"ఆ! విమల తల్లి బ్రాహ్మిణి అనీ, తండ్రి కోమటి అనీ చెప్పాను సాధారణ మధ్యతరగతి కుటుంబం అని చెప్పాను. రెండు మూడు నెలలుగా విమలను అన్ని విధాలా అర్ధం చేసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పాను."
"మరి శకుంతల విషయం చెప్పలేదా!"
"లేదు."
విమల గభాలున శర్మ ఒళ్ళో నుంచి శకుంతలను లాక్కోబోయింది శకుంతల రాలేదు. విమల రోషంగా "నేను శకుంతలను వదలి ఉండను" అంది.
శర్మ అనుసూయ వేపు తిరిగి "అత్తయ్యగారూ! ముందు పెళ్ళి జరిగి పోనీయండి, ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే, శకుంతలను మా దగ్గరికి పిలిపించుకుంటాను." అన్నాడు.
అనసూయకు శర్మలో నమ్మకం కలగసాగింది. ఈ అవకాశం ఒక్కటీ చేజారిపోతే, ఇక విమల జీవితమంతా ఒంటరిగా మిగిలిపోవలసిందే! అందుకే చొరవచేసి గంభీరంగా నిలబడ్డ విమలతో, "విమలా! శర్మగారు చెప్పింది బాగానే ఉంది. ఈ పెళ్ళీ జరిగిపోతే నాకు నిశ్చింత" అంది.
విమల మాట్లాడలేదు. ఆమె మనసులో ఇంకా ఏవో సందేహాలు.
శర్మ శకుంతలను దింపి, "బేబీ! టాటా! నేను వెళ్తున్నాను" అన్నాడు. అతని కంఠం బరువుగా పలికింది.
"డాడీ! మీరు మళ్ళీ ఎప్పుడొస్తారు?" అని అడిగింది శకుంతల.
"మీ అమ్మనడుగు."
"మమ్మీ! డాడీ మళ్ళీ ఎప్పుడొస్తారు?"
విమల తలెత్తి చూసింది. శర్మ కళ్ళలో అభ్యర్ధన ఆమెను కదిలించింది.
"మన పెళ్ళి కాగానే శకుంతల మన దగ్గిరకు వస్తుందా?"
"రెండు రోజులకంటే ఆలస్యం జరగదు. కానీ అప్పటి వరకూ ఇది రహస్యంగా ఉంచాలి."
"సరే! కానీ, పెళ్ళయ్యాక శకుంతలను పిలిపించకపోతే నేను మిమ్మల్ని వదిలి......"
మెరుపులా వచ్చి విమలనోరు తన చేత్తో మూసేసాడు.
"అలా ఎప్పుడూ మాట్లాడకు" అన్నాడు మందలిస్తున్నట్లు. అతని చెయ్యి తొలగించి నవ్వింది విమల, ఈ దృశ్యం చూసిన అనసూయ మనసులో అంతకుముందున్న కొద్దిపాటి సందేహాలు కూడా తొలగిపోయాయి.
"పెళ్ళి ముహూర్తం నిర్ణయించి మీకు వచ్చి చెప్తాను. త్వరలోనే నిర్ణయమవుతుంది" అన్నాడు శర్మ.
'పెళ్ళి' అనే మాట శకుంతలకు అర్ధమయింది. ఈ మధ్య ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి శకుంతలకూడా బొమ్మల పెళ్ళి చేసింది.
"పెళ్ళి ఎవరికి డాడీ?" అంది.
"మీ అమ్మకి" అల్లరిగా నవ్వాడు.
శకుంతల సంతోషంగా గెంతుతూ "అమ్మకి పెళ్ళి! అమ్మకి పెళ్ళి" అని చప్పట్లు కొట్టింది. అయిదేళ్ళ కూతురు "అమ్మకి పెళ్ళి" అంటోంటే, విమలకి చాలా సంకోచం కలిగింది. అక్కడ నుండి వెళ్ళిపోయింది. శర్మ తను కూడా లోపలికి వెళ్లాడు. శకుంతల వెళ్ళకుండా అనసూయ దగ్గరకు తీసుకుంది.
తల దించుకు నిలబడ్డ విమల చుబుకం పట్టుకుని ముఖం తనవైపుకు తిప్పుకున్నాడు శర్మ.
