Previous Page Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 8


    "ఏం లేదు నువ్వు వెళ్ళిరా"
    అతని ముఖంలోని దృఢ నిశ్చయం చూసి ఆమె ఏమి తర్కించలేదు. బాధపడినట్లు కనిపించింది. గుళ్ళోకి వెళ్ళి పదిహేను నిమిషాల తర్వాత ముఖాన బొట్టుతో బయటకు వచ్చింది.
    ఇద్దరూ దేవాలయం వీధివెంట నడుస్తున్నారు. వసంత మౌనంగా వుంది.
    "వసంతా! కోపం వచ్చిందా?"
    "వచ్చి ఏం ప్రయోజనం కనుక?"
    "దేముడంటే నువ్వు ఇష్టపడి వెళ్ళావు. నీ యిష్టానికి నేను కోపం తెచ్చుకోలేదు. నా యిష్టం గనుక బయటనే నిలబడి పోయాను. నా యిష్టానికి నువ్వెందుకు కోపగిస్తావు?"
    "మీరు నాస్తికులాని యిన్నాళ్ళూ ఊహించలేక పోయాను."
    "చెప్పు సందర్భం యింతవరకూ రాలేదంతేగా దాచిపెట్టలేదు."
    అయినా ఆమె కోపం పోయినట్లులేదు. ఆ రోజంతా అలిగినట్లుగా ముభావంగానే వుండిపోయింది.
    అయితే మరునాటికల్లా దాని ఊరు మరిచిపోయినట్లు మామూలు మూడ్సులోకి వచ్చేసింది.
    ఓ సాయంత్రం కొళాయి చెరువుగట్టుమీద యిద్దరూ ప్రక్కప్రక్కన కూర్చున్నారు. జనం చెదురుగా అక్కడొకరుగా, అక్కడొకరుగా కనబడుతున్నారు.
    చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. మనసులు మాట్లాడుకుంటున్నట్లు మౌనంగా వుండిపోయారు.
    "మూర్తీ!"
    "ఊఁ"
    "ఐ లవ్ యూ!"
    "థ్యాంక్స్" అన్నాడు మూర్తి.
    "థ్యాంక్స్ చెప్పటంకాదు. నువ్వు నాకు కావాలి."
    "ఏం చేసుకుంటావు?"
    "కాపురం చేసుకుంటాను" అంది వసంత పెంకెగా.
    మూర్తి ఒక్క నిమిష మాగి "ఈ విషయం నువ్వు యింకోసారి ఆలోచించుకుంటే మంచిదేమో" అన్నాడు.
    "ఎందుకని?"
    "నేను ప్రతి అంశంమీద నిర్దుష్టమైన అభిప్రాయాలున్న వాడ్ని మంచిగానీ చెడుగాని నా మనసుకు తోచిందానికి వ్యతిరేకంగా రాజీపడే స్వభావంకాదు. నాతో జీవితమంతా సుగమంగా వుండదేమో"
    "కాని..." అంది వసంత. "నేను నిర్ణయం చేసుకున్నాను."
    "ఏమని?"
    "దీంతోటే ప్రయాణం చెయ్యాలని."
    మూర్తి నిట్టూర్చాడు." "నీ యిష్టం."
    "వసంత చెంపల్లో వేయి మందారాలు పూశాయి. "థాంక్యూ మూర్తీ!"
    
