బ మొఖం నువ్వూనూ! లేచి ఓసారి బయటికొచ్చి చూడు. ఉదయం పదయిందిరా!"
    సింహాద్రి ఆశ్చర్యపోయాడు.
    ఉదయం పదయిందా?
    నమ్మకం చాలక కిటికీ తెరచి చూశాడు. చుట్టూ జనం. తన గది చుట్టూ ఓ పాతిక మంది నిలబడి విచిత్రంగా తనవంక చూస్తూ కనిపించారు.
    "వీళ్ళందరూ ఎవరూ?" చిరంజీవి వేపు చూసి ఆశ్చర్యంగా అడిగాడతను.
    "ఎవరేమిట్రా? 'జూ' చూడ్డానికొచ్చిన వాళ్ళు. తలుపులు రెండు గంటల నుంచీ కొడుతున్నా నిద్రలేవని జంతువులెలా వుంటాయోనని చూడ్డానికొచ్చారు."
    సింహాద్రి కేమాత్రం అర్ధం కావటం లేదాయన మాటలు. అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటున్నాయ్?
    ఇలా మాట్లాడుతుంటే ఎవరికి మాత్రం ఏమి అర్ధమవుతుంది?
    "నీకేమయినా అర్ధమయినయ్యా?" చిరంజీవి నడిగాడతను.
    చిరంజీవి అడ్డంగా తలూపాడు.
    "నేనూ ఫస్ట్ టైమ్ వింటున్నాను. ఇలా ఇంతసేపు అర్ధం లేకుండా మాట్లాడటం చాలా గొప్ప సంగతే!" అన్నాడు నెమ్మదిగా.
    "నోర్మూసుకోండి....." మళ్ళీ చెవులు పగిలేట్లు అరిచాడు విశ్వనాథం.
    ఇద్దరూ సైలెంటయిపోయారు.
    "అంటే రోజూ పన్నెండింటివరకూ నిద్రపోతూ ఆఫీసెగ్గొడుతున్నావన్నమాట! అంతేనా?" అడిగాతను.
    "ఛ ఛ అదేం లేదు మావయ్యా! సాధారణంగా రోజూ తెల్లవారుజామున ఏడున్నరకె లేస్తాను. కావాలంటే వాడి నడుగు"
    "అవునండీ! పాపం వాడు ఏడున్నరకే లేచేసి- లేచేసి...... అంతేనండీ! లేచేస్తాడు"
    విశ్వనాథానికి చిరంజీవి మీద వళ్ళు మండిపోయింది.
    "నీ బోడి సాక్ష్యం ఎవ్వడూ అడగలేదిక్కడ" అన్నాడు విరుచుకుపడుతూ.
    "అడగలేదాండీ?"
    "లేదు"
    "సింహాద్రి అడిగాడు కదండీ"
    "వాడికి బుద్దిలేదు కనుక అడిగాడు"
    "అయితే సరేనండీ"
    "ఏమిటి సరే?" మరింత రెచ్చిపోతూ అడిగాడు విశ్వనాథం.
    "అంటే అదేనండీ ఓ.... కే..."
    "ఎందుకు ఓ... కే..."
    చిరంజీవికి విసుగు పుట్టుకొచ్చింది గానీ ఏం మాట్లాడితే మళ్ళీ ఇంకేం గొడవవుతుందో అని సైలెన్సయిపోయాడు.
    విశ్వనాథం కొంచెం శాంతించాడు.
    "ఊ!" అన్నాడు తను చెప్పదల్చుకుంది ఏమిటా అని ఆలోచిస్తూ. అదేమిటో ఎంత ఆలోచించినా గుర్తురావటం లేదు. రాగానే అయితే ఠపీమని గుర్తుకొచ్చేసేది. కానీ వీళ్ళిద్దరూ కలిసి వెధవ్వాగుడు వాగి తన మైండ్ డైవర్ట్ చేసేశారు. అవునూ అసలు వీళ్ళిద్దరూ ఎలా కలసి ఉన్నారిక్కడ"
    ఛటుక్కున చిరంజీవివేపు చూశాడతను.
    "ఇంతకూ నువ్వెలా ఉన్నావీ రూమ్ లో?" సడెన్ గా పోలీస్ స్టేషన్ లోనే దొంగను పట్టుకున్న కానిస్టేబుల్లా అడిగాడు. 

 Previous Page Next Page