అంతా పూర్తయి యిహ బయల్దేరతామనుకుంటూండగా అతనిమామగారికి భుజంనొప్పివచ్చింది. ఆయన ఇల్లంతా మ్రోగిపోయేటట్లు మూలుగుతూ పెద్ద హడావుడి చెయ్యసాగాడు.
లక్ష్మి "నాన్నకు వంట్లో బాగాలేదండి. ఈ స్థితిలో మనం విడిచి వెళ్ళిపోతే నలుగురూ ఏమనుకుంటారు?" అన్నది.
"అవును పాపం ఈస్థితిలో వెడితే ఏం బాగుంటుంది?" అని అతనుకూడా ఒప్పుకుని లీవు ఎక్సిటెండ్ చేశాడు.
మామగారి భుజం నొప్పి సపర్యలతో కొన్నాళ్ళు ఆఫీసు తుడుచిబెట్టుకుపోయింది.
అంతేగాకుండా లక్ష్మికి దేముళ్ళమీదనమ్మకం అపారంకాబట్టి, ఆమెకు రకరకాల మొక్కులు మొక్కటం అలవాటు కాబట్టి-మోపిదేవిలో ముడుపు చెల్లించటానికో అన్నవరంలో సత్యనారాయణవ్రతం చెయ్యటానికో, మందపాకలో శనికి నూనితో అభిషేకం చేయించి తమకు పుట్టిన శని వదిలించటానికో, లేక ఫలానా ఊళ్ళో వేంచేసి వున్న ఫలానా బాబాగారిని సందర్శించి తీర్ధం స్వీకరించడానికో, ఆమెతోబాటు ఓపిగ్గా తిరుగుతూ వుండేవాడు. ఇవన్నీ అసహజంగాగానీ అస్వాభివికంగాగానీ ఎప్పుడూ కనబడేవికావు.
అతడంటే ఆఫీసరుకు జుగుప్స, ఎలర్జీ రెండూ పట్టుకున్నాయి.
అతను ఆఫీసు మానేసిన రోజున "ఏమయ్యా ఈసారి విశేషమేమిటి? మీ అత్తగారికి వెన్నుపోటు వచ్చిందా? మామగారికి భుజం వాచిందా? మీ ఆవిడ పేరంటానికి వెడితే తోడు వెళ్ళావా? తద్దినానికి రెండు రోజులు ఎగ్గొట్టావేమిటి? ఈ రెండు రోజులూ వెడుతూనే వున్నావేమిటి? ఓహో! శేషభుక్తం తినటానికి ఎకస్ట్రా కావల్సివచ్చిందా?" యిలా చురుక్కుమనేటట్లు మాట్లాడేవాడు.
రాఘవ చాలా తేలిగ్గా అన్నీ దులిపేసుకునేవాడు.
ఒకసారి పెట్టెలో బట్టలు సర్దుతూ వుంటే, అడుగున పిల్లనగ్రోవి కనిపించింది.
వళ్ళు గగుర్పొడిచినట్లయింది. పెట్టెలోంచి బయటకు తీసి పెదవులదగ్గర పెట్టుకుని కొంచెం ఊదాడు.
"అబ్బ! ఏమిటండి వెధవగోల? నేనసలే తలనొప్పితో ఛస్తూవుంటే యీ వెధవ చప్పుళ్ళేమిటి?" అని లక్ష్మి విసుక్కుంది.
ఆమె మనసు కష్టపడినందుకు అతను నొచ్చుకుని, పిల్లనగ్రోవి మళ్ళీ పెట్టెలో పెట్టేశాడు.
* * *
అనంతమూర్తి పనిచేసే పత్రిక అనేక రూపాంతరాలు పొంది ప్రాచుర్యంలోకి వొచ్చి, చివరకు బహుళ ప్రచారం గల వారపత్రికగా నిలిచింది. ఎడిటర్ రఘురామయ్యగారి పేరే వుండేది, మూర్తి అసిస్టెంట్ ఎడిటరయ్యాడు.
ఒకరోజు రఘురామయ్యగారు మూర్తికి కబురు చేశారు "మన పత్రిక అందరి మన్ననలూ పొందుతోంది సంతోషం. వారఫలాలు శీర్షిక కూడా వెయ్యమని చాలా ఉత్తరాలు వస్తున్నాయి. అదికూడా ప్రారంభిస్తే ఎలా వుంటుందంటారు?" అన్నారు.
మూర్తి సవినయంగానే 'వొద్దండి. ఆ శీర్షికలవల్ల నాకు నమ్మకంలేదు. కనీసం మనమే నమ్మనిదాన్ని మన పత్రికలో వెయ్యటం మంచిది కాదేమో' అన్నాడు.
"నాకూ నమ్మకం లేదనుకోండి. కానీ వ్యాపార దృష్టితో ఆలోచిస్తే..."
