శకుంతల పెళ్ళి తంతు జరుగుతున్నంతసేపూ శర్మపక్కనే కూచుంది అన్నీ వింతగా చూస్తూ స్నేహితు డొకడు నిద్రపోతున్న శకుంతలను ఎత్తుకుని ఒక వారగా తువ్వాలు పరిచి పడుకోబెట్టాడు.
అంతా గమనిస్తోన్న అనసూయ నెమ్మదిగా నిద్రపోతున్న శకుంతలను తన వల్లో పడుకోబెట్టుకుంది.
శర్మ, విమల మెళ్ళో మంగళసూత్రాలు కడుతోంటే! వేద మంత్రాల మధ్య అందరూ అక్షింతలు జల్లుతోంటే, అనసూయ మనసు అపూర్వానందంతో నిండిపోయింది. ఇలాంటి దృశ్యం తన కళ్ళలో చూడగలనని ఆమె అనుకోలేదు. శకుంతలను భుజంమీద వేసుకుని లేచి నిలబడి, వధూ వరులపైన దూరంనుంచే అక్షింతలు జల్లింది. విమల మనసు-ఆనందమూ భయమూ, సంభ్రమమూ మొదలైన అనేకభావాలతో నిలకడలేకుండా ఊగిపోతోంది. తన ప్రక్కనే కూచున్న శర్మ గంభీరమూర్తికి తనను తను మనసారా అర్పణ చేసుకొంది. 'ఇకముందు తను బ్రతికేది అతని సుఖం కోసం, అతని ఆనందం కోసం....' అనుకొంది. తనను గురించీ, శకుంతల గురించీ తను ఆలోచించనక్కర్లేదు. ఆ బాధ్యత అతను స్వీకరిస్తాడు. ఆ విషయంలో తనకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
ఏ ఉద్దేశంతో శర్మ తన వివాహం క్లుప్తంగా జరిగిపోవాలని పట్టుపట్టాడో, ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఈశ్వరి, సత్యనారాయణ వ్రతమంటూ బంధువులందరినీ ఆహ్వానించింది.
"మీ అమ్మగారి దేవూరు? మీ నాన్నగారి దేవూరు? ఆయన ఏం చేసేవారు?" మొదలైన ప్రశ్నల బారినుండి విమల తప్పించుకోలేక పోయింది. విమల తండ్రి వైశ్యుడని తెలిసినవారే, ఆ విషయం ప్రత్యేకంగా విమలనడిగి ఆమెనోట వినికాని, తృప్తిపడలేక పోయేవారు. ఇలా పదిమంది పదిసార్లు అడగటంతో విమలలోనూ ఒక మొండితనం వచ్చేసింది నిస్సంకోచంగా. ధైర్యంగా సమాధానాలు చెప్పసాగింది.
ఈశ్వరికి మాత్రం ఇందుకు బాధ కలిగింది. ఆవిడ అప్పటికప్పుడే పురోహితుల్ని పిలిపించి కోడలి తండ్రి వైశ్యుడయినందుకు పశ్చాత్తాప పడకుండా ఏమైనా ఉంటే కనుక్కుని, ఉంది__అనిపించుకొని, ఆ తతంగమంత జరిపించటం ప్రారంభించింది.
ఇదంతా విమలకు చాలా ప్రాణసంకటంగా తయారయింది 'ఏనాడో చనిపోయిన తండ్రి కులం కోసం ఈనాడు తానీ ప్రాయశ్చిత్త కాండలో పాల్గొనాలా?' కానీ. శర్మ కళ్ళలో అభ్యర్ధన - 'పెద్దవాళ్ళ ఆచారాలు మనం అనుసరించనక్కర్లేదు. సానుభూతితో అర్ధం చేసుకొంటే చాలు!' అనే అతని బోధ.
అదంతా ముగిసాక ఈశ్వరి తానీ సగర్వంగా, "మా కోడలి తండ్రి వైశ్యుడు అయితేనేం? నేను శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్తం జరిపించాను. ఇప్పుడు దోషమేం లేదు" అని చెప్పుకోసాగింది ఇదంతా వింతగా తమాషాగా తోచసాగింది విమలకు.
ఎలాగో పెళ్ళి తతంగమంతా ముగిసింది 'శకుంతలను ఎప్పుడు తీసుకొస్తారు?' అని అడగలేదు విమల. ఆ భారం పూర్తిగా శర్మకే వదిలేసింది. ఆ మరునాడు విమల తలరా స్నానంచేసి అత్తగారికి పూజగది శుభ్రం చేస్తుండగా, శర్మ శకుంతలను తీసుకొచ్చాడు. "మమ్మీ!" అంటూ విమలను కౌగిలించుకుంది శకుంతల.
నిర్ఘాంతపోయి నిలబడింది ఈశ్వరి. చదువుతున్న పేపర్ చేతిలో పట్టుకునే వచ్చాడు సీతాపతి. శర్మ - "నాన్నగారూ! నన్ను క్షమించండి. ఈ పాప నా కూతురు. నాకూ విమలకూ పెళ్ళికి ముందే పుట్టింది" అన్నాడు.
