Previous Page Next Page 
మానవత పేజి 9


    జానకికి అంతా అయోమయంగా ఉంది. తానేదో దానవత్వాన్ని గెలుద్దామని బయలుదేరింది. ఇక్కడ మానవత్వం కనిపించింది. ప్లెజంట్ సర్ ప్రైజ్! ఆనందం పట్టరానంతగా వుంది. ఎంత మంచివాళ్లుంటారు లోకంలో! శకుంతల అలా ఎందుకుంటుంది?
    తన స్వభావాన్ని బట్టి లోకాన్ని చూస్తుంది.
    "మీరంటే మావారికి గొప్ప గౌరవం ఏర్పడింది. నేనేం పెద్దగా చదువుకున్నదాన్ని కాదు. కాసేపు మీతో మాట్లాడితే, చదువుకున్న చాలామంది కన్నా విజ్ఞానవంతుల మవుతామని అన్నారు. విజ్ఞానమంటే ఏమిటో దాన్ని ఇప్పుడు కొత్తగా నేర్చుకావాలన్న ఉబలాటం కూడా కాదు. మంచిని గురించి విని, మంచివాళ్ళని కలుసుకుంటున్నాం అని విన్నప్పుడు నాకు హాయీ, సంతృప్తి వుంటాయి" అంది శాంత.
    జానకీ, శాంతి చాలాసేపు మాటాడుకున్నారు. చైర్మన్ పని చేసుకుంటున్నట్టు తలవొంచుకుని తమ పనిలో నిమగ్నమయ్యారు. అయినా వారి సంభాషణంతా ఆయన చెవిలో పడుతూనే వుంది.
    కొంతసేపటి తరువాత ఎవరో వచ్చారని కబురు వచ్చింది. జానకి లేచి నుంచుంది "వస్తానండీ" అని.
    "మంచిది అప్పుడప్పుడూ వస్తుండండి" అన్నాడు చైర్మన్ లేచి నుంచుంటూ. శాంత కూడా లేచి నుంచుంది.
    జానకి శలవు తీసుకుంది. సాగిపోయింది. ఆమె వీధుల వెంట సాగిపోతుంటే ఏదో తేలిగ్గా వున్నట్లుంది. తేలిపోతున్నట్లుంది. ఆనందంతో గుండె నిండిపోయింది. హాయిగా వుంది.


