Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 10

 

    "నేను వెళ్తున్నాను . రేపు ఉదయం వస్తాను మళ్ళీ...."
    మరోసారి బట్టతల సవరించుకుని వెళ్ళిపోయాడు శివతాండవం!
    కొద్దిక్షణలు నిశ్శబ్దంగా గడిచిపోయినాయ్.
    "స్వప్నా...." పిలిచాడు చిరంజీవి.
    "ఊ!"
    "మావయ్య ఆస్తి నా పేర రాస్తాడని నీకు నమ్మకముందా?"
    స్వప్న నవ్వింది.
    "నాకు డబ్బు మీద ఎప్పుడూ ఆశ లేదూ! నాక్కావలసింది మనిద్దరం సంతోషంగా ఉండటం! మనం దగ్గరయింది మన కోసం! డబ్బు ఇచ్చే సుఖాల కోసం కాదు!" అంది అతని చేతిని తన చేత్తో స్పర్శిస్తూ.
    "ఆ విషయం నిజమే స్వప్నా! కాని నేను నిన్న ఇలా ఈ బీద తనంతో చిత్రవధ చేయటానికి కాదు పెళ్ళి చేసుకుంది! నేను ప్రేమించిన దేవత నా వల్ల స్వర్గసుఖాలు అనుభవించాలి గానీ - ఇలా ఆకలికి మాడుతూ, పాడుబడిన ఇంట్లో కాపురం చేయకూడదు !...." కళ్ళ వెంబడి కారుతున్న నీటి చుక్కల్ని తుడుచుకుంటూ అన్నాడతను.
    ఆ రాత్రి చిరంజీవికి నిద్ర పట్టలేదు.
    మావయ్యతో ఏ విషయంలో తను ఏకీభవించాడని?"
    కాలేజిలో డిగ్రీ అయిపోగానే 'తెలుగుకిరణం' పేపర్లో సబ్- ఎడిటర్ గా పనిచేయమని మావయ్య అడిగితే తను నా కిష్టం లేదని చెప్పేశాడు.
    అయన తదనంతరం తనే ఆ పత్రికకు యజమాని అవుతాడనీ, అలాంటప్పుడు తనకు ఆ పత్రిక వ్యవహారాలన్నీ తేలీకపోతే - పేపరు నడపడం కష్టమవుతుందనీ అయన అభిప్రాయం.
    ఆలోచనల్లో సతమతమవుతుండగానే నర్శింలు గొంతు వినిపించింది ఆప్యాయంగా.
    "దొరా - చాయ్ తెచ్చినా!"
    చిరంజీవి మంచం మీ నుంచి లేచి కూర్చున్నాడు.
    బయట ఇంకా చీకట్లు పూర్తిగా విచ్చుకోనేలేదు. అప్పటికే పక్షులన్నీ నిద్రలేచి చాలా హడావుడిగా , గొడవగోడవగా మాట్లాడేసుకుంటున్నాయ్. ఓ కాకి కిటికీ బయట చెట్టు కొమ్మ మీద కూర్చుని కొంపలు మునిగి పోయినట్లు అరుస్తోంది.
    తను మావయ్య ఇంట్లో ఉన్నప్పటి అలవాటు - తెల్లవారుజామునే 'టీ' తాగటం !


