"అందమైన పిల్లనే చేసుకున్నాడన్న మాట!" అనుకున్నాడతను.
అయితే చిరంజీవి ఆ పిల్ల కోసం మామయ్యతో తగూ పెట్టుకుని అంత ఆస్తిని వదులుకుని ఇలాంటి భయంకరమయిన దరిద్రం అనుభవించటంలో తనకేమీ ఔచిత్యం కనిపించటం లేదు. కానీ మరి ప్రేమ గుడ్డిది అన్న నానుడి ఉండనే ఉంది కదా!
"నేను వెళ్తున్నాను" అన్నాడు శివతాండవం బట్టతల సవరించుకుంటూ.
"ఊ!" అన్నాడు చిరంజీవి.
శివతాండవంకి చిరంజీవి అంటే ఏమాత్రం ఇష్టం లేదు. చిరంజీవి స్కూల్లో నూ కాలేజి లోనూ చదివేటప్పుడూ అతను చేసిన అనేక ఆకతాయి పనులకు చిత్రహింసలు అనుభవించాడు తను. శివతాండవానికి ఆ చేదు జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవడానికి మనస్కరించలేదు. అంచేత ఆ ఆలోచనల్లోనుంచి బయట కొచ్చేసి మరోసారి చిరంజీవి వంకా స్వప్న వంకా చూశాడు.
స్వప్న తన చక్రాల్లాంటి కళ్ళతో అతనేం మాట్లాడతాడా అని ఎదురుచూస్తోంది. చిరంజీవి మొఖంలో మాత్రం ఎలాంటి భావమూ కనిపించటం లేదు.
"ఓల్డ్ ఫెలో చస్తే చావనీ! నాకేం?' అనుకున్నాడతను. తను స్వప్న అనే సెయింట్ ఫ్రాన్సిస్ గాళ్ ని ప్రేమించాననీ - పెళ్ళి చేసుకోవాలని ఉందనీ చెప్తే మావయ్య ఏమన్నాడు? అలాంటి పిచ్చి వేషాలేస్తే ఇంట్లో నుంచి బయటకు గెంటుతానన్నాడు!
"నువ్వు గెంటేదేమిటి మావయ్యా! అసలు నీ యింటికే రాన్నేను!" అనేసి అప్పటికప్పుడే ఇల్లు వదిలి వచ్చేశాడు.
అంతే! ఆ రోజు నుంచీ ఈ రోజు వరకూ తను మళ్ళీ మామయ్య గడప తొక్కలేదు. మావయ్య తనను ఆహ్వానించనూ లేదు!
శివతాండవం హటాత్తుగా "వస్తా" అంటూ బయటకు నడవబోయి ఏదో గుర్తుకొచ్చి గడపలో ఆగి వెనక్కు తిరిగాడు.
"అన్నట్లు సాయంత్రం అయిదింటికి దహన క్రియలు జరుగుతాయ్" బట్టతల నిమురుతూ అనేసి వడివడిగా నడుస్తూ వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిపోయాక కొద్ది క్షణాల వరకూ చిరంజీవి, స్వప్నా ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు. తరువాత స్వప్న అతని దగ్గరకు నడచి అతని మొఖం మీదకు పడుతోన్న జుట్టుని పైకి తోసింది మృదువుగా.
"చాలా హటాత్తుగా మరణం కదూ?" అన్నది నెమ్మదిగా.
"ఊ!" అన్నాడు చిరంజీవి ఆ పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ.
"మరి.....మనం త్వరగా వెళ్ళవద్దూ?"
చిరంజీవి స్వప్న వేపు చిరాకుగా చూశాడు.
"మనం వెళ్ళటమా?"
"అవును! ఆయనకున్నది నువ్వొక్కడీవేగా! నువ్వే అంత్య క్రియలన్నీ చేయాల్సి ఉంటుంది...."
చిరంజీవి తల అడ్డంగా ఊపాడు.
"నో! ఆ ఓల్డ్ ఫెలోకి - మనకీ ఏమీ సంబంధం లేదు!" అన్నాడు అంతలోనే కోపం తెచ్చుకుంటూ.
"బాగుంది! ఇప్పుడా పట్టుదలలన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా? నిన్ను కన్నకొడుకులా పెంచుకున్నారాయన! ఇలాంటి సమయంలో పాత పగలన్నీ మర్చిపోవాలి!" అందామె అనునయంగా.
