"నేను విమలాదేవిని కనెక్ట్ చేయమంటే -- నా మిసెస్ ని ఎలా కనెక్ట్ చేశావ్ మిస్టర్ భవానీ శంకర్ ?" అడిగాడతను ఆవేశం బాగా అణచుకొని.
"ఇన్ కమింగ్ కాల్ సర్-"
"టు హెల్ విత్ యువర్ ఇన్ కమింగ్ కాల్!" రూమ్ కూలిపోయెంత గట్టిగా అరచాడతను. "నా భార్య ఫోన్లో వుందని నాతొ ఎందుకు చెప్పలేదు.?"
"మీరడగలేదు కదా అని వదిలేశానండీ! అడిగినదే చెప్పటం బెస్ట్ పాలసీ అని మా ఫ్రెండ్ సయ్యద్ యూసపుద్దీన్ నిసార్ చెప్పాడండీ! బైదిబై - సయ్యద్ యూసపుద్దీన్ నిసార్ గురించి మీకు చెప్పలేదు కదూ?"
"టు హెల్ విత్ యువర్ డామ్ ఫ్రెండ్ !" మళ్ళీ అరచాడతను. "యూ ఆర్ డిస్ మిస్ డ్"
భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు. ఉద్యోగంలో చేరిన అయిదో రోజే డిస్ మిస్సా ? ఎక్కడయినా చేస్తారా ఇలా?
అదే మేనేజర్ తో అన్నాడతను.
"నేను చేరి ఇది అయిదో రోజేసార్! అప్పుడే....."
"నేను ఆపరేటర్ రూమ్ లో ఉంటాను గదండీ! ఆఫీస్ అవర్స్ లో నా ముఖం ఎలాగూ మీకు కనబడదు - ఇకపోతే మిగతా సమయాలంటారా - మీరు ఏయే రూట్స్ లో వెళ్ళాలనుకుంటారో నాకు ప్రోగ్రాం ఇస్తే - నేను ఆ రోడ్లు ఎవైద్ చేస్తాను - ఈజిట్ ఓకే?'
"డోంటాక్ ! ప్లీజ్ గేటేవే?" పిడికిళ్ళు బిగిస్తూ అన్నాడు మేనేజరు.
"డోంట్ గెట్ ఎగ్జేటేడ్ సార్! మనం అన్ని విషయాలూ కూల్ గా మాట్లాడి పరిష్కరించుకోవచ్చు! కూల్ నెస్, కూల్ నెస్, కూల్ నెస్! కూల్ నెస్ ఒక్కటే ప్రస్తుతం మన దేశాన్ని రక్షించగలదని మా ఫ్రెండ్ రాధేశ్యాం అంటుండేవాడు. బైదిబై మీకు రాధే శ్యాంగురించి చెప్పానా?"
"టు హెల్ విత్ యువర్ రాధేశ్యాం - అండ్ టు హెల్ విత్ హిజ్ కూల్ నెస్-"
"ఓకే సార్ ఎగ్రేడ్! పోనీ ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్ క్యూజ్ చేస్తే - అయ్ మీన్ - నేనేదయినా తప్పు చేసి ఉంటె ...."
"నువ్వు నా జీవితం నాశనం చేశావ్! సుఖంగా ఆనందంగా చేసుకుంటున్న నా సంసారాన్ని వీధిలోకి లాగావ్ - అండర్ స్టాండ్?"
"ఏమన్నారు సార్! సంసారాలు వీధికి లాగటం నా హాబీ అంటున్నారా? నో! నో! నో! యూ ఆర్ ధరూలీ మిస్టేకెన్ మైడియర్ సార్! వెయ్యి అబద్దాలు ఆడి ఓ ఇల్లు నిలబెట్టాలన్నదే నా పాలసీ! ఇన్ ఫాక్ట్ - మా రమణ్రావ్ గాడి సంసారం నిలబెట్టిందేవరనుకున్నారు ? నేను! అయితే వెయ్యి అబద్దాలు కూడా చెప్పాల్సిన అవసరం లేకపోయింది. ఓన్లీ పధ్నాలుగు వాడాను! అంటే! కావాలంటే ఏజీస్ ఆఫీస్ కి ఫోన్ చేసి కనుక్కోండి! హి విల్ సర్టిఫై!"
"గెటౌట్ -" జుట్టు పీక్కుంటూ అరిచాడాయన.
"అల్ రైట్ - వెళ్తాను! బైదిబై మీ సంసారం ఎప్పుడు, ఎలా వీధిన పడేశానో 'క్లూ" ఇస్తే ....జస్ట్ ఫర్ మై రిఫరెన్స్ ! అంతే!"
"యూ డర్టీ క్రీచర్ ! నేను ఫోన్ లో మాట్లాడింది విన్నావా?"