                                        *****

    భవానీశంకర్ 'జోరుగా హుషారుగా షికారు పోదమా" పాట విజిలేసుకుంటూ తన గదిలోంచి రోడ్డు మీద కొచ్చాడు. ఉద్యోగం పోయి అప్పటి కప్పుడే వారం రోజులయిపోయింది. మరో ఉద్యోగం కోసం మొదలు పెట్టిన 'వేట' ఏమాత్రం సత్పలితాలు ఇవ్వలేదు.
    బుక్ స్టాల్ లో కనబడుతున్న 'తెలుగుకిరణం' న్యూస్ పేపర్ కొని తిరగేశాడు.
    "కావలెను! పార్లమెంట్ మెంబర్ ఇంట్లో పనిచేయుటకు విద్యవంతుడయిన యువకుడు కావాలి! అవసరమయితే అతను నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయగలిగి ఉండాలి. అతనికి ఓటు హక్కుండాలి! ఇంటి ముందు తరచుగా ప్రదర్శనలు జరిపే ప్రజలను అదుపులో పెట్టగలిగే సామర్ధ్యం ఉండాలి!"
    భవానీశంకర్ ఉత్సాహంతో పొంగిపోయాడు. ఆ క్వాలిఫికేషన్ లన్నీ తనకున్నాయ్. అడ్రస్ చూశాడతను. "ఆర్. భీమారావ్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, బంజారాహిల్స్- రోడ్ నెంబర్ ...."
    అతను ఉలిక్కిపడ్డాడు.
    ఎవరో కాదు! తను అటో రిక్షా నుంచి పడేసినతను! తనను చూస్తే షూట్ చేసి పారేసేది  ఖాయం.
    ఆ ప్రయత్నం విరమించుకుని "రైజింగ్ స్టార్" హోటల్లో కి నడిచాడతను. మొగలాయీ 'పౌనా' ఆర్డర్ చేసి, అంతకు ముందు రోజే తన స్వీట్ హార్ట్ విజ్జీ రాసిన ఉత్తరం తీసి మరోసారి చదువుకున్నాడు.
    తను హైదరాబాద్ చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందట. ఇక్కడ పాత గాంగ్ తో కలసి బలాదూర్ తిరక్కుండా రచయిత దీప్ చంద్ లాంటి వారి స్నేహాన్ని పెంచుకుని ఉన్నతమయిన సంస్కారం అలవరచుకోవాలిట!
    విజ్జీ కోరిక ప్రకారం ఓసారి రచయిత దీప్ చంద్ ని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడతను.
    సీతాఫల్ మండి బస్ ఎక్కి దీప్ చంద్ ఇంటికి చేరుకున్నాడు.
    ఆ సమయంలో రచయిత దీప్ చంద్ గది మధ్యలో పడక్కుర్చీలో పడుకుని ఇంటి కప్పు కున్న వాసాలు లెక్క పెడుతున్నాడు. రెండు సార్లు తన ప్రియురాలి తండ్రితో తమ పెళ్ళి విషయం మాట్లాడబోయి  భంగపడిన ప్రేమికులేవరయిన సరే అలా ఇంటి వాసాలు లెక్కపెట్టక తప్పదని "నేటి పిచ్చాళ్ళీ - రేపటి ప్రేమికులు" అనే ఇంగ్లీషు పుస్తకంలో రాశాడు రచయిత గ్రిస్టన్ క్రిస్ట్ ఫర్డ్.
    "గుడ్ మాణింగ్ ...." అన్నాడు దీప్ చంద్ అయోమయంగా అతని వంక చూస్తూ.
    'ఆయామ్ భవానీ శంకర్! గోల్డ్ మెడలిస్ట్ భావనీశంకర్!" అన్నాడతను తన వివరాలు తెలియజేస్తూ!
    "అంటే!" అన్నాడు దీప్ చంద్ అయోమయంగా.
    "అదే! విజ్జీ ఫ్రెండ్ ని! బైదిబై మనం ఈ మధ్యే ఒక అవాంచనీయమయిన పరిస్థితిలో కలుసుకున్నాం! పరిచయం చేసుకుందామనుకునే లోపలే మీరు గంటకు నూట డెబ్బై కిలోమీటర్ల వేగంతో పరుగెత్తికెళ్ళి పోయారు! ఆ తరువాత నేనూ అదే స్పీడులో వచ్చాను గానీ మీరు కనిపించలేదు. అన్నట్లు అంత స్పీడ్ గా ఎలా పరిగెత్తగలిగారు మీరు? బై చాన్స్ స్పోర్ట్స్ మాన్ కాదు గదా?"