"ఎలా మర్చిపోతాం? మనిద్దరం ప్రేమించుకున్నామని చెప్తే ఇంట్లో నుంచి పొమ్మన్నాడు. సరే! అదలా వదిలేయ్! మనం గత ఆరు నెలల నుంచీ ఎంత దారుణమయిన జీవితం గడుపుతున్నామో తెలిసి కూడా మనకే మాత్రం సహాయం చేయని రాక్షసుడి గురించి మనమెందుకు పట్టించుకోవాలి! పోనీ! ఆ ఓల్డ్ ఫెలో కి అనాధ ప్రేత దహనసంస్కారం జరగాల్సిందే! అదే తగిన శాస్తి -" కసిగా అన్నాడు చిరంజీవి.
స్వప్నకు అతనినేలా సమాధాన పర్చాలో అర్ధం కావటం లేదు. నెమ్మదిగా నేలమీద కూర్చుని అతని మోకాళ్ళ మీద చేతులుంచి అతని కళ్ళల్లో కి చూసింది.
"ఏయ్! నా మాట వినవూ!" దీనంగా అడిగిందామె. చిరంజీవి ఆమె కళ్ళల్లోకి చూసి చలించిపోయాడు. తనకి వెళ్ళాలని లేదు! స్వప్న కోరిక కాదనలేడు.
"సరే! నాకు మాత్రం ఇష్టం లేదు! గుర్తుంచుకో!" అన్నాడు నిష్టూరంగా.
ఆమె సంతృప్తిగా లేచి నిలబడి అతని చేయి పట్టుకుని, "పద బయల్దేరదాం" అంది. అప్పటికప్పుడే ఇద్దరూ రడీ అయి బయటికొచ్చారు. ఖాళీ అటో రోడ్డు పక్కనే కనిపించింది.
ఇద్దరూ ఆటోలో కూర్చున్నారు.
అటో స్టార్ట్ చేసి అడిగాడు డ్రైవర్ "కహజానా సాబ్?"
"తెలుగు కిరణం ! డైలీ ఆఫీస్?" అన్నాడు చిరంజీవి.
*****
పి.ఏమ్.బి.ఎక్స్. ఆపరేటర్ ఉద్యోగంలో చేరిన అయిదో రోజు ఉదయం తొమ్మిది గంటల కల్లా హుషారుగా "ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం -" పాట విజిల్ వేసుకుంటూ బిజిలీ అండ్ బిజిలీ కంపెనీ చేరుకున్నాడు భవానీశంకర్.
మేనేజింగ్ డైరెక్టర్ కారు దిగి తన క్రాఫ్ సరిజేసుకుంటూ లోపలికి రావడం కనిపించింది.
"గుడ్ మార్నింగ్ సర్!" అన్నాడు భవానీ శంకర్ చిరునవ్వుతో.
"గుడ్ మాణింగ్ ! గుడ్ మాణింగ్" అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్ పరాంకుశం ఆనందంగా.
భవానీశంకర్ బోర్డ్ బిజీ అయిపొయింది . ఫోన్ల మీద ఫోన్లు -
ఆఫీస్ నుంచి బయటకూ - బయట నుంచి ఆఫీస్ కి - ఆ హడావుడిలో ఎంత టైమ్ గడిచి పోయిందో తెలీదు.
హటాత్తుగా మేనేజింగ్ డైరెక్టర్ గొంతు ఖంగున మోగించి ఫోన్లో.
"హలో...."
"గుడ్ మాణింగ్! గుడ్ మాణింగ్ యంగ్ మాన్! విమలాదేవిగారికి- కనెక్ట్ చెయ్! ఒకే?"
"ఒకే సార్! అయ్ విల్ కాల్ యూ బాక్!' అన్నాడు భవానీ శంకర్ ఆ నెంబరు నోట్ చేసుకుంటూ.
తీరా రింగ్ చేయబోయే సమయానికి ఇంకెక్కడి నుంచో ఇన్ కమింగ్ కాల్ వచ్చింది.
"హలో బిజిలి అండ్ బిజిలి కంపెని ప్లీజ్!' అన్నాడతను వినయంగా.
"హలో ఆపరేటర్! నేను మీ మేనేజింగ్ డైరెక్టర్ పరాంకుశం మిసెస్ ని మాట్లాడుతున్నాను - అర్జెంట్ గా ఆయనకు కనెక్ట్ చెయ్!" దబాయిస్తూ మాట్లాడిందా గొంతు.
"ఒకే- మేడమ్ - స్పీకాన్!" అంటూ టక్కున కనెక్షన్ ఇచ్చేశాడు భవానీశంకర్.
ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ పరాంకుశం గురించి రెండు ముక్కలు చెప్పటం ఎంతయినా అవసరం! అతను స్వతహాగా సరదా పురుషుడు! మందు కొట్టడం, అప్పుడప్పుడు పెకాడటం, ఓ అతివతో శృంగారం జరపటం - ఇవన్నీ అతని చిన్ని చిన్ని కోరికలు! అయితే అతని ప్రవర్తన ఓ కంట కనిపెడుతూ , అతని అవకాశాలను చిన్నాభిన్నం చేస్తూ - జాగ్రత్తగా కాపురం చేస్తోంది అతని భార్య ఝాన్సీ లక్ష్మి! అయినా గానీ ఇటీవలే అతగాడామే కన్నుగప్పి విమాలాదేవి అనే ఓ అప్సరస (అప్సరస అతని దృష్టిలో మాత్రమే అని పాఠకులు గమనించ ప్రార్ధన) ను వలచాడు. చాలా డబ్బు ఖర్చు చేసి (కొన్ని వేలు) వలపించుకున్నాడు కూడా!
ఇప్పుడు ఆరోజు సాయంత్రం ప్రోగ్రాం గురించి మాట్లాడడానికే ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చి కనేక్షనిమ్మని భవానీ శంకర్ చెప్పాడు. కానీ ఈ బాక్ గ్రౌండ్ స్టోరీ ఏమాత్రం తెలీని భవానీశంకర్ టక్కున మిసెస్ పరాంకుశం కనెక్షన్ ఇచ్చాడు.
తన టేబుల్ మీదున్న ఫోన్ మోగగానే ఎగబడి అందుకున్నాడు. ఎం.డి. పరాంకుశం.
"హలో విమలా డార్లింగ్! ఎంత ఆనందంగా ఉంది విమలాదేవి - మీ గొంతు వింటుంటే ...." అన్నాడతను తన్మయత్వంతో.
ఝాన్సీలక్ష్మి నిర్ఘాంతపోయింది. అది తన భర్త గొంతు అని తెలుస్తూనే ఉంది. మరి. ఆ విమలా డార్లింగ్ ఎవరు? అంటే .....అంటే.....ఈ ఉష్ట్రపక్షి తనకు తెలీకుండా ఎవత్తెనో పట్టుకుని వెధవ్వేషాలేస్తున్నాడన్నమాట!
"ఊ..." అందామె తన గొంతు కొంచెం మార్చి.
"విమలాదేవి! ఇవాళ సాయంత్రం మన ప్రోగ్రాం ఏమిటో తెలుసా? టాంక్ బండ్ మీద షికార్! ఆ తరువాత హోటల్ నాన్ కింగ్ లో డిన్నర్! ఆ తరువాత "టార్జాన్ ది ఏప్ మాన్" ఇంగ్లీష్ పిక్చర్!"
ఝాన్సీ లక్ష్మి కోపంతో రగిలిపోయింది. రగిలి రగిలి ఆ సెగలను ఫోన్ లోకి వదిలేసింది.
"నువ్వు .....నువ్వూ......ఇంత ద్రోహం చేస్తావా? ఎంత పొగరు? నీ బోడి మొఖానికి అదేవత్తో విమలాదేవి కావలసి వచ్చిందా? ఇద్దరూ టాంక్ బండ్ కెళ్తరా - తరువాత హోటల్ .....చింగ్ చాంగ్..... కెళ్తరా?"
ఆ సంభాషణంతా వింటున్న భవానీశంకర్ కి ఆమె హోటల్ పేరునలా తప్పు పలకటం నచ్చలేదు.
"చింగ్ చాంగ్ కాదు మేడం! నాన్ కింగ్! నాన్ కింగ్! అన్నాడు సరిచేస్తూ.
"ఆ! అదే నాన్ కింగ్ - ఆ తరువాత సినిమానా! సిగ్గు లేకపోతే సరి! నీ అంతెత్తు పిల్లలున్నారు ఇంట్లో - ఇంకా పోరంబోకు వేషాలేస్తున్నావా? ఇంటికిరా -- నీ అంతు తేలుస్తా" అయిదు నిమిషాల పాటు తిట్టి ఫోన్ డిస్కనెక్ట్ చేసిందామె.
పరాంకుశం బోలెడు నిశ్చేష్టుడయి తర్వాత కోలుకున్నాడు. విమలాదేవి రావాల్సిన ఫోన్ లో తన భార్య ఝాన్సీ లక్ష్మి ఎలా వచ్చిందో ఎంత ఆలోచించినా అర్ధం కావటం లేదు.
ఫోన్లో భవానీ శంకర్ ని పిలిచాడతను.
"హలో సర్!" అన్నాడు భవానీశంకర్ ఉత్సాహంగా.
"ఒకసారి -- నా రూమ్ కి రా!' అన్నాడతను మండిపోతూ.
"వన్ సెకండ్ సార్!"
అనేసి నిజంగానే ఒక సెకండ్ లో పరాంకుశం ముందు నిలబడ్డాడతను.