తల్లిదండ్రుల ముఖాల్లో మబ్బులు విడిపోలేదు. "నీ యిష్టం" అన్నట్లు చూశారు.
* * *
"గూడు" అనే దాంట్లో ఏదో ఆకర్షణ వుండివుంటుంది. కొందరు జీవితంలో ఏదో ఓ దశలో ఆ గూటిలోచేరి, అందులోనే ఆనందం అనుభవిస్తూ బయటకు రావటానికి నిరాకరిస్తూ వుంటారు.
రాఘవ జీవితంలో క్రమంగా తల్లిదండ్రుల అధ్యాయం ముగిసి భార్యాబిడ్డల అధ్యాయం విరుచుకు పడుతోంది.
పెళ్ళినాడు సప్తపదిలో
సమయాన సంకల్పాన హై
సంక్రియా రా చిష్ణూ
సమస్య మావే ఇధ మూర్జ
మభినంద సానే
సం సౌ మనాసిం నంవుతా
సముశ్చిత్తా న్యా కరం'
అని ప్రమాణం చేశాడు కాబట్టి, అని జీర్ణించు కున్నట్లు కొన్ని సత్యాలను నమ్మినవాడూ, వాటిని తు.చ తప్పకుండా ఆచరించేవాడూ కాబట్టి భార్యతోటి అధ్యాయాలు ముగింపు లేకుండా జీవిత కాలం వెన్నాడుతూనే వుంటాయి.
అతనికి పిల్లలంటే పంచప్రాణాలు. ఫ్యామిలీ ఫ్లానింగ్ అంటే అసహ్యం, కోపం అన్నిటికంటే భయం ఎవరన్నా ఆ వూసెత్తితే ఆపరేషన్ చేయించుకుని నడుం నొప్పితో బాధ పడిన వాళ్ళ గురించీ, అనేక జబ్బులకి గురయిన వాళ్ళ గురించీ కథలు చెప్పుకొస్తాడు.
ప్రస్తుతానికి నలుగురు పిల్లలు.
ఒకసారి భార్య గర్భిణిగా వున్నప్పుడు లేడీ డాక్టర్ చూసి "ఈసారి జాగ్రత్తగా వుండాలి. తల్లికి వంట్లో రక్తం లేదు. బలహీనంగా వుంది" అని చెప్పింది.
కాన్పయేదాకా నవమాసాలూ లక్ష్మి మోయలేదు రాఘవ మోశాడు. ఆఫీసులో కూర్చున్నా, యింటిలో మసులుతున్నా, అన్నం తింటున్నా, ప్రక్కమీద పడుకున్నా అదే ఆలోచన. లక్ష్మికి సీరియస్ అవుతుందేమో లక్ష్మికి సీరియస్ అవుతుందేమో."
కళ్ళలో నీళ్ళు తిరుగుతూండేవి. ఆమెకు కొంచం నడుంనొప్పివస్తే డాక్టర్ దగ్గరకు పరిగెత్తే వాడు. ఆనందమూర్తి దగ్గరకు తనబాద చెప్పుకునేందుకు తరచు వెళ్ళేవాడు. అతను ఆఫీసు పనిలో ఎంతో బిజీగా వున్నా, దగ్గర కూర్చోపెట్టుకుని "ఏమిటి రాఘవా?" అని ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు, కొంత రాఘవ కొంత చెప్పేవాడు చెప్పకపోయినా మూర్తి అర్ధం చేసుకుని, అనునయించి పంపించేవాడు.
కాన్పు సమయంలో ఆసుపత్రిలో చేర్చినప్పుడు బయట వరండాలో పిచ్చెత్తినట్లు తిరిగాడు. జుట్టుపీక్కున్నాడు బావురుమని ఏడ్చాడు. నేలమీదపడి "లక్ష్మీ! లక్ష్మి!!" అనుకుంటూ పొర్లాడు. నానా చేష్టలు చేశాడు. తిరుపతి. వెంకటేశ్వరస్వామికి తలవెంట్రుక లిస్తానని మొక్కుకున్నాడు.
చివరకు కొంచం కష్టమైనా లక్ష్మి సుఖంగానే ప్రసవించింది.
* * *
పిల్లల్ని ఏడవనివ్వడు. కొంచెం ఏడిస్తే తలక్రిందులై పోతాడు. ఎత్తుకుని క్షణం దింపడు. ముక్కులుతుడిచి పంచకి రాసుకుంటాడు. పాడుచేస్తే కడుగుతాడు. బల్లదగ్గర వచ్చి నానా భీభత్సంచేస్తూ రభసజరుగుతూంటే చిరునవ్వునవ్వుతూ చూస్తూ వూరుకుంటాడు. అస్సలు మందలించడు.
ప్రొద్దున్నే ఫర్లాంగ్ దూరంలో వున్న మార్కెట్ కి కూరలకని బయల్దేరతాడు. లుంగి సగంపైకి మడిచి కట్టుకుని, ఒకచేతితో కూరలసంచీ, ఓ చేతిలో చంటిపిల్లాడు భుజంమీద పారాడుతూ - వాడిని ముద్దులాడుతూ, వాడితో 'ఊసు' లాడుతూ నడుస్తాడు. తిరిగివచ్చేటప్పుడు అతడిసంచీ బరువుగా వుండి, అందులోంచి ఏపొట్లకాయో, ములక్కాడో బయటకు తొంగిచూస్తూ వుండేది.