    దీప్ చంద్ కి అతని మాటలేమీ అర్ధం కావటం లేదు.
    "మీరు చెప్పేది నాకేం అర్ధం కావటం లేదు...... అన్నాడు దీప్ చంద్  ఇంకా ప్రగడమయిన అయోమయంలో కెళ్ళిపోతూ.
    భవానీశంకర్ కతని అయోమయ పరిస్టితి మీద జాలి వేసింది. రచయితలు సాధారణంగా ఇలాంటి అయోమయవస్థలో ఎక్కువ సేపు గడుపుతుంటరేమోనని అతనికి అనిపించింది.
    "నేను విజ్జీ ఫ్రెండ్ భవానీశంకర్ ని....." అన్నాడు మళ్ళీ.
    "విజ్జీ ఎవరు?"
    "మా ఫ్రెండ్?"
    "మీరెవరు?"
    ఇలా పద్దెనిమిది రోజుల పాటు సంభాషణ కొనసాగే అవకాశాలేక్కువగా ఉన్నాయని పసిగట్టాడు భవానీశంకర్.
    అంచేత అతనికి కొన్ని బండగుర్తులు చెప్పదలచుకున్నాడు.
    "మీకు హోటల్ హోయసల తెలుసా?"
    "తెలుసు!" వప్పుకున్నాడు దీప్ చంద్.
    "ఆగస్ట్ పన్నెండో తారీఖు తెలుసా?"
    "తెలుసు? కాలెండర్లో ఉంటుంది!"
    "ఆ రోజు మీరు, మా విజ్జీ నేనూ - హోటల్ హోయసల కెళ్ళాం! మీరు పనీర్ పాలాక్ కూర చొక్కా మీద పదేసుకున్నారు...."
    టక్కున గుర్తుకొచ్చేసింది దీప్ చంద్ కి.
    "మైగాడ్! మీరు విజ్జీ ఫ్రెండ్ భవానీ శంకరా?"
    "ఎగ్జాక్ లీ మైడియర్ ఫ్రెండ్!"
    "లెక్చరర్ విజ్జీ ఫ్రెండా మీరు!"
    "ఫర్ ఫెక్ట్ లీ రైట్ ఫ్రెండ్!"
    దీప్ చంద్ కి అనందం కలిగింది. తనకున్న కొద్ది మంది అభిమానుల్లో విజ్జీ చాలా ముఖ్యమయిన అమ్మాయి.
    ఆమె వల్లే తన పేరు ప్రఖ్యాతులు మరో ఎనభై ముగ్గురికి తెలిశాయ్. (వాళ్ళ క్లాస్ పిల్లలకు)    
    "రండి! రండి! కూర్చోండి!" అన్నాడు భావానీశంకర్ సాదరంగా ఆహ్వానిస్తూ.
    భవానీశంకర్ లోపలకు నడిచి కుర్చీలో కూర్చున్నాడు.
    "మీరు వైజాగ్ లో కదూ ఉండటం?" అడిగాడు దీప్ చంద్.
    "ఆ పిరిడ్ అయిపొయింది బ్రదర్! ఇప్పుడు నేనిక్కడే ఉంటున్నాను"
    "ఐసీ! విజ్జీ ఏలా ఉంది?"
    "ఒండర్ పుల్ హెల్త్ తో ఉంది! ఆఖరుసారి నేను చూచినప్పుడు 'మనిషీ! నీ ముఖం అటు' అనే మీ నవల చదువుతోంది రైల్లో..."
    "అవునవును! నాకూ ఉత్తరం రాసిందీ మధ్య డిల్లీ నుంచి! మీరు నా దగ్గర కొస్తారనీ - మీకు మంచి అలవాట్లు నేర్పాలనీ...."
    భవానీశంకర్ చప్పున అందుకున్నాడు.
    "ఉత్తరం సంగతి మర్చిపోండి! మనం అలా వెళ్ళి మంచి కాఫీ వన్ బై టూ తాగివద్దామా?"
    దీప్ చంద్ అదిరిపడ్డాడు.
    "వన్ బై టు కాఫీయా?"
    "అవును! ఏం?"
    "ఇలా వన్ - బై టూ లూ నాకిష్టం ఉండదు. అది మంచి అలవాటు కాదు. అయ్ ఎంజాయ్ ఫుల్ కాఫీ!"
    "ఓ.కె. యాజ్ యూ ప్లీజ్ బ్రదర్! నో కంపల్షన్!"
    ఇద్దరూ గది బయటకొచ్చేసరికి అప్పుడే అటో వచ్చి ఆగింది. అందులోంచి అమ్మాయి చెంగున దూకింది.
    "దీప్ - అర్జంటుగా ఇంటికి పద! డాడీ మాంచి ఒండర్ ఫుల్ మూడ్ లో ఉన్నారు" అంది ఉత్సాహంగా.
    దీప్ చంద్ మళ్ళీ భయంతో బిగుసుకుపోయాడు. అమ్మాయి త్వరత్వరగా మాట్లాడసాగింది.

 Previous Page Next Page