                                                            9


    ఆతల మైదానం_స్కూలుకు సంబంధించింది_స్కూలుకు దగ్గర్లో వుంది. పిల్లలు వరుసగా నుంచున్నారు_దూరదూరంగా. డ్రిల్లు చేయిస్తూంది జానకి. జానకి సంకేతాలు ఇస్తూంది. పిల్లలు చేతులు ఎత్తుతున్నారు, దించుతున్నారు. శ్వాస బిగపడ్తున్నారు, వదుల్తున్నారు. నడుంమీద చేతులు పెట్టుకుంటున్నారు. ఎగురుతున్నారు.
    దృశ్యం బావుంది.
    క్రమశిక్షణలో అందం వుంది.
    శారద తొలివరసలో వుంది. డ్రిల్లు చేస్తూ వుంది. కాని కదలికలో నీరసం కనిపిస్తూంది. చేతులు ఎత్తినా, దించినా యంత్రవత్తుగా జరుగుతూంది. ఉత్సాహం కనిపించడంలేదు, కాళ్ళలో ఏదో బరువు చేరినట్లుంది. జానకి శారదను చూచింది. సంకేతాలు మానేసింది. పిల్లలంతా బొమ్మ గీసినట్లు నుంచుండిపోయారు. జానకి శారద దగ్గరికి వెళ్ళింది. భుజం మీద చేయివేసింది.
    "ఏమ్మా! అలా వున్నావు?"
    "ఏంలేదు టీచర్!"
    "చెప్పు, ఏం నీరసంగా వుందా?"
    "అవును టీచర్! కళ్ళు తిరుగుతున్నాయి"
    "అదేమిటి. చెప్పవేం మరి! మానెయ్యి డ్రిల్లు. కూర్చో ఆ పక్కన, కాసేపుంటే సర్దుకుంటుంది"
    జానకి శారదను ఒక పక్కకు తీసికెళ్ళింది. కూర్చోపెట్టింది. మళ్ళీ తన స్థానానికి వచ్చింది. అయినా మనసు శారద మీదనే వుంది.
    శారద కూర్చున్నది, కూర్చుని....కూర్చుని పడిపోయింది.
    జానకి పరిగెత్తి శారదను వడిలోకి తీసుకుంది. శారదకు చెమటలు పట్టాయి. నోట మాటలేదు, మెడ వ్రేలాడిపోతూంది.
    జానకి గుండె దడ దడ లాడింది. మెదడు పని మానేసింది. పిల్లలంతా చుట్టూ మూగారు.
    మేరీ పరిగెత్తికెళ్ళి గ్లాసుతో నీళ్ళు తెచ్చింది. శారద మొహాన కొడ్తూంది. శారద కనురెప్పలు కదలడం లేదు. శకుంతల వచ్చింది. గుంపును చీల్చుకొని లోపలికి ఉరుకింది, చూచింది.
    "ఇదేమిటీ పిల్ల విచిత్రం _ ఇక్కడ పడిపోయింది. స్కూలుకు బదనాం-తీయండి-ఇంటికి చేర్చాలి-ఇక్కడ పోగూడదు." గంతులేస్తూంది శకుంతల. పిల్లలంతా చూస్తున్నారామెను వింతగా.
    "ఏమిటి చూస్తారు? పొండి రిక్షా తెండి" కసిరింది. పిల్లలు పరిగెత్తారు.
    అంతలో జానకి లేచి నిలబడి శారదను భుజాన వేసుకుంది.
    "అరే, ఏమిటది మొండితనం! ఆగు రిక్షా వస్తుంది" అరుస్తూంది శకుంతల. జానకి ఆమె మాటలు వినిపించుకోలేదు, వడివడిగా అక్కడి నుంచి బయలుదేరింది.
    "డాక్టర్....డాక్టర్ ఈ ఊళ్లో లేడు. మీ ఊరిదాకా పోవాలి. నువ్వు పడిపోతావు. ఈ కాలపు పిల్లలు అంతేనమ్మా!" అడుగు ముందుకు వేయకుండా అరుస్తుంది శకుంతల.
    జానకి సాగిపోతూంది. ఆమెకు ఏమీ వినిపించడం లేదు - రుకుతూంది.
    ఎదురుగా రిక్షా వస్తూంది. చూచింది జానకి. అయినా ఆగలేదు. రిక్షాకు ఎదురుగా ఉరుకుతూంది.
    రిక్షా తొక్కుతున్నది రమాదాసి. రిక్షాలో వున్నవాడు బొర్రసేటు. రామాదాసి జానకిని చూచింది. భుజం మీద పాపను చూచింది. రిక్షా ఆపింది, జానకి ఆగింది.
    "దిగు రిక్షా, ఈమెను తీస్కపోవాలె. ఆపదలో వున్నది." రమాదాసి సేటుతో అన్నది.
    "అదేంది? అట్లంటవు. పైసలు తీస్కోవా? ఊళ్ళో దింపు" అన్నాడు సేటు బుర్ర దువ్వుకుంటూ.
    "నీ యవ్వ_మనిషివా, దయ్యానివా? దిగుతవా కిందికి తొయ్యనా? నీ పైసలొద్దు, నువ్వొద్దు. దిగుతవా కిందికి తొయ్యమంటవా?"
    "పైసలొద్దంటావా? అయితే దిగుత" సేటు దిగాడు.
    ఎవరో చెప్పకుండానే, ఎవరో తెలియకుండానే జానకి రిక్షా ఎక్కి కూర్చుంది. శారద భుజం మీదనే వుంది.
    రమాదాసి రిక్షా తిప్పింది_ఎక్కింది, తొక్కింది.
    రిక్షా వేగంగా సాగిపోతూంది.
    రమాదాసి చెమటలు కక్కుతూంది.
    కొందరు పిల్లలు అక్కడిదాకా వచ్చారు. వారిని జానకి చూళ్ళేదు. జానకి రిక్షా ఎక్కడంతో వారు ఆగిపోయారు. మేరీ ఆగిపోలేదు. రిక్షా వెంట పరుగెత్తుతూంది.
    రిక్షా సాగిపోతూంది.
    రమాదాసి చెమటలు కక్కుతూంది.
    మేరీ రిక్షా వెనక ఉరుకుతూంది.
    రిక్షా ఆస్పత్రి ముందు ఆగింది. జానకి దిగుతున్నది.
    "డాక్టరు బాబు లేరమ్మా" ఏసుదాసు గుమ్మంలో నుంచుని అన్నాడు.
    జానకి విన్నది. 'లేరా?' అన్నది. రిక్షా దిగే ప్రయత్నంలో ఒక కాలు కిందికి జాల్చింది. ఇహ ఆ ప్రయత్నం మానేసినట్టు అలాగే కూర్చుంది.
    ఫోటోలో బొమ్మలా వుంది జానకి_చలనం లేదు.
    "మీరు దిగండమ్మా నేను తీసుకొస్తాను డాక్టర్ను" రమాదాసి అన్నది. జానకి విన్నది, చలనం వచ్చింది, రిక్షా దిగింది.
    రమాదాసి ఏసుదాసును చురచుర చూచింది. రిక్షా ఎక్కింది, సాగిపోయింది.
    ఏసుదాసు రమాదాసి పోయిన దిక్కు చూస్తున్నాడు.
    జానకి రిక్షా దిగింది, వెనక్కు చూచింది.
    మేరీ పరుగెత్తుకుని వస్తూంది. చెమటలు కారుతున్నాయి.
    జానకి గుండె దడదడ లాడింది. "మేరీ, మేరీ" అంటూ ముందుకు వురకబోయింది. ఆమె భుజం మీద శారదను మరచిపోయింది. అడుగు ముందుకు వేయగానే అనిపించింది_భుజం మీద శారద వుందని. వురకలేక పోయింది. నిలబడింది. మేరీ చూస్తూ వురికి వచ్చింది. రొప్పుతూంది. "టీచర్ శారద.... శారద.... శారద ఎలా వుంది టీచర్!" మేరీ అడిగింది.

 Previous Page Next Page