ఉలిక్కిపడింది విమల. వంచిన తల ఎత్తలేదు. మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. కొంతసేపటి వరకూ ఎవరూ మాట్లాడలేక పోయారు. చివరికి ఈశ్వరి గొంతు పెగాల్చుకుని రుద్దస్వరంతో, "ఇంతకర్మ ఏం వచ్చిందిరా నీకు? నువ్వు ఈ ఆమ్మాయిని చేసుకొంటానంటే, మేం కాదన్నామా? ఈ చేసుకొనేది ముందే చేసుకోవచ్చుగా?" అంది.
సీతాపతి శర్మను సూటిగా చూస్తూ "శర్మా! ఐయిదారేళ్ళనుంచీ, నీకు ఈమెతో పరిచయం ఉందా? ఈమెతో పరిచయం బిడ్డను కనేవరకు పెంచుకొంటూనే, మాతో పెళ్ళిచేసుకోనని చెప్పుతున్నావా? నిన్ను చక్కని ఆదర్శాలతో పెంచానని గర్వపడేవాడిని. ఇదేమిటి - ఇంత సంకుచితంగా పిరికిగా ప్రవర్తించావా నువ్వు?" అన్నాడు.
శర్మ తలవంచుకుని, "క్షమించండి నాన్నగారూ! కానీ, నాకు మీరిచ్చిన మనోబలంతోనే, ఈనాటికైనా నా భార్యనూ, కూతుర్నీ మన యింటికి తీసుకురాగలిగాను" అన్నాడు.
సీతాపతి ఇంకేమీ మాట్లాడకుండా శకుంతలను ఎత్తుకొన్నాడు. అక్కడితో ఈశ్వరి ముందుకొచ్చి, "ఇలా ఇవ్వండి" అని చేతులు జాపింది.
ఎదురుగావున్న శర్మకి రెండు చేతులూ జోడించింది విమల. అతి త్వరలో శకుంతలా, ఈశ్వరీ మంచి స్నేహితురాళ్ళయి పోయారు. ఇన్నాళ్ళకి ఈశ్వరికి మంచి శ్రోత దొరికింది. ఈశ్వరి చెప్పే కథలన్నీ శకుంతల చాలా శ్రద్దగా వినేది. మధ్యలో ఎన్నో ప్రశ్నలడిగేది. శకుంతలను విడిచి ఒక్క క్షణం ఉండాలన్నా భరించలేని దశకు వచ్చేసింది ఈశ్వరి. రెండు రోజుల కొకసారి ఏదో వంకతో విమలనూ, శకుంతలనూ తీసుకొని అనసూయ దగ్గిరకి వెళ్ళి వచ్చేవాడు శర్మ. వాళ్ళున్న గంటసేపూ శకుంతలను వదిలేసి కాదు అనసూయ ఈశ్వరి కూడా శకుంతలను ప్రేమగా చూస్తోందని తెలుసుకొని పొంగిపోయింది.
శర్మా, విమలా, అనసూయను వచ్చి తమతో వుండమన్నారు. అనసూయ ఒప్పుకోలేదు. ఈశ్వరి కూడా ఒకసారి అడిగింది. అనసూయ తన కృతజ్ఞతలు చెప్పుకొంది కానీ రాలేదు. ఆవిడ చేతులతో ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే వుంది. ఎప్పటిలా విమల ఆర్డర్స్ సంపాదించటం, అనసూయ కుట్టటం-ఈ క్రమంలో మార్పు రావడానికి ఒప్పుకోలేదు అనసూయ. శర్మ డబ్బు ఇవ్వపోతే తీసుకోలేదు సరికదా, తను సంపాదించిన దాన్లో ఎలాగో మిగిల్చి శకుంతలకు ఏదో ఒకటి కొనిచ్చేది.
ఆరోజు శర్మ, విమల, శకుంతల వచ్చేసరికి, అనసూయ ఎప్పటిలా ఎదురు రాలేదు. శర్మ ఆశ్చర్యంగా దగ్గిరకు వచ్చి చూసేసరికి ఆవిడ శరీరంలో ప్రాణంలేదు కూర్చున్నట్లే ఉంది వళ్ళో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్న బట్ట ఉంది. విమల కుమిలి కుమిలి ఏడ్చింది. తనను ఎంతో ప్రాణప్రదంగా పెంచిన తల్లి-తను చేయరాని పొరపాటు చేసినా ఒక్క మాట కూడా అనకుండా స్వీకరించిన తల్లి - ఈనాడు దిక్కులేనిదానిలా చచ్చిపోయింది.
చివరకు తల్లి మరణ సమయంలో దగ్గర లేనేలేదు. ఏ బాధలు అనుభవించిందో, ఆ ప్రాణం ఎలా పోయిందో! ఏనాడూ పెదవి విప్పి "నాకీ బాధ ఉంది" అని చెప్పుకోలేదు, ఎంత సహనమో! విమలను ఓదార్చటం చాలా కష్టమయింది శర్మకి. అంత దుఃఖంలో తల్లి నిర్భాగ్యపు స్థితికి కారణమయిన వారిమీద వెర్రి కోపం వచ్చింది విమలకి.