"ఇది వ్యాపారం అయినా, ఆర్టుఫారం వున్న వ్యాపారం. అది నడిపేవాళ్ళ అభిరుచి, వ్యక్తిత్వం ప్రతిపేజీలో ప్రస్ఫుటమౌతూ వుండాలి. అప్పుడే దాని విలువ పెరుగుతుంది. సర్క్యులేషన్ పెరగటంకోసమే అయితే, క్వాలిటీ పెంచటంద్వారా అది సాధించగలగాలి గానీ యిలాంటి ఎదుగూ బొదుగూలేని శీర్షికలద్వారా కాదు."
"మీ యిష్టం" అన్నాడు రఘురామయ్యగారు.
పత్రిక విలువల్ని పెంచాలని అతన్లో పట్టుదల చెలరేగింది. సాహిత్యం అతనిఊపిరి, పత్రిక అతని ప్రాణం అయింది ఆఫీసులో కూర్చుని పనిచేస్తుంటే టైము తెలిసేదికాదు. అన్నం తినాలనీ, ఇంటికి వెళ్ళాలనీ ధ్యాస వుండేదికాదు. శీర్షికల విషయంలో సీరియల్స్ ప్రచురించటంలో పత్రిక స్థాయిని పెంచుతూ నూతన ప్రయోగాలు చేస్తూవుండేవాడు. పండగలకి ప్రత్యేక సంచికలు ప్రచురించాల్సి వచ్చినప్పుడు వర్కర్సుతో పనిచేయిస్తూ ఒక్కోసారి ఆఫీసులోనో, ప్రెస్సు లోనో వుండిపోయేవాడు.
మొదటిరోజుల్లో దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చేది.
వసంతకు యింట్లో ఒక్కదానికీ తోచేదికాదు. అతన్తో కలసి భోజనం చెయ్యాలన్న కోరిక ఏనాడూ ఆమెకు తీరేది కాదు. అతన్తో బయటకు వెళ్ళాలనీ, ఊళ్ళు తిరగాలనీ, ఏమిటేమిటో చేయాలనీ కలలుకనేది. అందులో ప్రేమించి చేసుకున్న భర్త.
ఒకరోజు అక్కసు పట్టలేకపోయింది. "ఇందుకేనా మీరు నన్ను పెళ్ళిచేసుకుంది?" ఓ రాత్రి పన్నెండుగంటలకు యింటికి వచ్చిన భర్తని.
"ఇందుకేనా అంటే?"
"మిమ్మల్ని ప్రేమించాను. మీరు నన్ను ప్రేమించారు. మీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఒక్కటీ తీరటం లేదు."
అనంతమూర్తి ఒక్కక్షణం ఆగి అన్నాడు. "నిన్ను ప్రేమించినంత మాత్రాన, పెళ్ళిచేసుకున్నంత మాత్రాన నా విధి నిర్వహణ మానుకుంటానని చెప్పానా?"
"చెప్పలేదు. అయితే?"
"పెళ్ళి చేసుకోబోయేముందు నేను ఓపత్రికలో దీక్షా పరుడైన సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నట్లు తెలీదా? అప్పుడూ ఎన్నోసార్లు ఆఫీసులో పనివుండి నీకు యిచ్చినమాట నిలబెట్టుకోలేకపోయేవాన్ని. ఎక్కడికో వస్తాను నిన్నెదురుచూడమనిచెప్పి ఒక్కోసారి రాలేకపోయేవాణ్ని. అప్పుడు హర్షించినదానివి, యిప్పుడెందుకు హర్షించలేకపోతున్నావు?"
"అది ప్రేయసి స్థానం ఇప్పుడు పెళ్ళాంగా వున్నాను"
"అంటే....ప్రేయసి స్థితికంటే పెళ్ళాం పరిస్థితి దిగజారిందా?"
"దిగజారటం కాదు. అనుభవంలోకి వస్తున్న తేడాలు?"
అనంతమూర్తికి ఆమె అంటే జాలి కలిగింది. అనునయంగా చెప్పాడు.
"చూడు వసంతా! ప్రతిమనిషికి కొన్ని బాధ్యతలూ, విధినిర్వహణలూ వుంటాయి. ఎవరి జీవిత తరహాలను బట్టి వారికి కొన్ని కుదురుతూ వుంటాయి. కొన్ని కుదరవు. కొంతమందికి కావలసినంత తీరిక వుంటుంది. పేకాడుకోవటానికీ, ఫ్రెండ్సుతో బాతాఖానీ కొట్టటానికీ, పెళ్ళాల్ని తరుచు సినిమాలకూ, షికార్లకూ త్రిప్పటానికి ఖాళీ వుంటుంది. అదివాళ్ళ అదృష్టం. ఒక బిజీ డాక్టరున్నాడనుకో పేషెంట్లకు చికిత్స చెయ్యటమే అతని జీవిత పరమావధి అనుకుంటే, అతనిని ప్రేమించినవాళ్ళు అతని పద్దతులకు అలవాటు పడాల్సి వుంటుంది. అతన్ని నిందించీ, కోరికలు తీర్చమని అడిగి ప్రయోజనం లేదు...వసంతా! యింకో విషయం చెప్పనా? నువ్వు నా పట్ల ఎట్లా అసంతృప్తి పడుతున్నావో, నీ పట్లా నేను అసంతృప్తి కలిగే సందర్భాలు చాలా వున్నాయి తెలుసా?"