Previous Page Next Page 
జీవాత్మ పేజి 9


    
    సరిగ్గా ఆమె భర్త మరణించి సంవత్సరకాలం పూర్తయిన రోజే ఆమె సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ రాత్రి కాగితం మీద కలం కదిలింది.
    
    ఆమె ఇంతింత నేత్రాలు చేసుకు చూస్తుండగా "నేను నీ భర్తను వచ్చాను" అని కాలం కదిలి కాగితం అడుగుభాగంలో విల్లీ బర్ధన్ అనే సంతకం చేసి అచేతనమైంది. ఆ సంత్ర్హకం అచ్చు గుద్దినట్టు తన భర్త సంతకానికి సరిపోయింది.
    
    ఆమె ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఆనాటి నుంచీ ఆమెకూ, ఆమె భర్తకూ ఈ ఆటో రైటింగ్ ద్వారా సంబంధం కుదిరింది. అతడనేక విశేషాలామెతో చెబుతూ వుండేవాడు. అతనిది సూక్ష్మ శరీరం కనుక ఎంత దూరాన జరుగుతున్న సంగతులనైనా క్షణంలో చూచివచ్చి చెబుతుండేవాడు.
    
    అతని సహాయంతో ఆమె అనేక విషయాలు చెప్పగలుగుతూ, మానవాతీతమైన అంశాలతో సలహాలిస్తూ బాగా పేరు, డబ్బు సంపాదించు కుంది. ఆమె వల్ల ఎందరికో ఎన్నో కార్యాలు నెరవేరాయి.
    
    అందులో ముఖ్యమైనది ఒక కోటీశ్వరుడి ఉదంతం- "క్రిచ్ టన్ బర్క్ లీ" అనే అహానికి అమెరికాలో ఒక విశాలమైన స్థలం ఉంది.
    
    దానిలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టిద్దామని ప్లాను గీయించి నిర్మాణం మొదలుపెట్టాడు. అప్పట్నుంచీ అతనికి ఎన్నో సమస్యలొచ్చి పడసాగాయి. పని ప్రారంభించైనా ప్రతిసారీ అతనికో, ఇంట్లోవాళ్ళకో, కూలీలకో అనారోగ్యం వచ్చి నిర్మాణం ఆగిపోయేది.
    
    దాంతో వాళ్ళకి అనుమానం వచ్చి అతీతశక్తులతో సంబంధం కలిగిన వ్యక్తిగా ప్రసిద్ది పొందిన లూసీ బర్ధన్ ని కలుసుకొని సమస్య వివరించారు.
    
    ఆమె రాత్రికి ఆ విషయం తన భర్త నడిగింది. అశరీరుడైన ఆమె భర్త ఆత్మ ఆ క్రిచ్ టన్ స్థలం దగ్గరకు వెళ్ళింది. అక్కడ అతనివంటి ప్రేతాత్మలే కొన్ని కనిపించాయి. వాటితో మాట్లాడాడతను.
    
    ఆ స్థలం లోపల తమ సమాధులు వున్నాయని, అవి పూడిపోయి పైకి మామూలు నేలలానే కన్పిమ్చటంతో ఆ సంగతి ఎవరికీ తెలీలేదని, ఆ స్థల యజమాని జరప తలపెట్టిన నిర్మాణం వల్ల తమకీ, తమ సమాధులకీ యిబ్బంది కలుగుతుందని వివరించాయ్. తమ సమాధులు కదిలించటం గానీ, తామక్కడి నుంచి తరలిపోవటం గానీ వాటికిష్టం లేదన్నాయి.
    అందుకే భవన నిర్మాణం  మొదలుపెట్టగానే ఆ ప్రేతాత్మలు ఏవో ఒక అడ్డంకులు సృష్టించేవి. దాంతో పనాగిపోయేది.
    
    ఆ స్థల యజమానికీ, అతని కుటుంబ సభ్యులకూ, పనివాళ్ళకూ రోగాలూ, బాధలూ రాకుండా వుండాలంటే అక్కడ త్రవ్వటం, భవన నిర్మాణానికి పూనుకోవటం మానాలని ఆ ప్రేతాత్మలు విల్లీ ఆత్మతో చెప్పాయి. అతడు భార్యకి ఆటో రైటింగ్ ద్వారా ఈ విషయం మొత్తం తెలియపరిచాడు.
    
    స్థల యజమానికి అసలు విషయాన్ని ఆమె చెప్పవలసిన రీతిలో చెప్పి బోధపడింది. ఆమె సూచన ప్రకారం ఆ రోజు రాత్రి స్థల యజమాని, అతనికి సంబంధించిన వ్యక్తులు ఆ స్థలం దగ్గరకు వెళ్ళి తాము అక్కడ ఇక మీదట ఎటువంటి త్రవ్వకాలు గానీ, భవన నిర్మాణ పనులు గానీ ప్ర్రారంభించమని" గట్టిగా అరుస్తూ ప్రమాణం చేశారు.
    