ఆ పిల్లల కెప్పుడూ రోగాలు, వాళ్ళనెత్తుకుని ఆసుపత్రిచుట్టూ ప్రదక్షిణాలు చేస్తూవుంటాడు. వాళ్ళకి ఇంజక్షన్ చెయ్యాల్సి వస్తే "అమ్మా నే ఎత్తుకోలేను. నే చూడలేను" అని నర్సునో కంపౌండర్నో ఎత్తుకోమనిచెప్పి గోడవైపు తిరిగి వీపు యిటుపెట్టి నిలబడి "సిస్టర్ అయిందా? మెల్లిగా డాక్టర్ మెల్లిగా" అని పదేపదే హెచ్చరించేవాడు.
ఆఫీసులో అతనితోపాటు చేరిన వారందరికీ ప్రమోషనొచ్చింది. అతనింకా మునుపటి గుమాస్తాగానే వుండిపోయాడు.
ఏరోజూ ఆఫీసుకు నిర్ణీతవేళల్లో వెళ్ళడానికి వీలుండేదికాదు. ఇంట్లో అతనికి 'గొప్పగొప్ప' సమస్యలెదురయ్యేవి.
పాపం లక్ష్మికి ఎప్పుడూ కడుపులా? దాంతో బాటు వంట్లోకూడా ఎప్పుడూ బాగుండదు. నడుంలో పోటూ, తలనొప్పీ, ఏమీ లేకపోతే గుండెదడో, నీరసమో-వీటితో బాధపడుతూ వుండేది. చిత్రమేమిటంటే అది ఎంత పాత కంప్లెయింటయినా, నిరంతరమైనదే అయినా, ఎప్పటికప్పుడు కొత్తగా చిత్రించి తల్లడిల్లిపోతూండేది. అతనూ ఆమెతో వంతపాడుతూ వుండేవాడు.
"లక్ష్మి! వంట్లో బాగుండలేదా? నువ్వు పడుకో విశ్రాంతి తీసుకో. డాక్టరు దగ్గరకెళ్ళి మందు తెస్తాను. వంట నేనే చేస్తాను. నువ్వు లేవమాకు." అంటూ మందులు తేవటం ఆవిడతో తినిపించడం వగైరాలు పూర్తిచేసి, అన్నంవండి పిల్లలకు పెట్టి, చిన్న పిల్లలకు పాలు త్రాగించి, కంచాలెతేసి, ఎంగిళ్ళు తీసేసి ఆఫీసు కెళ్ళేసరికి గంటన్నర లేటయేది. ఆఫీసర్ మండిపడి తలవాచేటట్లు చివాట్లు పెట్టేవాడు.
ఇహ ఆమెగారు ఇంట్లోకి రాకూడని మూడురోజులూ పిల్లల్ని కూడా తనే సాకాలి కాబట్టి ఆఫీసుకు సెలవు పెట్టేవాడు. అంతేగాక అతనికెప్పటి కప్పుడూ వేరే సమస్యలు ఎదురవుతూ వుండేవి.
భార్య ఏ బంధువు ఇంట్లో పెళ్ళికో, పండక్కి పుట్టింటికో, ఏ బారసాలకో బయల్దేరతీసేది.
అవునవును. వెళ్ళకపోతే బాగుండదు. అని తను నిజాయితీగా ఆమెను అనుసరించేవాడు-సెలవుపెట్టి.
ఒకసారి అతని బావమరిది పెళ్ళయింది. బావమరిది వచ్చి "ముందుగా వచ్చెయ్యి అక్కయ్యా నువ్వు తప్ప ఎవరున్నారు మాకు?" అన్నాడు.
రాఘవ "అవును పాపం. వెళ్ళకపోతే ఎట్లా?" అనుకున్నాడు.
వారంరోజులు ముందుగా తరలి వెళ్ళారు.
ఆఫీసరు అన్ని రోజులు సెలవు యివ్వనని పేచీపెట్టాడు సిక్ లీవనీ అదనీ యిదని చివరికి మొత్తంమీద లాన్ ఆఫ్ మీద విస్సంకోచంగా పెళ్ళాంపిల్లలతో వెళ్ళిపోయాడు.
పెళ్ళిలో చాకిరీ అంతా అతనేచేశాడు. పెళ్ళి పూర్తి చేసుకుని పెళ్ళికొడుకు గారింటికి వచ్చాక డిన్నర్ లో ఏమేమి సంతకాలు చేయించాలో, స్వీటు ఏది వండాలో, కూరలు ఎన్ని వండాలో అన్ని అతనే నిర్ణయించాడు. భోజనాలదగ్గర వడ్డించడం కూడా అతనికి గొప్ప సరదా. అన్నం పళ్ళెమో లేకపోతే పులుసుగిన్నో పట్టుకుని అందరిని అడిగి అడిగి వడ్డించటంతో ఏదో నిషా అనుభవించేవాడు.