"విన్నాన్సర్! ఇద్దరూ కలిసి హోటల్ నాన్ కింగ్ లో డిన్నర్ కెళ్ళి ఆ తర్వాత సెకెండ్ షో ఇంగ్లీషు పిక్చర్ కెళ్దామని - పిక్చర్ పేరు "బ్లూ లాగూన్" అనుకుంటాను - అన్నారు మీరామెతో!"
"బ్లూ లాగూన్ కాదు! టార్జాన్ డి ఏప్ మాన్!"
"నేను బ్లూ లాగూన్ అనుకున్నాను. నిజం చెప్పాలంటే రెండింట్లో 'బ్లూ లాగూన్' బెస్ట్ పిక్చర్!"
"నో! టార్జాన్ ది ఏప్ మాన్ గొప్ప పిక్చర్!"
"ఎగైన్ యూ ఆర్ ధరూలీ మిస్టేకన్ సార్! బ్లూ లాగూన్ గొప్ప పిక్చర్ ని ఎంతోమంది మేధావులు వప్పుకున్నారు. ఇంక్లూడింగ్ - మా ఫ్రెండ్ రమేష్, బైదిబై రమేష్ గురించి మీకేప్పుడయినా చెప్పానా! ఏ గ్రేట్ జమీందార్! ఇప్పుడు కాదు అదివరకు - వాడికి 'బీరు' అలవాటుపడక ముందు సంగతి చెప్తున్నాను. ఇప్పుడు .....వాడు..."
"స్టాప్!' బిగ్గరగా అరచాడు మేనేజరు.
భవానీశంకర్ నిశ్శబ్దం అయిపోయాడు.
"ఏమిటిసార్ అలా అరచారు? ఎనీ ప్రాబ్లం!"
"నువ్ ఫోన్ కనెక్షన్ ఇచ్చింది మిస్ విమలకు కాదు!"
"కాదని నేను వప్పుకుంటున్నా కదండీ!"
"కనుక మా ఆవిడ ఇప్పుడు ఇంటి కెళ్తే నన్ను చిత్రవధ చేసేస్తుంది! తను పుట్టింటి కెళ్ళి పోతుంది!"
భవానీశంకరానికి పరిస్థితి అర్ధమయింది. చాలా క్లిష్టమయిన వ్యవహారమే అనిపించింది.
అయన విమలాదేవితో మాట్లాడాలనుకున్న మాటలన్నీ - అయన భార్యతో మాట్లాడాడు కాబట్టి - ఆఫ్ కోర్స్! అయన సంసారం వీదీన పడే అవకాశం ఉంది!
అయినా భార్య పుట్టింటి కెళ్తే ఇంత రాద్దంతమా! పూర్ ఫెలో! జనరల్ నాలెడ్జి నిల్!
తన భార్య - మిస్ విమల ఇంటి కెళ్తే -- గొడవ కానీ పుట్టింటికెళ్తే ఏమిటిట?
"మీకో విషయం చెప్పమంటారా? ' తాపీగా తేలిగ్గా అడిగాడతను.
"ఏమిటది?" అనుమానంగా అడిగాడు మేనేజర్.
"భార్యలు పుట్టింటికేల్తారు - పుట్టింటి నుంచి వస్తారు ! ఆ మాత్రానికే ఇంత కన్ ప్యూజ్ అవగూడదు సార్! 'పుట్టింటి కెళ్ళను' అని భార్య మొండి కేస్తే మనం దిగులు పడాలి! కన్ ఫూజ్ అవాలి! ఇన్ ఫాక్ట్ - మనిషి జీవితంలో అద్భుతమయిన సమయం ఏదో తెలుసా? భార్య పుట్టింటి దగ్గరున్నప్పుడు! మా ఫ్రెండ్ రాధే శ్యామ్ గాడు...."
"గెటౌట్!" మళ్ళీ భీకరంగా అరిచాడు ఎండీ.
"దయచేసి సీరియస్ డిస్కషన్స్ అవుతున్నప్పుడు, మధ్యలో -- అలా అరవకండి సార్! అయ్ డోంట్ లైకిట్! కామ్ గా , నీట్ గా , నిశ్సబ్దంగా వినే శ్రోతలుంటే నాకెంతో ఇష్టం! అయ్ ఎడోర్ దెమ్! ఫరెగ్జాంపుల్ - ఆలిండియా రేడియో శ్రోతల్ని చూడండి! చిత్రవధకు గురి అవుతున్నాసరే! కామ్ గా, నీట్ గా నిశ్శబ్దంగా భరిస్తారు! దట్ ఘుద్ బి ది స్పిరిట్!...."
"గెటౌట్ !" ఇంకా భీకరంగా అరిచాడు మేనేజర్, ఆ అరుపులకు అసిస్టెంట్ మేనేజరూ, ఇద్దరూ ఫ్యూనులూ పరుగెత్తుకొచ్చారు లోపలకు.
"అయన మాటలేం పట్టించుకోకండి! టూమచ్ ఎగ్జయిట్ మెంట్! అంతే! నధింగ్ ఎల్స్! ఇప్పుడాయనకు కావలిసిందల్లా కూల్ నెస్! చల్లదనం! అది దొరకిందంటే చాలు! రేపీపాటికల్లా మళ్ళీ మామాలు మనిషయి పోతారు!"