                                 * * *
    
    ఇంటికి వెళ్ళగానే తండ్రి గంభీరంగా అటూ యిటూ పచార్లు చేస్తూ కనిపించాడు. తల్లి దిగాలుపడి నిలబడి వుంది. అతనికోసమే ఎదురు చూస్తున్నట్లు పచార్లు ఆపి ముఖంలోకి పట్టి పట్టి చూశాడు.
    "వరేయి యిప్పుడెక్కడ్నుంచి వస్తున్నావు?"
    "కొళాయి చెరువు దగ్గర్నుంచి." మూర్తి తాపీగా జవాబిచ్చాడు.
    "అక్కడ ఒక్కడివే వున్నావా?"
    "లేను ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాను?"
    "అమ్మాయి...ఎవర్రా ఆ అమ్మాయి?"
    "వసంత నాన్నా ఆమె పేరు. ఆమెను పెళ్ళి చేసుకుందామని కూడా అనుకుంటున్నాను."
    "చూశావా? చూశావా?" అన్నట్లు ఆయన భార్య ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి.
    "ఆ అమ్మాయి కులమేమిటి? గోత్రమేమిటి?"
    "తెలియదు. ఎప్పుడూ అడగలేదు."
    "ఏమిటి? తెలీయకుండానే అంతముందుకొచ్చారా?"
    "అదంత ముఖ్యమని అనుకోలేదు" అతని మాటల్లో ఎక్కడా అమర్యాదగాని, అసభ్యతగానిలేదు. తాను అనుకున్నది దాపరికం లేకుండా చెబుతున్నాడు.
    తండ్రి హతాశుడై పోయినట్టు ఊరుకున్నాడు.
    కొన్నాళ్ళకు పెళ్ళయిపోయింది.
    ఆ పెళ్ళి మామూలు సాంప్రదాయం ప్రకారం కాలేదు, రిజిష్టర్ మ్యారేజి కూడాకాదు. పదిమంది పెద్దల ముందు. రఘురామయ్యగారి ఆధ్వర్యంలో, ఆయన నాలుగు మాటలు చెప్పగా, దండలు మార్చుకోవటంతో అయింది.
    పెళ్ళికి రాఘవ అతని భార్య కూడా వచ్చారు.
    పెళ్ళి జరిగే తతంగం చూసి లక్ష్మీ నోరు నొక్కుకుంది. "అయ్యో! అదేం పెళ్ళండీ! మరీ విడ్దూరం కాక పోతేనూ అసలు మంత్రాలూ, పురోహితుడూ లేకపోతే వాళ్ళిద్దరికీ భార్య భర్తలని కనీసం వాళ్ళకైనా అనిపించవద్దూ?" అన్నది.
    రాఘవకి చూడటానికి మనసులో ముచ్చటగానే వున్నది. అయినా బయటకేమీ వ్యాఖ్యానించలేదు.
    ఆ రాత్రి వసంత కూడా భర్తతో అంది. "ఏమండీ! మెడ యిలా బోసిగా వుంటే బాగుండలేదు. ఓ నల్లపూసల తాడు తెచ్చి, పోనీ మీరు వద్దులెండి, నేనే కట్టేసు కుంటాను."
    మూర్తి నవ్వాడు. "ఆ తాడు కంతబలం వుందనుకుంటే పోనీ అలానే చెయ్యి.
    వసంత ముఖమంతా నలుపు చేసుకుంది. "మీ కిష్టం లేకపోతే వద్దులెండి?
    "నా కిష్టం లేకపోయినా అభ్యంతరం లేదు. ఇంత చిన్న విషయానికి ముఖాలు మాడ్చుకోవద్దు అందులో యిలాంటి రాత్రి" అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
    వసంత అత్తగారితో, మామగారితో బాగానే మాట్లాడింది. కలుపుగోలుతనంగానే మసిలింది.
    కాని రెండు రోజుల తర్వాత మూర్తే అన్నాడు. "నేను వేరే వుందామనుకుంటున్నానమ్మా."
    ఆమె ఉలికిపడింది. "అదేమిట్రా ఆ పిల్లని నేనేమీ అనలేదే. మీ సుఖాలకి మేమేమన్నా అడ్డువస్తామనుకున్నావా?"
    "అది కాదమ్మా"
    తండ్రి విననే విన్నాడు. "వాడు పెద్దవాడయ్యాడు ప్రయోజకుడయ్యాడు. ఇప్పుడు మనం ఎందుకు పనికొస్తామే. కన్న తల్లిదండ్రుల్నే కాదనే స్థితికి వచ్చాడు.
    మూర్తి తన మనసులోని భావాల్ని సవినయంగా స్పష్టం చేశాడు.
    "అన్యధా భావించకండి నాన్నా. నలుగురు ఒక దగ్గర సమిష్టిగా వుండటంవల్ల, ఒకరి మొహాలకి ఒకరు యిరవై నాలుగు గంటలూ కనిపిస్తూ వుండటంవల్ల మంచికన్నా చెడే బయటపడుతూ వుంటుంది. మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారే అవకాశం వుంటుంది. వసంత కులం దగ్గర నాకు పట్టింపులేదు. కొన్ని విషయాలలో మీరు రాజీ పడలేక పోవచ్చు. అనేక సమస్యలు తల ఎత్తుతాయి. అందుకని దూరంగా వుంటున్నాను. దూరంగా వున్నంత మాత్రాన మీకూ  నాకూ సంబంధం తెగిపోయిందని ఎందుకనుకుంటారు? ఒకవేళ నేను దూరదేశంలో ఉద్యోగం చేస్తున్నట్లయితే విడిగా వుండమా? మేము వచ్చిపోతూనే వుంటాం. కాపరం మాత్రం వేరు"

 Previous Page Next Page