    తరువాత వారికీ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఆ ప్రదేశానికి కొంచెం దూరంలో వేరే భవనం నిర్మించుకున్నారు వాళ్ళు.
    
    ఈ ఉదంతంతో అమెరికాలో లూసీ బర్ధన్ పేరు మారుమోగి పోయింది" అన్నాడు అభిరాం.
    
    "పత్రికల వాళ్ళకేముంది... వాళ్ళు సేల్స్ పెంచుకోవటానికి ఏదో వ్రాస్తారు. ఇదీ అటువంటి కట్టుకధే అయుంటుంది" అన్నాడు మహదేవ్.
    
    "అదే పొరపాటు... మనం నమ్మని విషయం తెలిసిన వైర్ని తప్పు పట్టటం మన అవివేకాన్ని తెలియజేస్తుంది. ఎక్కడో అమెరికాలో జరిగిన సంగతి కాబట్టి, అదీ పత్రికల్లో వచ్చింది కాబట్టి అవి నిజమై వుండ వంటున్నావు.
    
    మనదేశంలో... అదీ మన ఆంద్రప్రదేశ్ లో మంత్రశక్తితో పచ్చకామెర్లు నయం చేయబడుతున్నాయన్న సంగతి తెలుసా నీకు?" కాస్త ఆవేశంగా అన్నాడు అభిరాం.
    
    మహదేవ్ ఒకింత ఆశ్చర్యంగా చూశాడు.
    
    "టంగుటూరు దగ్గరిలోని వెంకటాయపాలెంలో వెంకటరత్నం అనే వ్యక్తి, అతని సోదరులు తమ మంత్రశక్తితో పచ్చకామెర్లు నయం చేస్తున్నారు. ఈ వైద్యం తీసుకొనేవారు మూడువారాల పాటు స్నానం చేయకూడదు. ఆహారంలో ధనియాలపొడి, చింతకాయ పచ్చడి, మినప్పచ్చడి, కందిపప్పు, ఉప్పుతో నల్లపెసలు ఏవిధంగానైనా వాడుకోవచ్చు.
    
    పొట్లకాయ, పెద్దచిక్కుడు, బత్తాయి, ఆపిల్, సపోటా తినవచ్చు. సాయంత్రం పూట తప్పకుండా మిరియాల చారు వాడాలి. మందు తీసుకొనే ప్రదేశంలోకి చెప్పులతో వెళ్ళకూడదు.
    
    వంశ పారంపర్యంగా తొమ్మిది తరాల నుండి వారు కామెర్లకు వైద్యం చేస్తున్నారు. వారానికి రెండువందల నుండీ, మూడువందల మంది రోగులు మద్రాసు, గుంటూరు, కడప, బద్వేలు, మార్కాపురం, నెల్లూరు, విజయవాడ నుంచి వస్తూంటారు.
    
    ఆ గ్రామానికి చేరుకోవాలంటే ఒంగోలుకు దగ్గరలో జి.టి. రోడ్డులో టంగుటూరు స్టేజీలో దిగి గుర్రబ్బండిలో కానీ, రిక్షాలో కానీ వెంకటాయపాలెం చేరుకోవచ్చు. ఒక వ్యక్తి నుంచి వైద్యం నిమిత్తం పదిరూపాయలు వసూలు చేస్తారు వాళ్ళు.
    
    మందు తీసుకునే రోజు రోగి ఉదయాన ఏమీ తినకూడదు. కాళ్ళకు చెప్పులు ధరించకూడదు. వైద్యుడు తన చేతులు సబ్బునీటిలో ముంచి తదుపరి ఘాటయిన తెల్లసున్నం రుద్ది కళ్ళ ముందు మూడుసార్లు వుంచడంతో తొలి విడత వైద్యం పూర్తవుతుంది. ఇలా చేస్తున్నప్పుడు వైద్యుడు మంత్రోచ్చారణ చేస్తూనే వుంటాడు.
    
    అదేరోజు మరికసారి ఇలానే చేయడం జరుగుతుంది. ఆ రోజు చికిత్స దాంతో పూర్తవుతుంది. రోగి మూడు వారాలు వరుసగా ఇలా చికిత్స చేయించుకోవలసి వుంటుంది. దాంతో పచ్చకామెర్లు మాయమై పోతాయి" అని చెప్పాడు అభిరాం.
    
    "ఈ కామెర్ల చికిత్స సంగతి నీకెలా తెలుసు?" ప్రశ్నించాడు మహదేవ్.
    
    "క్రితం సంవత్సరం నేను మా అమ్మమ్మకి పచ్చ కామెర్లొస్తే చేయించింది ఈ వైద్యమే"
    
    "ఇది మంత్రశక్తి వల్లే నయమైందని నీవు నమ్ముతున్నావా?" అని అడిగాడు మహదేవ్.

 Previous Page Next Page