తన సలహా ఇచ్చేసి బయటి కొచ్చేశాడు భవానీ శంకరం. రోడ్డు మీద కొచ్చాక ఎంచేతో అంతవరకూ ఉన్న ఉత్సాహం చల్లారి పోయినట్లనిపించింది.
*****
దహన క్రియలన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రం ఎడయిపోయింది.
చిరంజీవి "తెలుగు కిరణం" దినపత్రిక ఆఫీస్ మేడమీదున్న మావయ్య గదిలో కిటికీ ముందు కూర్చుని దూరంగా టాంక్ బండ్ మీద మిణుగురుపురుగుల్లా కదులుతున్న వాహనాల్ని చూస్తున్నాడు.
అంతవరకూ "తెలుగు కిరణం" దినపత్రిక సిబ్బందితో హడావిడిగా ఉన్న ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా అయిపొయింది.
వంటవాడు నర్శింలు ' అతనికి అప్పటికప్పుడే రెండోసారి బాయ్ తెచ్చి ఇచ్చాడు.
"ఇంక మనం వెళ్ళిపోదామా?" అడిగింది స్వప్న చిరంజీవి దగ్గర కొచ్చి.
అక్కడే నిలబడ్డ నర్శింలు ఉలిక్కిపడ్డాడు.
"మీరేడకు పోతారమ్మా ఇంక! ఈ ఇల్లు మీది గాదూ? ఈ ఆస్తి ఈ పత్రిక, ఈ మిద్దె ఇవన్నీ మీవికావూ?" అన్నాడు ఆత్రుతగా.
చిరంజీవి చటుక్కున లేచి నుంచున్నాడు.
అతనిలో నర్శింలు మాటలు చాలాపెద్ద సంచలనాన్ని కలిగించినయ్!
అవును! తనా విషయమే మర్చిపోయాడు.
మావయ్యకు 'నా' అంటూ ఉన్నది తానొక్కడే! అంచేత ఈ ఆస్తీ , ఈ దినపత్రిక ఈ మేడా ఇవన్నీ - వీటన్నిటికీ తనే వారసుడు.
ఒక్కసారిగా అతనిని ఎక్కడ లేని సంతోషం ఊగించివేసింది. అంటే.....అంటే తన దరిద్రానికి పుల్ స్టాప్ పడిపోయింది. తనిప్పుడు లక్షాధికారి! లక్షాల కొద్దీ ఆస్తి - ఓ దినపత్రికల ఆధిపత్యం -
"స్వప్నా! ఆనందంగా స్వప్నను పిలిచాడతను.
ఆమె అతని వంక చూసింది. తనలోని ఆశ్చర్యాన్ని అణచుకుంటూ.
"నేనీ విషయం మర్చేపోయాను స్వప్నా! ఇప్పుడు మావయ్య ఆస్తికి మనమే వారసులం! ఇప్పుడు మనం ఆకలితో మాడక్కర్లేదు. చిరిగిన బట్టలు కట్టుకోనక్కర్లేదు - ఇంతవరకూ - నామూలన నువ్వు అనుభవించిన కష్టాలన్నీ ఈరోజు నుంచి మర్చిపోవాలి స్వప్నా...." ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ అన్నాడతను.
స్వప్న కూడా కొద్ది క్షణాలు సంతోషంతో తనను తాను మర్చి పోయింది.
తాము ఇంత త్వరగా , ఇంత హటాత్తుగా ఈ దరిద్రం నుంచి బయట పడతారని అనుకోలేకపోయింది.
మెట్ల మీద బూట్ల చప్పుడు వినిపించి అందరూ అటు వేపు చూశారు.
శివతాండవం నెమ్మదిగా వచ్చి గది మధ్యలో నిలబడి ఓసారి తన బట్టతల సవరించుకున్నాడు. చిరంజీవినీ, స్వప్ననూ చూచి గొంతు సవరించుకుని చెప్పాడు.
"మీరీరాత్రికి ఇక్కడే ఉండండి చిరంజీవి! ఉదయం ఎనిమిది గంటలకు మన లాయరుగరోస్తానన్నారు. వచ్చి మీ మావయ్య రాసిన విల్లు అందరి ఎదురుగ్గా చదివి వినిపిస్తారు...."
అంతవరకూ ముప్పిరిగొన్న అనందం హటాత్తుగా మాయమయి పోయింది చిరంజీవిలో!
అవును! చాలా ముఖ్యమయిన విషయం మర్చిపోయాను తను, మావయ్య విల్లు రాశాడంటే - ఖచ్చితంగా ఆస్తి తనకు దక్కదన్నమాటే! తన మొఖం కూడా చూడకుండా ఆరునెలలు గడిపిన వ్యక్తీ- ఆస్తి తన పేర రాస్తాడని ఎలా అనుకోవటం?