"విమలా! జరుగుతున్న దానిలో తప్పేమీ లేదని నీకు బాగా తెలుసు. అయిన, ఎందుకీ సంకోచం? చూసావా-ఎంతో ఆధునికుల మనుకొంటున్న మనమే సంప్రదాయాల ప్రభావాన్నుంచి విముక్తి పొందలేకుండా ఉన్నాం అట్లాటప్పుడు పెద్దవాళ్ళ చాదస్తాలను అనుసరించక పోయినా, అర్ధం చేసుకోవద్దా చెప్పు"
"నేను మీ ఇంటి కోడలిగా రాగలిగితే, అత్తగారికి కానీ, మామగారికి కానీ, ఏమీ కష్టం కలగనియ్యను. కానీ, శకుంతల......"
"విమలా! ఒక్క మాట నమ్ము ఈ క్షణం నుంచీ శకుంతల నీ కూతురే కాదు- మన కూతురు, నా కూతురు."
"థాంక్యూ"
* * *
ఒక నెల రోజుల లోపుగానే, విమల శర్మకు పెళ్ళి నిశ్చయమయి పోయింది శర్మ కోరగా ఒక రోజు అనసూయ వెళ్ళి ఈశ్వరి సీతాపతి గార్లతో మాట్లాడింది. ఈశ్వరికి అనసూయ కూడా చాలా నచ్చింది. ఎందుకంటే, అనసూయ ఈశ్వరి పూజా విధానం చాలా శాస్త్రోక్తంగా ఉందని మెచ్చుకొంది ఈ రోజుల్లో ఇలా అన్ని నోములూ పూర్తిచేసుకొనే వారు ఉండరని ఆశ్చర్యపడింది తనను చూసి 'సంకోచంతో ముడుచుకుపోయిన అనసూయతో సీతాపతి ఏం మాట్లాడలేదు. ఆయనకు విమల నచ్చింది. విమల పనిచేసే షాపుకి ఆయన ఏదో వంకన వెళ్ళారు విమల ఆయనను చూడను కూడా లేదు. తన పని తను చేసుకోవడం తప్ప ఎవరితోనూ శ్రుతిమించి మాట్లాడని విమల స్వభావం ఆయనకు బాగా నచ్చింది. అంచేత అనసూయని పలకరించి ప్రశ్నలడిగి ఆమెను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అనసూయలోని ఈ సంకోచం ఈశ్వరికి బాగానచ్చింది. 'పెద్దింటి మనిషి' అనుకొంది. ఆ క్షణంలో అనసూయ ఒక కోమటి కులంలో వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుందన్న విషయం పూర్తిగా మరిచిపోయింది.
ముహూర్తం నిర్ణయించి శుభలేఖలు తానేతెచ్చి అనసూయకిచ్చాడు. అవి చూస్తోంటే, ఆమె కళ్ళలో ఆనంద భాష్పాలు నిండుకున్నాయి.
"బాబూ! చిన్నవాడివి- నీకు చేతులెత్తి నమస్కరించ కూడదు. ఈ పెద్ద మనసు నీకు కలకాలం ఉండాలని ఆశీర్వదిస్తున్నాను" అంది.
ఏ ఆర్బాటాలూ లేకుండా తనపెళ్ళి క్లుప్తంగా గుళ్ళో జరిగిపోవాలని పట్టుబడ్డాడు శర్మ. అనసూయ అకుమ్తలను తీసుకొనే పెళ్ళికి వచ్చింది. ఇంటి దగ్గిర విమలను పలకరించకూడదని చాలా బోధలు చేసింది. "నువ్వు మమ్మీతో మాట్లాడితే, దేవుడికి కోపంవస్తుంది" అని భయంకూడా పెట్టింది. అన్నింటికీ తల ఊపింది శకుంతల కానీ పెళ్ళి మంటపంలోకి శర్మరాగానే "డాడీ!" అంటూ అతడి దగ్గిరకు వచ్చేసింది.
విమల అదిరిపడింది. ఆమె సర్వాంగాలు కంపించాయి. కనీ శర్మ మాత్రం ఎప్పటిలాగానె ఆప్యాయంగా శకుంతలను తన వళ్ళో కూచోబెట్టుకున్నాడు.
"ఈ పాపా ఎవర్రా - నిన్ను 'డాడీ' అంటోంది?" అని స్నేహితులు పరిహాసం చేసారు.
"నా కూతురు" అన్నాడు నవ్వుతూ శర్మ - కళ్ళతో విమలకు ధైర్యం చెపుతూ అదేదో జోక్ అయినట్లు అందరూ నవ్వేశారు. అనసూయ భయంతో మూలకు ఒదిగి కూచుంది.